2070 నాటికి భారత్‌లో హిందూ, ముస్లింల జనాభా ఎలా ఉండబోతోంది?

ఫొటో సోర్స్, AFP via Getty Images
రాబోయే అనేక దశాబ్దాల పాటు కూడా భారత్ హిందూ మెజార్టీ దేశంగానే కొనసాగనుంది. అయితే, మతపరమైన జనాభా నిష్పత్తిలో క్రమంగా మార్పులు చోటు చేసుకుంటాయని అంచనాలు వెలువడ్డాయి.
ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన కొత్త అధ్యయనం 2070 నాటికి ప్రపంచంలోనే మత జనాభా ఎలా ఉండబోతుందో అంచనావేసింది. ఈ అధ్యయనం ప్రకారం.. 2070 నాటికి భారత జనాభాలో 76 శాతం మంది హిందువులు ఉంటారని తెలిపింది. 2020లో ఈ జనాభా 79 శాతంగా ఉంది.
ఈ సమయంలో.. జనాభాలో ముస్లింల సంఖ్య 15 శాతం నుంచి 20 శాతం పెరగనుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
ఈ మార్పు ప్రధానంగా వయసు, సంతానోత్పత్తి రేట్లలో మార్పుల వల్ల జరగనుంది. భారత్‌లో హిందువులతో పోలిస్తే.. ముస్లింల సగటు వయసు తక్కువగా ఉంటుంది. అలాగే, వారికి సగటున ఎక్కువ మంది పిల్లలు కూడా ఉంటారు.
ప్యూ అంచనాల ప్రకారం.. దక్షిణాసియాలో చోటుచేసుకునే భారీ జనాభా సంబంధిత మార్పులకు భారత్ ప్రధాన కేంద్రంగా ఉంది.

మరోవైపు.. ప్రపంచంలో అత్యంత ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న దేశంగా ఇండోనేషియాను అధిగమించి పాకిస్తాన్ ముందుకు వస్తుందని అంచనా. ఆ తర్వాత రెండో స్థానంలో భారత్ ఉండనుంది. బంగ్లాదేశ్ కూడా తన ముస్లిం జనాభాను గణనీయంగా పెంచుకుంటుందని అంచనాలున్నాయి.
201 దేశాలకు చెందిన డేటాను ఆధారంగా చేసుకుని వచ్చే 50 ఏళ్లలో ప్రపంచంలో మతపరమైన జనాభా ఎలా ఉండనుందో ఈ అధ్యయనం అంచనావేసింది. ఈ అధ్యయనంలో మొత్తం ప్రపంచ జనాభాను కవర్ చేసింది.
ఇటీవలి జనాభా సంబంధిత ధోరణులు ఇదే విధంగా కొనసాగుతాయని అంచనా వేస్తూ, 2020 నుంచి 2070 మధ్య కాలంలో ఏడు మతాలకు చెందిన ప్రజల జనాభా ఎంత ఉంటుందో ఈ అధ్యయనం అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
జనాభా, సర్వే డేటాను ఆధారంగా చేసుకుని.. 2020లో ప్రతి గ్రూప్ వారి జనాభాను, వయసును అంచనావేస్తుంది. సంతానోత్పత్తి రేట్లలో తేడాలను, మత మార్పిడులను కూడా ఇది పరిగణనలోకి తీసుకుంది.
ఈ అధ్యయన ఫలితాలు ప్రపంచ మతపరమైన స్వరూపంలో మార్పులు వస్తున్న తరుణంలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను నొక్కి చెబుతున్నాయి. 2070 నాటికి, పాకిస్తాన్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన రెండో దేశంగా భారత్ నిలుస్తుందని కూడా ఇది అంచనావేసింది.
అంచనాల ప్రకారం.. భారత ముస్లిం జనాభా అప్పుడు 33.4 కోట్లు ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది. పాకిస్తాన్ ముస్లిం జనాభా 46.1 కోట్లకు పెరగనుంది. ఇలా ఇండోనేషియాను అధిగమించి, ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా గల దేశంగా పాకిస్తాన్‌ను మార్చనుంది.
నివేదిక ప్రకారం, ప్రస్తుత జనాభా పెరుగుదల ధోరణులు ఇలాగే కొనసాగితే, 2020 నుంచి 2070 మధ్య భారత్‌లో హిందూ జనాభా 17.6 కోట్లు పెరుగుతుందని అంచనా. అంతేకాకుండా, దేశ మొత్తం జనాభాలో వారి వాటా ముప్పావు వంతు కంటే ఎక్కువగా ఉంటుంది.
