రాయలసీమ పల్లెల్లో కనిపిస్తున్న ఈ 'పింక్ బస్' ఏం చేస్తుంది?

పింక్ బస్సు, రొమ్ము క్యాన్సర్, మహిళలు, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, చికిత్స
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 9 నిమిషాలు

పింక్ బస్.. రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పల్లెల్లో ఇప్పుడు ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఏపీ ప్రభుత్వం, టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ సహకారంతో స్విమ్స్ ఈ పింక్ బస్సుల ద్వారా పల్లెల్లో ప్రజల చెంతకే వెళ్లి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది.

దేశంలో క్యాన్సర్ ప్రధాన సమస్యగా మారడం, ఎక్కువ కేసులు బాగా ముదిరిన దశలో బయటపడుతుండటం, క్యాన్సర్ వ్యాధిపై సరైన అవగాహనాలేమి, అపోహలతో వ్యాధి స్క్రీనింగ్ కోసం ఆస్పత్రులకు వెళ్లడానికి ప్రజలు సంకోచిస్తుండడం వంటివాటిని పరిగణనలోకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని స్విమ్స్ చెబుతోంది.

ప్రధానంగా మహిళలకు వచ్చే రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, స్త్రీలు, పురుషులకు వచ్చే ఓరల్ క్యావిటీ క్యాన్సర్ల కోసం సమగ్ర స్క్రీనింగ్ అందించడానికి ఈ పింక్ బస్‌ను రూపొందించారు

మరి ఈ పింక్ బస్సు ద్వారా స్విమ్స్ ఎలాంటి వైద్య నిపుణుల ద్వారా ఏ సేవలు అందిస్తోంది? దీని నిర్వహణలో ప్రధానంగా కనిపిస్తున్న లోపాలు ఏంటి? మెరుగుపరచడానికి వస్తున్న సూచనలేంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రజలకు ఎలాంటి భారం లేకుండా..

ముందుగా ఈ సేవలకు ప్రజల స్పందన ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రయత్నించిన బీబీసీ, పింక్ బస్సు తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలం కోవనూరు గ్రామంలో ఉన్నప్పుడు అక్కడికి చేరుకుంది. ఆ బస్సు ద్వారా ఏం చేస్తున్నారో వైద్య నిపుణులతో, స్థానికులతో మాట్లాడింది.

దేశంలో పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులను అదుపు చేయడం, వ్యాధిగ్రస్తులకు ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ పింక్ బస్సులు ఏర్పాటు చేశామని స్విమ్స్ డైరెక్టర్ కుమార్ బీబీసీకి చెప్పారు.

''మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి, సరైన చికిత్స అందించే వసతులు లేవు. అందుకే స్విమ్స్ దాతల సాయంతో ఒక్కో బస్సుకు దాదాపు 3 కోట్ల రూపాయలు వ్యయం చేసి రెండు పింక్ బస్సులు ఏర్పాటు చేసింది. తిరుపతి లాంటి పెద్ద నగరాలకు వచ్చి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలంటే 10 వేల రూపాయల వరకూ ఖర్చవుతుంది. అంత దూరం రావడం ఇబ్బంది అవుతుంది కాబట్టే, వాళ్ల ఊరికే వచ్చి ఈ పరీక్షలు చేసి అవసరమైన వారికి చికిత్స అందిస్తున్నాం'' అని వివరించారు.

పింక్ బస్సు, రొమ్ము క్యాన్సర్, మహిళలు, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, చికిత్స
ఫొటో క్యాప్షన్, క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయొచ్చని ప్రజలకు చెబుతున్నామని వైద్యులంటున్నారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే...

