'భర్తే మత్తుమందు ఇచ్చి ఇతరులకు అప్పగించాడు' దోషుల నిర్ధరణ వేళ బాధితురాలు ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, Allie Crewe Photography
- రచయిత, బెత్ క్రూస్, ఫియోనా లామ్డిన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
భార్యకు మత్తుమందు ఇవ్వడం, అత్యాచారం చేయడం, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చి ఇతర పురుషులను కూడా ఇంటికి రప్పించిన కేసు ఇంగ్లండ్‌లో చర్చనీయాంశమైంది. ఈ కేసులో కోర్టు తాజాగా నలుగురిని దోషులుగా తేల్చింది.
ఇకపై తాను సురక్షితంగా ఉన్నట్లు భావించలేనని బాధితురాలు, పేరును వెల్లడించేందుకు అంగీకరించిన జోవాన్ యంగ్ చెప్పారు. ఇంగ్లండ్‌లో ఈ తరహా కేసుపై విచారణ జరగడం ఇదే తొలిసారి.
"ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తే అత్యంత భయంకరమైన రీతిలో నాకు ద్రోహం చేశాడు" అని జోవాన్ యంగ్ అన్నారు.
విల్ట్‌షైర్‌లోని స్విండన్‌లో ఉన్న తమ ఇంట్లో 13 ఏళ్ల పాటు భార్యకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఫిలిప్ యంగ్ (50) ఇప్పటికే పలు అభియోగాలను అంగీకరించారు. భార్యకు తెలియకుండా క్రెయిగ్స్లిస్ట్, గ్రైండర్, ఫ్యాబ్ స్వింగర్స్ వంటి వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా పురుషులను ఆయన ఇంటికి ఆహ్వానించారు.
గురువారం వించెస్టర్ క్రౌన్ కోర్టులో జరిగిన విచారణలో నార్మన్ మాక్సోనీ (48), రిచర్డ్ విల్కిన్స్ (62), కానర్ శాండర్సన్-డోయల్ (32), మొహమ్మద్ హసన్ (38)లు పలు లైంగిక నేరాల్లో దోషులుగా తేలారు. విల్కిన్స్, మాక్సోనీ ఒక్కొక్కరు ఒక అత్యాచారం కేసులో దోషులుగా నిర్ధరణ అయ్యారు.

గత ఏడాది ఫిలిప్ యంగ్‌తో విడాకులు తీసుకున్న జోవాన్ యంగ్, ఈ వేధింపుల వల్ల తనదనుకున్న జీవితం పూర్తిగా నాశనమైందన్నారు.
"నాపై ఒక్క వ్యక్తి మాత్రమే నేరం చేయలేదు, ఇతరులను కూడా ఇందులో పాల్గొనేలా ఆహ్వానించారు. వారు కూడా అందుకు అంగీకరించారు" అన్నారామె.
తనపై జరిగిన నేరాలు తనతో పాటు తన పిల్లల జీవితాలపైనా తీవ్ర ప్రభావం చూపాయని జోవాన్ యంగ్ అన్నారు.
"నా బాధను మాటల్లో చెప్పడం కష్టం. ఇది మా జీవితాలను ఎప్పటికీ ప్రభావితం చేస్తుంది. ఎవరికైనా ఇలాంటిది జరగవచ్చనే ఆలోచనే భయంకరంగా ఉంది. నాకు జరిగినది తలుచుకుంటే, నేను ఇపుడు పూర్తిగా సురక్షితంగా ఉన్నానని భావించలేకపోతున్నా. ఇంటి నుంచి బయటకు వెళ్లడమే కష్టంగా మారింది. అయితే, ఈ భయంకరమైన వేధింపుల వల్ల ఇంట్లో కూడా రక్షణ లేదని నాకు అర్థమైంది. అప్పట్లో మాత్రం ఇంట్లో నేను సురక్షితంగా ఉన్నాననే నమ్మాను" అని ఆమె చెప్పారు.
పురుషుల చేతుల్లో వేధింపులకు గురైన మహిళలు, బాలికలందరికీ ఈ తీర్పులు ఎంతో ముఖ్యమైనవని జోవాన్ యంగ్ అన్నారు. బాధితుల వాదనలను నమ్ముతారని, వారి పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఈ తీర్పులు సందేశం ఇస్తున్నాయని చెప్పారు.
