బాలుడిని కొట్టి, బాలికపై లైంగిక వేధింపులు.. బిహార్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయా మాటీన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
బిహార్‌లో ఒక టీనేజీ బాలికపై కొందరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడటం, ఆమె స్నేహితుడిని కొడుతున్నట్లుగా ఉన్న వీడియో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
ఈనెల 19న జముయి జిల్లాలో మైనర్లు అయిన ఈ ఇద్దరు పాఠశాల విద్యార్థులను కొందరు అడ్డగించారు.
ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ అవుతున్న వీడియోలో.. ఒక గుంపు వారిని చుట్టుముట్టడం, తమను వదిలేయాలని ఆ విద్యార్థులు పదేపదే వేడుకోవడం కనిపిస్తోంది.
ఆ బాలుడిని చెంపదెబ్బలు కొడుతూ, కాలర్ పట్టుకుని లాగడం అందులో కనిపిస్తుంది. ఆ బాలికను అసభ్యంగా తాకడం, మరో క్లిప్‌లో ఆ బాలుడు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగానే ఒక వ్యక్తి ఆమెను ఎత్తుకెళ్లడం రికార్డైంది.
ఈ దాడికి సంబంధించి మైనర్లే అయిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా అనుమానితులను పట్టుకునేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
కలవరపెట్టే ఈ వీడియోలో ఆ ఇద్దరు మైనర్లపై వేధింపులు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. బిహార్‌లో మహిళలు, బాలికల భద్రతపై జరుగుతున్న విస్తృత చర్చకు మళ్లీ తెరతీసింది. దాంతోపాటు రాష్ట్ర అధికారుల తీరుపై ప్రశ్నలను లేవనెత్తింది.
"ఇలాంటి చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉంటాయి", ప్రభుత్వం వాటిపై నిఘా ఉంచిందని బిహార్ మంత్రి శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించడంతో ప్రజల ఆగ్రహం మరింత తీవ్రమైంది.
"ప్రపంచం పూర్తిగా నేర రహితంగా ఏమీ లేదు" అన్నారాయన. దీనికి బాధ్యులైన వారిని తప్పించుకోనివ్వబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అధికార జనతాదళ్ (యునైటెడ్) నేత ఉమేష్ కుష్వాహా కూడా ఇలాంటి కేసులను "చెదురుమదురు ఘటనలు"గా పేర్కొనడం, గత ఆర్జేడీ ప్రభుత్వ హయాంతో తమ ప్రభుత్వ పనితీరును పోల్చి మాట్లాడటంతో తీవ్ర విమర్శల పాలయ్యారు.
కాగా, తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తప్పుగా చిత్రీకరించారని కుష్వాహా ఆ తర్వాత చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది?
శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
అయితే, ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ మైనర్లు ఇద్దరూ పదో తరగతి విద్యార్థులు. ఒకే కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న వీరు, క్లాసులు ముగిసిన తర్వాత ఫోటోలు తీసుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై వారిద్దరూ ముందుగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని జముయి ఎస్పీ బిశ్వజీత్ దయాల్ చెప్పారు. ఆన్‌లైన్‌లో వీడియో విస్తృతంగా వైరల్ అయిన తర్వాతే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫుటేజీలో కనిపించిన ఒక వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ ఇద్దరినీ గుర్తించారు.
ఆ తర్వాత వారి వాంగ్మూలాలను రికార్డు చేశారు. బాలిక ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, ANI
పోక్సో కింద కేసు.. మరిన్ని సెక్షన్లు
పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) వంటి కఠిన చట్టాల కింద ఈ కేసును నమోదు చేశారు.
మహిళ గౌరవానికి భంగం కలిగించేలా దాడి చేయడం లేదా నేరపూరిత బలాన్ని ప్రయోగించడం, దుస్తులు తొలగించాలనే ఉద్దేశంతో దాడి చేయడం, ఒకే ఉద్దేశంతో ఉమ్మడిగా నేరానికి పాల్పడటం లాంటి భారత శిక్షాస్మృతి (క్రిమినల్ కోడ్) సెక్షన్లను కూడా పోలీసులు ఈ కేసులో చేర్చారు.
ఈ కేసులో ముగ్గురు మైనర్లను అరెస్టు చేశామని, మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారిణి కేఎస్ అనుపమ్ తెలిపారు.
బాధిత మైనర్ల గుర్తింపు తెలిసేలా ఉన్న వీడియో ఫుటేజీని సర్క్యులేట్ చేసిన 32 సోషల్ మీడియా ఖాతాలపై కూడా చర్యలు ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు.

ఫొటో సోర్స్, ANI
నెటిజన్ల ఆగ్రహం
ఈ దారుణ ఘటన ఆన్‌లైన్‌లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఇద్దరు మైనర్లు కలిసి ఉన్నంత మాత్రాన వారిని నిలదీసే హక్కు ఆ గుంపులోని పురుషులకు ఎవరిచ్చారంటూ నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
కొందరు ఈ ఘటనను "మోరల్ పోలీసింగ్"కు పరాకాష్టగా వర్ణిస్తుండగా.. మరికొందరు బిహార్ పోలీసులను ట్యాగ్ చేస్తూ వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన "సమాజానికి తలవంపులు" తెచ్చిందని బిహార్ మంత్రి, జముయి ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ ఎన్‌డీటీవీ న్యూస్ ఛానెల్‌తో చెప్పారు.
బిహార్‌లో మహిళలు అనేక రంగాల్లో ముందుకు సాగుతున్నారని, అయితే వారి భద్రతపై ఆందోళనలు మాత్రం అలాగే ఉండిపోయాయని మాజీ అంతర్జాతీయ స్పోర్ట్స్ షూటర్ అయిన శ్రేయసి సింగ్ వ్యాఖ్యానించారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను కూడా వెంటనే అరెస్టు చేయాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
మహిళల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రశ్నించేందుకు ప్రతిపక్ష నేతలు ఈ కేసును ఆసరాగా చేసుకున్నారు.
ఇది సంస్కృతి కాదు: రాహుల్ గాంధీ
ఈ ఫుటేజీ 'తీవ్రంగా కలచివేసేలా' ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
'ఒక బాలిక శరీరం, కదలికలు, ఎంపికలపై పురుషులు పెత్తనం చెలాయించగలరన్న' పితృస్వామ్య భావజాలాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడ్డారు.
"ఇది సంస్కృతి కాదు. ఇది పితృస్వామ్యం" అని రాహుల్ గాంధీ ఎక్స్ పోస్టులో తెలిపారు.
ఈ ఘటన తనను తీవ్రంగా సిగ్గుపడేలా చేసిందని బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ అన్నారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రతిపక్షాలు చేస్తున్న విస్తృత విమర్శలను బిహార్ అధికార సంకీర్ణ కూటమి నేతలు తిప్పికొట్టారు. ఈ దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. ఇందులో ప్రమేయం ఉన్నవారందరినీ గుర్తించి అరెస్టు చేయాలని, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసింది.
ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని బిహార్ పోలీసులను కమిషన్ కోరింది. ఆ బాలిక గుర్తింపు, గోప్యతను కాపాడేందుకు వీడియో క్లిప్‌లు మరింతగా షేర్ కాకుండా అడ్డుకోవాలని అధికారులను సూచించింది. ఈ కేసులో తీసుకుంటున్న చర్యల గురించి బిహార్ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా జిల్లా అధికారుల నుంచి సమాచారం కోరింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