''ఇందులో మాకు రెండు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమకు క్యాన్సర్ వచ్చిందని చెబుతారేమోనని చాలామంది భయపడతున్నారు. క్యాన్సర్ అంటే కచ్చితంగా చనిపోతారు అనే భ్రమలు తొలగించి, దానిని ముందే గుర్తిస్తే నయం చేసే సామర్థ్యం వైద్య చికిత్సలకు ఉందని వారికి తెలియజేయడానికే పింక్ బస్సుతో గ్రామాల్లోకి వస్తున్నాం''

''క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బుకు చికిత్స పొందలేమని, లక్షల ఖర్చు భరించలేమని అనుకుంటారు. కానీ ఐదారు లక్షల రూపాయల వ్యయమయ్యే చికిత్సను ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ వైద్య సేవలు, టీటీడీ ప్రాణదానం ఫండ్ ద్వారా పైసా ఖర్చు లేకుండా అందించే సదుపాయం స్విమ్స్‌కు ఉంది. అందుకోసమే ఈ పింక్ బస్సు'' అని ఆయన వివరించారు.

పింక్ బస్సు, రొమ్ము క్యాన్సర్, మహిళలు, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, చికిత్స
ఫొటో క్యాప్షన్, పింక్ బస్సుల ద్వారా దాదాపు 43వేలమందికి స్క్రీనింగ్ చేశామని స్విమ్స్ వైద్యులు తెలిపారు.

770 క్యాంపులు, 43 వేల మందికి పరీక్షలు

మొదటి దశలో భాగంగా పింక్ బస్సులో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పల్లె పల్లెకూ వెళ్లి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. ఇది భారత్‌లో స్విమ్స్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం అని వైద్యులు చెబుతున్నారు.

పింక్ బస్ ద్వారా ఇప్పటివరకు దాదాపు 770 క్యాంపులు నిర్వహించినట్టు స్విమ్స్ వైద్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన ఈ క్యాంపుల్లో దాదాపు 43 వేల మందిని స్క్రీనింగ్ చేశారు. క్యాన్సర్ ఉండొచ్చనే సందేహంతో 4,500 మందిని మిగతా పరీక్షల కోసం స్విమ్స్‌ పంపించారు. వీరిలో దాదాపు 500 మందికి సంపూర్ణ చికిత్స అందించారు.

పింక్ బస్సులో కేవలం క్యాన్సర్ స్క్రీనింగ్ మాత్రమే కాకుండా దంతవైద్యం, ఆప్తమాలజీ, ఈఎన్‌టీ, పీడియాట్రిక్ సేవలు కూడా అందిస్తున్నారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో వీటిని నిర్వహించడంపై దృష్టి పెట్టారు. రాష్ట్రం అంతటా ఇలాంటి సేవలు అందించే ప్రణాళికతో ఉన్నామని స్విమ్స్ డైరెక్టర్ కుమార్ చెప్పారు.

''ఈ పింక్ బస్ కాన్సెప్ట్ 2018లో ప్రారంభమైంది. తర్వాత చాలా మార్పులు వస్తుండడంతో స్విమ్స్ తరపున, ప్రభుత్వం తరపున కూడా క్యాంపులు నిర్వహించాం. ఇప్పుడు ప్రభుత్వం సంజీవని అనే ఆరోగ్య కార్యక్రమం ప్రారంభించింది. అందులో భాగంగానే మేం రాష్ట్రమంతటా ఇలాంటి సేవలు అందించాలనే ప్రణాళికతో ఉన్నాం. అది సాకారం అవుతుందని భావిస్తున్నాం''

''ప్రభుత్వ సహకారంతోపాటూ, టీటీడీకి భక్తులు ఇచ్చిన విరాళాలతో నడిచే ప్రాణదానం నిధులను ఈ పింక్ బస్ కోసం వెచ్చిస్తున్నాం. క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా ఐవోసీఎల్, రిలయన్స్ లాంటి సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అత్యాధునిక యంత్రాలను అందించాయి. వాటిని పింక్ బస్ సేవలకు ఉపయోగిస్తున్నాం'' అని స్విమ్స్ అధికారులు చెబుతున్నారు.

