ట్రంప్-జిన్‌పింగ్ భేటీ: ఆప్యాయంగా పలకరించుకున్నారు, అసలు విషయాలపై ఏం తేల్చారు?

డోనల్డ్ ట్రంప్-జిన్‌పింగ్ భేటీ, షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన, వైట్‌హౌస్
ఫొటో క్యాప్షన్, షీ జిన్‌పింగ్, డోనల్డ్ ట్రంప్
    • రచయిత, బెర్న్డ్ డెబుస్‌మాన్, మాక్స్ మాట్జా, అయోన్ వెల్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

వైట్‌హౌస్‌లో అత్యంత ఘనంగా జరిగిన అధికారిక విందులో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అయితే, అత్యవసర సమస్యల పరిష్కారంపై ఎలాంటి పురోగతి కనిపించలేదు.

కృత్రిమ మేధ 'మానవుల నియంత్రణలోనే' ఉండేలా దేశాలు చూసుకోవాలని, 'బాధ్యతాయుతమైన ప్రధాన దేశాలుగా' వ్యవహరించాలని జిన్‌పింగ్ నొక్కిచెప్పారు.

రెండు దేశాలకు 'సామరస్యం, శాంతి, విజయాలతో' కూడిన భవిష్యత్తు ఉండాలని ట్రంప్ ఆకాంక్షించారు.

దౌత్యపరమైన మర్యాదలు పాటించినప్పటికీ, తైవాన్ విషయంతో సహా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్వయంప్రతిపత్తి గల ఆ ద్వీపం తమదేనని బీజింగ్ వాదిస్తోంది.

ట్రంప్ ఇటీవల ఒక భారీ ఆయుధ ప్యాకేజీని నిలిపివేసిన నేపథ్యంలో తైవాన్ పట్ల 'సరైన వైఖరి' అవలంబించాలని అదే రోజు ఉదయం ట్రంప్‌ను జిన్‌పింగ్ కోరారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బాల్‌రూమ్ ప్రాజెక్టుపై ముచ్చట్లు

ఈ విందులో కోటీశ్వరులైన వ్యాపారవేత్తలు, ట్రంప్ ప్రభుత్వ అధికారులు, అమెరికన్ టెక్ కంపెనీల సీఈఓలు అతిథులుగా పాల్గొన్నారు.

అయితే, వారు అక్కడికి చేరుకుంటున్న సమయంలో బయట ఆందోళనకారులు గట్టిగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వారిలో కొందరిని అరెస్టు చేశారు.

గురువారం రాత్రి అక్కడికి విచ్చేసిన వారిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. సుదూర ప్రయాణం చేసి అమెరికాకు వచ్చినందుకు జిన్‌పింగ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, తమ ఇద్దరి మధ్య బంధం దృఢంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

"మా మధ్య ఇప్పుడున్నంత సాన్నిహిత్యం గతంలో ఎన్నడూ లేదు" అని ట్రంప్ అన్నారు.

అమెరికా-చైనా సంబంధాలకు ఉన్న సుదీర్ఘ చరిత్రను ఆయన ప్రశంసించారు. అయితే, ప్రసంగం మధ్యలో అకస్మాత్తుగా అంశం మార్చి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తన బాల్‌రూమ్ ప్రాజెక్టుపై ట్రంప్ మాట్లాడారు.

ఏడాదిలో పూర్తయ్యే ఆ బాల్‌రూమ్‌లోకి తొలిసారిగా అడుగుపెట్టే అవకాశం చైనా నేతకు, ఆయన సతీమణికి కల్పించడం ఒక 'ప్రత్యేక ఆతిథ్యం' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

"అందంగా, శుభ్రంగా, తళతళలాడుతున్న నిర్మాణ స్థలంలో అడుగుపెట్టాలనుకునే వారు ఎవరైనా సరే.. ఇక్కడికి రావడం మాకు గర్వకారణం" అన్నారు.

డోనల్డ్ ట్రంప్-జిన్‌పింగ్ భేటీ, షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన, వైట్‌హౌస్

చారిత్రక బంధాన్ని గుర్తుచేసిన జిన్‌పింగ్

అమెరికా జాతీయ చిహ్నమైన 'బాల్డ్ ఈగిల్' (గ్రద్ద) శిల్పాన్ని కూడా జిన్‌పింగ్‌కు ట్రంప్ బహూకరించారు. ఇది 'అమెరికా స్వేచ్ఛను, ఉన్నత స్ఫూర్తిని' ప్రతిబింబిస్తుందని అన్నారాయన.

