‘చంద్రబాబు మాటలు నన్ను బాధపెట్టాయి.. పవన్‌తో చెబుతా’ అంటున్న జనసేన ఎమ్మెల్యే .. ఇంతకూ ఏమిటీ వివాదం

ఫొటో సోర్స్, AP I&PR
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా పొన్నపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘ఎమ్మెల్యే గారూ మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు’ అన్న మాటలు వైరల్ అయ్యాయి.
నరసాపురం ఎమ్మెల్యే, జనసేనకు చెందిన బొమ్మిడి నారాయణ నాయకర్‌ను ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబర్ 1న ఇది జరిగింది. అనంతరం.. దీనిపై ఎమ్మెల్యే నాయకర్ తన మనసులోని మాటలను బీబీసీ వద్ద వ్యక్తపరిచారు.
సీఎం చంద్రబాబు తనను ఉద్దేశించి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు తాను బాధ పడ్డానని, ఈ విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి కచ్చితంగా తీసుకువెళ్తానని చెప్పారు.
అయితే, టీడీపీ నేతలు దీనిపై మాట్లాడుతూ ఇందులో వివాదమేమీ లేదంటున్నారు. ‘చంద్రబాబు పెద్ద మనిషి తరహాలో మంచి ఉద్దేశంతోనే ఆ మాటలన్నారని, ఇందులో వివాదం ఏమీ లేదు’ అని టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ మొహమ్మద్ షరీఫ్ అన్నారు.


ఫొటో సోర్స్, AP I&PR
చంద్రబాబు ఏమన్నారు?
సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 1న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం పొన్నపల్లిలో పర్యటించారు.
అక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనంతరం.. ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రసంగిస్తూ బొమ్మిడి నారాయణ నాయకర్, అధికారుల పనితీరు గురించి "బాలేదు పర్ఫార్మెన్స్, ఎమ్మెల్యే గారూ.. మీరు, మీ నియోజకవర్గ ఆఫీసర్లు సరిగ్గా పనిచే యడం లేదు. జిల్లా బాగుంది. మీ నియోజకవర్గం సరిగ్గా లేదు. వీళ్లు కూడా చప్పట్లు కొడుతున్నారు (అక్కడి సభికులనుద్దేశించి). అన్నింట్లో మైనస్ ఉన్నారు. 25 పాజిటివ్ ఉంటే 23 మైనస్. ఇది ఆమోదయోగ్యం కాదు. మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది" అని అన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలతో ఎమ్మెల్యే నాయకర్ వేదిక మీదే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిపై ప్రధానంగా జనసేన శ్రేణులు సీఎం వ్యాఖ్యలను ఆక్షేపిస్తూ చర్చకు తెరలేపారు.
ఈ నేపథ్యంలో అసలు అక్కడేం జరిగింది. ఏ సందర్భంలో చంద్రబాబు ఆ మాట అన్నారు. ఎమ్మెల్యేగా మీ స్పందన ఏమిటంటూ నాయకర్‌తో బీబీసీ గురువారం మాట్లాడింది.
నాయకర్ స్పందిస్తూ ''ఆ రోజు సీఎం మాటలకు నేను చాలా బాధ పడ్డాను. వెంటనే ఎలా రియాక్ట్ కావాలో తెలియలేదు'' అని వ్యాఖ్యానించారు.
"చంద్రబాబు వస్తే నాకు బూస్ట్ వస్తుందనుకున్నాను. కానీ ఆ పర్యటన తర్వాత డల్ అయ్యాను. కార్యక్రమం చక్కగా నిర్వహించాను. మత్య్సకారులతో బోటులో కూడా సీఎం పర్యటించేలా ఏర్పాట్లు చేశాను. అప్పటివరకు అంతా బాగానే ఉందన్నారు. కానీ ఒక్కసారిగా నన్ను ఎన్నుకున్న ప్రజలు ఉన్న సభలో చంద్రబాబు అలా అనడం బాధించింది" అని నాయకర్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
'నాకు సంబంధంలేని విషయంలో '
''పీ4 పథకం అమలు సరిగ్గా లేదని సీఎం ఫీలయ్యారు. అది నోడల్ ఆఫీసర్ బాధ్యత.. ఆపై జిల్లా కలెక్టర్ బాధ్యత. అందులో నాకేం సంబంధముంటుంది?" అని నాయకర్ ప్రశ్నించారు.
