గోరుకల్లు రిజర్వాయర్: ‘నెత్తిన కుండ పెట్టి నిద్ర లేకుండా చేస్తున్నారు’ అంటున్న ఆ గ్రామస్థుల ఆందోళన ఏంటి? ఆ రోజు అసలేం జరిగింది?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 10 నిమిషాలు
"భయం పుట్టింది ఆ నీళ్లను చూసి ..మేం ఈ ఊరే వద్దనుకుంటున్నాం. మాకు రాత్రిళ్లు నిద్ర లేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు" 22న గోరుకల్లులో జరిగిన జలవిధ్వంసం తర్వాత ఆ ఊరికి చెందిన రామలక్ష్మమ్మ భయంతో అన్న మాటలివి.
గోరుకల్లు రిజర్వాయర్ ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో ఉంది. నంద్యాలకు 20 కిలోమీటర్ల దూరంలో, చుట్టూ పచ్చని పొలాలు, అటూ ఇటూ కొండల మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది.
ఏపీ ఇరిగేషన్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 12.44 టీఎంసీలు. ప్రత్యక్ష నిల్వ 10.29 టీఎంసీలు.
రిజర్వాయర్ మొత్తం పొడవు 3,626 మీటర్లు కాగా దీని స్పిల్ వే పొడవు 160మీటర్లు. ఇది 15 చదరపు కిలోమీటర్లకు పైగా వ్యాపించి ఉంది. ఈ ప్రాజెక్ట్ డిశ్చార్జ్ సామర్థ్యం 2400 క్యూసెక్కులు.
గోరుకల్లు రిజర్వాయర్ కింద శ్రీశైలం నుంచి వచ్చే పైపులైన్ కూడా కనిపిస్తుంది. ఒకపక్క కొండకు చుట్టూ కెనాల్ వెళ్తుంటే, దానికి దిగువనే ఉంటుంది గోరుకల్లు గ్రామం. దానికి అవతల కూడా దూరంగా మరో రెండు మూడు గ్రామాలు కనిపిస్తుంటాయి.


జల విలయం ఎలా జరిగింది?
జల విలయం తర్వాత రిజర్వాయర్ దిగువన ఉన్న గ్రామాల ప్రజలు తమకు కంటి మీద కునుకు కరువైందని అంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు సెప్టెంబర్ 22న తెల్లవారుజామున గేటు ఎత్తారని, దాంతో గోరుకల్లు గ్రామంలోకి నీళ్లొచ్చాయని స్థానికులు చెప్పారు.
ఆ సమయంలో రిజర్వాయర్లో 9.5 టీఎంసీల నీరు నిల్వ ఉండగా అందులో నీరు ఊరిపైకి ప్రవహించింది. ఒక్కసారిగా ఎగసిపడిన ప్రవాహానికి కెనాల్ పక్కన మూడుచోట్ల వేసిన గ్రావెల్ మొత్తం కోతకు గురైంది.
ఆ కొండకు చుట్టూ ఈ కెనాల్ ఉండడంతో రిజర్వాయర్ నుంచి బయటకు దూకిన నీళ్లు ఒక మలుపులో ఉప్పొంగి గ్రామంపై పడ్డాయి.
ఆ సమయంలో సిమెంట్ కాంక్రీట్‌తో నిర్మించిన కెనాల్‌కు ఎలాంటి నష్టం జరక్కున్నా నీరు పొంగి ప్రవహించడంతో కాలువకు ఆనుకొని ఉన్న గ్రావెల్, బండలు అన్నీ కోతకు గురయ్యాయి.
అవి ఒక్కసారిగా ఊరు, పొలాలపైకి రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
సెప్టెంబర్ 22న జలవిలయం తర్వాత ఆ గ్రామాల్లో పరిస్థితి ఏంటో తెలుసుకోడానికి బీబీసీ గోరుకల్లులో పర్యటించింది. అక్కడి ప్రజలతో మాట్లాడింది.
అయితే గత మంగళవారం జరిగిన విధ్వంసాన్ని గోరుకల్లు ప్రజలు సులభంగా మర్చిపోలేక పోతున్నారు.

