‘ఆకలి తీర్చుకోవడానికి కలుపు మొక్కలు తింటున్నారు’...దిగ్బంధంలో రష్యా ఆక్రమిత ఒలెష్కీ ప్రజలు

రష్యా, యుక్రెయిన్, నిత్యావసరాలు, యుద్ధం, ఆకలి

ఫొటో సోర్స్, Ksenia Arkhipova

ఫొటో క్యాప్షన్, ఒలెష్కీలో 2023 నుంచి గ్యాస్, కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ప్రత్యామ్యాయాలు వెదుక్కుంటున్నారు.
    • రచయిత, ఓల్గా మాల్చెవ్‌స్కా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

హెచ్చరిక: ఈ కథనంలో కలవరపెట్టే అంశాలున్నాయి.

''నిన్న రాత్రి మరో ఇద్దరు సామాన్య పౌరులు చనిపోయారు'' అని హాలియా చెబుతుండగానే ఆమె ఫోన్ కనెక్షన్ కట్ అయిపోయింది.

ఆమె రష్యా ఆధీనంలో ఉన్న యుక్రెయిన్ నగరం ఒలెష్కీలో చిక్కుకుపోయారు.

అక్కడ నిరంతరం బాంబుల దాడి జరుగుతోందని ఆమె చెబుతున్నారు.

ఆ నగరానికి ఆహారం, నీళ్ల సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ రాత్రి చనిపోయిన ఇద్దరూ భార్యాభర్తలని హాలియా మూడు రోజుల తర్వాత చెప్పారు. వారిద్దరూ ఆమెకు బాగా తెలుసు. తమ ఇంటికి 23కిలోమీటర్ల దూరంలో ఉన్న రాడెన్స్క్ పట్టణం నుంచి భార్యాభర్తలిద్దరూ ఒక సంచిలో ఆహారం తీసుకుని ఇంటికి వస్తున్నారు. కానీ రష్యా అధికారులు విధించిన కర్ఫ్యూ ప్రారంభమయ్యేలోపు వారు ఇంటికి చేరుకోలేకపోయారు.

ఆ తర్వాత డ్రోన్ దాడిలో వారు చనిపోయారు.

ఆహారం తీసుకెళ్తున్న ఇద్దరు పౌరులు సెప్టెంబర్ 20న చనిపోయినట్టు నాలుగు వేర్వేరు వర్గాలు ధృవీకరించాయి.

ఒలెష్కీ పట్టణం

ఫొటో సోర్స్, Ombudsman Dmytro Lubinets

ఫొటో క్యాప్షన్, ఒలెష్కీ పట్టణం 2022 నుంచి రష్యా ఆక్రమణలో ఉంది. అక్కడి ప్రజలు దిగ్బంధంలో చిక్కుకుపోయారు

‘పిల్లలకు ఆహారం లేదు, చదువు లేదు’

తన గుర్తింపు బయటపడుతుందనే భయంతో హాలియా వారి పేర్లను వెల్లడించడానికి ఇష్టపడటం లేదు. హాలియా ఆమె అసలు పేరు కాదు.

దక్షిణ ఖెర్సాన్‌లోని ఈ యుద్ధ ప్రాంత నగరంలో నివసిస్తున్న ప్రజల నుంచి బీబీసీ ఇటీవల విన్న అనేక భయానిక అనుభవాల్లో హాలియా చెప్పిన కథనం ఒకటి మాత్రమే.

ఒలెష్కీ నగరం 2022 నుంచి రష్యా ఆధీనంలో ఉంది. దీనికి ఒకవైపు డ్నిప్రో నది ఉంటుంది. ఆ నది దాటిన తర్వాత యుక్రెయిన్ స్థావరాలుంటాయి. మరోవైపు రష్యా బలగాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఒలెష్కీ నగరం చిక్కుకుపోయింది.

2023లో నోవా కఖోవ్కా డ్యామ్ కూలిపోవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

డ్యామ్ నీళ్లు ముంచెత్తిన నగరాల్లో ఒలెష్కీ కూడా ఒకటి.

వరద నీరు భవనాల పైకప్పుల వరకు చేరింది.

ఆ డ్యామ్‌ను రష్యానే పేల్చివేసిందని యుక్రెయిన్, నేటో ఆరోపించాయి.