భారత్‌లో మొత్తంగా సంతానోత్పత్తి రేటు బాగా పడుతున్నప్పటికీ.. హిందూ మహిళలతో పోలిస్తే సగటున ముస్లిం మహిళలే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. ఈ మార్పు ప్రధానంగా డెమోగ్రాఫిక్ మొమెంటమ్ అని ప్యూ అధ్యయనం పేర్కొంది.
2020లో భారతీయ ముస్లింల మధ్యస్థ వయసు 24 సంవత్సరాలు. హిందువుల మధ్యస్థ వయసు 29 ఏళ్లు. అంటే ఇక్కడ ముస్లిం యువత శాతం ఎక్కువగా ఉందని అర్థం.
2025 నుంచి 2030 మధ్య భారత్‌లోని ముస్లిం మహిళలు సగటున 2.3 మంది పిల్లలకు జన్మనిస్తారని, హిందూ మహిళల విషయంలో ఈ సంఖ్య 1.8గా ఉంటుందని ప్యూ అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
"భారత్‌లో మత జనాభా కూర్పులో మార్పునకు ప్రధాన కారణం హిందువులు, ముస్లింల మధ్య దీర్ఘకాలంగా ఉన్న జనాభా వ్యత్యాసాలేనని మేం అంచనా వేస్తున్నాం. ముస్లింలకు సగటు వయసు తక్కువగానూ, సంతానోత్పత్తి రేటు ఎక్కువగానూ ఉంది" అని ప్యూ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన స్టెఫానీ క్రామర్ బీబీసీతో అన్నారు.
''మతాల మధ్య ఈ సంతానోత్పత్తి రేటులో ఉన్న అంతరం క్రమంగా తగ్గింది. 1992లో.. ప్రతి మహిళకు జన్మించే పిల్లల సంఖ్య ఆధారంగా ఈ వ్యత్యాసం ఒకరి కంటే ఎక్కువగా ఉండేది. అయితే, ఇటీవలి సంవత్సరాల్లో ఈ అంతరం దాదాపు సగానికి తగ్గింది. భవిష్యత్తులో కూడా ఈ వ్యత్యాసం మరింత తగ్గే అవకాశం ఉంది" అని స్టెఫానీ క్రామర్ చెప్పారు.
''అయితే, హిందువుల సంతానోత్పత్తి రేటు ఇప్పటికే రీప్లేస్మెంట్ స్థాయిల కంటే పడిపోయింది. మరోవైపు.. ముస్లింల సంతానోత్పత్తి రేటు వచ్చే రెండు దశాబ్దాల పాటు ఈ స్థాయి కంటే పైనే ఉంటుందని అంచనాలున్నాయి'' అని తెలిపారు.
(రీప్లేస్మెంట్ స్థాయి అంటే.. ఒక జనాభా సంఖ్య దీర్ఘకాలంలో స్థిరంగా కొనసాగడానికి అవసరమైనంత మంది పిల్లలు జన్మించే సంతానోత్పత్తి రేటు)
అయితే.. ఈ అంచనాలు అంత ఆశ్చర్యకరంగా ఏమీ లేవని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఇండియా డెమోగ్రాఫర్ కేఎస్ జేమ్స్ అన్నారు.
''ముస్లింలు, హిందువుల మధ్య సంతానోత్పత్తి రేటులో అంతరం ఇప్పటికే సుస్పష్టంగా ఉంది'' అని ఆయన బీబీసీకి తెలిపారు.
''అంటే..వచ్చే కొన్ని దశాబ్దాల్లో ముస్లిం జనాభా అత్యంత వేగంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, అన్ని మతపరమైన కమ్యూనిటీల్లో ఈ సంతానోత్పత్తి రేట్లు తగ్గుతున్నాయి. ఈ వ్యత్యాసం మరింత తగ్గుతుందని అంచనాలున్నాయి'' అని చెప్పారు.
''కాలక్రమేణా.. ఇద్దరి సంతానోత్పత్తి రేట్లు సమానంగా మారతాయి'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
ఈ అంచనాలు.. భారత జనాభా ధోరణుల్లో ఎలాంటి కీలక లేదా నాటకీయ మార్పులు ఉండవని సూచిస్తున్నట్లు చెప్పారు.
