గోల్కొండ: అమెరికా, ఆస్ట్రేలియాలో కొన్ని ఊళ్లకు ఈ పేరు ఎందుకు పెట్టారు, ఏమని అర్ధం చెప్పారు?

ఫొటో సోర్స్, Getty Images
గోల్కొండ. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది హైదరాబాద్‌లో గంభీరంగా నిలిచిన కోటే కాదు, దానిని ఏలిన నవాబులు కూడా.
చరిత్రపుటల్లో చేరిపోయిన గొల్కొండ సామ్రాజ్యాన్ని కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు పాలించారు.
అయితే గోల్కొండ అంటే కోట, దాని పాలకులే కాదు, వజ్రాలకు కూడా ప్రసిద్ధి చెందిందనే విషయం గుర్తుకువస్తుంది.
గోల్కొండ సామ్రాజ్య పరిధిలోకి వచ్చే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని కొల్లూరు, పరిటాల ప్రాంతాలు ముఖ్యమైన వజ్రాల గనులుగా ఉండేవి. వీటితో పాటు ఇతరత్రా అనేక గనులు కూడా ఉన్నాయి.
ఇక్కడ నుంచి నాణ్యమైన పెద్ద వజ్రాలు ఉత్పత్తి అయి, అవి హైదరాబాద్ నగరం మీదుగా ప్రపంచవ్యాప్తంగా ఎగుమతయ్యేవి. అలా గోల్కొండ సామ్రాజ్యం వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా ఉండేది.

ప్రస్తుతం ప్రపంచంలో పేరెన్నికగన్న చాలా వజ్రాలు ఇక్కడ దొరికాయని పలువురు చరిత్రకారులు రాశారు.
గోల్కొండ వజ్రాలకు ఎంతగా ప్రసిద్ధి పొందింది అంటే, ఒక దశలో సంపద, అవకాశాలు, సంతోషం వంటి పదాలకు గోల్కొండను ప్రత్యామ్నాయ పదంగా ఇంగ్లీషు నిఘంటవుల్లో చేర్చారు. ఇది అతిశయోక్తి కాదు.
ఎందరో యూరోపియన్ వర్తకులు, యాత్రికులు ఈ వజ్రాల గురించి రాశారు.ఫ్రెంచ్ యాత్రికుడు, వజ్రాలు,రత్నాల వ్యాపారి జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ వంటి వారి రచనలు ఇందులో చాలా కీలకం.
గోల్కొండ అంటే ఒక సంపన్న గని, విస్తృత అర్థంలో గొప్ప సంపదకు కేంద్రం అని మెరియమ్ వెబ్ స్టర్ డిక్షనరీ వివరించింది.
గోల్కొండ పేరును అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో కొన్ని ఊళ్లకు పెట్టారు.
అంతేకాదు ప్రపంచంలోని కొన్నిఇతర ప్రదేశాల్లో గనులకు, చిన్న చిన్న ప్రదేశాలకు, వజ్రాల దుకాణాలకు కూడా గోల్కొండ పేరు ఉంది.

