కేఎల్ రాహుల్ సెంచరీ: ఆడిన బంతులు కంటే వదిలేసినవే ఎక్కువ, ఈ ఆటగాడిలో వచ్చిన మార్పేంటి?

కేఎల్ రాహుల్, భారత్ వర్సెస్ న్యూజీలాండ్ టెస్టు, సెంచరీ
ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 136 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
    • రచయిత, శుభమ్ గర్గ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

"నా టెక్నిక్‌ను మార్చుకోవడం కంటే, సరైన స్టాన్స్, బ్యాటింగ్ పొజిషన్‌పైనే దృష్టి పెట్టాను. పరిస్థితికి అనుగుణంగా నన్ను నేను మలచుకోవడానికి వీలు కల్పించే పొజిషన్ కోసం చూశాను" అని భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ అన్నాడు.

వెల్లింగ్టన్‌లో భారత్, న్యూజీలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 136 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ శతకంతో న్యూజీలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లో టెస్టు శతకం సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రాహుల్ నిలిచాడు.

రాహుల్ ఓపెనర్‌గా 290 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు.

రాహుల్ ఫామ్‌పై ఎప్పటి నుంచో సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అదే రాహుల్ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. ఇంతకీ ఇతనిలో ఏం మారింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఏడాది టెస్టుల్లో 70కి పైగా సగటు

క్రిక్‌ఇన్ఫో సమాచారం మేరకు, 2022లో కేఎల్ రాహుల్ టెస్ట్ సగటు సుమారు 17గా ఉంది. ఇది 2023 లో సుమారు 28కి పెరిగింది. అయితే 2024 లో అతని సగటు సుమారు 35గా ఉంది.

2025లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో ఆడాడు. ఈ పర్యటనలలోనూ అతని సగటు 45.16 వద్దే నిలిచిపోయింది.

అయితే, రాహుల్ 2026లో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 74.20 సగటును నమోదు చేశాడు. ఈ ఏడాది రెండు శతకాలు కూడా నమోదు చేశాడు.

టెస్ట్ సగటును మెరుగుపరచుకోవడానికి గత రెండేళ్లలో ఎలాంటి మార్పులు చేశారని రాహుల్‌ను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రశ్నించగా, ''ఎక్కువ పరుగులు చేయడమే'' అని రాహుల్ క్లుప్తంగా బదులిచ్చారు.

"నిజం చెప్పాలంటే, ఏదో పెద్దగా మారిపోయిందనుకోవడం లేదు.నాకు టెస్ట్ క్యాప్ వచ్చినప్పటి నుంచి, ఎప్పుడూ ఒకే విధంగా సిద్ధమయ్యా. ఇప్పుడు ఎంత కష్టపడుతున్నానో అప్పడూ అంతే కష్టపడ్డాను. కాకపోతే గతంలో పరుగులు చేయలేకపోయాను అంతే" అన్నారు.

"నా టెక్నిక్‌లో సమస్య ఉందనుకోను. కానీ ఆటను చూసే, అర్థం చేసుకునే నా దృక్పథం కాలక్రమేణా మారింది. మీరు ఎంత ఎక్కువగా ఆడితే, మీ తప్పులను అంత ఎక్కువగా గుర్తిస్తారు. ఎక్కడ, ఎలా మెరుగుపడాలో మీకు అర్థమవుతుంది. ఇదంతా అనుభవంతో వస్తుంది" అని రాహుల్ చెప్పారు.

అదే సమయంలో, సీనియర్ క్రీడా జర్నలిస్ట్ నీరూ భాటియా కూడా రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రశంసించారు.

నాలుగు సేనా దేశాల (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్)లోనూ రాహుల్ టెస్ట్ సెంచరీలు సాధించాడని అన్నారు. దీనిని బట్టి అతని టెక్నిక్ ఎప్పుడూ పేలవంగా లేదని స్పష్టమవుతోంది.

విదేశీ గడ్డపై సెంచరీ చేయడం అంత సులభం కాదు. రాహుల్ అది చేసి చూపించాడు.

