గోదావరిఖనిలో యువతి మృతి కేసు.. పురుగుల మందు తాగించి హత్య చేశారన్న పోలీసులు

ఫొటో సోర్స్, Ramagundam Police Commissionerate/ Ambala Rajender
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో యువతి మృతి కేసును ఛేదించామని పోలీసులు తెలిపారు.
సుల్తానాబాద్ మండలానికి చెందిన యువతి తాండ్ర అక్షిత రాణి (20) అపస్మారక స్థితిలో ఈ నెల 12న గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో చేరగా, ఆ మరుసటి రోజు అంటే 13న చనిపోయారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో 'అనుమానాస్పద మృతి'గా కేసు నమోదు చేసిన గోదావరిఖని-1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేశారు.
గర్రెపల్లికే చెందిన జెట్టి నవీన్‌ను అక్షిత రాణి మృతి కేసులో నిందితుడిగా గుర్తించి, అరెస్టు చేసినట్టు గోదావరిఖని డీసీపీ భూక్యా రాంరెడ్డి చెప్పారు.
నిందితుడి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది. వారి స్పందన రాగానే ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.


ఫొటో సోర్స్, Ambala Rajender
అసలేం జరిగింది?
పోలీసులు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్షిత రాణి సుమారు నాలుగేళ్ల క్రితం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని ఓ కాలేజీలో డిప్లొమా చేశారు. ఆ సమయంలో అదే కాలేజీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ నవీన్ కుమార్ పరిచయం అయ్యారు.
అక్షిత, నవీన్ ఇద్దరిదీ ఒకే ఊరు. క్రమంగా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.
"అప్పటికే వివాహితుడైన జెట్టి నవీన్ కుమార్ కు ఇద్దరు పిల్లలు. కుటుంబ విభేదాలతో భార్యకు దూరంగా ఉంటున్నారు. తమ సంబంధాన్ని వివాహం వరకు తీసుకెళ్లాలని నవీన్ కుమార్ భావించారు" అని గోదావరిఖని డీసీపీ భూక్యా రాంరెడ్డి బీబీసీకి తెలిపారు.
అయితే, అక్షిత డిప్లొమా పూర్తికావడంతో హైదరాబాద్‌లో మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సులో చేరారు. అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కొందరు క్లాస్‌మేట్స్‌తో కలిసి గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గుగనికి క్షేత్రస్థాయి శిక్షణకు వచ్చారు.
''అక్కడ ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్ (35)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ సమయంలో నవీన్, అక్షిత రాణిల మధ్య దూరం పెరిగి, గొడవలు జరిగాయి. తనను దూరం పెట్టి రవికుమార్‌కు దగ్గరవడం నవీన్ తట్టుకోలేకపోయారు. వారిద్దరిపైన పగ పెంచుకున్నారు'' అని తమ దర్యాప్తులో తేలిందని డీసీపీ రాంరెడ్డి తెలిపారు.
గొడవల విషయం తెలిసిన తర్వాత అక్షిత రాణిని ఆమె కుటుంబ సభ్యులు చదువు మాన్పించారు. కొన్ని నెలలుగా ఆమె గోదావరిఖనిలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Ramagundam Police Commissionerate
సెప్టెంబర్ 12న ఏం జరిగింది?
''ఈ క్రమంలో సెప్టెంబర్ 12న విధులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తున్న అక్షిత రాణిని ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్స్ వద్ద నవీన్ తన కారులో ఎక్కించుకున్నారు. కారులో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రవి కుమార్ తనపై అత్యాచారం చేయడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంటూ అక్షిత రాణితో సూసైడ్ నోట్ రాయించారు. ఆ తర్వాత కారులో పురుగుల మందును ఆమెతో బలవంతంగా తాగించారు" అని డీసీపీ తెలిపారు.
"త్వరగా ఆసుపత్రిలో చేర్పించి ఉంటే బతికించే అవకాశాలున్నా, ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేశాడు. ఆ తర్వాత ఆమె సెల్‌ఫోన్ నుంచే ఆమె తండ్రికి కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. తన కారులోనే ఆమె తల్లిదండ్రులను ఎక్కించుకుని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో అక్షిత రాణిని చేర్చారు" అని డీసీపీ తెలిపారు.
12న ఆస్పత్రిలో చేర్పించగా, 13న ఆమె చనిపోయారు.
"సీసీ కెమెరా దృశ్యాలు, కాల్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలతో ఈ కేసు మిస్టరీని ఛేదించాం" అని గోదావరిఖని డీసీపీ భూక్యా రాంరెడ్డి చెప్పారు.
అక్షిత రాణిని హత్య చేసి, సూసైడ్ నోట్ ఆధారంగా తప్పించుకోవాలని నవీన్ అనుకున్నారని డీసీపీ రాంరెడ్డి అన్నారు.
తన కూతురిని వేధించారని అక్షిత తండ్రి బీబీసీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయనతో మాట్లాడే అవకాశం బీబీసీకి లభించలేదు. నవీన్ కుమార్ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. వారు అందుబాటులోకి వస్తే ఈ కథనంలో అప్‌డేట్ చేస్తాం.