ఫొటో సోర్స్, Christie's
అమెరికాలో రెండు పట్టణాలకు
అమెరికాలో గోల్కొండ పేరుతో రెండు పట్టణాలు ఉన్నాయి. ఒకటి ఇల్లినాయిస్ రాష్ట్రంలోనిది కాగా, మరొకటి నెవాడాలో ఉంది.
ఇల్లినాయిస్‌లోని పట్టణానికి 1817లో గోల్కొండ పేరు పెట్టారు. అంతకుముందు వివిధ పేర్లు ఉండేవి. అయితే పేరు ఎందుకు మార్చారో స్పష్టమైన కారణం అందుబాటులో లేదు.
స్థానిక ప్రొప్రైటర్లు (పట్టణ భూయజమానులు) కోరిక మేరకు పేరు మారుస్తున్నట్టు ఒక ప్రకటనలో ఉంది.
‘‘1817 జూన్ 24 నాటి కోర్టు రికార్డు మినిట్స్‌లో ప్రొప్రైటర్స్ కోరిక మేరకు పోప్ కౌంటీ న్యాయ కేంద్రాన్ని ఇకపై గోల్కొండగా పిలవాలని ఆదేశిస్తున్నాం'' అని ఉంది.
అయితే ఆ పేరు మార్పుకు కారణం ఏంటి? ఆ పదం గురించి ఎవరు ఎక్కడి నుంచి సలహా ఇచ్చారు వంటి వివరాలేవీ లేవని సదరన్ ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలోని మ్యూజియం ఆఫ్ నేచురల్ అండ్ సోషల్ సైన్సెస్ ప్రచురించిన పోప్ కౌంటీ నోట్స్ పుస్తకంలో ఉందని జాన్ డబ్ల్యు ఎలెన్ అనే రచయిత రాశారు.
''ఆ ఉత్తర్వుల్లో గోల్కొండ అనే పదం మందంగా, ప్రత్యేకంగా రాశారు. అండర్ లైన్ చేసి పెట్టారు. సాధారణంగా ఇటువంటి ఆదేశాలపై ముగ్గురిలో కనీసం ఇద్దరు జడ్జీలు సంతకం చేయాల్సి ఉండగా, ఒక జడ్జి మాత్రమే సంతకం చేయడం ప్రశ్నార్థకం. మొత్తంగా రికార్డుల పరంగా ఈ పేరు ఎలా వచ్చింది అనే విషయంలో గందరగోళం ఉన్నప్పటికీ క్రమంగా గోల్కొండ అనే పేరు ఈ ఊరికి చాలా వేగంగా స్థిరపడింది'' అని ఎలెన్ రాశారు
ఈ గోల్కొండ పట్టణం దక్షిణ ఇల్లినాయిస్‌లోని పోప్ కౌంటీలో ఉంది. ఒహియో నదికి ఉత్తర ఒడ్డున ఉంటుందీ చిన్న పట్టణం. గతంలో ఈ ప్రాంతానికి లస్క్స్ ఫెర్రీ, సారావిల్లే వంటి పేర్లు ఉండేవి.
రోడ్లు, రైల్వేలు ప్రాచుర్యంలోకి రాక ముందు, జల రవాణా కీలకంగా ఉన్న రోజుల్లో ఒహియో నది ఒడ్డున ఉన్న ఈ గోల్కొండ రేవు పట్టణానికి చాలా ప్రాధాన్యం ఉండేది.
ఈ ప్రాంతాన్ని అక్కడి ప్రభుత్వం గోల్కొండ హిస్టారిక్ డిస్ట్రిక్ట్ పేరుతో రక్షిస్తోంది . ఇక గోల్కొండ ఇప్పటికీ పోప్ కౌంటీ ప్రధాన పరిపాలన కేంద్రంగా కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
‘సంపదే కారణం’
ఇక పేపర్స్ ఆఫ్ అబ్రహాం లింకన్ డిజిటల్ లైబ్రరీ ప్రకారం... గతంలో సారాస్ విల్లే (Sarahsville), కోరింథ్ (Corinth), లస్క్స్ ఫెర్రీ (Lusk's Ferry) వంటి పేర్లతో పిలిచిన గోల్కొండను పోప్ కౌంటీ కేంద్రంగా నిర్ణయిస్తున్నట్టు 1817లో ప్రకటించారు. 1820లో అక్కడ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేశారు.
ఇలా వేరే ప్రదేశాలకు గోల్కొండ పేరు పెట్టడం వెనుక ఆంతర్యం ఒకటేనని, గోల్కొండ సంపదే దానికి కారణమని వివరించారు ఈ అంశంపై పరిశోధన చేస్తున్న నానిశెట్టి శెరీష్.
''గోల్కొండ పేరు అమెరికాలో రెండు ప్రాంతాలకు కాదు, నాకు తెలిసి ఇంకా ఎక్కువ చోట్ల కనిపిస్తుంది. దానికి ఒకటే కారణం గోల్కొండ అంటే సంపదకు పర్యాయపదంగా ఉంది. వెల్త్ సింబల్. అందుకే వారు ఆ పేరు పెట్టుకున్నారు. ఉదాహరణకు మనకు భారత్‌లో కూడా చాలా చోట్ల ఎల్ డొరాడో అనే స్పానిష్ పేరు కనిపిస్తుంది. అది బంగారానికి చిహ్నం. ఎల్ డొరాడో బంగారానికి ఎలా అయితే చిహ్నమో, అలా వజ్రాలకు గోల్కొండ చిహ్నం. బంగారం అంటే ఎల్ డొరాడో, వజ్రం అంటే గోల్కొండ. అందుకే గోల్కొండ పేరును ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాలకు, చాలా వజ్రాల దుకాణాలకు, కొన్ని వజ్రాలకు పెట్టారు'' అని ది హిందూ పత్రికలో సీనియర్ పాత్రికేయులు, గోల్కొండ వజ్రాలపై పరిశోధన చేస్తున్న నానిశెట్టి శెరీష్ బీబీసీకి చెప్పారు
నెవాడాలో, ఆస్ట్రేలియాలో..
అమెరికాలోనే గోల్కొండ పేరుతో మరో పట్టణం ఇప్పటికీ ఉంది. ఇది హంబోల్ట్ కౌంటీ నెవాడాలో ఉంది. 1860 ప్రాంతాల్లో ఇక్కడ మైనింగ్ ప్రారంభం అయినప్పుడు అప్పటికే వజ్రాలకు పేరుగాంచిన హైదరాబాద్‌లోని గోల్కొండ పేరును ఈ ప్రాంతానికి పెట్టుకున్నారని పలువురు పరిశోధకులు తెలిపారు..
అంతేకాదు నెవాడా రాష్ట్రంలోని వివిధ పేర్ల చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకంలో గోల్కొండ అంటే సంపన్న గని అనే అర్థం ఇచ్చారు.
ది నెవాడా స్టేట్ రైటర్స్ ప్రాజెక్టులో భాగంగా ఆరిజిన్ ఆఫ్ ప్లేసెస్ నేమ్స్ – నెవాడాలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
హెన్రీ గన్నెట్ట్ రాసిన ‘ది ఆరిజిన్ ఆఫ్ సర్టెన్ ప్లేస్ నేమ్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్’ లో గోల్కొండకు భారత్ నుంచి తీసుకున్న ఒక నగరం పేరు అనే అర్థాన్ని ఇచ్చారు.
ఇక ఆస్ట్రేలియాలోని టాస్మానియా రాష్ట్రంలోని ఒక గ్రామీణ ప్రాంతానికి గోల్కొండ పేరు ఉంది. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన ఓ స్థానిక వెబ్‌సైట్ పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ పేరు భారత్‌లోని ఒక శిథిలమైన పాత నగరం పేరు నుంచి తీసుకున్నారు.
మొత్తంగా హైదరాబాద్‌లోని ఒక చారిత్రక కోటగా మనకు తెలిసిన గోల్కొండ కోట... కృష్ణా నదీ తీర వజ్రాలతో సంపదకు పర్యాయపదంగా విలసిల్లి విశ్వవ్యాప్తమైన పేరుగా నిలిచింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























