హిమాలయాలు వేగంగా కరిగిపోవడానికి కారణమేంటి, దీనిని కట్టడి చేయలేమా?

వేగంగా కరుగుతున్న హిమానీనదాలు, భారత ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Nur Photo via Getty Images

ఫొటో క్యాప్షన్, భారత ప్రభుత్వ సమాచారం ప్రకారం, 56 హిమానీనద సరస్సులను 'అత్యంత ప్రమాదకరమైనవిగా' వర్గీకరించారు.
    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

హిమానీనదాలు వేగంగా కరుగుతుండటం, అలా కరిగిన నీటితో ఏర్పడిన సరస్సులు మరింత అస్థిరంగా మారుతుండటం, మరోవైపు పర్వత ప్రాంతాలపై పర్యవేక్షణాలోపం కారణంగా హిమాలయాలు ప్రమాదకర దశకు చేరుకుంటున్నాయని తాజా పరిశోధన తెలిపింది.

నేపాల్, టిబెట్‌లో 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి, భారీ విధ్వంసం సంభవించిన వరదల తర్వాత ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. హిమాలయ పర్యావరణ వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల కారణంగా ఏ స్థాయిలో ముప్పు పెరుగుతోందో ఈ పరిశోధనా ఫలితాలు తెలిపాయి.

గ్లోబల్ కన్సల్టెన్సీ సిస్టమిక్ రిపోర్ట్ ప్రకారం, హిమాలయాల్లోని హిమానీనదాలు దశాబ్దం కిందటితో పోలిస్తే ఇప్పుడు 65 శాతం వేగంగా ద్రవ్యరాశిని కోల్పోతున్నాయి. ఈ నివేదికను ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ ఇనిషియేటివ్ రూపొందించింది. దీనికి ఐసీఐఎంవోడీ, జీబీ పంత్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్‌మెంట్ సాంకేతిక సహకారం అందించాయి.

హిమాలయ-కారాకోరం ప్రాంతంలో 40వేల హిమానీనదాలు ఉన్నట్లు అంచనా వేయగా, వాటిలో కేవలం 21 హిమానీ నదాలను మాత్రమే నిరంతరం,సమగ్రంగా పర్యవేక్షిస్తున్నారని రిపోర్టు చెబుతోంది. ఈ పర్యవేక్షణ లోటు ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే హిమాలయాల భౌగోళిక స్వరూపం వేగంగా మారిపోతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హిమానీనదాలు కరిగి వెనక్కి తగ్గుతున్న కొద్దీ, వాటి వెనుక పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడుతున్నాయి. వీటిని రాళ్లు, మంచుతో కూడిన అస్థిరమైన సహజ అడ్డంకులు నిలువరించి ఉంచుతున్నాయి.

అదే సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పెర్మాఫ్రాస్ట్‌ , అంటే శాశ్వతంగా గడ్డకట్టిన నేల క్రమంగా కరిగి అస్థిరంగా మారుతోంది. ఎత్తైన పర్వత వాలు కూడా బలహీనపడుతోంది. దీని వల్ల ఒక ప్రమాదం మరో ప్రమాదానికి దారితీసే అవకాశం పెరుగుతోందని ఈ రిపోర్టు చెబుతోంది. ఈ ముప్పు స్థాయి ఎంత ఉంటుందో భారత్ వద్ద ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి.

భారత్ భూభాగంలో సుమారు 18 శాతం హిమాలయ ప్రాంతమే ఉన్నప్పటికీ, దేశంలో సంభవించే విపత్తుల్లో దాదాపు 35 శాతం ఈ ప్రాంతంలోనే జరుగుతున్నాయని నివేదిక చెబుతోంది.

2025లో భారత హిమాలయ ప్రాంతంలోని అధికప్రమాదం ఉన్న 189 హిమానీనద సరస్సులపై నిర్వహించిన శాస్త్రీయ అంచనా తర్వాత వాటిల్లో 56 సరస్సులను 'అత్యంత ప్రమాదకరమైనవిగా' వర్గీకరించినట్టు జూలైలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. భారత హిమాలయ నదీ పరివాహక ప్రాంతాల్లో 10 హెక్టార్లకు పైగా విస్తీర్ణం ఉన్న 2,485 హిమానీనద సరస్సులను కేంద్ర జల సంఘం పర్యవేక్షిస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.

