6ఏళ్లకే 80 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తున్న ఈ కేరళ చిన్నారికి ఏమైంది?

జన్యు వ్యాధి, డాక్టర్, కేరళ, చిన్నారి
ఫొటో క్యాప్షన్, ఐసా వయసు ఆరేళ్లు.
    • రచయిత, నందిని వెళ్లస్వామి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

"నా బిడ్డను చూసిన వాళ్ళు రకరకాల వ్యాఖ్యలు చేస్తుంటారు.

'ఈ పిల్లను బయటకు ఎందుకు తీసుకువస్తున్నారు. ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా?' అని అడుగుతుంటారు. కానీ నా బిడ్డ ఇలాగే ఉంటుంది. ఆమె బయటకు వెళ్లాలి. ప్రజలు ఆమెను చూడాలి" అని అంజలి అన్నారు.

కేరళలోని వయనాడ్ జిల్లా మానంతవాడి గ్రామానికి చెందిన దంపతులు అంజలి, అఖిల్‌.

వారికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఆమె పేరు ఐసా. ముద్దుగా తక్కు అని పిలుస్తారు.

అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఐసా సమాజంలో అనేక రకాల అవమానాలు, వెక్కిరింపులను ఎదుర్కొంటోంది. అయితే, వాటన్నింటినీ పట్టించుకోకుండా భవిష్యత్తులో డాక్టర్ కావాలనే కలతో ముందుకు సాగుతోంది ఐసా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జన్యు వ్యాధి, డాక్టర్, కేరళ, చిన్నారి
ఫొటో క్యాప్షన్, 'క్యూటిస్ లాక్సా' అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో ఐసా బాధపడుతోంది.

కూతురు ఐసా కలను నిజం చేయడానికి తమవంతు ప్రయత్నాలన్నీ చేయాలని తల్లిదండ్రులు పట్టుదలతో ఉన్నారు.

ఐసా 'క్యూటిస్ లాక్సా' అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది.

"తక్కుకు 6 నెలల వయసున్నప్పుడు శరీరంపై ఉన్న ముడతలు పోలేదు. దాంతో మేము ఆసుపత్రికి తీసుకెళ్లాం. అసలు సమస్య ఏమిటో తెలుసుకోవడానికి జన్యు పరీక్షలు చేయించాలని వాళ్లు చెప్పారు. నెలరోజుల తర్వాత ఫలితాలు వచ్చాయి. పాపకు క్యూటిస్ లాక్సా అనే అరుదైన వ్యాధి ఉందని వైద్యులు చెప్పారు" అని తల్లి అంజలి చెప్పారు.

జన్యు వ్యాధి, డాక్టర్, కేరళ, చిన్నారి
ఫొటో క్యాప్షన్, ఐసాకు తరచుగా జలుబు, దగ్గు, జ్వరంవంటివి వస్తుంటాయని తల్లిదండ్రులు చెప్పారు.

రెండున్నరేళ్ల వయసులోనే రెండు శస్త్రచికిత్సలు

ఈ వ్యాధి కారణంగా ఐసా తరచుగా జలుబు, దగ్గు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని, నెలలో చాలా రోజులు ఆసుపత్రిలోనే గడపాల్సివస్తోందని అంజలి చెప్పారు. ప్రతి నెలా రెండు, మూడు ఆసుపత్రులకు వెళ్తామని ఆమె అన్నారు.

ఐసాకు రెండున్నరేళ్ల వయసున్నప్పుడే రెండు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది.

వాటిలో ఒకటి హెర్నియా సమస్యకు సంబంధించినది. మరో శస్త్రచికిత్స ఒక కంటిలో ఉన్న లోపాన్ని సరిచేయడానికి చేశారు. ఈ వ్యాధి ఉన్నవారికి శ్వాస సంబంధిత సమస్యలు, గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఐసాకు చికిత్స అందిస్తున్న వైద్యురాలు అంజనా చెప్పారు.

జన్యు వ్యాధి, డాక్టర్, కేరళ, చిన్నారి
ఫొటో క్యాప్షన్, భవిష్యత్తులో డాక్టర్ కావాలని ఐసా కలలు కంటోంది.

‘భారత్‌లో ఏడుగురికి ఈ వ్యాధి’

క్యూటిస్ లాక్సాలో అనేక రకాలున్నాయి.

