‘మేం హిందువులం కాదు’ అని స్వామి నారాయణ్ వర్గం కోర్టులో ఎందుకు చెప్పింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అర్జవ్ పరేఖ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
పారిస్‌లోని ఈఫిల్ టవర్ సంఘటన తరువాత స్వామినారాయణ్ శాఖ బోచాసనవాసి అక్షర్ పురుషోత్తం సంస్థ (బాప్స్) ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పారిస్‌లో జరిగిన సంఘటన ఆ వర్గంపై 'మహిళల పట్ల వివక్ష' ఆరోపణలు, ఆ తర్వాత నిరసనలకు దారితీసింది.
స్వామినారాయణ్ శాఖ అనుచరులు మహిళల పట్ల వ్యవహరించే తీరుపై ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది.
"స్వామినారాయణ్ శాఖ సరిహద్దులే గుజరాత్ సరిహద్దులు. వారు తమ సరిహద్దులను తామే నిర్దేశించుకున్నారు. ఈ శాఖలో మహిళలపై విధించే అత్యంత కఠినమైన ఆంక్షలు, ఆ సరిహద్దులను అమలుపరచడంలో మరో మార్గం" అని ప్రముఖ పాత్రికేయుడు మానవ హక్కుల కార్యకర్త సలీల్ త్రిపాఠి గుజరాతీలపై రాసిన తన పుస్తకంలో పేర్కొన్నారు.
స్వామి నారాయణ్ శాఖకు మహిళల పట్ల మాత్రమే కాకుండా దళితుల పట్ల కూడా వివక్ష చూపిన చరిత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.

స్వామి నారాయణ్ శాఖ ప్రతినిధులు ఒక కేసులో తాము హిందూ మతానికి చెందినవారం కాదని సుప్రీంకోర్టులో నిరూపించుకోవడానికి ప్రయత్నించారు.
ఈ వ్యవహారం 20 ఏళ్ల పాటు కోర్టుల్లో నడిచింది. స్వామి నారాయణ్ శాఖ, హిందూ మతం గురించి కోర్టులో అనేక చర్చలు జరిగాయి.
దళితులు దేవాలయాల్లోకి ప్రవేశించడం గురించిన వివాదం కారణంగానే ఈ వ్యవహారం కోర్టుల్లో నడిచింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ కేసు ఏంటి?
1947 నవంబర్‌లో బొంబాయి హరిజన్ దేవాలయ ప్రవేశచట్టం-1947 చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం దళితులు దేశంలోని అన్ని హిందూ దేవాలయాలలోకి ప్రవేశించి పూజలు చేసుకోవచ్చు. దళితులు విస్తృత వివక్షను ఎదుర్కొంటున్న కాలమది.
1947చివర్లో మహా గుజరాత్ దళిత సంఘ్ అధ్యక్షుడైన ముల్దాస్ భూదర్దాస్ వైశ్య తాను అహ్మదాబాద్‌లోని స్వామినారాయణ్ ఆలయంలోకి ప్రవేశిస్తానని ప్రకటించారు.
ఈ ప్రకటన తరువాత అహ్మదాబాద్ సివిల్ కోర్టులో స్వామి నారాయణ్ శాఖకు చెందిన అహ్మదాబాద్ బెంచ్ ట్రస్టీలు, అనుచరుల తరపున శాస్త్రి యజ్ఞ పురుషదాస్ ఒక పిటిషన్ వేశారు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ పీఠానికి ఇటీవల వివాదంలో చిక్కుకున్న బాప్స్ తో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు.
దావా వేసిన వ్యక్తి ఒకప్పటి బాప్స్ అధిపతి శాస్త్రి యజ్ఞపురుషదాస్ (శాస్త్రిజీ మహారాజ్) కాదు. ఆ ఇద్దరు వేర్వేరు.
"స్వామినారాయణ్ శాఖకు చెందిన దేవాలయాలు 'హిందూ దేవాలయాలు' అనే నిర్వచనం పరిధిలోకి రావు, అందువల్ల సత్సంగీలు కానివారు (దళితులు) వారి దేవాలయాలలోకి ప్రవేశించలేరు" అని యజ్ఞపురుషదాస్ కోర్టులో వాదించారు.
1951 సెప్టెంబర్‌లో అహ్మదాబాద్ సివిల్ కోర్టు ఈ కేసులో తీర్పు చెప్పింది.