అయితే డ్యామ్ విధ్వంసానికి యుక్రెయిన్ కారణమని రష్యా ఆరోపించింది.

రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించడానికి ముందు ఒలెష్కీలో 24 వేలమంది ప్రజలు నివసించేవారు.

ఇప్పుడు నగరంలో, దాని చుట్టుపక్కల ప్రాంతంలో సుమారు ఆరువేలమంది మాత్రమే మిగిలి ఉన్నారని యుక్రెయిన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. వారిలో 200 మంది పిల్లలు ఉన్నారు.

ఒలెష్కీ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మిగిలిన పిల్లలు సరైన పోషకాహారం లేక బాధపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం, చదువుకునే అవకాశం లేకపోవడంలో పిల్లల పరిస్థితి మరింత దిగజారుతోందని వారు అంటున్నారు.

రష్యా, యుక్రెయిన్, నిత్యావసరాలు, యుద్ధం, ఆకలి

ఫొటో సోర్స్, Maxar Technologies Handout/EPA-EFE/REX/Shutterstock

ఫొటో క్యాప్షన్, నోవా కఖోవ్కా డ్యామ్ కూలిపోవడంతో ఒలెష్కీ నగరాన్ని వరదలు ముంచెత్తాయి.

పరస్పర ఆరోపణలు

ప్రస్తుతం అక్కడ ఒక ఆసుపత్రి మాత్రమే పనిచేస్తోందని, అది కూడా పూర్తిస్థాయిలో కాదని పలువురు వ్యక్తులు బీబీసీతో చెప్పారు.

వారంలో కొన్ని రోజులు మాత్రమే ఆస్పత్రి తెరిచి ఉంటుంది. అవయవాలు తొలగింపు వంటి అత్యవసర శస్త్ర చికిత్సలు చేయడానికి మాత్రమే ఆస్పత్రిని ప్రధానంగా ఉపయోగిస్తున్నారు.

ఈ ప్రాంతానికి అవసరమైన సరుకులు పంపించేందుకు యుక్రెయిన్ ప్రయత్నించినప్పటికీ ఇటీవలి నెలల్లో ఆ ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదు.

ఒలెష్కీ విషమ పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఆహారం, మందు సరఫరాలో సమస్యలు ఉన్నాయని ఈ వారం ప్రారంభంలో రష్యా అంగీకరించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు రష్యా సైన్యం ప్రయత్నిస్తోందని చెప్పింది. అయితే సమస్యలకు కారణం యుక్రెయినే అని రష్యా ఆరోపించింది.

రష్యా బలగాలు విధించిన పూర్తి దిగ్బంధనంలో ఒలెష్కీ ప్రజలు జీవిస్తున్నారని యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రియ్ సిబిహా చెప్పారు.

న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో సిబిహా ఈ నెల 22న మాట్లాడుతూ ఒలెష్కీలోకి మానవతా సాయాన్ని అనుమతించేలా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.

గడ్డి ఎలా వండుకోవాలో చాటింగ్‌లో అడుగుతున్న ప్రజలు

ఒలెష్కాలో ఉన్న హాలియా ప్రాణాలతో ఉండడానికి ప్రతీరోజూ పోరాడుతున్నారు.

నగరంలో ఆహారం ఏమీ లభించడం లేదని ఆమె అన్నారు.

చివరిసారిగా మే నెలలో ఆహారం అందిందని ఆమె తెలిపారు.

''నేను రోజూ రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తాను. సాదా రొట్టె చేసుకుంటాను. దానికి కొన్నిసార్లు టమాటా లేదా కొంచెం తేనె కలుపుకుని తింటాను. ఒక టీ తాగుతాను అంతే'' అని హాలియా వివరించారు.

వేసవిలో కష్టపడి పండించుకున్న కూరగాయలు కూడా అయిపోవడంతో చాలా మంది ప్రజలు తోటల్లో పెరిగే కలుపు మొక్కలను వండుకుంటున్నారని హాలియా చెప్పారు.ఏ కలుపు మొక్కలు తినొచ్చు, వాటిని ఎలా ఉడికించాలి అనే విషయాలు స్థానిక టెలిగ్రామ్ చాట్లలో చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా ఆహారాన్ని అమ్ముకోవడం, ఒకరితో ఒకరు మార్చుకోవడం లేదా పంచుకోవడం గురించి కూడా స్థానికులు ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు.