సహజ ఆనకట్టలను బద్దలుకొట్టుకుని కొట్టి హిమానీనదాలుఒక్కసారిగా పొంగిపొర్లితే ఎంతటి విధ్వంసం జరుగుతుందో హిమాలయాలు ఇప్పటికే చవిచూశాయి.

2023లో హిమానీనద సరస్సు ఉప్పొంగి వచ్చిన వరదల కారణంగా సిక్కింలో కనీసం 70 మంది చనిపోయారు. రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. 2021లో ఇలాంటి విపత్తు కారణంగా రిషిగంగా, ధౌలిగంగా లోయల్లో భారీ వరదలు సంభవించి 200 మందికిపైగా మరణించారు.

అయితే హిమాలయాల నుంచి పొంచి ఉన్న ప్రమాదం ఇలాంటి భారీ వరదలకే పరిమితం కాలేదు.

వేగంగా కరుగుతున్న హిమానీనదాలు, బ్లాక్ కార్బన్‌, భారత ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 2023లో హిమానీనద సరస్సు ఉప్పొంగడంతో ఆకస్మిక వరద సంభవించి, సిక్కింలో భారీ నష్టం వాటిల్లింది.

హిమాలయ నీటి వనరులే ఆధారం

హిమాలయాలు ఒక విశాలమైన సహజ జల వ్యవస్థ. దీని కారణంగా ప్రవహిస్తున్న నదులు దక్షిణాసియాలోని వందల మిలియన్ల కొద్ది ప్రజలకు జీవనాధారంగా ఉన్నాయి.

ఈ శతాబ్దం మధ్య నాటికి చాలా హిందూ కుష్ హిమాలయ నదీ పరీవాహక ప్రాంతాల్లో 'పీక్ వాటర్' ఏర్పడుతుందని ఐసీఐఎంఓడీ పేర్కొంది. అంటే, హిమానీనదాలు కరిగే కొద్దీ నదుల్లోకి చేరే నీటి పరిమాణం ఒక దశలో గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఆ తర్వాత హిమానీనదాలు మంచు ద్రవ్యరాశిని కోల్పోతూ పోవడంతో ఆ నీటి ప్రవాహం క్రమంగా తగ్గడం మొదలవుతుంది.

హిమాలయాలపై ఆధారపడటం వల్ల ఆర్థికంగా ఎంత ప్రమాదకరమో ఈ కొత్త పరిశోధన స్పష్టం చేస్తోంది.

హిమాలయాల నుంచి లభించే నీరు భారత జీడీపీలో దాదాపు 20 శాతానికి ఆధారంగా ఉందని నివేదిక అంచనా వేసింది. గోధుమ, వరి, టీ సాగుతో పాటు జలవిద్యుత్‌, తీర్థయాత్రల ఆధారిత ఆర్థిక కార్యకలాపాలకు ఈ నీరే కీలకంగా ఉందని తెలిపింది.

"హిమాలయాలు మన భూమికి మూడో ధ్రువం లాంటివి, ఆర్కిటిక్ లేదా అంటార్కిటికా ధ్రువంలా కాకుండా ఇక్కడ కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు" అని ఆర్థికవేత్త లార్డ్ నికోలస్ స్టెర్న్ అన్నారు.

ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీలకమైన మౌలిక వసతులతో ముడిపడి ఉంది," అని ఆయన అన్నారు. అయితే వాటికి ఆధారంగా ఉన్న పర్యావరణ వ్యవస్థ "పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయే కీలక దశకు చేరువవుతోంది" అని ఆయన హెచ్చరించారు.

వేగంగా కరుగుతున్న హిమానీనదాలు, బ్లాక్ కార్బన్‌, భారత ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Corbis via Getty Images

బ్లాక్ కార్బన్‌తో వేగంగా కరుగుతున్న హిమానీనదాలు

హిమానీనదాలు కరిగిపోవడానికి కారణమవుతున్న అన్ని అంశాలు ఈ ప్రాంతం నియంత్రణకు పూర్తిగా అతీతమైనవి కావు.

హిమాలయల్లో హిమానీ నదాల కరుగుదలకు బాక్ల్ కార్బన్ దాదాపు మూడోవంతు కారణమని సిస్టమ్ఐక్యూ పరిశోధన అంచనా వేసింది. ఇందులో అధిక భాగం మైదాన ప్రాంతాల్లోని ఇటుక బట్టీల నుంచి వెలువడుతోంది. మంచు, హిమానీనదాలపై పేరుకునే ఈ మసి ఎక్కువ సూర్యకాంతిని గ్రహించడం వల్ల అవి మరింత వేగంగా కరుగుతాయి.