"వ్యాధి ఏ రకానికి చెందినది? అది శరీరంలోని అంతర్గత అవయవాలపై ఎంత ప్రభావం చూపుతుంది? అనే అంశాలపై బాధితుల ఆయుష్షు ఆధారపడి ఉంటుంది. వ్యాధి లక్షణాలను తగ్గించడానికి మాత్రమే ప్రస్తుతం చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్స మాత్రం లేదు" అని డాక్టర్ అంజనా తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని క్యూటిస్ లక్సా ఇంటర్నేషనల్ తెలిపింది. ఇది లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థ.

ప్రతి ఇరవై లక్షల మందిలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

భారత్‌లో ఇప్పటివరకు ఏడుగురు ఈ వ్యాధి బారిన పడినట్టు గర్తించారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సహాయాన్ని ఈ సంస్థ అందిస్తుంది. అలాగే వాళ్ల కుటుంబాలకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు.

ఐసా ఇంటిపక్కనే డాక్టర్ అంజన ఉంటున్నారు.

ఆమెను చూసే ఐసా కూడా భవిష్యత్తులో డాక్టర్ కావాలని కలలు కంటోంది.

ఐసాకు నాట్యం చేయడం, బొమ్మలు గీయడం, పాటలు పాడటం అంటే చాలా ఇష్టం.

బొమ్మ గీయమని చెబితే వెంటనే ఒక డాక్టర్ బొమ్మను గీస్తుంది. 'ఇది ఎవరి బొమ్మ' అని అడిగితే డాక్టర్ అంజన పేరు చెబుతుంది.

"భవిష్యత్తులో తక్కుకు కండరాల నొప్పులు రావచ్చు. పరిగెత్తడం, గెంతడం వంటి పనులు చేయలేని పరిస్థితి రావచ్చు. నాట్యం చేయడం, పాటలు పాడటం, బొమ్మలు గీయడం వంటి పనులు చేయడం కూడా కష్టంగా మారవచ్చు" అని తల్లి అంజలి తెలిపారు.

జన్యు వ్యాధి, డాక్టర్, కేరళ, చిన్నారి
ఫొటో క్యాప్షన్, నెల జీతంతో కూమార్తె వైద్య ఖర్చులు భరించడం కష్టంగా ఉందని ఐసా తండ్రి అంటున్నారు.

'ఈ పరిస్థితిని అంగీకరించడం చాలా కష్టంగా ఉండేది'

ఐసా తండ్రి అఖిల్ ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు.

"మొదట్లో ఈ పరిస్థితిని అంగీకరించడం మాకు చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఇలాంటి వ్యాధి గురించి మేమెప్పుడూ వినలేదు. చూడలేదు కూడా. అది మాకు చాలా బాధ కలిగించింది.

మా చిన్నారి శరీరాన్ని చూస్తే 70-80 ఏళ్ల వృద్ధురాలి శరీరంలా కనిపించేది. ఆ సమయంలో నా కుమార్తెను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లినప్పుడు, ఈ వ్యాధిని నయం చేసే చికిత్స ఏదీ లేదని చెప్పారు. చాలా బాధేసింది'' అని అఖిల్ చెప్పారు.

తన నెల జీతంతో కూమార్తె వైద్య ఖర్చులు భరించడం కష్టంగా ఉందని ఐసా తండ్రి అంటున్నారు.

"మా ఆదాయంతోనే అన్ని ఖర్చులూ చూసుకోవాలి. చికిత్స కోసం మిగతా ఖర్చులను తగ్గించుకుంటున్నాం. చాలావరకు చికిత్సలను కేరళలోనే చేయిస్తున్నాం" అని అఖిల్ వివరించారు.

తన కుమార్తెకు డాక్టర్ కావాలనే లక్ష్యం ఉండటం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.

"మా పక్కింట్లో ఒక అక్క డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమెను చూసే తక్కు కూడా డాక్టర్ కావాలని అనుకుంది. ఆమె నుంచే తక్కు స్ఫూర్తి పొందింది.

''నా కూతురు డాక్టర్ కావాలని చెబుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది''అని ఆయన అన్నారు.

ఐసా ప్రస్తుతం ఇంటికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది.

ఆమెకు ఏ సబ్జెక్టు అంటే ఇష్టమని అడిగితే లెక్కలు అని చెబుతుంది.

వెంటనే తన నోటుపుస్తకంలో కూడికల లెక్కలు రాసి, వాటికి సమాధానాలు కూడా చూపిస్తుంది.