కేఎల్ రాహుల్, భారత్ వర్సెస్ న్యూజీలాండ్ టెస్టు, సెంచరీ
ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్.

'బంతులను వదిలేసే అలవాటు కలిసొచ్చింది'

అదే విలేఖరుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ "నేను చాలా కాలంగా ఇక్కడే ఉన్నాను. నెట్స్‌లో ఎక్కువ సేపు సాధన చేశా. దురదృష్టవశాత్తు, ఇండియా 'ఎ' తరఫున ఆడుతున్నప్పుడు నేను ఎక్కువ పరుగులు చేయలేకపోయా" అన్నాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 290 బంతులు ఎదుర్కొన్న రాహుల్, వాటిలో సగానికి పైగా బంతులను వదిలేశాడు.

బంతిని వదిలే అలవాటు తనకు చాలా సహాయపడిందని రాహుల్ చెప్పాడు.

"సుమారు 15 నెలల పాటు నాకు మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే బాధ్యత అప్పగించారు. ఈ సమయంలో, నేను ప్రతి బంతిని కొట్టే అలవాటు చేసుకున్నాను. సీమ్, స్వింగ్ పరిస్థితులలో ఈ అలవాటు హానికరం. నా టెక్నిక్‌లో లోపం ఉందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, బంతి సీమ్ అయినప్పుడు, బంతికి, బ్యాట్‌కు మధ్య కనీసం టచ్‌ ఉండేలా చూసుకోవడం మంచిది'' అన్నాడు.

కేఎల్ రాహుల్, భారత్ వర్సెస్ న్యూజీలాండ్ టెస్టు, సెంచరీ
ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో మ్యాచ్‌లో కవర్ డ్రైవ్ ఆడుతున్న కేఎల్ రాహుల్.

బ్యాటింగ్ టెక్నిక్‌లో మెరుగు

రాహుల్ తన టెక్నిక్‌ను మెరుగుపరుచుకోవడంతో పాటు మానసికంగా కూడా బలపడ్డాడని సీనియర్ క్రీడా జర్నలిస్ట్ సంజయ్ కిషోర్ అన్నారు.

"రాహుల్ ఆటలో అతిపెద్ద మార్పు అతను పిచ్‌పై నిలబడే విధానంలో కనిపిస్తుంది" అన్నారు.

"రాహుల్ తన ఫ్రంట్ ఫుట్ పొజిషన్‌పై చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు అతని స్టాన్స్ మరింత ఓపెన్‌గా ఉంది. దీనివల్ల అతని బ్యాట్ నేరుగా బంతి లైన్‌లోకి రావడానికి వీలవుతుంది" అని సంజయ్ కిషోర్ అన్నారు.

"రాహుల్ షాట్లు ఎంచుకునే విధానంలో కూడా మార్పు వచ్చింది. గతంలో, అతను బయటకు వెళ్లే బంతులను కూడా కొట్టడానికి ప్రయత్నించేవాడు. ఇప్పుడు అలాంటి బంతులను వదిలేయడమే మంచిదని భావిస్తున్నాడు"

"రాహుల్ ఆటలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో అతనికి ఓపిక కొరవడినట్లు అనిపించేది. కానీ అనుభవంతో దాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు'' అని సంజయ్ కిషోర్ చెప్పారు.

కేఎల్ రాహుల్, భారత్ వర్సెస్ న్యూజీలాండ్ టెస్టు, సెంచరీ

గత ఆరు, ఏడు నెలలుగా సన్నాహాలు

ఈ శతకంతో, పాకిస్తాన్‌కు చెందిన సయీద్ అన్వర్ తర్వాత నాలుగు సేనా దేశాల్లోనూ టెస్ట్ సెంచరీ సాధించిన రెండో ఆసియా ఓపెనర్‌గా రాహుల్ నిలిచాడు .

మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ, తాను గత ఆరు, ఏడు నెలలుగా న్యూజీలాండ్‌లో టెస్ట్ ఆడటం గురించి ఆలోచిస్తున్నానని చెప్పాడు.