భవిష్యత్‌లో హిందువుల కంటే ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుందని హిందూ రైట్ వింగ్ గ్రూప్‌లు తరచూ చేసే వాదనలను జనాభా శాస్త్రవేత్తలు తిరస్కరిస్తున్నారు.
భారత్‌లో జనాభా మార్పులకు భారీ స్థాయి మత మార్పిడినే కారణమని చేసే వాదనలకు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. జనాభా శాస్త్రవేత్తలు ప్రకారం.. ఈ అంచనాలు అటువంటి ''ఆందోళనకరమైన వాదనలకు'' మద్దతు ఇవ్వడం లేదు.
ఈ నివేదిక ప్రకారం.. దక్షిణాసియాకు చెందిన విస్తృతమైన పరిస్థితి కూడా అంతే ఆసక్తికరంగా ఉంది.
2070 నాటికి పాకిస్తాన్‌లోని ముస్లిం జనాభా రెండింతలకు పైగా పెరిగి 46.1 కోట్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి. దీంతో, ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా గల దేశంగా ఇది అవతరించనుంది.
భారత్ 33.4 కోట్ల మంది ముస్లిం జనాభాతో రెండో స్థానంలో ఉండనుంది. అలాగే.. బంగ్లాదేశ్ ముస్లిం జనాభా 21.8 కోట్లకు పెరుగుతుంది. ఇదే సమయంలో ప్రపంచంలో భారత్, నేపాల్‌లు మాత్రమే హిందూ మెజార్టీ దేశాలుగా ఉండనున్నాయి.
ఈ ప్రాంతీయ మార్పుల వెనుక, ప్రపంచవ్యాప్తంగా కూడా మరింత విస్తృతమైన జనాభా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
నివేదిక ప్రకారం, 2035 నాటికి ప్రపంచ క్రైస్తవ జనాభాను ముస్లిం జనాభా అధిగమిస్తుందని అంచనా. 2020లో 2.02 బిలియన్లుగా ఉన్న ప్రపంచ ముస్లిం జనాభా, 2070 నాటికి 3.64 బిలియన్లకు చేరుకోవచ్చు.
ఇదే సమయంలో, క్రైస్తవ జనాభా దాదాపు మూడు బిలియన్లకు చేరుకుంటుంది. ప్రపంచ జనాభాలో ముస్లింలు ప్రస్తుతమున్న 26 శాతం నుంచి 36 శాతానికి పెరుగుతారు.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images)
అయితే, మతపరమైన నిర్మాణంలో అతిపెద్ద మార్పు దక్షిణాసియాకు పశ్చిమాన వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫ్రికాలో కూడా జరుగుతూ ఉండవచ్చు.
క్రైస్తవ మత కేంద్రం క్రమంగా యూరప్, అమెరికాల నుంచి సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికాకు మారుతోంది.
నివేదిక ప్రకారం, ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే, 2070 నాటికి ప్రపంచంలోని క్రైస్తవులలో సగానికి పైగా ఈ ప్రాంతంలోనే ఉంటారు.
2020లో ఈ సంఖ్య 31 శాతంగా ఉంది. క్రైస్తవ జనాభా విషయంలో అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక క్రైస్తవ జనాభా కలిగిన దేశంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అవతరిస్తుందని ప్యూ అంచనా వేస్తోంది.
నివేదిక ప్రకారం.. యూరప్‌లో క్రైస్తవ జనాభా అత్యంత వేగంగా క్షీణించే అవకాశం ఉంది. ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే... ప్రపంచ క్రైస్తవ జనాభాలో యూరప్ వాటా 2020లో 22 శాతం నుంచి 2070 నాటికి 11 శాతానికి పడిపోతుంది.
2065 సంవత్సరం నాటికి అమెరికాలో క్రైస్తవ జనాభా తగ్గుతుందని అంచనా. అయినప్పటికీ, 2070లో కూడా క్రైస్తవులు దేశంలో అతిపెద్ద మత సమూహంగా కొనసాగుతారు.
బ్రిటన్, ఫ్రాన్స్‌లో ఎలాంటి మతంతో సంబంధం లేని వారు 2070 నాటికి అత్యధికంగా ఉంటారని అంచనా. దక్షిణ కొరియాలో కూడా ఇదే ధోరణి కొనసాగనుంది.