'పిల్లలను ఎత్తుకుని పరుగులు తీశాం'
నీటి ప్రవాహం వేగంగా దూసుకురావడం చూసిన గ్రామస్థులు రిజర్వాయర్ కట్ట తెగిందని భావించారు.
హఠాత్తుగా ఊరిపైకి నీళ్లు రావడంతో పిల్లలను ఎత్తుకుని పరుగులు తీశామని గోరుకల్లుకు చెందిన లక్ష్మీదేవి చెప్పారు.
''నీళ్లు వస్తే పరుగులు తీశాం. పిల్లలు, బ్యాగులు తీసుకుని వెళ్లాం. మేము లేకపోయినా పిల్లలైనా బతకాలి కదా. నీళ్లు వస్తాయని కలగంటామా ఏంటి? కట్ట ఎప్పుడు తెగుతాదో, నీళ్లు ఎప్పుడొచ్చి మీద పడతాయో తెలీడం లేదు. ఇన్నేళ్ల నుంచీ అయితే తెగలేదు. కానీ ఇప్పుడు తెగుతాదేమో అని భయం పుడుతోంది" అని లక్ష్మీదేవి ఆందోళన వ్యక్తం చేశారు.
రిజర్వాయర్ కింది నుంచి తమ ఊరును తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఏదైనా జరిగి పొరపాటున రిజర్వాయర్ కట్ట తెగితే తమ ఊళ్లో ఒక్కరు కూడా మిగలరేమోనని భయపడుతున్నారు.
ఈ నెల 22న జరిగిన జల విలయం తర్వాత అసలు ఆ ఊరే తమకు వద్దనిపిస్తోందని రామలక్ష్మమ్మ లాంటి వారు చెబుతున్నారు.
''భయం పుట్టింది. రాత్రంతా నిద్ర లేదు. రెండు గంటలకుకూడా మేలుకునే ఉన్నాం. రిజర్వాయర్ ఎప్పుడు తెగతాదో అని మాకు భయం పుట్టింది. మేము ఈ ఊళ్లో ఉండకూడదని అనుకుంటున్నాము. మాకు ఏదైనా మార్గం చూపించమని అడుగుతున్నాము. పొలాలు ఉంటే ఉంటాయి. మా ప్రాణాలు పోయిన తర్వాత పొలాలు ఏం చేస్తాయి'' అని ఆమె అన్నారు.

గ్రామం నుంచి తమను తరలించాలని ఎమ్మెల్యేను కోరినట్లు రామలక్ష్మి బీబీసీతో చెప్పారు.
''ఇదే ఘటన రాత్రి పూట జరిగుంటే మా పరిస్థితి ఎలా ఉండేది. ఇక్కడ మొత్తం నీళ్లు వచ్చాయి. మా ఇంటి దగ్గరికి నీళ్లు వచ్చాయి. అందుకే మాకు భయం పుట్టింది. ఏమైనా జరిగితే అందరూ పోవాల్సిందే. మాకు వేరే చోట స్థలాలు ఇప్పించి ఇండ్లు ఇవ్వాలని మేము మా ఎమ్మెల్యేను కోరాం'' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నెత్తిన కుండ పెట్టి తమకు నిద్ర లేకుండా చేస్తున్నారని గోరుకల్లు గ్రామానికి చెందిన వెంకట లక్ష్మమ్మ ఆవేదన చెందుతున్నారు.
''ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. నిద్రలో ఉన్నాము. లేయండి ఉరకండి ఉరకండి డ్యామ్ తెగింది అంటున్నారు. ఎట్లా ఉరకాలో తెలియలేదు. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళాము. వారం రోజులు బాలింత ఇద్దరు పిల్లలను ఎత్తుకొని అడ్డపడి కంపలు తొక్కుకుంటూ వెళ్ళింది'' అని ఆమె చెప్పారు.
''మా నుంచి ఎంతోమంది బతుకుతున్నారు. మాకు ఏమి ఆసరా ఉంది. మాకు నెత్తిన కుండపెట్టారు. ఏ అధికారులు వచ్చి మాకు న్యాయం చేస్తారో. మాకు పునరావాసం కల్పించాలా మాకు స్థలాలు చూపించి ఇల్లు కట్టించాలా మేము ఎంతో మందికి మా పొలాలు త్యాగం చేసి అన్నం పెట్టాము'' అని ఆమె బీబీసీతో అన్నారు.
గ్రామంలోకి నీళ్లు అకస్మాత్తుగా రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని స్థానికుడు మనోహర్ అన్నారు.