ఒలెష్కీలో ఇప్పుడు ఏ దుకాణం కూడా తెరిచి ఉండటం లేదు.

దీంతో ప్రజలకు దుస్తులు, వ్యక్తిగత పరిశుభ్రతకు అవసరమైన వస్తువులు కూడా దొరకడం లేదు.

మూడేళ్ల క్రితం కఖోవ్కా డ్యాంపై దాడి జరిగినప్పటి నుంచి ఆ నగరంలో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా నిలిపివేశారు.

రష్యా, యుక్రెయిన్, నిత్యావసరాలు, యుద్ధం, ఆకలి

ఫొటో సోర్స్, Ksenia Arkhipova

ఫొటో క్యాప్షన్, నిత్యావసరాల కోసం రోడ్డుపై వెళ్తున్నప్పుడు మందుపాతరలు పేలడంతో కొందరు చనిపోతున్నారు.

‘డ్రోన్ ఎప్పుడు దాడి చేస్తుందో, మందు పాతర ఎప్పుడు పేలుతుందో చెప్పలేం’

అవసరమైన సరుకుల కోసం కొంతమంది ప్రజలు నగరం నుంచి బయటకు వెళ్లేందుకు.. మందు పాతరలు అమర్చిన రహదారులపై కాలినడకన ప్రయాణించి ప్రమాదాలను ఎదుర్కొన్నారు. ఇది ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారింది.

ఒలెష్కీలో ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారన్నది తెలియడం లేదు.

ఈ ఏడాది ఒలెష్కీలో, దానికి తూర్పున సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోలా ప్రిస్తాన్ ప్రాంతాల్లో కనీసం 29 మంది పౌరులు చనిపోయినట్టు, 54 మంది గాయపడినట్టు యుక్రెయిన్‌లోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పర్యవేక్షణ మిషన్ తెలిపింది.

అయితే ఈ సంఖ్య వాస్తవానికి చాలా ఎక్కువగా ఉండొచ్చని స్థానిక స్వచ్ఛంద కార్యకర్తలు అంచనా వేస్తున్నారు.

2022వేసవిలో ఒలెష్కీ ప్రాంతంలో రష్యా దాడుల నుంచి క్సేనియా ఆర్కిపోవా అనే యువతి తప్పించుకోగలిగారు. అప్పటినుంచి అక్కడ చనిపోయిన వారి సంఖ్యను ఆమె నమోదు చేస్తున్నారు.

రష్యా సైన్యం నగరాన్ని స్వాధీనం చేసుకున్న కొన్ని నెలల తర్వాత క్సేనియా అక్కడి నుంచి బయటపడ్డారు.

ఆమె ఒక స్వచ్ఛంద కార్యకర్త. ఒలెష్కీలో ప్రజలకు ఆహారం, మందులు పంపించడానికి, ప్రజలను అక్కడనుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆమె సహాయం చేస్తున్నారు.

స్థానికులు ఆమెను ఎంతగానో నమ్ముతారు. తమ వ్యక్తిగత సమాచారాన్ని ఆమెకు అందిస్తారు.

రష్యా, యుక్రెయిన్, నిత్యావసరాలు, యుద్ధం, ఆకలి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒలెష్కీలో మరణాల సంఖ్య కచ్చితంగా తెలియడం లేదు.

‘మరణాల సంఖ్య తెలియడం లేదు’

''ఎవరైనా చనిపోయినట్టు నాకు తెలియగానే వారి పేర్లు, పుట్టిన తేదీలు ఒక జాబితాలో నమోదు చేస్తున్నాను. ఇప్పటి వరకు నా దగ్గర అలా సుమారు 1200 మంది పేర్లు ఉన్నాయి. కొన్నిసార్లు ఆ జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడానికి కూడా నాకు సమయం ఉండదు. ఎందుకంటే ప్రతిరోజూ ఇంకొకరు లేదా ఇద్దరు ఆ జాబితాలో చేరుతూనే ఉంటారు. ఒకరిని డ్రోన్ చంపుతుంది. మరొకరు మందుపాతరపై అడుగు వేయడంతో చనిపోతారు'' అని క్సేనియా ఆవేదన వ్యక్తంచేవారు.