అహ్మదాబాద్ సివిల్ కోర్టులో స్వామి నారాయణ్ శాఖ కేసు గెలవడంతో దళిత వర్గానికి చెందిన ప్రజలు స్వామి నారాయణ్ ఆలయంలోకి ప్రవేశించలేక పోయారు.
అయితే స్వామి నారాయణ్ శాఖ హిందూమతానికి భిన్నమైనదని అహ్మదాబాద్ కోర్టు అంగీకరించలేదనేది ఈ కేసులో మరో కీలక అంశం.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/Getty Images
హైకోర్టులోనూ 'మేము హిందువులం కాదనే' వాదన
ఆహ్మదాబాద్ కోర్టు తీర్పుపై ముల్దాస్ వైశ్ అప్పటి బొంబాయి సంస్థానంలో ఉన్న బొంబాయి హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
హైకోర్టులో కూడా స్వామి నారాయణ్ శాఖ అనుచరులు తాము హిందూ మతానికి చెందినవారం కాదని వాదించారు.
హైకోర్టులో ఆ వర్గం సమర్పించిన వాదనల ఆధారంగా:
- ఈ శాఖ స్థాపకుడైన స్వామి నారాయణ్, తనను తాను దేవుడిగా భావించుకుంటారు.
- అందువల్ల, స్వామి నారాయణుని దైవిక స్వరూపాన్ని విశ్వసించే ఈ వర్గాన్ని హిందూమత అనుచరులుగా పరిగణించలేము.
- ఈ శాఖ వారు స్థాపించిన దేవాలయాలు సంప్రదాయ హిందూ దేవతల ఆరాధనకు కాకుండా సాక్షాత్తు స్వామి నారాయణుడికే అంకితమయ్యాయి. ఇది ఈ శాఖ హిందూమతానికి భిన్నమైనదని స్పష్టంగా సూచిస్తుంది.
- స్వామి నారాయణుడిని తప్ప మరే ఇతరులను పూజించడం తమ విశ్వాసానికి ద్రోహం చేసినట్లేనని ఈ శాఖ వారు నమ్ముతారు. స్వామినారాయణ్ నియమించిన ఆచార్యులు దీక్షను ప్రసాదిస్తారు. దీక్షను స్వీకరించిన తరువాత భక్తుడు 'సత్సంగి' అవుతారు. ఈ విధంగా వారు ఆ శాఖ అనుచరులుగా ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతారు.
- ఈ నాలుగు కారణాల వల్ల స్వామి నారాయణ్ శాఖ హిందూమతానికి భిన్నమైనదని .. దళితుల దేవాలయాల ప్రవేశానికి సంబంధించిన చట్టం తమకు వర్తించదని కోర్టులో నిరూపించడానికి ప్రయత్నించారు.
హైకోర్టులో కేసు విచారణలో ఉండగా బొంబాయి హిందూ ప్రార్థనా స్థలాల చట్టం (ప్రవేశ అధికార) చట్టం 1956 అమల్లోకి వచ్చింది.
1958లో హైకోర్టు స్వామి నారాయణ్ వర్గం వాదనలను తిరస్కరించింది. స్వామి నారాయణ్ శాఖ హిందూ మతంలో, సమాజంలో భాగమని తీర్పు ఇచ్చింది.
ఆ తర్వాత ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 'హిందూ' అనే పదానికి సుప్రీంకోర్టు కచ్చితమైన నిర్వచనం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫొటో సోర్స్, Supreme Court of India
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ప్రధాన న్యాయమూర్తి పి.బి. గజేంద్ర గడ్కర్‌తో సహా సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసు విచారించింది.
స్వామి నారాయణ్ శాఖ హిందూమతం నుంచి భిన్నమైనదా? దాని ఆలయాలు 1956 నాటి ప్రార్థనా స్థలాల చట్టం పరిధిలోకి వస్తాయా లేదా అన్నది ఈ కేసులో ప్రధానమైన ప్రశ్నగా నిలిచింది.
స్వామి నారాయణ్ శాఖ హిందూమతం నుంచి భిన్నమైనదనే వాదనను తిరస్కరిస్తూ సుప్రీం కోర్టు 1966 జనవరి 14న తుది తీర్పు వెలువరించింది.
ఈ కేసులో సుప్రీం కోర్టు హిందూ మతాన్ని సవివరంగా వర్ణించింది.