‘ప్రభుత్వం పరిష్కారం చూపాలి’
సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని రిజర్వాయర్ వల్ల ముప్పు ఎదుర్కొంటున్న తమకు ప్రభుత్వమే పరిష్కారం చూపాలని ఊరి ప్రజలు కోరుతున్నారు.
''ఇలాంటిదేదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాం. చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పునావాసం కల్పించాలని పోరాడాం. మా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం అనుకోవాలి. ఈ రిజర్వాయర్ వల్ల గ్రామంలోని 650 ఇళ్లలో నివసించే ప్రజలకు ప్రాణహాని ఉందని తెలుసుకుని ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి'' అని మనోహర్ అన్నారు.
ఇటీవల నేపాల్లో వచ్చిన వరదలను తాము చూశామని తమ గ్రామానికి అలాంటి పరిస్థితే వస్తుందని భయంగా ఉందని ఆయన చెప్పారు.
''కట్ట తెగితే కళ్లు మూసి కళ్లు తెరిచే లోపు మన్ను నిమిషాల్లో వచ్చి ముంచెత్తుతుంది. అది జరిగితే చెప్పడానికి మనిషి ఉండడు. మేము మునిగిపోయిన తర్వాత మా శవాలను తీసి లెక్క పెట్టుకోవడం తప్ప ఒక ప్రాణాన్ని కూడా తిరిగి తీసుకురాలేరు. అందుకే గతంలో మా ఊరిని సర్వే చేసి మాకు ఇళ్లు కట్టించడానికి నూనె మిల్లు దగ్గర ఇచ్చిన స్థలంలోకి మమ్మల్ని తరలించాలని అధికారులను కోరుతున్నాం'' అని ఆయన అన్నారు.
గోరుకల్లు రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చి తమ పెద్దలు చేసిన త్యాగాలకు తమకు ఫలితం దక్కడం లేదని 22న జరిగిన ఘటన తర్వాత తమ జీవితాలు దయనీయంగా మారాయని మనోహర్ చెప్పారు.

గ్రామస్థుల్లో భయం భయం
గేటు ఎత్తారనే విషయం తెలిసి త్వరగా గేటు మూసివేశారు కాబట్టి పెను ప్రమాదం తప్పిందని, కానీ గోరుకల్లు జలాశయం నిండి ప్రమాదకవశాత్తూ కట్ట తెగితే తమ పరిస్థితి ఏంటని స్థానికులు భయపడుతున్నారు.
గోరుకల్లు గ్రామంలో 650 ఇళ్లు ఉన్నాయి.
''గోరుకల్లులో 2500 ఓట్లు ఉన్నాయి. ఏదైనా జరిగితే మొదట గోరుకల్లు పోతుంది. తర్వాత దుర్వేషు అనే గ్రామం పోతుంది. తర్వాత కొట్టమొద్ది పోతుంది. తిరిపాడు, కడిగిరేవుల ఇలాంటి గ్రామాలు ఉన్నాయి. కానీ మొదట ముంపుకు గురయ్యే గ్రామం మాత్రం మాదే. ఒక్కరు కూడా బయటికి వెళ్లలేరు. ఇటు పోతే వంక అది దాటనివ్వదు. మరోపక్క చిన్న ఏరు, పెద్ద ఏరు అవి దాటనివ్వవు. ఎటూ పోలేం'' అని చెప్పారు.

ఘటన జరిగిన రోజున కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే, ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే గోరుకల్లు గ్రామంలో పర్యటించి గ్రామస్థులను పరామర్శించారు.
గ్రామస్థులు తమ గ్రామాన్ని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆందోళన చేశారు.
అయితే రిజర్వాయర్ కట్టకు ఎలాంటి ప్రమాదం లేదని, గ్రామస్థులు నిర్భయంగా ఉండచ్చని నంద్యాల ఇరిగేషన్ ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్1 ఎస్‌ఈ ప్రతాప్ బీబీసీతో చెప్పారు.
'' ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. రిజర్వాయర్ ఫుల్ కెపాసిటీ 12.5 టిఎంసీలు. ప్రస్తుతం 9.6 టిఎంసీలు ఉన్నాయి. దాని కింద నంద్యాల, కడప జిల్లాల్లో లక్ష 90 వేల ఎకరాల ఆయకట్టు ఉంది'' అని ఆయన అన్నారు.

ఎంత నష్టం జరిగింది?
రిజర్వాయర్ నుంచి నీళ్లు రావడంతో ఊళ్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. గ్రామంలో బండరాళ్లు, బురద పేరుకుపోయాయి.
ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందిని, ఎస్కవేటర్లు, డోజర్లు ఉపయోగించి వాటిని తీయించే పనులు పూర్తి చేస్తున్నారు. దాదాపు ఐదు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు భావిస్తున్నారు.
మనోహర్‌కు గోరుకల్లులో ఒక షాపు ఉంది. నీటి ప్రవాహంలో ఆ షాపు తడిసి ముద్దైంది. కొందరు రైతుల పొలాల్లో మట్టి, రాళ్లు మేటలు వేశాయి.
వాటిని తీయాలంటే తమవల్ల కాదని, ప్రభుత్వమే సాయం చేయాలని రైతు షేక్ మహమ్మద్ బాషా అన్నారు.
''వరి వేశాం. ఎమ్మార్వో వచ్చి ఎంత నష్టం జరిగిందో రాసుకుని వెళ్లారు. పంట నష్టానికి సంబంధించి ఎంత ఇస్తారో తెలీదు. మా పొలాల్లో పేరుకున్న మట్టిని ఎత్తించడానికి ప్రభుత్వం సాయం చేయాలి. లేదంటే మా పొలం ప్రభుత్వం తీసుకున్నా మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. మేం ఊరు ఖాళీ చేస్తాం'' అని బాషా అన్నారు.