"గ్రీవెన్సెస్ విషయం కూడా. గ్రీవెన్స్ అనేవి ఎమ్మెల్యేగా నాతో పాటు టీడీపీ నరసాపురం ఇన్‌చార్జ్ పొత్తూరి రామరాజుకి కూడా ప్రజలు అందిస్తారు. అలాంటప్పుడు గ్రీవెన్స్ విషయంలో ఇద్దరిదీ బాధ్యత ఉంటుంది కదా. టీడీపీ ఇన్‌చార్జ్‌ని అనకుండా నన్ను ఒక్కడినే అంటే ఎలా" అని నాయకర్ బీబీసీతో అన్నారు.
"సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల జాబితా పంపిణీ రాష్ట్రంలోనే నేను చేసినట్టు ఎవరూ చేయడం లేదు. లబ్ధిదారుడు నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా నేను స్వయంగా వారి ఇంటికి వెళ్లి లబ్ధిదారునికి నేరుగా అందిస్తా. ఎమ్మెల్యే ఆఫీస్‌కి పిలిపించుకుని ఇచ్చే సంస్కృతికి దూరంగా స్వయంగా నేను ఇళ్లకి వెళ్లి ఇస్తా. అలా వెళ్లినప్పుడు స్థానిక సమస్యలు నాదృష్టికి వస్తాయి. ఈ రెండేళ్ల మూడు నెలల కాలంలో అర్హులైన వందల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు ఇప్పించాను. కానీ ఆ విషయంలో కూడా ఆక్షేపించడం బాధ అనిపించింది'' అని నాయకర్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, AP I&PR
‘కొన్ని నేను మాట్లాడకూడదు కానీ..’
''నేను కొన్ని మాట్లాడకూడదు.. కూటమి ధర్మం కాబట్టి. కానీ వెనుకబడిన సామాజికవర్గం నుంచి వచ్చిన వాడిని. చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్లను గౌరవించుకోవాల్సిన బాధ్యత పెద్దవాళ్లది. వాళ్లే అలా అంటే.. ప్చ్ నేను ఏం మాట్లాడతాను" అని నాయకర్ అన్నారు.
"పవన్ కల్యాణ్ ఇప్పుడు అందుబాటులో లేరు. ఆయన వచ్చిన తర్వాత కచ్చితంగా కలిసి ఈ విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్తాను. ఇది వ్యక్గిగత సమస్య కాదు. పార్టీపరంగా కూడా సున్నిత సమస్యగా భావిస్తున్నాను" అని నాయకర్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, facebook.com/SrinivasBolisettiOfficial
పిలిచి మాట్లాడితే బాగుండేది: బొలిశెట్టి
''సీఎం చంద్రబాబు వేరే ఉద్దేశంతో అన్నారని నేను భావించడం లేదు. అధికారులు ఇచ్చిన రిపోర్ట్‌ను యథాలాపంగా చదివారంతే. కానీ ఆ కామెంట్లను అంత బహిరంగంగా కంటే ఆ తర్వాత నాలుగుగోడల మధ్య అంటే బాగుండేదనేది నా అభిప్రాయం'' అని పశ్చిమగోదావరి జిల్లాకే చెందిన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, facebook.com/mlc.shariff
'ఎమ్మెల్యేను నేరుగా అనలేదు'
"సీఎం చంద్ర బాబు చేసిన వ్యాఖ్యలు నరసాపురం ఎమ్మెల్యే పనితీరుపై చేసినవి కావు. ఆ నియోజకవర్గ నోడల్ ఆఫీసర్‌నుద్దేశించి అన్నారు. అయితే ఇద్దరినీ ఉద్దేశించి అన్నట్టుగా పొరపాటున ఫోకస్ అయింది. అధికారులను అన్నా.. కేవలం సదుద్దేశంతో చేసిన సూచనగా కేవలం సానుకూల కోణంలోనే నియోజకవర్గ అభివృద్ధి కోసం చూడాలి" అని టీడీపీ సీనియర్ నేత మొహమ్మద్ షరీఫ్ బీబీసీతో అన్నారు.
నరసాపురం ప్రాంతానికే చెందిన ఆయన సీఎం వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో చర్చల నేపథ్యంలో బీబీసీతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రజాప్రతినిధులను గౌరవిస్తారని, ఆ రోజు కూడా యాధృచ్ఛికంగా అన్న మాటే కానీ ఉద్దేశయపూర్వకంగా అన్నది కాదని, ఇందులో వివాదాలకు తావులేదని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























