తెలంగాణలో కౌలు రైతుల కష్టాలేంటి? గుర్తింపు కార్డులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్..

(కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలిచివేయెచ్చు.)
‘‘వరిపొలం ఎండిపోయిందని వచ్చి బాధపడ్డాడు.. నాకు చెప్పకుండానే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.. పొలం వద్దనే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికీ త్వరగానే వెళ్లాము ఏమైనా దొరుకుతాడని.. కానీ అప్పటికే చనిపోయాడు’’ అంటూ కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పారు పొన్న నర్సమ్మ.
మెదక్ జిల్లా చెట్టతిమ్మాయిపల్లికి చెందిన పొన్న సాయిబాబా ఈ ఏడాది ఏప్రిల్ 24న బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఈ కుటుంబానికి ఒక ఎకరం పొలం ఉంది. మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని చేస్తున్నారు.
''పొలం అంతా ఎండిపోయింది. రూ.3లక్షలు అప్పులు అయ్యాయని ఎలా తీర్చాలోనని బాధపడుతూ ఉండేవాడు. ఎలాగోలా అప్పులు తీరుద్దాంలే అని చెప్పేదాన్ని. ఆ బాధలోనే నా కొడుకు మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు'' అని నర్సమ్మ చెప్పారు.

సాయిబాబాకు భార్య వెంకటమ్మ, ముగ్గురు పిల్లలున్నారు. ఆ అప్పుల భారం తమపై పడిందని వాపోతున్నారు.
ఇప్పుడు ఆ కుటుంబం సాగును వదల్లేక మళ్లీ వ్యవసాయాన్నే నమ్ముకుంది. వర్షాభావ పరిస్థితులతో వరి పొలం కొంతమేర నెర్రలు చాచి ఎండిపోయేలా మారింది.
తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితికి అద్దంపట్టే చిత్రమిది.

తెలంగాణలో కౌలు రైతులు ఎందరు..?
ఆరుగాలం శ్రమించినా, ఆశించిన ప్రయోజనం దక్కుతుందనే నమ్మకం లేకుండాపోయిందని కౌలు రైతులు వాపోతున్నారు.
అసలు తెలంగాణలో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు.. వారు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు.. ఈ లెక్కలు ప్రభుత్వం వద్ద అందుబాటులో లేవని వ్యవసాయ శాఖ చెబుతోంది.
నీతిఆయోగ్ లెక్కల ప్రకారం మాత్రం మొత్తం సాగుదారుల్లో 13శాతం మంది కౌలుదారులు తెలంగాణలో ఉన్నట్లుగా 2020లో చెప్పింది. అలాగే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ 2018 లెక్కల ప్రకారం, తెలంగాణ సాగుదారుల్లో 17శాతం మంది కౌలు రైతులు ఉన్నట్లుగా చెప్పింది.
2022లో తాము చేసిన అధ్యయనంలో తెలంగాణలో సాగుదారుల్లో 36 శాతం మంది కౌలు రైతులున్నట్లుగా తేలిందని రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కన్నెగంటి రవి బీబీసీతో చెప్పారు.
''కౌలుదారులకు సంబంధించి అధికారిక లెక్కలనేవి ఎప్పుడూ అందుబాటులో లేవు. దానివల్ల ఎంతమంది కౌలుదారులనేది ఇప్పటికీ స్పష్టత లేదనే చెప్పాలి'' అని కన్నెగంటి రవి వివరించారు.

''అప్పులు, పిల్లల భారం నాపైనే..''
ఎంతో కొంత భూమి ఉన్న రైతులకు రైతు భరోసా, బీమా రూపంలో సాయం అందుతుంటుంది. అనుకోని ప్రకృతి వైపరిత్యాలు వచ్చి పంటలు నష్టపోతే ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది.
కానీ, కౌలు రైతుల పరిస్థితి ఇందుకు భిన్నం. వారికి గుర్తింపు లేకపోవడంతో కౌలు వ్యవసాయం గుదిబండగా మారిందని వారు వాపోతున్నారు.