ఈ ఘోరానికి కారణమెవరు?
గేటు తెరిచింది చేపలు పట్టేవాళ్లని వచ్చిన వార్తలపై గోరుకల్లు గ్రామస్థులు స్పందించారు. ఇది బాగా తెలిసినవారు చేసిన పనేనని స్థానికుడు హుస్సేన్ అనుమానం వ్యక్తం చేశారు. ''గేటు మామూలు వాళ్లు ఎవరు ఎత్తలేనంతగా ఉంటుంది. ఇక్కడి కరెంటు సప్లై గురించి ఎవరికి తెలుసు? లైన్ ఎక్కి ఆఫ్ చేయాలి. అది ఎట్లా చేస్తారు. చేపలు పట్టేవాళ్లు అంటున్నారు. వాళ్లు అయితే కాదు. తెలిసిన వాళ్లే ఈ పని చేసుంటారు'' అని ఆయన బీబీసీతో అన్నారు.
గేటు ఎత్తిన వ్యక్తిని శిక్షించడంతోపాటూ తమ ప్రాణాలకు కూడా రక్షణ కావాలని మనోహర్ డిమాండ్ చేస్తున్నారు.
‘‘ఆ చర్యకు పాల్పడిన వాళ్లని పట్టుకుంటామని అంటున్నారు. వాళ్లని పట్టుకుంటే శిక్షిస్తారు. కానీ మా ప్రాణాలకి రక్షణ అయితే ఇవ్వలేరు కదా. మా ఊళ్లో ఉన్న 2500 మంది ప్రాణాలకు అయితే మీరు హామీ ఇవ్వలేరు కదా" అని ఆయన అన్నారు.

గోరుకల్లు రిజర్వాయర్ 15 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉందని, ఒక వ్యక్తి అనధికారికంగా గేటును తెరవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నంద్యాల ఇరిగేషన్ అధికారి ప్రతాప్ తెలిపారు.
''ఈ నెల 22న వేకువజామున ఒక అనాథరైజ్డ్ పర్సన్ గేటు ఆపరేట్ చేశాడు. కెనాల్ కెపాసిటీ 2400 క్యూసెక్కులు. అదర్ పర్సన్ ఆపరేట్ చేయడం వల్ల 4500 క్యూసెక్కులు ఆ కెనాల్ లోకి రావడం జరిగింది. అది మాకు తెలిసిన వెంటనే, ఆ గేటును అరగంటలోనే క్లోజ్ చేసా:. ఈ లోపలే కెనాల్ ఓవర్ ఫ్లో అయ్యింది. అంతేగానీ డ్యాంకు, దీనికి కానీ ఎలాంటి సంబంధం లేదు. గేట్ ఆపరేషన్ వల్ల అదనపు జలాలు వచ్చాయి. డ్యామ్ వల్ల లీకేజీ ఏదీ జరగలేదు. డ్యాంకు ఎటువంటి ఇబ్బంది లేదు. కెనాల్‌కి గానీ ప్రజలకుగానీ ఎటువంటి ఇబ్బంది లేదు'' అని ఆయన చెప్పారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు దీనిపై దర్యాప్తు చేస్తున్నారని ఇరిగేషన్ అధికారులు చెప్పారు.
''ఈ ఘటనపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. దానిపైన దర్యాప్తు జరుగుతోంది. గేటు దగ్గర ఎప్పుడూ మా వర్కర్స్ ఉంటారు. అక్కడ వర్షం పడుతుండడంతో పక్కన వేరే ప్రాంతంలోకి వెళ్లారు. అదే సమయంలో ఇది జరిగింది. ఆ పని ఎవరు చేశారు అనేది పోలీసుల దర్యాప్తులో బయటపడుతుంది''అని ప్రతాప్ అన్నారు.
గేట్లు ఎత్తిన ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, దర్యాప్తులో భాగంగా 15మందిని విచారణ చేస్తున్నామని పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
ఈ సంఘటనపై నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని సంప్రదించడానికి బీబీసీ ఫోన్లో పలుమార్లు ప్రయత్నించిన ఆమె అందుబాటులోకి రాలేదు.
ఆమె స్పందిస్తే ఈ కథనంలో అప్‌డేట్ చేస్తాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























