జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎలా తొలగిస్తారు?

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌
ఫొటో క్యాప్షన్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ చెబుతోంది.
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలోని ఇద్దరు సభ్యులు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు గత కొన్ని నెలలుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పలు అంశాలపై విభేదించారని ఆంగ్ల వార్తాపత్రిక 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌' పరిశోధనాత్మక కథనం ఒకటి పేర్కొంది.

గత ఏడాది జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్-‘సర్’) కార్యక్రమం సందర్భంగా... ఈ ఎన్నికల కమిషనర్లకు చాలా విషయాలు చెప్పలేదని, ఈ నిర్ణయాలపై ఈ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పదేపదే అభ్యంతరాలు లేవనెత్తారని ఈ వార్తా పత్రిక నివేదిక పేర్కొంది.

అయితే, పలు సభ్యులున్న ఈ రాజ్యాంగ సంస్థలో విభిన్న అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు రావడం సర్వసాధారణమేనని, ఇది నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగమని ఎలక్షన్ కమిషన్ పేర్కొంటోంది.

‘సర్’తో సహా గత ఏడాది కాలంలో తీసుకున్న తుది నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా ఉన్నాయని కమిషన్ తెలిపింది.

ఈ వార్తా పత్రిక కథనం తర్వాత.. ‘సర్’ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, దీనికి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు ఆరోపించడం మొదలుపెట్టాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు ఉభయ సభలలో ఒక తీర్మానాన్ని తీసుకు రానున్నాయని కాంగ్రెస్ వర్గాలను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ఒకటి పేర్కొంది.

అదేవిధంగా.. శనివారం వరకు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకపోతే, అక్టోబర్ 2 నుంచి తాము ఉద్యమం ప్రారంభిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ పేర్కొంటోంది.

ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్లను, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎలా నియమిస్తారు? వారిని ఎలా తొలగించవచ్చో ఒకసారి చూద్దాం..

ఎన్నికల కమిషనర్లు
ఫొటో క్యాప్షన్, ఎన్నికల కమిషనర్లు ఎడమ నుంచి ఎస్.ఎస్. సంధు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, మూడో ఎన్నికల కమిషనర్ వివేక్ జోషి

ఎన్నికల కమిషనర్లను ఎలా నియమిస్తారు?

దేశంలో స్వేచ్చాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాపై ఉంది.

ఎన్నికల కమిషనర్ నియామకం, వారి పదవీకాలం, తొలగింపు ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, 'చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్(అపాయింట్‌మెంట్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యుర్) యాక్ట్, 2023' నిబంధనల ప్రకారం జరుగుతాయి.

ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు.

ఈ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మంత్రి మండలి సభ్యుడు ఉంటారు.

2023 చట్టం ప్రకారం, ఈ పదవులకు ఎంపికైన వారు గతంలో ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయి పదవుల్లో పనిచేసి ఉండాలి.

"నిజాయితీ"గా ఉంటూ.. ఎన్నికల నిర్వహించడంలో జ్ఞానం, అనుభవం ఉండాలి. సదరు అధికారిని ఆరు సంవత్సరాల పదవీకాలం లేదా 65 సంవత్సరాల వయస్సు వరకు (ఏది ముందు అయితే అది అమలు) నియమిస్తారు.

కాక్రోచ్ జనతా పార్టీ
ఫొటో క్యాప్షన్, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ... ఆందోళన చేపడతామని జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే హెచ్చరించారు.

ఎన్నికల కమిషనర్ల, ప్రధాన ఎన్నికల కమిషనర్ జీతం ఎవరు నిర్ణయిస్తారు?

1991 చట్టం ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల జీతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతానికి సమానంగా ఉండేది.

కొత్త బిల్లులో, ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల జీతాలను కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి జీతానికి సమానం చేసేందుకు ఒక నిబంధన పొందుపరిచారు.

ప్రస్తుతం ఇద్దరికీ సమాన జీతాలు ఉన్నాయి. కానీ, వారి జీతాలు వేర్వేరు పద్ధతులలో నిర్ణయిస్తారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 125 ప్రకారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతాన్ని పార్లమెంటు చేసే చట్టం ద్వారా నిర్ణయించాలి.

అదే సమయంలో, కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా కేబినెట్ కార్యదర్శి జీతాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

'చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్(అపాయింట్‌మెంట్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యుర్) యాక్ట్, 2023' ప్రకారం, వేతనాన్ని నిర్ణయించే విషయంలో ఈ చట్టం కార్యనిర్వాహక వర్గానికి గతంలో కంటే ఎక్కువ అధికారాలను కల్పించవచ్చు.