పింక్ బస్సు, రొమ్ము క్యాన్సర్, మహిళలు, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, చికిత్స
ఫొటో క్యాప్షన్, 35 ఏళ్లు నిండిన మహిళలు అందరికీ బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు జరుపుతున్నారు.

పింక్ బస్సులో ఏమేం ఉంటాయి.?

పింక్ బస్సులో ప్రధానంగా మామోగ్రఫీ మెషీన్ ఉంటుంది. దీనితో 35 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రొమ్ము క్యాన్సర్ పరీక్ష చేస్తారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చేయడానికి పాప్ స్మియర్ పరీక్ష చేస్తారు. రొమ్ములో గడ్డలు లాంటివి ఏవైనా ఉన్నాయా అన్నది తెలుసుకోడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ మెషీన్ ఉంటుంది. నోటి క్యాన్సర్‌ను గుర్తించడానికి ఓరోస్కోప్ అనే మరో పరికరం కూడా ఉంది. పింక్ బస్‌లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఉండే డాక్టర్లు, టెక్నీషియన్లు అందరూ మహిళలే. బస్ డ్రైవర్, సెక్యూరిటీ తప్ప అందరూ మహిళలే ఉంటారు.

పల్లెల్లో ఉన్న చాలా మందికి పెద్ద ఆస్పత్రులకు వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి దంత సమస్యలు, కళ్లు, చెవి జబ్బులకు కూడా పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు.

పింక్ బస్సు, రొమ్ము క్యాన్సర్, మహిళలు, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, చికిత్స
ఫొటో క్యాప్షన్, పింక్ బస్‌లో పరీక్షలు చేయించుకోవడానికి వచ్చేవారికి క్యాన్సర్‌పై అవగాహన కలిగిస్తున్నామని వైద్యులు తెలిపారు.

70 శాతం నిరక్షరాస్యులే

క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిత చెప్పారు.

''రూరల్ ఏరియాల్లో క్యాంపులు పెట్టినపుడు పెద్దగా చదువుకోని వారు 70శాతం మంది వస్తుంటారు. క్యాన్సర్ ఏంటి, స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటో తెలీనివారే వస్తుంటారు. సహజంగా వాళ్లు క్యాన్సర్ అనే పదం వినగానే భయపడిపోతారు. క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాం అంటే అసలు క్యాంపులకు రారు. అందుకే మేం జనరల్ క్యాంప్ అని చెప్పి వారిని రమ్మంటున్నాం. ఆధునిక చికిత్సలు చాలా అందుబాటులో ఉన్నాయి. అవి సంక్రమించే వ్యాధులు కాదని తెలియక క్యాన్సర్ అనగానే ఇక మరణమే అని భయపడతారు'' అని ఆమె తెలిపారు.

పింక్ బస్సు, రొమ్ము క్యాన్సర్, మహిళలు, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, చికిత్స

మూడు క్యాన్సర్లకు చికిత్స

ముఖ్యంగా మూడు క్యాన్సర్ల గురించి తాము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని డాక్టర్ హరిత చెప్పారు.

నోటి క్యాన్సర్ - దీనిని పురుషులు, మహిళలు ఇద్దరికీ చేస్తారు. మొదట క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా నోటిని పరీక్షిస్తారు. దంతవైద్యులు నాలుక, బుగ్గలు, పెదవులు పరీక్షించి నాలుక, చెంపలపై తెల్లటి పొడలు, ఎర్రటి మచ్చలు లాంటివి ఉన్నాయా అన్నది చెక్ చేస్తారు. కొందరికి నోరు తెరచుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి లక్షణాలు కనిపించిన వారికి క్యాన్సర్ తొలిదశలో ఉంటే వారికి అప్పుడే మందులు సూచించి, పొగ తాగడం, పొగాకు నమలడం లాంటి అలవాట్లు ఉంటే వాటిని మానేయాలని చెబుతారు. క్యాన్సర్ ఉందని తెలిస్తే స్విమ్స్‌కు రిఫర్ చేస్తారు. అక్కడ ఆరోగ్య శ్రీ ద్వారా బయాప్సీ చేసి, తదుపరి చికిత్స అంతా ఉచితంగా అందిస్తారు.