ఈ మతం 4,000 సంవత్సరాలుగా పరిణామం చెందింది కాబట్టి హిందూమతం విశిష్ట లక్షణాలను నిరూపించడం ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తుందని కోర్టు అంగీకరించింది.
ప్రపంచంలోని ఇతర మతాలలాగా కాకుండా హిందూ మతాన్ని ఒక దేవుడు స్థాపించినట్లు చెప్పుకోదు. అలాగే ఒకే దేవతను పూజించదు. ఈ మతం ఏ ఒక్క సిద్ధాంతానికి లేదా నమ్మకానికో పరిమితం కాదు. ఏ ఒక్క తాత్విక భావనను కూడా విశ్వసించదు అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
హిందూ మతాన్ని విస్తృతమైన అర్థంలో ఒక 'జీవన విధానం'గా మాత్రమే పరిగణించవచ్చని కోర్టు తెలిపింది.
'ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ అండ్ ఎథిక్స్', మోనర్ విలియమ్స్ రాసిన 'రిలీజియస్ థాట్ అండ్ లైఫ్ ఇన్ ఇండియా' డాక్టర్ రాధాకృష్ణన్ రాసిన 'ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్' అనే పుస్తకాలను ప్రస్తావించిన సుప్రీంకోర్టు, వీటి గురించి వివరంగా చర్చించింది.
హిందూమతంలో ఏ విధమైన విగ్రహారాధనను నమ్మని వారు కూడా ఉన్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాకుండా హిందూ మతంలో లెక్కలేనంతమంది దేవతలు ఉన్నారని వారిని హిందువులలోని వివిధ సమూహాలు పూజిస్తాయని కూడా తెలిపింది.
స్వామినారాయణ్ జీవితం ఆయన రాసిన 'శిక్షాపత్రి' పుస్తకం స్వామి నారాయణ్ సంప్రదాయానికి చెందిన ఇతర గ్రంథాల గురించి కూడా సర్వోన్నత న్యాయస్థానం చర్చించింది.
"స్వామినారాయణ్ శాఖ అనుచరులు హిందూ సమాజం నుంచి వేరుగా ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పరుస్తారని వారి మతం హిందూమతానికి భిన్నమైనదని చెప్పడం పూర్తిగా తప్పు" అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
స్వామినారాయణ్ హిందూ సాధువనీ, ఆయన వల్లభాచార్యుని ప్రబోధకులు, అనుచరులలో ప్రబలంగా ఉన్న భ్రష్ట పద్ధతులను అంతం చేసి, హిందూమతాన్ని దాని అసలైన వైభవానికి, స్వచ్ఛతకు తీసుకురావాలని నిశ్చయించుకున్నారని చెప్పింది.
"దళితులకు చట్టం ద్వారా దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు అనేది దళితుల అన్ని సామాజిక హక్కులకు ప్రతీక అని మేం నొక్కి చెప్పాలనుకుంటున్నాం" అని పేర్కొంటూ సుప్రీం కోర్టు తన తీర్పును ముగించింది.

దళితులు వర్సెస్ స్వామినారాయణ్ వర్గం
గుజరాత్‌లో స్వామినారాయణ్ వర్గంపై దళితుల పట్ల వివక్షకు సంబంధించిన అనేక వివాదాలు ఉన్నాయి.
1980ల్లో స్వామి నారాయణ్ శాఖ గుజరాత్‌లోని నిమ్న వర్గాల పరిస్థితులను మెరుగుపరిచిందని బ్రిటిష్ వారు మరాఠాలు కూడా దాని అనుచరులుగా మారారని శాఖకు చెందిన కొన్ని రచనలు చెబుతున్నాయి.
దీనికి ప్రతిస్పందనగా, గుజరాతీ చరిత్రకారుడు మకరంద్ మెహతా 1986లో స్వామి నారాయణ్ శాఖపై ఒక వ్యాసాన్ని ప్రచురించారు.
ఈ వ్యాసం సూరత్‌లోని సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ వారి 'అర్థ' అనే పత్రికలో ప్రచురితమైంది.
అందులో ఆయన స్వామి నారాయణ్ వర్గం వాదనలను పరిశీలించి వాటిలో చాలావాటిని ఖండించారు.
