అనారోగ్యంతో ఆఫీసుకు సెలవు పెట్టాలంటే ఏదో తప్పు చేసినట్లు అనిపిస్తోందా? కారణం ఇదే కావొచ్చు...

ఆఫీసు వర్క్, పని, ఉద్యోగం, సిక్ లీవ్, సెలవులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అనారోగ్యం పట్ల మీరు చూపే స్పందన, ఒక వ్యక్తిగా మీ గురించి, మీరు పనిచేసే చోటు గురించి ఎన్నో విషయాలను స్పష్టం చేస్తుంది.
    • రచయిత, నిక్ ట్రిగ్ల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

మీరు ఉదయం నిద్రలేచేసరికి ఒంట్లో నలతగా అనిపిస్తుంది, కానీ ఆఫీసులో ఆ రోజు ఎంతో ముఖ్యమైన పని ఉంటుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఆఫీసుకు వెళ్లడమో లేదా లాగిన్ అవ్వడమో చేస్తామని మీ సమాధానమైతే, అలా చేసేది మీరు మాత్రమే కాదు.

బ్రిటన్‌లోని ఉద్యోగుల్లో మూడొంతుల నుంచి సగం మంది అనారోగ్యంతో ఉన్నా సరే పనిచేస్తుంటారని పరిశోధనలు చెబుతున్నాయి. నిపుణులు దీన్ని 'ప్రజెంటీయిజం' అంటారు.

అనారోగ్యం పట్ల మీరు చూపే స్పందన, ఒక వ్యక్తిగా మీ గురించి, మీరు పనిచేసే చోటు గురించి ఎన్నో విషయాలను స్పష్టం చేస్తుంది.

"నేటి యువతకు సున్నిత మనస్కులు అనే ముద్ర వేస్తుంటారు, కానీ అది నిజం కాదు" అని మాంచెస్టర్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ సర్ క్యారీ కూపర్ అన్నారు. ఆఫీసుల్లో ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ప్రపంచంలోనే పేరున్న నిపుణుల్లో ఈయన ఒకరు.

ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ డేటా కూడా ఇదే విషయాన్ని బలపరుస్తోంది. గత ఏడాది 50-64 ఏళ్ల వయసున్నవారు సగటున 6.2 రోజుల పాటు అనారోగ్య సెలవులు తీసుకుంటే, 16-24 ఏళ్ల మధ్య వయసున్న ఉద్యోగులు కేవలం 2.4 రోజులు మాత్రమే తీసుకున్నారు. యువ ఉద్యోగులు ఇలా తక్కువ సెలవులు తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని, ఈ అంశంపై బ్రిటన్ ప్రభుత్వానికి సలహాలు అందించిన సర్ క్యారీ చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఉద్యోగ భద్రత పెద్దగా లేని 'జీరో-అవర్' కాంట్రాక్టుల లాంటి పాత్రల్లో యువకులు ఎక్కువగా పనిచేస్తుంటారు. అనారోగ్య సెలవులకు ప్రధాన కారణమయ్యే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, కీళ్ల నొప్పుల బారిన పడే అవకాశాలు వీరికి తక్కువగా ఉంటాయి.

"యాజమాన్యాలు తమతో ఎలా వ్యవహరించాలి, తమ సంక్షేమాన్ని ఎలా పట్టించుకోవాలి అనే విషయాల్లో యువ తరానికి భారీ అంచనాలే ఉంటాయనిభావిస్తున్నా. గత తరాల వారు బహుశా పరిస్థితులకు సర్దుకుపోవడానికి ఎక్కువ మొగ్గుచూపి ఉండొచ్చు, అలాగని ఆ విధానం ఆరోగ్యకరమైనదని చెప్పలేం" అని సర్ క్యారీ చెప్పారు.

"సెలవులు తీసుకునే విషయానికి వస్తే, మానసిక ఆరోగ్యాన్ని ఏదో బలవంతంగా నెట్టుకొచ్చే విషయంగా కాకుండా, తమ సంపూర్ణ ఆరోగ్యంలో ఒక భాగంగా చూసేందుకు యువ ఉద్యోగులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది" అన్నారు.