ఫొటో సోర్స్, Ambala Rajender
రవి కుమార్‌పై ఆరోపణలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జనవరిలో అప్రెంటిస్ సమయంలో పరిచయమైన సింగరేణి ఉద్యోగి బొమ్మకంటి రవికుమార్‌పై ఏప్రిల్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు అక్షిత.
ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ కుమార్ సహా, లైంగిక వేధింపుల ఆరోపణలున్న బొమ్మకంటి రవి కుమార్‌ను సెప్టెంబర్ 20న గోదావరిఖనిలో పోలీసులు అరెస్ట్ చేశారు. నేరానికి వాడిన కారుతో పాటు, రెండు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అప్రెంటిస్ సమయంలో అక్షిత రాణితో సన్నిహితంగా మెలిగిన బొమ్మకంటి రవి కుమార్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపైనా విచారణ కొనసాగుతోందని డీసీపీ భూక్యా రాంరెడ్డి తెలిపారు.
'బాధితుడినే నిందితునిగా చూపారు'
అయితే, తన భర్తను ఈ కేసులో ఇరికించారని ఆరోపణలు ఎదుర్కుంటున్న బొమ్మకంటి రవి కుమార్ భార్య బొమ్మకంటి ప్రియాంక అన్నారు.
''బాధితుడినే నిందితునిగా చూపారు'' అని ప్రియాంక బీబీసీతో అన్నారు.
"మృతురాలు, నా భర్త ఒకే కాలేజీలో వేర్వేరు సమయాల్లో డిప్లొమా చదివారు. 12 రోజుల అప్రెంటిస్ సమయంలో వారిద్దరి మధ్య సీనియర్, జూనియర్‌ల స్వల్ప పరిచయం ఏర్పడింది. అప్రెంటిస్ ముగిసిన మూడు నెలల తర్వాత నా భర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. సింగరేణి అంతర్గత విచారణలో నా భర్తకు క్లీన్‌చిట్ ఇచ్చారు" అని ప్రియాంక బీబీసీకి తెలిపారు.
నవీన్, రవికుమార్‌ల వేధింపులు, అధికారుల నిర్లక్ష్యం తన కూతురు హత్య వెనుక కారణాలని మృతురాలి తండ్రి తాండ్ర ఇసాక్ బీబీసీతో అన్నారు.
"నా కూతురుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. న్యాయం చేయాలి. ఫిర్యాదుపై సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సరైన సమయంలో స్పందించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు" అని ఆయన అన్నారు.
తనపై వస్తున్న ఆరోపణలపై సింగరేణి రామగుండం-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.
'లైంగిక వేధింపుల ఆరోపణలను సింగరేణి సంస్థ నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలను ఖండిస్తున్నాను' అని జీఎం లలిత్ కుమార్ బీబీసీతో అన్నారు.
పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, జెండర్ ఈక్వాలిటీకి సింగరేణి కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
"అప్రెంటిస్ ముగిసిన రెండు నెలల తర్వాత మార్చ్ లో అక్షిత రాణి, ఓవర్ మెన్ రవి కుమార్ పై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే మహిళా సభ్యులతో కూడిన అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు చేసి, మరుసటి రోజే విచారణ ప్రారంభించాం. ఆమె తల్లిదండ్రులనూ విచారణకు పిలిచాం. ఆరోపణలపై ఎలాంటి ఆధారాలను కమిటీ ముందు వారు చూపలేదు. ఆధారాలు లేకుండా ఒక ఉద్యోగిపై చర్యలు తీసుకోలేం. అయితే, ఈ ఘటనపై పోలీసులను సంప్రదించవచ్చని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చాం. వారు పోలీసులను సంప్రదించలేదు" అని జీఎం లలిత్ కుమార్ తెలిపారు.
జరిగిన ఘటనపైన సంస్థ తరపున విచారం వ్యక్తం చేస్తున్నాం. సింగరేణిలో ప్రతి రోజు 2000 వేల మంది మహిళా ఉద్యోగులు 1600 పని గంటలు పనిచేస్తున్నారు. అన్ని గనులపైన ప్రత్యేకంగా ఉమెన్ సెల్ లు పనిచేస్తున్నాయి. ఈ ఘటన తర్వాత ఉపరితల, భూగర్భ గనుల్లో మహిళల సెఫ్టీ కోసం భవిష్యత్తులో ఇంకా తీసుకోవాల్సిన చర్యలేమైనా ఉన్నాయా అనే అంశంపైన దృష్టి పెట్టాం' అని జీఎం లలిత్ కుమార్ బీబీసీతో చెప్పారు.
(ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