దీని తర్వాత, మకరంద్ మెహతా, 'అర్థాత్' పత్రికకు చెందిన ఇద్దరు ఎడిటర్లు ఘనశ్యామ్ షా, అచ్యుత్ యాగ్నిక్‌లపై ఐపీసీ సెక్షన్ 295-ఎ కింద క్రిమినల్ దర్యాప్తు జరపాలని స్వామి నారాయణ్ వర్గం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
దళితుల పరిస్థితిని మెరుగుపరచడానికి సహజానంద్ అంటే స్వామి నారాయణ్ ప్రత్యేకంగా ఏమీ చేయలేదని మకరంద్ మెహతా తన వ్యాసాలలో పేర్కొన్నారు.
ఈ కేసు విచారణ జరుగుతుండగా మకరంద్ మెహతా ఆరోపణలకు స్వామి నారాయణ్ వర్గం స్పందించింది. ఈ స్పందన దళితుల పట్ల ఆ వర్గం వైఖరిని సూచిస్తుంది.
"స్వామి సహజానంద్ అందించిన ఆదరణతో దళిత సమాజం పరిశుభ్రతను పాటించడం నేర్చుకుంది. వారి ప్రవర్తన బ్రాహ్మణుల వలె మారింది. ఆ కాలంలో కుల వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ సహజానంద్ వారి అభ్యున్నతికి కృషి చేశారు" అని ఆ వర్గం పేర్కొంది.
దళిత సమాజం అధిక సంఖ్యలో ఉన్న ప్రతిచోటా సహజానంద్ వారికోసం ప్రత్యేక దేవాలయాలను నిర్మించారు. కుల వ్యవస్థ ఉన్న ఆ కాలంలో వారి విముక్తి కోసం సహజానంద్ సాధ్యమైన అన్ని ప్రయత్నాలూ చేశారు. ఆయన దళితులకు అక్షరాస్యతను అందించారు, దాని ఫలితంగా దళితులు మత గ్రంథాలను చదవడం ప్రారంభించారు’’ అని చెప్పింది.
1966 నాటి తీర్పు వెలువడి 60 ఏళ్లు గడిచినా, స్వామి నారాయణ్ వర్గం దళితులపై వివక్ష చూపుతోందన్న ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.
న్యూయార్క్ టైమ్స్‌లోని 2021 కథనం ప్రకారం న్యూజెర్సీలోని బాప్స్ స్వామి నారాయణ్ ఆలయం పలువురు ‘నిమ్న కుల’ వ్యక్తులను బలవంతపు కార్మికులుగా నియమించుకుందనే ఆరోపణలపై స్థానిక అధికారులు దాడులు చేశారు.
ఓ కార్మికుడికి నెలకు కేవలం 450 డాలర్లు మాత్రమే చెల్లించారని కోర్టు ఆరోపించింది.
అమెరికాలోని పలు స్వామి నారాయణ్ దేవాలయాల్లో కూడా ఇదే పరిస్థితి వెలుగులోకి వచ్చింది. అయితే తక్కువ జీతానికి అనే ఆరోపణలనను బాప్స్ ప్రతినిధి ఖండించారు.
ఈ కేసులో క్రిమినల్ దర్యాప్తు పూర్తయింది. సివిల్ కేసు ఇంకా కొనసాగుతోంది. ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు.
ఫ్రాన్స్ 24 రిపోర్ట్ బాప్స్ ఆలయ మాజీ ఉద్యోగి కథను ప్రస్తావించింది. దీంతో ఆయన అప్పటి నుంచి ఆలయాన్ని విడిచిపెట్టారు. కానీ ఆయనకు ఇంకా న్యాయం జరగలేదు. ఆ కార్మిడుకు దళిత వర్గానికి చెందినవారు. ఆలయ నిర్మాణంలో రాతి శిల్పిగా పనిచేసేందుకు ఆయనను భారత్ నుంచి తీసుకొచ్చారు.
పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారని, ఆలయ ప్రాంగణం ఒక కేంద్ర జైలులా ఉందని, అక్కడ తనను ఎవరితోనూ మాట్లాడనివ్వలేదని, బయటకు వెళ్లనివ్వలేదని, కేవలం రాతి శిల్పాలు చెక్కే పని మాత్రమే చేయాల్సిందిగా బలవంతం చేశారని ఆయన ఆరోపించారు.
ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో కూడా, బాప్స్ సంస్థ ఈ ఆరోపణలను ఖండిస్తూనే ఉంది. తమ సంస్థ కులం, పుట్టుక ఆధారంగా వివక్షను వ్యతిరేకిస్తుందని బాప్స్ గతంలో స్పష్టం చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























