బకాయిపడ్డ 10వేల జీతం చెల్లించడం లేదని టెక్స్టైల్ మార్కెట్‌కు నిప్పు పెట్టాడు

ఫొటో సోర్స్, PTI
సూరత్‌లోని దుస్తుల మార్కెట్లో సెప్టెంబర్ 9న అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది 14 గంటలు శ్రమించాల్సి వచ్చింది.
ముందు దీన్నొక ప్రమాదంగానే భావించారు. కానీ దీనిపై విచారణ మొదలు పెట్టాక, ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వక చర్య అని తెలుసుకున్నారు.
వినోద్ సావ్లే అనే వ్యక్తి శ్యాం సంఘీ మార్కెట్‌కు నిప్పు పెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇతనికి జీతం బకాయిల విషయంలో తను పనిచేసిన వస్త్రదుకాణ యజమానితో విభేదాలు ఉన్నట్టు గుర్తించారు.
నిప్పు పెట్టిన తర్వాత నిందితుడు రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలలో తిరిగాడు. కానీ చివరకు పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.


ఫొటో సోర్స్, ANI Video Grab
ఇంతకీ మార్కెట్లో ఏం జరిగింది?
సూరత్‌లో సెప్టెంబర్ 8వ తేదీ అర్థరాత్రి తర్వాత (సెప్టెంబర్ 9వ తేదీ వేకువజామున) కుంభరియా త్రీ క్రాసింగ్ సమీపంలో ఉన్న శ్యాం సంఘీ టెక్స్టైల్ మార్కెట్లోని ఆరో అంతస్తులో మంటలు చెలరేగాయి.
సూరత్ వస్త్ర మార్కెట్లో అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. దుస్తులు కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి. విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతూ ఉంటాయి.
శ్యాం సంఘీ టెక్స్టైల్ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంగానే తొలుత సాధారణమైనదిగానే భావించారు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే. మండే స్వభావం ఉన్న ద్రవాన్ని దుస్తుల పార్సిల్స్‌పై పోసి ఓ వ్యక్తి నిప్పు పెట్టినట్టు కనిపించింది. తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.ఈ వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వినోద్ పండిట్ సావ్లేగా గుర్తించి అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Rupesh Sonwane
దుకాణాలన్నీ మూసే వరకు ఎదురు చూసి...
శ్యాం సంఘీ మార్కెట్లోని 639 నెంబర్లో ఉన్న జగదంబా టెక్స్‌టైల్స్‌లో హనుమాన్ ప్రసాద్ వద్ద వినోద్ పండిట్ సావ్లే అకౌంటెంట్‌గా పని చేశారు. ఆయన నెలకు జీతం 30వేల రూపాయి. వినోద్ ఉద్యోగం మానేసే సమయానికి యజమాని 10వేల రూపాయిలు జీతం బకాయి పెట్టారు. ఈ డబ్బుపైనే వినోద్‌కు యజమానితో గొడవ మొదలైంది. ఈ బకాయిను చెల్లించేందుకు యజమాని నిరాకరించడంతో, తన యజమానికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే మార్కెట్‌కు నిప్పుపెట్టాడని పోలీసులు చెప్పారు.
'ఉద్యోగం మానేసిన తర్వాత తనకు రావాల్సిన పదివేలు ఇవ్వని తన ఓనర్‌కు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే నిందితుడు వినోద్ పండిట్ సావ్లే నిప్పు పెట్టారు' అని సూరత్ అదనపు డీసీపీ(క్రైం) కరణ్‌రాజ్ వాఘేలా చెప్పారు.
'నిందితుడు దిండోలి నుంచి 150 రూపాయల పెట్రోల్ కొనుగోలు చేశాడు. దుకాణం బయట ఉన్న దుస్తుల పార్సిల్స్‌పై పెట్రోల్ చల్లారు. అనంతరం నిప్పు పెట్టారు. తర్వాత రాజస్థాన్‌లోని ఖతుశ్యాం ఆలయాన్ని, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య ఆలయాన్ని సందర్శించారు. సూరత్‌కు తిరిగి వస్తున్న క్రమంలోనే దిండోలి ఫ్లవర్ గార్డెన్ వద్ద ఆయన్ను అరెస్టు చేశాం' అని కరణ్‌రాజ్ వాఘేలా వివరించారు.
'ఘటన జరిగిన రోజున నిందితుడు తొమ్మిది గంటలకే మార్కెట్‌కు వచ్చారు. దుకాణాలన్నీ మూసివేసే వరకు ఎదురు చూస్తూ ఐదో అంతస్తులో కూర్చున్నారు'అని పేర్కొన్నారు.
'యజమాని దుకాణం మూసివేసి వెళ్లిపోయాక, 12 గంటల తర్వాత నిందితుడు నిప్పుపెట్టారు. తర్వాత ఆయన పేరు బయటకు రాగానే మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు' అని తెలిపారు.
'అగ్నిమాపక సిబ్బందికి అర్థరాత్రి 12.50 గంటలకు ఫోన్ వచ్చింది. పై అంతస్తులో అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం అందింది' అని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ధర్మేశ్ మిస్త్రీ మీడియాకు చెప్పారు.
'వెంటనే అగ్నిమాపక కేంద్రాల నుంచి వాహనాలు రప్పించారు' అని ప్రమాదం జరిగిన తర్వాత రోజు మీడియాకు మిస్త్రీ తెలిపారు.
ప్రమాదం జరిగిన అంతస్తులోని దుకాణాలన్నింటినీ పూర్తిగా దగ్ధం చేసిన మంటలను ఆర్పడానికి 14 గంటల సమయం పట్టింది. దాని కింద ఉన్న ఐదో అంతస్తులోని దుకాణాల్లోని కొంత సరకు కూడా కాలిపోయింది.
విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే, ఒక వ్యక్తి ముఖానికి రుమాలు కట్టుకొని దుస్తుల పార్సిల్స్‌లో ఏదో చల్లి నిప్పు పెట్టినట్టు కనిపించింది. ముందుగా గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేసిన పోలీసులు తర్వాత నిందితుణ్ని సావ్లేగా గుర్తించారు.