కౌలు రైతులు రెండు రకాలుగా కనిపిస్తున్నారు. అప్పటికే ఒకటి లేదా రెండు ఎకరాల భూమి ఉండి, అదనంగా భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు కొందరైతే, అసలు భూమి లేకుండా వేరేక భూయజమాని వద్ద నుంచి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు ఇంకొందరు.
మెదక్ జిల్లాలోని కుచెన్ పల్లికి చెందిన మరో కౌలు రైతు కుటుంబాన్ని బీబీసీ కలిసింది.
ఈర్ల మమత రేకుల షెడ్లు తరహాలో ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆమె తనపై రూ.3 లక్షల అప్పుల భారం పడిందని చెబుతున్నారు.
కుట్టు పని చేసుకుంటూ, చీరలు అమ్ముకుంటూ ఆ అప్పులు తీర్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు పిల్లల్ని చదివించుకున్నారు.
మమత భర్త ఈర్ల ప్రవీణ్ వ్యవసాయంలో నష్టాలు రావడంతో 2024 డిసెంబరు 21న ఆత్మహత్య చేసుకున్నారు.
గ్రామంలో ఆరున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఆయన వరి పండించేవారు.
''14 ఏళ్లుగా.. అంటే మా పెళ్లి జరిగినప్పట్నుంచి మాది కౌలు వ్యవసాయమే'' అని మమత చెప్పారు.
భర్త చనిపోయాక వ్యవసాయాన్ని కొనసాగించాలని భావించినా.. తనవల్ల కాక నిలిపేశానని చెప్పారామె.
''అప్పులు ఎక్కువైపోయాయని బాధపడేవారు. మేం ఉన్న పరిస్థితికి రూ.3లక్షల అప్పులు మాకు ఎక్కువే. ఆ రోజు మధ్యాహ్నం ఎరువుల బస్తాలు తీసుకుని పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం చీకటి పడినా రాకపోవడంతో మా పెద్దబ్బాయి తీసుకుని వెళ్లా. అప్పటికే నా భర్త ఆత్మహత్మ చేసుకున్నాడు'' అని చెప్పారు మమత.
భర్త చనిపోయాక భూ యజమాని ఏసయ్య మానవత్వంతో స్పందించి రూ.20వేలు సాయం చేశారు. అది తప్ప తమకు ఎలాంటి సాయం అందలేదని మమత వాపోయారు.
తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటివరకు 92 మంది కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడినట్లుగా రైతు స్వరాజ్య వేదిక సభ్యులు చెబుతున్నారు. అయితే, ఈ సంఖ్యను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు. అలాగే ప్రభుత్వం తరఫున కూడా ఈ సంఖ్యను అధికారికంగా ఎక్కడా నిర్ధరించడం లేదు.

కమిటీ అధ్యయనంలో ఏం తేలిందంటే..
తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ, రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో తెలంగాణలోని 22 జిల్లాల్లోని 47 మండలాల పరిధిలోని 57 గ్రామాలలో 1816మంది కౌలు రైతులపై ఈ ఏడాది మే నెలలో అధ్యయనం చేశారు. ఈ సర్వే నివేదికను వారు ఇటీవల విడుదల చేశారు.
దీని ప్రకారం గత కొన్నేళ్లలో కౌలు ధరలు విపరీతంగా పెరిగినట్లుగా తేలింది. ఎకరాకు గరిష్ఠంగా 53వేల రూపాయలు… మొత్తంగా తెలంగాణలో సగటున ఎకరాకు 14,936 రూపాయలు కౌలుగా ఉందని కమిటీ చెబుతోంది.
కౌలు రైతులు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని తమ అధ్యయనంలో తేలిందని రైతు స్వరాజ్య వేదిక సభ్యులు విస్సా కిరణ్ కుమార్ బీబీసీతో చెప్పారు.
''విత్తనాలు, యూరియా పొందడం, పంట అమ్మకం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టపరిహారం పొందలేకపోవడం, పంట రుణాలు రాకపోవడం.. ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి'' అని చెప్పారు.
