తిహార్ జైలులో ఉన్న ఏడుగురు విదేశీయులను కోర్టు వదిలిపెట్టడంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు?

ఫొటో సోర్స్, ANI
దిల్లీలోని రౌస్ ఎవెన్యూ ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు మియన్మార్ శిక్షణా శిబిరం కేసులో అరెస్టైన అమెరికన్ మాథ్యూ ఆరోన్ వాన్‌డైక్‌తో పాటు ఆరుగురు యుక్రేనియన్ పౌరులు నెల రోజుల పాటు తమ దేశాలకు తిరిగి వెళ్ళడానికి అనుమతించింది.
కొన్ని షరతులకు లోబడి ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఈ ఏడుగురు నిందితులు తమ దేశానికి వెళ్లేందుకు కోర్టు అనుమతించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
గురువారం రాత్రి మాథ్యూ ఆరోన్ వాన్‌డైక్ దిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదలై తమ దేశానికి పయనమయ్యారు.
ఈ ఏడుగురు నిందితులకు ఇప్పటికే సెప్టెంబర్ 18న డిఫాల్ట్ బెయిల్ లభించినప్పటికీ ప్రత్యేక ఎన్ఐఏ జడ్జి ప్రశాంత్ శర్మ సెప్టెంబర్ 24న ఈ ఉత్తర్వులు ఇచ్చారని 'బార్ అండ్ బెంచ్' తెలిపింది.
వీరిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నిర్దేశిత సమయంలోగా దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయడంలో ఎన్ఐఏ విఫలమైంది.

అమెరికా పౌరుడు మాథ్యూ ఆరోన్ వాన్‌డైక్‌తో పాటు ఆరుగురు యుక్రేనియన్ పౌరులను 2026 మార్చిలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
యుక్రేనియన్ పౌరుల పేర్లు హుర్బా పెట్రో, స్లివియాక్ తారాస్, ఇవాన్ సుక్మనోవ్స్కీ, స్టెఫాన్కివ్ మరియన్, హోంచారుక్ మాక్సిమ్, కామిన్స్కీ విక్టర్.
తీవ్రవాద చర్యలకు పాల్పడేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై యుఏపీఏ సెక్షన్ 18 కింద వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఈ కేసులో నిందితుల విడుదలపై కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలువురు ప్రశ్నలు లేవనెత్తారు.
సెప్టెంబర్ 18న నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరైనప్పుడు తన క్లయింట్ 'త్వరలోనే జైలు నుండి బయటకు వస్తారని' మాథ్యూ తరపు న్యాయవాది రోహిత్ దండ్రియాల్ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.
"నా క్లయింట్ 180 రోజులకు పైగా జైలులో ఉన్నందున, ఇప్పుడు ఆయన బెయిల్‌కు అర్హుడని కోర్టు స్పష్టంగా పేర్కొంది. ఉపా కేసులో ఎన్ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. ఈ చట్టం ప్రకారం 180 రోజుల్లోగా చార్జ్‌షీట్ దాఖలు చేయడం తప్పనిసరి" అని రోహిత్ దండ్రియాల్ చెప్పారు.
నెల రోజుల తర్వాత నిందితులు భారతదేశానికి తిరిగి రావాలని, వచ్చిన 72 గంటల్లోగా కోర్టుకు సమాచారం అందించాలని కోర్టు ఆదేశించినట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, ANI
ఆరోపణలు ఏమిటి?
అమెరికా పౌరుడు మాథ్యూ ఆరోన్ వాన్‌డైక్‌తో సహా ఏడుగురు నిందితులు చెల్లుబాటు అయ్యే పర్మిట్లు లేకుండా మిజోరాంలోకి ప్రవేశించారని ఆపై అక్రమంగా సరిహద్దు దాటి మియన్మార్లోకి వెళ్లారని ఆరోపణలు ఉన్నట్లు బార్ అండ్ బెంచ్ తెలిపింది.
అక్కడ, ఈ బృందం మియన్మార్ సైనిక ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ గ్రూపులకు డ్రోన్లతో దాడుల గురించి శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.
బీబీసీ ఈ విషయాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేదు.
ప్రారంభంలో వారిపై ఉపా సెక్షన్ 18 కింద కేసు నమోదైంది.
అయితే ఈ కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన ప్రాథమిక చార్జ్‌షీట్‌లో కేవలం ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలను మాత్రమే పేర్కొన్నారు.