"బీజింగ్‌లో దీనికి ఒక అద్భుతమైన, అందమైన స్థానం దక్కుతుందని ఆశిస్తున్నాం. ఇది మీకు దక్కిన గౌరవం" అన్నారు.

ఈ శిల్పం రూపకల్పనలో తాను, ప్రథమ మహిళ మెలానియా కూడా పాలుపంచుకున్నట్లు ట్రంప్ వివరించారు.

తనను, తన సతీమణిని అత్యంత శ్రద్ధతో, సాదరంగా ఆహ్వానించినందుకు ఆతిథ్యమిచ్చిన వారికి జిన్‌పింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి వాతావరణం తమకు 'సొంతింట్లో ఉన్న అనుభూతిని' కలిగించిందన్నారు.

'మా ద్వైపాక్షిక చర్చలతో చరిత్ర సృష్టిస్తున్నాం' అని జిన్‌పింగ్ అన్నారు .

"వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన నిర్మాణాత్మక చైనా-అమెరికా సంబంధాలను పెంపొందించుకోవడానికి మేం అంగీకరించాం" అన్నారు.

ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేలా, "నిజాయితీగా, లోతైన విషయాలను" పంచుకున్నామని జిన్‌పింగ్ తెలిపారు.

ట్రంప్ తరహాలోనే జిన్‌పింగ్ ప్రసంగం కూడా పొగడ్తలతో సాగింది. అమెరికా, చైనాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలు, ఉమ్మడి చరిత్రపై ఆయన మాట్లాడారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై చేసిన పోరాటంలో ఇరు దేశాల మధ్య బంధం 'రక్తం, అగ్నిజ్వాలల మధ్య రూపుదిద్దుకుందని' జిన్‌పింగ్ అన్నారు. ఆ తర్వాత నిక్సన్ ప్రభుత్వ హయాంలో జరిగిన 'పింగ్ పాంగ్' దౌత్యంతో ఈ బంధం మరింత బలపడిందని గుర్తుచేశారు.

అమెరికా, చైనాల లక్ష్యాలు 'పరస్పరం బలోపేతం చేసుకునేలా' ఉండొచ్చని ప్రసంగం ముగింపులో జిన్‌పింగ్ అన్నారు. 'అగ్రరాజ్యాలు కలిసికట్టుగా ముందుకు సాగేందుకు ఒక కొత్త విధానాన్ని' అన్వేషించాలని ఇరు పక్షాలను చైనా అధ్యక్షుడు కోరారు.

డోనల్డ్ ట్రంప్-జిన్‌పింగ్ భేటీ, షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన, వైట్‌హౌస్
ఫొటో క్యాప్షన్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి ఎలాన్ మస్క్ అతిథులతో ముచ్చటిస్తూ కనిపించారు.

వ్యాపార, టెక్ దిగ్గజాల సందడి

రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ గంభీరమైన ముఖంతో మరో టేబుల్ దగ్గర కనిపించారు. హెగ్‌సెత్ పక్కనే ఆయన సతీమణి కూర్చున్నారు. వారికి సమీపంలో జారెడ్ కుష్నర్, వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోనికా క్రౌలీ కూడా ఉన్నారు.

వైట్‌హౌస్ అమెరికన్ అధికారులతో పాటు కన్జర్వేటివ్ బ్రాడ్‌కాస్టర్లను, టెక్ పరిశ్రమ అధినేతలను, సోషల్ మీడియా సీఈఓలను, ఇతర కార్పొరేట్ కార్యనిర్వాహకులను పెద్ద సంఖ్యలో ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ట్రంప్ క్యాబినెట్ సభ్యులతో పాటు ఆయన పిల్లలు ఇవాంకా, ఎరిక్, టిఫనీ లాంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

విందుకు విచ్చేసిన టెక్ పరిశ్రమ అధినేతల్లో యాపిల్‌కు చెందిన టిమ్ కుక్, ఓపెన్‌ఏఐకి చెందిన సామ్ ఆల్ట్‌మాన్, గూగుల్‌కు చెందిన సుందర్ పిచాయ్, అమెజాన్ నుంచి జెఫ్ బెజోస్, ఎన్విడియా నుంచి జెన్సన్ హువాంగ్ ఉన్నారు.

కుక్, హువాంగ్ ఇద్దరూ ట్రంప్, జిన్‌పింగ్‌ కూర్చున్న టేబుల్ దగ్గరే ఆశీనులయ్యారు. గతంలో ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించే బాధ్యతలు చేపట్టి ట్రంప్ పరిపాలనా విభాగంలో పనిచేసిన ఎలాన్ మస్క్ కూడా అదే టేబుల్ వద్ద కూర్చున్నారు.