ఎన్నికల కమిషనర్‌
ఫొటో క్యాప్షన్, ఎన్నికల కమిషనర్‌ను పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ద్వారా మాత్రమే తొలగించవచ్చు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎలా తొలగిస్తారు?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే, అవే కారణాలతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కూడా పదవి నుంచి తొలగించవచ్చు.

2023 చట్టంలోని సెక్షన్ 11(2) కూడా ఇదే విషయాన్ని చెబుతుంది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫార్సు లేకుండా ఏ ఇతర ఎన్నికల కమిషనర్‌ను గానీ, ప్రాంతీయ కమిషనర్‌ను గానీ పదవి నుంచి తొలగించరాదని రాజ్యాంగం కూడా పేర్కొంటోంది.

ఎలక్షన్ కమిషన్‌పై రాజకీయ ఒత్తిడిని నివారించడానికి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే ప్రక్రియను కష్టతరం చేశారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానాన్ని నిర్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (4) ప్రకారం, "దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపితమైతే" మాత్రమే సీఈసీని తొలగించడానికి చర్య తీసుకోవచ్చు.

దుష్ప్రవర్తనలో అవినీతి చర్యలు లేదా పదవీ దుర్వినియోగం వంటివి ఉండవచ్చు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవికి తగని చర్యలు లేదా అధికారిక విధులను నిర్వర్తించడంలో స్పష్టమైన వైఫల్యాలు కూడా ఇందులో ఉన్నాయని కాలానుగుణంగా కోర్టులు పేర్కొన్నాయి.

అసమర్థత అంటే ఒక అధికారి తన విధులను నిర్వర్తించలేని పరిస్థితి.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే ప్రక్రియను ప్రారంభించడానికి, ప్రధాన ఎన్నికల కమిషనర్ దుష్ప్రవర్తనకు లేదా అసమర్థతకు పాల్పడ్డారని స్పష్టంగా ఆరోపిస్తూ పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఒక తీర్మానాన్ని నోటీసు రూపంలో ఇస్తారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్
ఫొటో క్యాప్షన్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం విలేఖరుల సమావేశంలో ఆరోపించారు.

అభిశంసన తీర్మానం ఆమోదం పొందాలంటే, లోక్‌సభలో కనీసం 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది ఎంపీల సంతకాలు అవసరం.

తీర్మానాన్ని ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ముందు సంబంధిత వ్యక్తులు, పత్రాల నుంచి ప్రిసైడింగ్ ఆఫీసర్ (ఉభయ సభల అధ్యక్షులు, లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్) సమాచారాన్ని కోరవచ్చు.

తీర్మానాన్ని ఆమోదిస్తే, ఆరోపణల వాస్తవాన్ని ధ్రువీకరించడానికి విచారణ జరుగుతుంది.

ఇందుకోసం, దుష్ప్రవర్తన లేదా అసమర్థతకు సంబంధించిన సాక్ష్యాధారాలను విచారించే ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు.

దీని తర్వాత పార్లమెంటు ఉభయ సభలలో హాజరై ఓటు వేసే సభ్యులలో మూడింట రెండు వంతుల మెజారిటీతో, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది.

ఈ తీర్మానం పార్లమెంట్ ఉభయ సభలలో ఆమోదం పొందితే.. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తన పదవి నుంచి రాష్ట్రపతి తొలగిస్తారు.

రాజ్యాంగ ప్రక్రియ పూర్తయిన తర్వాత, రాష్ట్రపతికి ఇకపై ప్రత్యేక విచక్షణాధికారం ఉండదు. ఎందుకంటే ఈ విషయంలో పార్లమెంటు సలహా మేరకే రాష్ట్రపతి వ్యవహరించాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు భారత్‌లో ఏ ప్రధాన ఎన్నికల కమిషనర్‌పైనా అభిశంసన తీర్మానం జరగలేదు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాలను ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్ తిరస్కరించారు. ఉభయ సభల అధ్యక్షులు తమ నిర్ణయానికి ఎటువంటి కారణం చెప్పలేదు.

తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మార్చి 12న లోక్‌సభ, రాజ్యసభలలో అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టింది.

లోక్‌సభ తీర్మానంపై 130 మంది ఎంపీలు, రాజ్యసభ తీర్మానంపై 63 మంది ఎంపీలు సంతకాలు చేశారు.

రెండు తీర్మానాల్లోనూ ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితాలు, ‘సర్‌’ల గురించి ప్రస్తావించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)