బ్రెస్ట్ క్యాన్సర్ - పింక్ బస్సులో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఛాతీలో గడ్డలు ఏమైనా ఉన్నాయా, చనుమొనల నుంచి రక్తం లేదా వేరే ద్రవాలు ఏవైనా వస్తున్నాయా అనేది పరీక్షిస్తారు. 40 ఏళ్లు దాటిన మహిళలకు మామోగ్రాఫ్ స్కానింగ్ చేస్తారు. 40ఏళ్ల లోపు మహిళలకు గడ్డలు లాంటివి ఉంటే వారికి సోనో మామోగ్రామ్ అనే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. క్యాన్సర్ అనే సందేహం వచ్చినవారిని స్విమ్స్‌కు రిఫర్ చేస్తారు.

సర్వైకల్ క్యాన్సర్ - ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. మహిళల్లో చాలా సాధారణం. ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చే ఒక ఇన్ఫెక్షన్. ఆ వైరస్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ చాలా మెల్లగా పెరుగుతుంది. దీనిని ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకోవచ్చు. అందుకే పింక్ బస్‌లోని క్యాన్సర్ యూనిట్లో 35 ఏళ్లు పైబడిన మహిళలందరికీ పాప్‌ స్మియర్ టెస్ట్ చేసి ఆ శాంపిళ్లను స్విమ్స్‌కు పంపిస్తారు. రిపోర్టులో ఎవరికైనా ఇన్ఫెక్షన్, క్యాన్సర్ ఉందని తేలితే తదుపరి చికిత్స అందిస్తారు.

పింక్ బస్సు, రొమ్ము క్యాన్సర్, మహిళలు, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, చికిత్స
ఫొటో క్యాప్షన్, రూ.పదివేలు ఖర్చయ్యే పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్టు డాక్టర్లు చెప్పారు.

ఏటా లక్షల్లో కొత్త కేసులు

మన దేశంలో ఏటా దాదాపు 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు వెలుగుచూస్తున్నాయని పద్మావతీ మెడికల్ కాలేజీ కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భవాని చెప్పారు. ముందే గుర్తిస్తే క్యాన్సర్‌ను చాలావరకు పెరగకుండా మొదటి దశలోనే సరైన చికిత్స ద్వారా నయం చేయవచ్చని చెప్పారు.

''గ్రామాల్లో పొగాకు తినే అలవాటు మగాళ్లు, ఆడవారిలో ఉంటుంది. సిగరెట్లు, బీడీలు తాగడం చాలా ఎక్కువ. వాటి వల్ల నోటి క్యాన్సర్ వస్తుంది. మనం ఇలాంటి చెడు అలవాట్లు మానుకుంటే నోటి క్యాన్సర్ నివారించచ్చు. రొమ్ము క్యాన్సర్ అనేది జన్యుపరంగా కూడా రావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అంటే అక్కచెల్లెళ్లు, తల్లి పూర్వీకులకు ఉంటే అది మనకూ వచ్చే చాన్స్ ఉంటుంది. అలాంటివారు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. లక్షణాలు కనిపించక ముందే కౌన్సిలింగ్ ఇవ్వడం లేదా మొదటి దశలో వాటిని గుర్తించి నివారించడం వల్ల వారి ప్రాణాలు కాపాడవచ్చు'' అని డాక్టర్ భవాని తెలిపారు.

బయట ఆస్పత్రుల్లో రూ. 10వేల వరకూ ఖర్చయ్యే పరీక్షలు పింక్ బస్సులో ఉచితంగా చేస్తున్నారని ఈ పరీక్షలు మహిళలే చేస్తారు కాబట్టి అందరూ ముందుకు వచ్చి చేయించుకోవాలని డాక్టర్ భవాని సూచిస్తున్నారు.