ఈ సంఖ్యను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది.

తన తల్లిదండ్రులను కోల్పోయిన స్థానిక మహిళ ఒకరు తన అనుభవాన్ని బీబీసీకి వివరించారు.

ఈ వేసవిలో తన తల్లిదండ్రులిద్దరూ ఒలెష్కీలో చనిపోయారని టెటియానా చెప్పారు. టెటియానా ఆమె అసలు పేరు కాదు. తల్లిదండ్రులకు సంబంధించిన ఆధారాలను ఆమె బీబీసీకి అందించారు.

అయితే తన భద్రత కోసం వారి వివరాలు, ఫోటోలు ప్రచురించవద్దని ఆమె కోరారు.

''వాళ్లిద్దరినీ ఇంట్లోనే కాల్చి చంపారు. రష్యా సైనికులు అక్కడకు వచ్చి ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు'' అని ఆమె చెప్పారు.

మృతదేహాల ఖననంపైనా రష్యా అధికారులు ఆంక్షలు విధించారని స్థానికులు చెబుతున్నారు. దీంతో చనిపోయిన వారి సంఖ్యలను లెక్కించడం మరింత కష్టంగా మారింది.

రష్యా, యుక్రెయిన్, నిత్యావసరాలు, యుద్ధం, ఆకలి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మృతదేహాలను విద్యుత్ సరఫరాలేని మార్చురీలో ఒకదానిపైఒకటి ఉంచుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

‘అంత్యక్రియలకూ అనుమతి లేదు’

''ఎవరైనా డ్రోన్ దాడిలో చనిపోయినా, మందుపాతరపై అడుగుపెట్టి చనిపోయినా లేదా మరే విధంగానైనా చనిపోయినా వారిని ఖననం చేయడానికి అధికారులు మమ్మల్ని అనుమతించరు'' అని టెటియానా చెప్పారు.

ఆ మరణాలను రష్యా వైద్యుడు నిర్వహించే పోస్టుమార్టం ద్వారా ధృవీకరించాల్సిందేనని రష్యా ఆక్రమణ అధికారులు చెబుతున్నట్టు బీబీసీకి తెలిసింది. అయితే ఒలెష్కీలో ఈ ధ్రువీకరణ అంత తేలిగ్గా సాధ్యం కావడం లేదు.

సహజ కారణాలతో చనిపోయిన వారిని మాత్రమే ఖననం చేయడానికి అనుమతిస్తారని టెటియానా చెప్పారు. ఫలితంగా డిసెంబర్ నుంచి కొన్ని మృతదేహాలు వీధుల్లోనే ఉన్నాయని ఆమె తెలిపారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రి మార్చురీలో ఒకదానిపై మరొకటి ఉంచుతున్నారని స్వచ్ఛంద కార్యకర్త క్సేనియా ఆర్కిపోవా చెప్పారు. ఆ మార్చురీలో చలికాలం నుంచి విద్యుత్ కూడా లేదని ఆమె తెలిపారు. లేదంటే వాటిని వీధి కుక్కలు తింటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

స్థానికుల నుంచి సేకరించిన అనేక ఫోటోల ఆధారంగా ఈ విషయాన్ని బీబీసీ ధృవీకరించింది. అయితే ఆ ఫోటోలు చాలా భయానకంగా ఉండటంతో వాటిని ప్రచురించడం లేదు.

ఇది ప్రజలపై మానసిక ఒత్తిడి పెంచడానికి ఉపయోగించే ఒక మార్గమని ఎస్టర్ వ్రాటర్యోవా చెప్పారు. ఆమె హ్యూమానిటీ అనే స్వచ్ఛంద సంస్థ సహ వ్యవస్థాపకురాలు. ఈ సంస్థ ఒలెష్కీతో పాటు రష్యా ఆధీనంలో ఉన్న యుక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల ప్రజలకు సహాయం చేస్తుంది.

''మీరు ఒక మృతదేహాన్ని ఖననం చేయడానికి ప్రయత్నిస్తే తర్వాత చనిపోయేది మీరే అవుతారు'' అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)