నిందితులపై తీవ్రవాదానికి సంబంధించిన ఆరోపణలను ఉపసంహరించుకోలేదని ఎన్ఐఏ ఆ తర్వాత స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, scott Peterson/Getty Images
మాథ్యూ వాన్‌డైక్ ఎవరు?
2022 మే 1న గెట్టీ ఇమేజెస్ అమెరికన్ పౌరుడు మాథ్యూ ఆరోన్ వాన్‌డైక్ ఫోటోను విడుదల చేసింది.
"అమెరికాకు చెందిన ఈ మాజీ సైనికాధికారి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు యుక్రేనియన్ సైనికులకు శిక్షణ ఇస్తున్నారు" అని ఆ ఫోటో గురించి వివరణ రాసింది.
అందులో ఇంకా ఏముందంటే "యుక్రెయిన్‌లోని లెవివ్‌లో ఒక హోటల్ గదికి సంబంధించిన ఈ ఫోటో 2022 మే 1 నాటిది. ఇందులో మాథ్యూ వాన్‌డైక్ 'సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్' అనే ఎన్జీవో అధిపతిగా ఉన్నారు. ఈ సంస్థ అమెరికాకు చెందిన మాజీ సైనిక శిక్షకులను యుక్రెయిన్ టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్సెస్, నేషనల్ గార్డ్ విభాగాలతో కలిసి పనిచేసేందుకు పంపుతుంది"
"యుక్రెయిన్‌లో సుమారు 12 మంది శిక్షకులతో కలిసి పనిచేస్తున్న సోలీకి సైనిక సాయం అందించే అనుభవం ఉంది. ఈ సంస్థ గతంలో ఉత్తర ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోరాడిన క్రిస్టియన్ సైనికులకు ఇదే తరహా సాయం అందించింది. అంతేకాకుండా, ఈ సంస్థ సభ్యులు ఫిలిప్పీన్స్, ఆఫ్రికాలలో కూడా పనిచేశారు" అని గెట్టీ ఇమేజెస్ రాసింది.
త్వరలోనే వారు బర్మా (మియన్మార్) లో కూడా పనిచేయనున్నట్లు అదే క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
గెట్టి ఇమేజెస్ మరో ఫోటోను విడుదల చేసింది. అందులో మాథ్యూ వాన్‌డైక్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి నిలబడి ఉన్నారు.
"అమెరికన్ మెరైన్ కోర్ మాజీ ఇన్ఫాంట్రీ సైనికుడు ఎరిక్ ఇన్‌బాడీ, లాభాపేక్ష లేని సంస్థ 'సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్' లో కీలక వ్యక్తి మాథ్యూ వాన్‌డైక్, అమెరికా సైన్యానికి చెందిన మాజీ కాంబాట్ మెడిక్ జాసన్లు 2022 మే 1న యుక్రెయిన్‌లోని లెవివ్‌లో ఉన్న ఓ హోటల్ గది బాల్కనీలో ఫోటో దిగుతున్న దృశ్యం" అని ఆ ఫోటో కింద సమాచారం రాసి ఉంది.

మోదీ సర్కారుపై కాంగ్రెస్ విమర్శలు
అమెరికన్ పౌరుడు మాథ్యూ వాన్డైక్ను నెల రోజుల పాటు తన దేశానికి వెళ్లేందుకు డిఫాల్ట్ బెయిల్‌పై విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.
అమెరికా ఒత్తిడి వల్లే నిందితులను మోదీ ప్రభుత్వం విడుదల చేస్తోందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు.
"ఒక వ్యక్తి తన బృందంతో కలిసి పర్యటకుడిగా మన దేశానికి వస్తాడు. మిజోరాం నుంచి మియన్మార్ సరిహద్దు దాటుతాడు. అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తాడు. తిరిగి వస్తాడు. ఆ తర్వాత అరెస్టవుతాడు. అకస్మాత్తుగా ఆయన్ని విడుదల చేస్తున్నారు? అమెరికా ముందు ఇంకా ఇంకెంతలా తల వంచుతారని మోదీని అడగండి" అని పవన్ ఖేరా అన్నారు.
ఈ నిర్ణయం వెనుక అమెరికా ఒత్తిడి ఉందని, భారత జాతీయ భద్రతను కాపాడటంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ సందేహాస్పద విదేశీ పౌరులకు వీసా ఎలా లభించింది? భారత్ మీదుగా మియన్మార్‌కు వెళ్లేందుకు మొదట అనుమతి ఎలా దొరికింది అనే విషయాలపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని విపక్షం డిమాండ్ చేసింది.