భవిష్యత్తులో మహిళలకు సరైన రక్షణ కల్పించేలా సమ్మతికి సంబంధించిన చట్టాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా పరిశీలించాలని ఆమె కోరారు. చట్టంలో తీవ్రమైన మార్పుల అవసరాన్ని ప్రశ్నించేలా తన కేసు చేసిందని చెప్పారు. 2003 నుంచి ఇంగ్లండ్, వేల్స్లో ఈ చట్టాన్ని మార్చకపోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని జోవాన్ కుమార్తె అలెక్స్ సోషల్ మీడియాలో తెలిపారు.
"సమాజం మారింది. నేరాల స్వరూపం మారింది. మరి చట్టాలు మాత్రం ఎందుకు మారలేదు?" అని ఆమె ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Wiltshire Police
కోర్టులో ఏం జరిగింది?
కోర్టులో తీర్పులు వెలువరిస్తున్న సమయంలో ప్రశాంతంగా ఉండాలని న్యాయమూర్తి జస్టిస్ సైనీ కోరారు. ఆ సమయంలో జోవాన్ యంగ్ కోర్టు ప్రేక్షకుల గ్యాలరీలో తన కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని, చేతులను నోటికి అడ్డంగా పెట్టుకున్నారు.
కానర్ శాండర్సన్-డోయల్ మొదట దోషిగా తేలగానే జోవాన్ యంగ్ ఊపిరి పీల్చుకున్నారు. ఒకసారి తాకడం ద్వారా లైంగిక దాడికి పాల్పడిన కేసులో, మరోసారి 'అసాల్ట్ బై పెనెట్రేషన్' కేసులో ఆయన దోషిగా తేలారు. తీర్పు వెలువడగానే ఆయన తల దించుకున్నారు.
ఎనిమిది మంది పురుషులు, నలుగురు మహిళలతో కూడిన జ్యూరీ.. విల్కిన్స్‌ను కూడా 'అసాల్ట్ బై పెనెట్రేషన్' కేసులో దోషిగా నిర్ధరించింది. ఒకసారి తాకడం ద్వారా లైంగిక దాడికి పాల్పడిన కేసులో హసన్ దోషిగా తేలారు.
ఈ కేసులో ఆరో నిందితుడైన డీన్ హామిల్టన్ (47).. సోమర్సెట్లోని స్ట్రీట్‌కు చెందిన వ్యక్తి. 2026 ఫిబ్రవరిలో జరిగిన కోర్టు విచారణలో 'అసాల్ట్ బై పెనెట్రేషన్' సంబంధించిన ఒక అభియోగాన్ని, లైంగిక వేధింపులకు సంబంధించిన రెండు అభియోగాలను, ఒక అత్యాచారం అభియోగాన్ని అంగీకరించారు.
ఈ విచారణలో జోవాన్ యంగ్ చూపిన 'అసాధారణమైన ధైర్యాన్ని' న్యాయమూర్తి ప్రశంసించారు. కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ పోలీసు అధికారి కూడా కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది.
డిసెంబర్ 21, 22 తేదీల్లో శిక్షలు ఖరారు చేసే సమయంలో సుదీర్ఘ జైలు శిక్షలు పడే అవకాశం ఉందని న్యాయమూర్తి చెప్పడంతో, నిందితులందరినీ కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ సమయంలో జోవాన్ కుటుంబ సభ్యులు ఆమెను కౌగిలించుకున్నారు.

ఫొటో సోర్స్, Wiltshire Police
ఎవరీ ఫిలిప్ యంగ్?
ఫిలిప్ యంగ్ 2007 నుంచి 2010 వరకు స్విండన్ బరోలో కన్జర్వేటివ్ పార్టీ కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆయన 13 ఏళ్ల పాటు భార్యకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు. ఆమె సమ్మతి లేకుండానే ఇతర పురుషులను ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఆహ్వానించారు.
అంతకుముందు జరిగిన కోర్టు విచారణలో ఫిలిప్ యంగ్ తన భార్యకు సంబంధించిన కేసులో మొత్తం 56 అభియోగాలను అంగీకరించారు. వీటిలో 14 వాయరిజం (ఇతరులకు తెలియకుండా వారి వ్యక్తిగత దృశ్యాలను చూడటం లేదా చిత్రీకరించడం), 11 అత్యాచారాలు, ఉద్దేశపూర్వకంగా మత్తు పదార్థం ఇవ్వడానికి సంబంధించిన 11 అభియోగాలు, 'అసాల్ట్ బై పెనెట్రేషన్'కు సంబంధించిన ఏడు అభియోగాలు, నాలుగు లైంగిక దాడి, అశ్లీల చిత్రాలను ప్రచురించడానికి సంబంధించిన ఒక అభియోగం ఉన్నాయి.
