గొల్లగుప్పలో ఏడేళ్ల బాలిక మరణానికి మలేరియా మాత్రల మోతాదే కారణమా, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా నివారణ కోసం ఇచ్చిన క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న తరువాత ఏడేళ్ల బాలిక మృతి చెందగా, మరో 53 మంది అస్వస్థతకు గురయ్యారు.
అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది చిన్నారులే.
వీరిని భద్రాచలం ఏరియా ఆసుపత్రితో పాటు లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనపై విచారణతో పాటు పోస్టుమార్టం, మందుల నాణ్యతపై పరీక్షలు జరుగుతున్నాయని జిల్లా అధికారులు బీబీసీకి తెలిపారు.
అయితే బాలిక మృతి క్లోరోక్విన్ మాత్రల ప్రభావం వల్లే జరిగిందా? మాత్రల మోతాదులో ఏమైనా తేడా జరిగిందా? లేక చిన్నారికి మరేదైనా ఆరోగ్య సమస్య ఉందా?

అసలేం జరిగింది?
గొల్లగుప్పలో ఇటీవల మలేరియా కేసులు నమోదయ్యాయి. దీంతో ఫీవర్ సర్వేలెన్స్‌లో భాగంగా మంగళవారం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ గ్రామ జనాభా 253 మంది.
మలేరియా నివారణ చర్యల్లో భాగంగా గ్రామంలోని 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు ఇచ్చినట్లు పోలవరం జిల్లా వైద్యాధికారిణి విష్ణు చైతన్య బీబీసీకి తెలిపారు. అక్కడి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు కూడా వైద్య సిబ్బంది మాత్రలు ఇచ్చారని తెలిపారు.
"క్లోరోక్విన్ తీసుకున్న వారిలో 53 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించాం. వీరిలో 46 మంది రెండు నుంచి పదేళ్లలోపువారే. మిగిలిన ఏడుగురు పెద్దవారు. మాత్రలు వేసుకున్న తర్వాత పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిలో గొల్లగుప్పకు చెందిన ఏడేళ్ల మడివి జమున కూడా ఉంది. జమున వాంతులు చేసుకోవడంతో లక్ష్మీపురం ఆసుపత్రికి తరలించాం. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు" అని విష్ణు చైతన్య చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
రెండు మాత్రలా, మూడు మాత్రలా?
"జమునకి మూడు మాత్రలు ఇచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు మీడియాలో రిపోర్ట్ అవుతోంది. ఇది తప్పు. ఆమె బరువు, వయసు బట్టి ఆమెకు రెండు మాత్రలేఇచ్చాం" అని ఆమె తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
జమున స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఈ పాపతోపాటు మరికొందరు చిన్నారులు, పెద్దల్లో కూడా అనారోగ్య లక్షణాలు కనిపించాయి.
క్లోరోక్విన్ మాత్రలు తీసుకున్న 53 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారులు తెలిపారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందాలు బాధితులను పర్యవేక్షిస్తున్నాయని, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వైద్య బృందాలను కూడా రప్పించామని తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
మోతాదు సరిగ్గానే ఇచ్చాం: కలెక్టర్
చిన్నారులకు క్లోరోక్విన్ మాత్రలు ఎక్కువ మోతాదులో ఇచ్చారన్న ఆరోపణలపై జిల్లా యంత్రాంగం స్పందించింది.
"వైద్య ఆరోగ్య శాఖ ప్రోటోకాల్ ప్రకారమే క్లోరోక్విన్ మాత్రలు ఇచ్చాం. మందుల నాణ్యతపై నిర్వహించిన క్వాలిటీ కంట్రోల్ పరీక్షల్లోనూ సమస్య కనిపించలేదు" అని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ బీబీసీతో చెప్పారు.
అయితే మరింత స్పష్టత కోసం పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రల బ్యాచ్ నమూనాలను విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినట్లు తెలిపారు.
గొల్లగుప్పలో ఇది రెండో ఘటన.. కారణాలేంటి?
ఈ ప్రాంతంలో మలేరియా కేసులు సాధారణంగా ఉంటాయి. ఇప్పుడు నాలుగు మలేరియా కేసులు వచ్చాయి. కానీ వారిలో ఎవరు మరణించలేదని కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు.
మలేరియా కేసులు పెరుగుతుండటంతో క్లోరోక్విన్ టాబ్లెట్లు పంపిణీ చేశామన్నారు.
"గొల్లగుప్పలో చిన్నారులు వరుస మరణాల బారిన పడుతున్నారని మీడియాలో రిపోర్టు అవుతున్నాయి, ఈ సమాచారం సరైనది కాదు’’ అనికలెక్టర్ అన్నారు.