"ప్రస్తుతం ఐసాకు తనకు వచ్చిన వ్యాధి గురించి పూర్తిగా తెలియదు. కానీ అప్పుడప్పుడు 'అందరూ నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? నాతో ఎవరూ ఎందుకు స్నేహం చేయడం లేదు?' అని అడుగుతుంది. మొదటిసారి స్కూల్‌కు వెళ్లినప్పుడు ఆమెకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తోటి పిల్లలంతా ఆమెను 'అమ్మమ్మ' అని పిలిచేవారు. దాంతో మేము పాఠశాలకు వెళ్లి జరిగిన విషయాన్ని ప్రిన్సిపాల్‌కు చెప్పాం. ఆ తర్వాత ప్రిన్సిపాల్ ఇతర విద్యార్థులకు ఈ వ్యాధి గురించి వివరించారు. అప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది" అని పాప తల్లి అంజలి తెలిపారు.

జన్యు వ్యాధి, డాక్టర్, కేరళ, చిన్నారి
ఫొటో క్యాప్షన్, ఇంటికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐసా ఒకటో తరగతి చదువుతోంది.

చాలా తెలివైన చిన్నారి

ఐసా చాలా ప్రతిభావంతురాలైన పిల్ల అని ఆమె టీచర్ ఐశ్వర్య అన్నారు.

"తక్కు బాగా తెలివైనది. తోటి విద్యార్థులకు సహాయం చేయడంలోనూ, ఇతర పనుల్లోనూ చాలా చురుగ్గా ఉంటుంది. మొదట్లో స్కూల్‌లోని కొంతమంది విద్యార్థులు ఆమెను వెక్కిరించేవారు. కానీ ఇప్పుడు అందరూ ఆమెతో స్నేహంగా ఉంటున్నారు. భవిష్యత్తులో డాక్టర్ అయి తనలాంటి సమస్యలతో వచ్చే ఇతర పిల్లలకు చికిత్స అందించాలని తక్కు చెబుతుంటుంది. ఆమె మాటలు విన్నప్పుడు తన కల తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను" అని టీచర్ ఐశ్వర్య తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఐసాకు 25 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఐసాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని గమనించిన వాళ్ల పక్కింటి వ్యక్తి అర్జున్ ఆమె డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చని సూచించారు.

పాప సంతోషం కోసం తల్లిదండ్రులు కూడా అందుకు అంగీకరించారు.

2024లో ఐసా పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించారు.

ప్రస్తుతం ఆ ఖాతాను అర్జున్ నిర్వహిస్తున్నారు.

"మొదట్లో ఐసా గురించి చాలా ప్రతికూల వ్యాఖ్యలు వచ్చేవి. వాటిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది.

ఇతరులు ఆ వ్యాఖ్యలను చూడకముందే వాటిని తొలగించడం నా అలవాటు. ప్రారంభంలో చాలామంది తక్కును చూసి జాలిపడేవారు. కానీ క్రమంగా ఆమెను అంగీకరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమెను సానుకూల దృక్పథంతో చూస్తున్నారు. ఒకసారి తక్కు నాతో 'నేను చాలా ఫేమస్ అయిపోయాను. నాకు ఒక సెక్యూరిటీ గార్డు కావాలి' అని అడిగింది" అని అర్జున్ చెప్పారు.

జన్యు వ్యాధి, డాక్టర్, కేరళ, చిన్నారి
ఫొటో క్యాప్షన్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఐసాకు 25 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఇప్పటికే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియాకు అలవాటు చేయడం వల్ల ఆమెపై మరింత మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని మానసిక వైద్యులు కృపాకర్ హెచ్చరిస్తున్నారు.

ఆమె రీల్స్ ద్వారా ప్రపంచానికి తనలోని మంచి కోణాన్ని చూపించవచ్చని ఐసా తల్లిదండ్రులంటున్నారు. , ప్రతికూల వ్యాఖ్యలు కూడా తగ్గుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.

ఎన్ని సమస్యలు ఎదురైనా తమ జీవితాల్లో సంతోషాన్ని నింపే చిన్నారి ఐసానే అని తల్లిదండ్రులు చెబుతున్నారు.

"తను డాక్టర్ కావాలని కోరుకుంటోంది. మాకు సాధ్యమైనంత వరకు ఆమె ఉన్నత విద్య చదువుకునేలా చూస్తాం" అని అంజలి చెప్పారు.

"నా కూతురే నా ప్రాణం" అని తండ్రి అఖిల్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)