"భర్త పథకం ప్రకారం భార్యకు మత్తుమందు ఇచ్చి, ఆమెపై లైంగిక దాడులకు పాల్పడిన పురుషులను జ్యూరీ దోషులుగా నిర్ధరించడం ఇంగ్లాండ్‌లో ఇదే తొలిసారి" అని ప్రత్యేక క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యాయవాది జేమ్స్ ఫోస్టర్ కోర్టు బయట చెప్పారు.

ఫ్రాన్స్ ఘటనతో..
ఫ్రాన్స్‌లో గిసెల్ పెలికోట్ కేసు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన తర్వాత మాజీ కౌన్సిలర్ ఫిలిప్ యంగ్ నేరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కేసులో గిసెల్ భర్త డొమినిక్ పెలికోట్ ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడంతో పాటు, ఆమెపై లైంగిక దాడులకు పాల్పడేందుకు మరో 50 మంది పురుషులను ఆహ్వానించారు. ఆ విచారణలో గిసెల్ పెలికోట్ కూడా తన అజ్ఞాత హక్కును వదులుకున్నారు.
2024లో ఆమె భర్తకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులందరూ కనీసం ఒక అభియోగంలో దోషులుగా తేలారు.
ఫిలిప్ యంగ్‌ను చట్టం ముందు నిలబెట్టేందుకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ప్రాసిక్యూటర్లు ఫ్రాన్స్‌లోని దర్యాప్తు అధికారుల సహాయం తీసుకున్నారు.
ఉత్తర లండన్‌లోని ఎన్ఫీల్డ్లో చివరిసారిగా నివసించిన ఫిలిప్ యంగ్, 200 సందర్భాల్లో తన భార్యకు సంబంధించిన 480 సన్నిహిత చిత్రాలు, వీడియోలను తీశాడని, కనీసం 500 సందర్భాల్లో ఆ చిత్రాలను ఆన్లైన్లో పోస్ట్ చేశాడని డిటెక్టివ్లు కనుగొన్నారు. వీటిలో ఎక్కువ భాగం స్విండన్లోని వారి ఇంట్లోనే తీశారు.
ఫిలిప్ యంగ్ ఇంటర్నెట్లో తీవ్ర అసభ్యకరమైన అశ్లీల చిత్రాలను అప్లోడ్ చేసినట్లు 2023లో పోలీసులకు సమాచారం అందడంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, REUTERS/Jack Taylor
జోవాన్ యంగ్‌పై లైంగిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి కోసం ఇంకా గాలిస్తున్నామని విల్ట్‌షైర్ పోలీసులు తెలిపారు.
ఆయన "బలిష్టమైన శరీరాకృతి, ఒంటిపై ఎక్కువ వెంట్రుకలు, తల వెనుక భాగంలో మచ్చలు, మందమైన పెదవులు, పొట్టిగా కత్తిరించిన లేదా పూర్తిగా గీసిన జుట్టు" కలిగి ఉంటాడని పోలీసులు వివరించారు. ఆయన ఛాతీ ఎడమ వైపు ప్రత్యేకమైన పచ్చబొట్టు కూడా ఉందని తెలిపారు.
జోవాన్ యంగ్‌కు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటనల అసలు సంఖ్య తెలియదని విల్ట్‌షైర్ పోలీసులు చెప్పారు. ఎందుకంటే, తమపై ఇలాంటి నేరం జరిగిన విషయం బాధితులకు తెలియకపోవడమే కారణమని తెలిపారు.
"ఇతర రకాల లైంగిక నేరాలతో పోలిస్తే మత్తుమందు ఇచ్చి, లైంగిక దాడులకు పాల్పడే కేసులు చాలా అరుదుగా నమోదవుతుంటాయి. అయితే, ఇటీవల వెలుగులోకి వచ్చిన కేసులు, నిఘా సమాచారాన్ని బట్టి చూస్తే, ఇలాంటి నేరాలు వాస్తవానికి నమోదవుతున్న వాటి కంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. బాధితులకు తమకు మత్తుమందు ఇచ్చిన విషయం తెలియకపోవచ్చు. జరిగిన ఘటనలు పూర్తిగా గుర్తుండకపోవచ్చు. లేదా వాటి ప్రభావాన్ని మద్యం సేవించడం వల్ల కలిగిన లక్షణాలుగా భావించవచ్చు. ఈ కారణాల వల్ల ఇలాంటి నేరాలను గుర్తించడం, ఫిర్యాదు చేయడం చాలా కష్టంగా మారుతోంది" అని పోలీసు అధికారి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