"గొల్లగుప్పలో ఇటీవల మరో 11 ఏళ్ల బాలిక రోజా మృతి చెందింది. అయితే ఆమె మరణానికి, జమున మరణానికి సంబంధం లేదు’’ అని దినేష్ కుమార్ తెలిపారు.
"రోజా గత శుక్రవారం కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లింది. ఆమెకు క్లోరోక్విన్ మందులు ఇవ్వడం వల్ల ఈ మరణం జరగలేదు. ఆమె ఆకస్మికంగా పడిపోగా, గ్లూకోజ్ స్థాయిలు పెరిగినట్లు గుర్తించాం. ఆ బాలిక మృతి వేరు. జమున మాత్రం క్లోరోక్విన్ మాత్రలు తీసుకున్న తర్వాత స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చేరింది. ఆమె గ్లూకోజ్ స్థాయిలు తగ్గినట్లు గుర్తించాం. ఈ రెండు ఘటనలు వేర్వేరు" అని కలెక్టర్ తెలిపారు.
మరో ఇద్దరు విద్యార్థులు వాంతులతో ఏరియా ఆసుపత్రిలో చేరారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కేసుల్లో ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన తర్వాత వాటిలోని వివరాలు ఆధారంగా దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
జమున మృతికి అసలు కారణమేంటి?
ఇదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
క్లోరోక్విన్ మాత్రలు తీసుకున్న తర్వాత జమున అస్వస్థతకు గురైందని అధికారులు చెబుతున్నారు. ఆమె రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఆమెకు ముందే ఏదైనా గుండె సంబంధిత సమస్య ఉందా? క్లోరోక్విన్ ప్రభావం ఏమైనా ఉందా? లేక మరేదైనా కారణమా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
క్లోరోక్విన్ ప్రభావం వల్లే జమునకు గుండె లయలో ఏమైనా మార్పులు వచ్చాయా అనేది ఇప్పటివరకు నిర్ధరణ కాలేదని జిల్లా వైద్యాధికారిణి తెలిపారు. పోస్టుమార్టం, హిస్టోపాథాలజీ, ఫోరెన్సిక్ పరీక్షల నివేదికలు వచ్చాకే మృతికి కారణం స్పష్టమవుతుందని విష్ణు చైతన్య తెలిపారు.
అదే సమయంలో చిన్నారికి కుటుంబపరంగా లేదా జన్యుపరంగా గుండె సంబంధిత సమస్య ఏదైనా ఉందా అనేది కూడా తెలుసుకునేందుకు రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అన్నారు.
మృతురాలు జమున పెదనాన్న మసయ్య బీబీసీతో మాట్లాడారు.
‘‘వైద్య సిబ్బంది మూడు మలేరియా మాత్రలు ఇవ్వడం వల్లే జమున మృతి చెందిందని’’ ఆరోపించారు.
ఈ విషయాన్ని వైధ్యాధికారణి విష్ణు చైతన్య ను బీబీసీ ప్రశ్నించగా... "జమునకు మూడు క్లోరోక్విన్ మాత్రలు ఇచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆమె వయసు, బరువును బట్టి రెండు మాత్రలే ఇచ్చాం. ఆమెకు ముందే ఏదైనా గుండె సంబంధిత సమస్య ఉందా అనేది కూడా పరిశీలించాల్సి ఉంది. మాత్రలు వేసుకున్న తర్వాత ఆమె అస్వస్థతకు గురైందనేది వాస్తవం. అయితే ఆమె మృతికి అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుంది" అని విష్ణు చైతన్య తెలిపారు.
ప్రొటోకాల్ ప్రకారం ఏడేళ్లలోపు చిన్నారులకు ఒక మాత్ర, ఆపై పదేళ్ల వరకు రెండు మాత్రలు ఇవ్వొచ్చని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, UGC
‘ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగుతుంది’
గొల్లగుప్పలో మలేరియా కేసులు నమోదవుతుండటంతో ఫీవర్ సర్వేలెన్స్ నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు.
మాత్రలు పంపిణీ చేయడానికి ముందు గ్రామంలో పరీక్షలు నిర్వహించగా కొంతమందికి మలేరియా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు.
అందువల్ల ఈ ఘటనలో మలేరియా నివారణ చర్యలు, మందుల పంపిణీ విధానం, మోతాదు, మందుల నాణ్యత, బాధితుల వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు వంటివి అన్నింటినీ కలిపి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, పోలవరం జిల్లా కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించారు.
గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగుతుందని, ఆసుపత్రిలోనూ నిపుణుల పర్యవేక్షణలో చిన్నారులకు చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ కె.దినేష్‌కుమార్ తెలిపారు.
కాకినాడ, రాజమహేంద్రవరం, పాడేరు, విజయవాడ నుంచి ప్రత్యేక వైద్య నిపుణుల బృందాలు భద్రాచలం చేరుకున్నాయని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శుభం నొక్వాల్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