''ఉదాహరణకు ఎరువుల బుకింగ్ కోసం ప్రభుత్వం యాప్ తీసుకువచ్చింది. దానికి భూ యజమాని ఫోన్ నంబరు ఇవ్వాలి. ఓటీపీ వచ్చినప్పుడు భూ యజమాని అందుబాటులో లేకపోవడం, వేరొకచోట ఉండటం, ఓటీపీ చెప్పడానికి ఇష్టపడకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఎరువులు పొందాలంటే కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, రైతు స్వరాజ్యవేదిక
బీసీ, ఎస్సీ, ఎస్టీలే అత్యధికం..
సాగునీటి వసతులు, పంట విధానాలు.. ఇలా రకరకాల కారణాలతో వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలను కౌలు రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నట్లుగా రైతు స్వరాజ్య వేదిక అధ్యయనంలో తేలింది.
కౌలు రైతుల్లో ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీలేనని చెబుతున్నారు. సుమారు 47 శాతం మంది బీసీలు, 27శాతం మంది ఎస్సీలు, 14శాతం మంది ఎస్టీలు, 4 శాతం ముస్లింలు, 7.5శాతం ఓసీలు ఉన్నారని సర్వేలో గుర్తించారు.
''ఎకరాకు వచ్చే నికర ఆదాయం తగ్గిపోతుండటం వల్ల చిన్న కౌలు రైతులు తమ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఎక్కువ భూమిని కౌలుకు తీసుకుంటున్నారు'' అని నివేదికలో తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ పేర్కొంది.
కౌలు రైతులు పంట విక్రయాల్లోనూ తీవ్రంగా నష్టపోతున్నారని అధ్యయనంలో తేలిందని రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ సభ్యులు చెబుతున్నారు.
''పంట అమ్ముకున్నప్పుడు డబ్బులు ప్రభుత్వం జమ చేయాలంటే భూ యజమాని ఫోన్ నంబరు, పాస్ బుక్ సమర్పించాలి. అలాంటప్పుడు భూ యజమానుల ఖాతాల్లోనే కౌలు రైతులు అమ్ముకున్న పంట డబ్బులు జమ అవుతున్నాయి. దీనివల్ల వారు అదనంగా కౌలు డబ్బులు వసూలు చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారని తేలింది'' అని విస్సా కిరణ్ కుమార్ బీబీసీతో చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు కార్డుల జారీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు ''ఏపీ ల్యాండ్ లైసెన్స్‌డ్ కల్టివేటర్ యాక్ట్ - 2011''ను అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రభుత్వం తీసుకువచ్చింది. దీన్ని 2012 జనవరి నుంచి అమల్లోకి తెచ్చారు.
అప్పట్లో ఏడాది కాల వ్యవధితో కౌలుదారులకు గుర్తింపు కార్డులను ప్రభుత్వం జారీ చేసింది.
ఈ ప్రక్రియ రెవెన్యూ శాఖ తరఫున జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగేది.
పంట రుణాలు పొందడం నుంచి పంట అమ్ముకోవడం వరకు వివిధ అవసరాలకు రైతులు గుర్తింపు కార్డులను ఉపయోగించుకునేవారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత 2015-16, 2016-17 లో జిల్లా వారీగా కౌలుదారులకు కార్డులను ప్రభుత్వం జారీ చేసింది.
2018లో రైతుబంధు అమలు నేపథ్యంలో కౌలుదారులకు గుర్తింపు కార్డుల జారీని అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. అప్పట్నుంచి తెలంగాణలో కౌలుదారులకు గుర్తింపు కార్డుల జారీ నిలిచిపోయింది.
అయితే, 2023 సెప్టెంబరులో అప్పటి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి.. తాము అధికారంలోకి వస్తే కౌలుదారుల చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది అమల్లోకి రాలేదు. ఈ విషయంపై వివరణ కోసం తెలంగాణ సీఎంవోను బీబీసీ సంప్రదించింది. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో కౌలుదారులకు గుర్తింపు కార్డుల జారీ కొనసాగుతోంది.