అనారోగ్య సెలవు మీ గురించి ఏం చెబుతుంది?

అనారోగ్య సెలవుల పట్ల ఒకరి ఆలోచనా విధానాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి.

కొందరికి వారి గుర్తింపు పనితోనే గట్టిగా ముడిపడి ఉంటుంది. వృత్తిపరమైన మానసిక నిపుణులు దీన్ని 'వర్క్ సెంట్రాలిటీ' అంటారు. ఇలాంటి వారు పనిలో మరింత నిమగ్నమై, ఎంతో అంకితభావంతో పనిచేస్తారని, అవసరమైతే అదనపు బాధ్యతలు మోసేందుకు కూడా సిద్ధంగా ఉంటారని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

పనే ప్రాణంగా బతికేవారికి, ఆఫీసుకు వెళ్లకపోవడం వల్ల తమలో ఏదో కొంత భాగాన్ని తాత్కాలికంగా కోల్పోయినట్లు అనిపిస్తుంది.

"ఇలాంటి వారు ఆఫీసుకు వెళ్లాలనే బలమైన కోరికతో ఉంటారు" అని కార్యాలయాల్లో ఉద్యోగుల సంక్షేమం గురించి రచనలు చేసే సైకాలజిస్ట్ డాక్టర్ ఆడ్రీ టాంగ్ అన్నారు. వైద్యం, నర్సింగ్, బోధన వంటి సేవా వృత్తుల్లో ఉన్నవారిలో ఈ ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తుందని ఆమె చెబుతున్నారు.

మరికొందరైతే తమను ఎక్కడ బలహీనులుగా, బద్ధకస్తులుగా చూస్తారోనని భయపడుతుంటారు. యువ ఉద్యోగులు ఈ రకమైన ఒత్తిడికి ఎక్కువగా లోనవుతుంటారని టాంగ్ చెప్పారు.

" కెరీర్ ప్రారంభ దశలో ఉంటారు కాబట్టి, ఆఫీసులో తమపై ఎలాంటి వ్యతిరేక ముద్ర పడకూడదని వారు కోరుకుంటారు" అన్నారు.

ఆఫీసు వర్క్, పని, ఉద్యోగం, సిక్ లీవ్, సెలవులు

ఫొటో సోర్స్, Getty Images/Jacob Wackerhausen

ఫొటో క్యాప్షన్, ఉద్యోగులు అనారోగ్య సెలవులు (సిక్ లీవ్స్) తీసుకునే ఆలోచనపై ఆఫీసు వాతావరణం తీవ్ర ప్రభావం చూపుతుంది.

మీరు పనిచేసే చోటు గురించి ఏం చెబుతుందంటే..

ఉద్యోగులు అనారోగ్య సెలవులు తీసుకునే ఆలోచనపై ఆఫీసు వాతావరణం, అక్కడి వ్యవహార శైలి తీవ్ర ప్రభావం చూపుతాయని సైకాలజిస్ట్ డాక్టర్ తారా క్విన్-సిరిల్లో చెప్పారు.

ఆఫీసులో పనిభారం ఎక్కువగా ఉన్నప్పుడు, ఎవరైనా సెలవు పెడితే చేయడానికి వేరే వాళ్లు లేని పరిస్థితుల్లో.. తాము రాకపోతే ఆ భారం తోటి ఉద్యోగులపై పడుతుందని వారికి తెలుసు.

"ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం కంటే వాళ్లు చేసే పనికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రతికూల వాతావరణం ఉన్న సంస్థల్లో ఈ అపరాధ భావం, సిగ్గు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది" అని క్విన్-సిరిల్లో అన్నారు.

"కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలోనూ పనులు కొనసాగించేలా ప్రోత్సహించే అలా నెట్టుకొచ్చేయడం (క్యారీ ఆన్) లాంటి సంస్కృతి ఉంటుంది" అన్నారు.