అయితే, ప్రపంచ మొత్తం జనాభాలో అటువంటి వారి వాటా 24 శాతం నుంచి 17 శాతానికి తగ్గినట్లు అంచనా. దీనికి ప్రధాన కారణం చైనా జనాభా క్షీణించడమే.
నివేదిక ప్రకారం, ప్రపంచంలోని మతవిశ్వాసం లేని వారిలో మూడింట రెండు వంతుల మంది చైనాలో నివసిస్తున్నారు.
చైనా జనాభాలో ఈ తగ్గుదల అంచనా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో పెరుగుతున్న జనాభా సంఖ్యల ప్రభావాన్ని భర్తీ చేస్తుంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
2070 సంవత్సరం నాటికి మరికొన్ని ఊహించని మార్పులు కూడా కనిపించవచ్చు.
హిందూ జనాభా విషయంలో ప్రపంచంలో ఐదో అతిపెద్ద దేశంగా అమెరికా మారుతుంది. ఈ పెరుగుదలకు వలసలే ప్రధాన కారణం.
ఆస్ట్రేలియాలో ఏ మతానికి చెందని జనాభా దేశంలోనే అతిపెద్ద గ్రూప్‌గా అవతరించి, క్రైస్తవులను అధిగమించనుందని అంచనా.
మరోవైపు.. బౌద్ధ మత జనాభాపై ఒత్తిడి పెరగనుందని అంచనా. చైనా, జపాన్, దక్షిణ కొరియాలో వృద్ధాప్య జనాభా పెరుగుతుండటం, తూర్పు ఆసియాలో మొత్తం జనాభా క్షీణత కారణంగా బౌద్ధ జనాభా సగానికంటే ఎక్కువగా తగ్గిపోవచ్చు.
అలాగే, లావోస్, మంగోలియాలో బౌద్ధులు ఇకపై మెజార్టీగా ఉండరని కూడా ఈ అధ్యయనం అంచనావేసింది.
అయితే, ఈ అంచనాల విషయంలో కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. ఇవి జనాభా అంచనాలు మాత్రమే. భవిష్యత్ సంఘటనల అంచనాలు కావు. సంతానోత్పత్తి, వలసలు, మత మార్పిడిలో ఇటీవలి ధోరణులు అలానే కొనసాగనున్నాయని ప్యూ అంచనా వేస్తోంది.
''మతపరమైన సమూహాల జనాభాను ప్రభావితం చేసే చాలా సంఘటనలు ఉన్నాయి. వాటిల్లో యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పులు ఉన్నాయి. ఈ అధ్యయనంలో వీటన్నింటినీ విశ్లేషించలేదు'' అని ఈ నివేదిక అంగీకరించింది.
భారత్ విషయానికి వస్తే.. 2020 సంవత్సరానికి సంబంధించిన మతపరమైన జనాభా నిష్పత్తిని అంచనా వేయడానికి 2011 జనాభా లెక్కల గణాంకాలను ఉపయోగించాల్సి వచ్చింది. ఆ తర్వాత జరగాల్సిన జనాభా గణన వాయిదా పడింది.
అయినప్పటికీ, జనాభా మార్పుల దిశ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రపంచ మతపరమైన పరిస్థితుల్లో దక్షిణాసియా భవిష్యత్తులోనూ కీలక పాత్ర పోషించనుంది. దీనికి భారత్‌లోని మెజార్టీ హిందూ జనాభా మాత్రమే కాకుండా, వేగంగా పెరుగుతున్న ముస్లిం జనాభా కూడా ముఖ్యమైన కారణంగా నిలవనుంది.
క్రైస్తవ మత భవిష్యత్తును ప్రభావితం చేయడంలో ఆఫ్రికా ఖండం మరింత కీలక పాత్ర పోషించనుంది. అదే సమయంలో, యూరప్‌తో పాటు తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో లౌకికవాదం పెరుగుతుందని అంచనా.
2070 నాటికి ప్రపంచ మతపరమైన జనాభా స్వరూపం గణనీయంగా భిన్నంగా ఉండే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఈ మార్పులకు మతమార్పిడుల కంటే వివిధ మతాల మధ్య జననాలు, మరణాలు, వలసల రేట్లలో ఉన్న వ్యత్యాసాలే ప్రధాన కారణాలుగా ఉండనున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