"మీరు చాలా కాలం పాటు టెస్ట్ క్రికెట్ ఆడి, మీ కెరీర్ చివరి దశకు చేరుకున్నప్పుడు, వివిధ దేశాలలో మిమ్మల్ని మీరు సవాలు చేసుకునే అవకాశాన్ని పొందాలని కోరుకుంటారు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలింగ్ దాడులను ఎదుర్కోవాలని కోరుకుంటారు" అన్నాడు.

"చాలా మంది బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టంగా ఉండే దేశం న్యూజీలాండ్. ఇక్కడి పరిస్థితులు కూడా అంత సులభంగా లేవు. అందుకే ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడాలనుకున్నా. నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు, దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. అందుకే సన్నాహాలకు తగినంత సమయం దొరికేలా ముందుగానే రావాలని నిర్ణయించుకున్నా" అని రాహుల్ అన్నాడు.

''ఒకానొక దశలో రాహుల్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది, ఆ సమయంలో అతని ఆటలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయి. అయితే, అతను తర్వాత వాటిపై కృషి చేసి మెరుగుపడ్డాడు'' క్రీడా జర్నలిస్ట్ నీరూ భాటియా విశ్లేషించారు.

"రాహుల్ తన ఆటలో ఎలాంటి పెద్ద మార్పులు చేసుకోలేదు. ఇప్పుడు అతను మరింత సానుకూల దృక్పథంతో ఆడటం, గతంలో కంటే ఎక్కువ సహనం చూపించడమే అసలైన తేడా" అన్నారు.

ప్రస్తుత భారత జట్టులో రాహుల్ అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో ఒకడని సీనియర్ క్రీడా జర్నలిస్ట్ సంజయ్ కిషోర్ అన్నారు.

అతను కెప్టెన్ కాకపోయినప్పటికీ, జట్టును నడిపించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. జట్టులోని సీనియర్ ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు, అది ఇతర ఆటగాళ్లపై కూడా ప్రభావం చూపుతుంది.

"రాహుల్ స్వయంగా సంయమనం పాటిస్తాడు. అలాగే ఇతర బ్యాట్స్‌మెన్‌లకు కూడా స్వేచ్ఛగా ఆడేందుకు స్వేచ్ఛనిస్తాడు" అని ఆయన అన్నారు.

కేఎల్ రాహుల్, భారత్ వర్సెస్ న్యూజీలాండ్ టెస్టు, సెంచరీ

యశస్వి జైస్వాల్, రాహుల్‌ల ఓపెనింగ్ జోడి గురించి మాట్లాడుతూ, దానిని సచిన్-సెహ్వాగ్ లేదా గంభీర్ జోడితో పోల్చడం సరికాదని సంజయ్ కిషోర్ అన్నారు.

అయితే, ఈ జంట చాలా కాలం పాటు కలిసి ఆడగలదు. నాలుగైదేళ్లలో వారు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోగలరు. చాలా కాలం తర్వాత భారతదేశానికి ఒక బలమైన ఓపెనింగ్ జంట దొరికింది. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ జోడి తర్వాత, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ రూపంలో భారత జట్టుకు ఒక బలమైన ఓపెనింగ్ జోడి లభించిందని నీరూ భాటియా అన్నారు.

టీ20 క్రికెట్ గురించి మాట్లాడుతూ, భవిష్యత్తులో ఆటగాళ్ల ఎంపిక చాలా వరకు ఐపీఎల్‌లో వారి ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని సంజయ్ కిషోర్ అన్నారు.

ఐపీఎల్‌లో దిల్లీ జట్టు కెప్టెన్ కోసం వెతుకుతోందని ఆయన అన్నారు. కేఎల్ రాహుల్‌ను వదులుకున్నందుకు లక్నో ఫ్రాంచైజీ ఇప్పుడు పశ్చాత్తాపపడుతుండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

రాహుల్ కెరీర్‌కు రాబోయే ఐపీఎల్ సీజన్ కీలకం కావచ్చని అన్నారు.

ప్రస్తుతం భారత టీ20 జట్టులోకి రాహుల్ పునరాగమనం కొంచెం కష్టంగా కనిపిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)