ఇలాంటి ఆఫీసుల్లోనే ప్రజెంటీయిజంకు ప్రాధాన్యం దక్కుతుంది. తమ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నాసరే ఆఫీసుకు వెళితేనే తమకు గుర్తింపు దక్కుతుందని ఉద్యోగులు భావిస్తుంటారు. అనారోగ్యంతో ఉన్నా పనిచేస్తున్న వారిని మేనేజర్లు పొగిడితే, మిగతా సిబ్బంది ఆ విషయాన్ని వెంటనే పసిగడతారు.

"ఆరోగ్యకరమైన పని వాతావరణం ఉన్నచోట, ఉద్యోగులు తమ ఆరోగ్యం, సిక్ లీవ్‌ల గురించి ఎలాంటి భయం లేకుండా నిజాయితీగా మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి" అని క్విన్-సిరిల్లో తెలిపారు.

ఇందులో నమ్మకం కూడా కీలకమే. ఎవరైనా సెలవు పెట్టిన ప్రతిసారీ ప్రశ్నించడం లేదా దాన్ని తప్పుగా చూడటం లాంటివి జరిగితే.. ఎక్కడ తమను తప్పుబడతారోనన్న భయంతో అత్యవసర పరిస్థితుల్లోనూ సెలవు తీసుకునేందుకు ఉద్యోగులు వెనుకడుగు వేస్తారు.

దాన్ని కచ్చితంగా ఒక "ప్రమాద ఘంటిక"గా పరిగణించాలని క్విన్-సిరిల్లో హెచ్చరించారు.

అనారోగ్యంతో ఉన్నారని తెలుసుకోవడం ఎలా?

పనికి వెళ్లలేనంత అనారోగ్యంతో ఉన్నామా లేదా అని నిర్ణయించుకోవడం అన్నివేళలా సులభం కాదు.

శారీరక అనారోగ్యానికి సంబంధించి కొన్ని స్పష్టమైన ప్రాథమిక నియమాలు ఉన్నాయని టాంగ్ చెప్పారు.

"ఒకవేళ మీకు వాంతులు, విరేచనాలు అవుతుంటే అవి తగ్గిన తర్వాత 48 గంటల పాటు, జ్వరం వస్తే అది తగ్గాక 24 గంటల పాటు ఇంటి దగ్గరే ఉండాలి. ఆ పరిస్థితుల్లో మీరు ఎలాగూ సమర్థవంతంగా పనిచేయలేరు" అన్నారు.

ఆ పరిస్థితులు దాటితే, నిర్ణయం తీసుకోవడం కాస్త సంక్లిష్టంగా మారుతుందని టాంగ్ అభిప్రాయపడ్డారు.

"దగ్గు, జలుబుల విషయానికొస్తేనే కాస్త సందిగ్ధత నెలకొంటుంది. కోవిడ్ తర్వాత, ఆఫీసుల్లో పద్ధతులు మారిపోయాయి. సాధారణంగా ఇంటి నుంచే పనిచేయడాన్ని మర్యాద పూర్వకమైన ప్రవర్తనగా భావిస్తున్నారు" అన్నారు.

మానసిక ఆరోగ్యాన్ని కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా పరిగణించడం అత్యంత ఆవశ్యకమని ఆమె స్పష్టం చేశారు.

"మీరు అనారోగ్యంతో ఉండి పని చేయలేని స్థితిలో ఉంటే, మీరు పనిచేయలేరంతే" అన్నారు టాంగ్.

"శారీరక ఆరోగ్యమైనా, మానసిక ఆరోగ్యమైనా, అంతిమంగా ఒక పనిని చేయగలిగే మన సామర్థ్యమే ఇక్కడ ముఖ్యం" అని క్విన్-సిరిల్లో అన్నారు.

మనం చేసే పని కనీస స్వీయ-సంరక్షణను దెబ్బతీయడం ప్రారంభించినప్పుడు, దాన్ని మరో హెచ్చరిక సంకేతంగా పరిగణించాలని ఆమె చెబుతున్నారు.

"మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నారా? పని ఒత్తిడి నుంచి బయటపడగలుగుతున్నారా, నిద్ర సరిగ్గానే పడుతోందా?. వీటికి సమాధానం 'కాదు' అయితే, మీకు కచ్చితంగా విశ్రాంతి అవసరమని అర్థం చేసుకోవాలి" అని క్విన్-సిరిల్లో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)