మే 23 నుంచి 26 మధ్య అమెరికా విదేశాంగ మంత్రి భారత పర్యటన సందర్భంగా భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ విదేశీ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ శుక్రవారం 'ఎక్స్'లో చేసిన పోస్టులో ఆరోపించారు.
"నిందితులు భారత్ వ్యతిరేక తిరుగుబాటు గ్రూపులకు సాయం చేస్తున్నారని ఎన్ఐఏ కోర్టులో మార్చి 16న ఆరోపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని కూడా చెప్పారు" అని జైరామ్ రమేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.
"ఆ తర్వాత సెప్టెంబర్ 8న ఉపా ఆరోపణలను తొలగించి, సెప్టెంబర్ 24న వారిని జైలు నుంచి విడుదల చేసి స్వదేశానికి వెళ్లేందుకు అనుమతించారు" అని జైరామ్ రమేశ్ తెలిపారు.
"మాథ్యూను అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన కారులో నేరుగా విమానాశ్రయానికి తీసుకెళ్లారు. కానీ మన పౌరులను మాత్రం చేతికి బేడీలు వేసి భారత్‌కు తిప్పి పంపారు" అని కేరళ కాంగ్రెస్ పేర్కొంది.

నిపుణులు ఏం చెబుతున్నారు?
విదేశీ పౌరుల విడుదలపై అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లానీ ప్రశ్నలు లేవనెత్తారు.
"భారత్ ఎప్పుడూ మృదు స్వభావంతో వ్యవహరించే దేశంగా ఉంటోంది. అమెరికాకు చెందిన రహస్య ఆపరేషన్ల నిపుణుడు మాథ్యూ వాన్‌డైక్, ఆరుగురు యుక్రేనియన్ డ్రోన్ నిపుణులను నిశ్శబ్దంగా భారత్ విడిచి వెళ్లేందుకు అనుమతించే నిర్ణయం కేవలం ఒక కేసులో న్యాయపరమైన తీర్పునకు పరిమితం కాదు" అని ఆయన 'ఎక్స్'లో చేసిన పోస్టులో రాశారు.
"న్యూదిల్లీ కఠినమైన క్రిమినల్ చట్టాల గురించి మాట్లాడుతుంది. కానీ జియో పొలిటికల్ ఒత్తిడి పెరిగినప్పుడు వెనకడుగు వేస్తుంది" అని ఆయన తన పోస్టులో తెలిపారు.
మధ్యప్రాచ్యం, యుక్రెయిన్లలో రహస్య ఆపరేషన్ల అనుభవం ఉన్న వాన్డైక్ను మార్చిలో యుక్రెయిన్‌కు చెందిన ఆరుగురు సైనిక శిక్షణ పొందిన సహచరులతో కలిసి అరెస్ట్ చేశారని ఆయన గుర్తుచేశారు.
భారత కోర్టులో దాఖలు చేసిన పత్రాల ప్రకారం ఈ బృందం ఒక పెద్ద అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో భాగమని, డ్రోన్లను అక్రమంగా భారత్‌కు రవాణా చేసి, అక్కడి నుంచి మియన్మార్‌కు పంపుతున్నాయని తెలిపారు.
"జాతీయ దర్యాప్తు సంస్థ మొదట్లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఇది భారత్‌లోని ప్రధాన ఉగ్రవాద వ్యతిరేక చట్టం. ఆ తర్వాత అకస్మాత్తుగా నిర్ణయం మారిపోయింది" అని బ్రహ్మ చెల్లానీ రాశారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నిర్బంధం అంశాన్ని నేరుగా న్యూదిల్లీ ముందు ప్రస్తావించినప్పుడు, యూఏపీఏ కింద ఉన్న ఆరోపణలను ఎన్ఐఏ తొలగించిందని, ఇప్పుడు వాన్‌డైక్ సహా యుక్రేనియన్ పౌరులందరికీ బెయిల్ లభించిందని, స్వదేశానికి వెళ్లేందుకు అనుమతి వచ్చిందని తెలిపారు.
హైప్రొఫైల్ క్రిమినల్ కేసుల్లో విదేశీయులు ఎప్పుడూ తప్పించుకుంటూనే ఉన్నారని బ్రహ్మ చెల్లానీ అన్నారు.
"ప్రభుత్వాలు మారినా, కేసులు వేరైనా ఒకే ప్రశ్న మిగిలింది. విదేశీయుల ప్రమేయం ఉన్న కేసుల్లో భారత్ ఎందుకు బాధ్యతను నిర్ధరించలేకోపోతోంది?" అని ఆయన ప్రశ్నించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