పింక్ బస్సు, రొమ్ము క్యాన్సర్, మహిళలు, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, చికిత్స
ఫొటో క్యాప్షన్, 40 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

పింక్ బస్సులో పరీక్షలు ఎలా జరుగుతాయి.?

క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఎలాంటి పరీక్షలను ఎలా నిర్వహిస్తారో పింక్ బస్సులో పనిచేస్తున్న రేడియాలజిస్ట్ కీర్తన, మామోగ్రఫీ టెక్నీషియన్ రెడ్డి ప్రసన్న బీబీసీకి వివరించారు.

''బస్సులోని మామోగ్రఫీ మెషిన్ ద్వారా 40 ఏళ్లు దాటిన వయసున్న రోగులకు స్క్రీనింగ్ చేస్తాం. చిన్న చిన్న గడ్డలు, లాంటివి ఏమైనా ఉంటే ఇది గుర్తిస్తుంది. అవి ఎలాంటివి అన్నది చూస్తాం. తర్వాత ఎఫ్ఎన్ఏసీ లేదా బయాప్సీ చేసి వాటిని టెస్టుకు పంపించి అది క్యాన్సర్ గడ్డా కాదా అనేది గుర్తిస్తాం'' అని మామోగ్రఫీ టెక్నీషియన్ రెడ్డి ప్రసన్న చెప్పారు.

కోవనూరులో పింక్ బస్‌లో వైద్య పరీక్షలు చేయించుకోడానికి చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి మహిళలు రావడం బీబీసీ గమనించింది.

''నాకు బీపీ, షుగర్ టెస్ట్ చేశారు. ఒకప్పుడు ముక్కు పొడి తినే అలవాటు ఉండేది. కానీ ఆ సమయంలో చాక్లెట్లు తింటూ దానిని వేసుకోవడం మానేసినట్టు వైద్యులకు చెప్పాను'' అని రాగిగుంటకు చెందిన పద్మ చెప్పారు.

సంపూర్ణ అనే మహిళ తనకు ఛాతిలో నొప్పి, గడ్డలు ఉండడం వల్ల వచ్చానని తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి వచ్చి చూపించుకోవాలని సూచించారని తెలిపారు.

మరికొంతమంది మహిళలు బీపీ, షుగర్‌ పరీక్షలు చేయించుకుని డాక్టర్లు రాసిన మందులు తీసుకుని వెళ్లారు.

సమన్వయం అవసరం

పింక్ బస్సు పథకం బాగానే కనిపిస్తున్నా నిర్వహణలో సమన్వయ లోపం కనిపిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ రవి కుమార్ అన్నారు.

"పింక్ బస్సు అనేది క్యాన్సర్‌కి సంబంధించిన టెస్టులు చేసి పెద్ద ఆసుపత్రికి డైవర్ట్ చేయడానికి పనికొస్తుంది. అది కంటిన్యూగా నడుస్తూ ఉంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా వాళ్లకు వీలైనప్పుడు అక్కడ లోకల్ లీడర్స్ సహకరించిన రోజు వెళుతున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారికి కొన్ని ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి లోకల్ హెల్ప్ కావాలి అలాంటిది లోకల్ కోఆర్డినేషన్ లేదు’’ అని ఆయన అన్నారు.

మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌ నుంచిగానీ స్విమ్స్ అంకాలజీ నుంచి గాని అతి పెద్ద క్యాన్సర్ ఆస్పత్రి అయిన టాటా ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రి ఈ మూడు కూడా కోఆర్డినేషన్ చేసుకొని చేస్తే ఆ సేవలకు ఉపయోగముంటుందని లేదంటే కేవలం క్యాన్సర్ మీద అవగాహన కోసం మాత్రమే ఉపయోపడుతుందని రవి కుమార్ అభిప్రాయపడ్డారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)