ప్రపంచవ్యాప్తంగా వెలువడే గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలతో పోలిస్తే, బ్లాక్‌ కార్బన్‌ కాలుష్యాన్ని తగ్గించడం భారత్‌, పొరుగు దేశాలు నేరుగా చర్యలు తీసుకోగల అంశం అని నివేదిక పేర్కొంది.

"హిమాలయాలు ఒక కీలక మలుపు దశకు చేరుకుంటున్నాయి. లక్షలాది మంది ప్రజల ప్రాణాలు, జీవనోపాధి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి," అని సిస్టమ్‌ఐక్యూ సీనియర్‌ డైరెక్టర్‌, నివేదిక ప్రధాన రచయిత అరుషి చోప్రా అన్నారు. "హిమానీనదాలు పదేళ్ల క్రితం కంటే ఇప్పుడు మరింత వేగంగా కరుగుతున్నాయి’’ అన్నారు.

ఈ నివేదిక 10 ముఖ్యమైన మార్పులను సూచించింది. అందులో బ్లాక్ కార్బన్ కాలుష్యాన్ని తగ్గించడం, హిమానీనదాల పర్యవేక్షణను పెంచడం, ముందస్తు ప్రమాద హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడం, కొండ ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని మార్చడం వంటివి ఉన్నాయి.

విపత్తును ఎదుర్కొనే సన్నద్ధతను పెంచడం నివేదిక సూచించిన ప్రధానమైన లక్ష్యాల్లో ఒకటి. ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం నుంచి కీలకమైన నిర్మాణాలు దెబ్బతినకుండా కాపాడటం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాలు ముందే నిర్ణయించుకోవాలని పేర్కొంది.

పర్యటకంపై పునరాలోచనకు సూచన

మరో ముఖ్యమైన సూచన పర్యటకంపై పునరాలోచన. భారత హిమాలయ ప్రాంతంలో ఏడాదికి దాదాపు 40 కోట్ల పర్యటక సందర్శనలు నమోదవుతున్నాయి. పర్యటకుల సంఖ్యను వీలైనంతగా పెంచడమే లక్ష్యంగా కాకుండా, పర్యటకం ద్వారా వచ్చే విలువ స్థానికంగానే మిగిలి, తిరిగి ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేలా విధానాన్ని మార్చాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

హిమాలయాల్లో ఎదురయ్యే ప్రమాదాలు రానురాను మరింత సంక్లిష్టంగా మారుతున్నాయని ఐసీఐఎంఓడి డైరెక్టర్ జనరల్ పెమా గ్యామ్‌ట్షో తెలిపారు.

"హిమానీనదాలు కరిగిపోతున్నాయి. శాశ్వతంగా గడ్డకట్టిన నేల, ఎత్తైన కొండ వాలు ప్రాంతాలు మరింత అస్థిరంగా మారుతున్నాయి. దీని వల్ల దిగువ ప్రాంతాల్లోని ప్రజలు, అక్కడి మౌలిక సదుపాయాలు కూడా ఒకదానితో ఒకటి ముడిపడిన వరుసగా సంభవించే ప్రమాదాల బారిన పడే ముప్పును ఎదుర్కొంటున్నారు" అని చెప్పారు.

ఈ ప్రమాదాలకు హిమాలయాలపై గీసిన దేశ సరిహద్దులు అడ్డుకావు. ఇలాంటి విపత్తులు "జాతీయ సరిహద్దులను పట్టించుకోవు. ఏ ఒక్క దేశం వాటిని ఒంటరిగా ఎదుర్కోలేదు" అని గ్యామ్‌షో అన్నారు.

అందుకే సరిహద్దులు దాటి పర్యవేక్షణ, ప్రమాదాల సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం, విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచేందుకు సంయుక్తంగా పెట్టుబడులు పెట్టడం అత్యవసరంగా మారాయి. ఈ పర్వతాలపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది మంది ప్రజల ప్రాణాలను, జీవనోపాధులను, ఆర్థిక వ్యవస్థలను రక్షించడానికి కూడా ఇది చాలా ముఖ్యం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)