గతంలో లోన్ ఎలిజిబిలిటీ కార్డు(ఎల్ఈసీ) పేరుతో జారీ చేసేవారు. 2019 జులైలో అక్కడి ప్రభుత్వం 'ఏపీ ల్యాండ్ లైసెన్స్‌డ్ కల్టివేటర్ యాక్ట్- 2011', 'ఏపీ కౌలు చట్టం-1956ను రద్దు చేసింది. ఆ స్థానంలో 'ఏపీ పంట సాగుదారుల హక్కుల చట్టం- 2019'ని తీసుకువచ్చింది.
''ఈ చట్టం ప్రకారమే ఏపీలో పంట సాగుదారుల హక్కుల కార్డు (సీసీఆర్సీ) జారీ చేస్తున్నారు'' అని కన్నెగంటి రవి బీబీసీతో చెప్పారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే..
2023 నవంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
అంతకు ముందు 2022 మే నెలలో వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌ను విడుదల చేసింది.
అందులో కౌలు రైతులకు హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటిని నెరవేరుస్తామని ప్రకటించింది.
''కౌలు రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. భూమి లేని రైతులకు రైతు బీమా వర్తింపజేస్తాం'' అని ప్రకటించింది.
తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు 'అభయహస్తం' పేరుతో ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కూడా కౌలు రైతులకు ఎకరానికి ఏడాది రూ.15వేలు రైతు భరోసా కింద ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోయాయి. నేటికీ హామీలు అమలు కాలేదు. కౌలు రైతుల సమస్యలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీబీసీతో మాట్లాడారు.
''కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసింది.
సబ్ కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. ఈ విషయంలో సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం'' అని చెప్పారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని వేసింది.
మరోవైపు, కౌలు రైతుల ఇబ్బందులు పరిష్కరించాలని ఈ ఏడాది ఆగస్టు 25న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ సభ్యులు కలిసి సర్వే నివేదికను అందించారు.
ఈ సందర్భంగా కౌలు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం చెప్పినట్లుగా ఆయన కార్యాలయం ప్రకటించింది.
ఈ విషయంపై తెలంగాణ వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ ఎ.కోదండరెడ్డితో బీబీసీ మాట్లాడింది.
''కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి మా తరఫున సిఫార్సు చేశాం. ఈ విషయంపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించాం'' అని ఆయన చెప్పారు.
గతంలో రెవెన్యూ శాఖ తరఫున కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇచ్చేవారని, నిబంధనల్లో మార్పులు చేసి వ్యవసాయ శాఖ తరఫున గుర్తింపు కార్డులు ఇవ్వాలని సూచించామని కోదండరెడ్డి చెప్పారు.
గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సుముఖంగా ఉందని, అవి వస్తే రైతులు పంట రుణాలు, ఎరువులు, పంటలు విక్రయించేందుకు వీలవుతుందని వివరించారు.
''ప్రభుత్వాన్ని మేం అడిగేది ఒక్కటే, వీలైనంత త్వరగా కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వండి'' అని విస్సా కిరణ్ కుమార్ అన్నారు.
''అనుమానాలు నివృత్తి చేయాలి.. ''
తెలంగాణలో కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇచ్చే విషయంపై కొందరు భూ యజమానులతో బీబీసీ మాట్లాడింది.
కౌలుదారులకు కార్డులు జారీ చేసే విషయంలో భూ యజమానుల్లో కొన్ని భయాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తే ఇబ్బంది లేదనేది మెదక్‌కు చెందిన రైతు ఏసయ్య బీబీసీతో అన్నారు.
''కౌలుదారులకు కార్డులు ఇస్తే భూమిపై ఎలాంటి హక్కులు ఉండవు. వాటిని కేవలం పంట రుణాలు, పంట విక్రయాలకే వాడుకునేలా ప్రభుత్వం చూడాలి. అప్పుడు భూ యజమానులు కూడా భయపడేది ఉండదు'' అని ఆయన అన్నారు.
(ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