జనరల్ మోటార్స్, వీసా, పారామౌంట్ స్కైడాన్స్, ఎక్సాన్ మొబిల్ లాంటి ఇతర సంస్థల అధినేతలు కూడా హాజరయ్యారు.

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు టిక్‌టాక్‌లో వాటా ఉన్న అమెరికన్ బిలియనీర్ జెఫ్ యాస్ కూడా ఈ విందులో పాల్గొన్నారు.

"అక్కడుండాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. మొత్తం టెక్ ప్రపంచం, బ్యాంకింగ్ రంగం.. ఇలా ఎందరో ఈ విందులో పాల్గొన్నారు" అని ఈ కార్యక్రమానికి ముందు ట్రంప్ అన్నారు.

అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విలువైన ఏఐ సంస్థల్లో ఒకటైన 'ఆంత్రోపిక్' ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

అసలు వాళ్లకు ఆహ్వానం అందలేదా? లేక వారే హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారా? అని బీబీసీ ఆంత్రోపిక్ సంస్థను ప్రశ్నించింది.

డోనల్డ్ ట్రంప్-జిన్‌పింగ్ భేటీ, షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన, వైట్‌హౌస్
ఫొటో క్యాప్షన్, ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో వ్యాపారవేత్తలు, టెక్ అధినేతలు ఉన్నారు.

విందు మెనూ ఇదే

విందు మెనూలో 'చైనా ప్రభావం కాస్తంత కనిపించే అమెరికన్ పదార్థాలు' ఉంటాయని ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసిన మెలానియా ట్రంప్ కార్యాలయం తెలిపింది.

అతిథులు ఎరుపు రంగు టేబుల్‌క్లాత్‌లపై భోజనం చేశారు. చైనాలో ఎరుపు రంగును అదృష్టానికి, శుభానికి ప్రతీకగా భావిస్తారు.

అతిథులు మొదట ఎల్లో స్క్వాష్, అడవి పుట్టగొడుగులు, కరకరలాడే పాన్‌సెట్టా రుచి చూశారు. ప్రధాన వంటకంగా నువ్వులు అద్దిన సీ బాస్ (చేప వంటకం), ఉడికించిన బోక్ చోయ్, వేయించిన వంకాయలను ఆరగించారు.

భోజనం తర్వాత తీసుకునే డిజెర్ట్ విషయానికొస్తే, ఇద్దరు నేతలు, ఇతర అతిథులు సోర్ చెర్రీ కాన్ఫిట్‌తో కూడిన వెనిలా క్రెమెక్స్‌ను ఆస్వాదించారు. దీనికి జతగా "వైట్‌హౌస్‌లో సేకరించిన తేనెతో తయారు చేసిన" ఐస్‌క్రీం అందించారు.

ప్రథమ మహిళ ఎంపిక చేసిన వైన్‌లలో 'స్క్రామ్స్‌బర్గ్ బ్లాంక్ డి నోయిర్' ఉంది. 1972లో చైనా మాజీ ప్రధాని చౌ ఎన్‌లైతో కలిసి అధ్యక్షుడు నిక్సన్ చేసిన "టోస్ట్ టు పీస్"కు ఇది ఒక గుర్తు. ఆ సమయంలో కూడా వారు ఇదే ద్రాక్షతోట నుంచి వచ్చిన వైన్ బాటిల్‌ను ఉపయోగించారు.

ట్రంప్, జిన్‌పింగ్‌లు తమ సతీమణులతో కలిసి పర్యటన చివరి రోజు(శుక్రవారం)ను వైట్‌హౌస్‌లోని రెడ్ రూమ్‌లో టీతో ప్రారంభించనున్నారు.

ఆ తర్వాత వీరు యూఎస్ నేషనల్ ఆర్కైవ్స్‌కు వెళ్లి, ఆ భవనాన్ని, అక్కడి ప్రదర్శనలను వీక్షించనున్నారు.

అధికారికంగా నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్‌గా పిలిచే ఈ భవనంలో, అమెరికా స్థాపనకు సంబంధించిన అత్యంత కీలకమైన పత్రాలు ఉన్నాయి. అమెరికా రాజ్యాంగం, స్వాతంత్య్ర ప్రకటన, బిల్ ఆఫ్ రైట్స్ ఇందులో భద్రపరిచారు. జిన్‌పింగ్, ఆయన సతీమణి అదేరోజు ఆ తర్వాత వాషింగ్టన్ నుంచి తిరుగుపయనం కానున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)