ఫొటో సోర్స్, CCTV
యజమాని తిట్లతో వేధించడం వల్లే..
''వినోద్ సావ్లే చేసే ప్రతి పనిలో లోపాలు వెతుకుతూ వ్యాపారి తిట్టేవారు. అందుకే నెల రోజుల క్రితం ఉద్యోగం మానేశారు. కానీ వ్యాపారి ఇంకా పదివేల రూపాయల జీతం బకాయి ఉన్నారు. ఆ డబ్బుల కోసం సావ్లే పదే పదే కాల్ చేశారు. నేరుగా కలిశారు. కానీ డబ్బులు ఇవ్వడానికి వ్యాపారి నిరాకరించారు. అందుకే బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో దుకాణం బయట ఉన్న పార్సిల్స్‌కు నిప్పు పెట్టారు'' అని పోలీసలు చెప్పారు.
'వస్త్రాలకు నిప్పు పెట్టిన తర్వాత వినోద్ సావ్లే అక్కడి నుంచి తన ద్విచక్ర వాహనంపై పారిపోయారు' అని కరణ్‌రాజ్ వాఘేలా చెప్పారు.
'వినోద్ సావ్లే తన సొంతూరు వెళ్లకుండా రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలలో తిరిగారు. ఆదివారం రాత్రి సూరత్ తిరిగి వచ్చారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు దిండోలి ప్రాంతంలో ఆయన్ను అరెస్ట్ చేశారు'' అని వివరించారు.
ఈ కేసులో నిందితుడు వినోద్ పండిట్ సావ్లేను కానీ, ఆయన కుటుంబాన్ని గానీ సంప్రదించడానికి సాధ్యపడలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























