వందే భారత్ స్లీపర్ రైళ్లు : ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వేగం ఎంత?

భారత్‌లో వందే భారత్ స్లీపర్ రైళ్లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. మొట్టమొదటి రైలును 2026 జనవరిలో హౌరా-గువాహటి మధ్య రైల్వే శాఖ ప్రారంభించింది.
అప్పటి నుంచి దశల వారీగా ఈ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి.
ఇటీవల బెంగళూరు నుంచి ముంబయి వెళ్లే వందే భారత్ స్లీపర్ రైలును రైల్వే శాఖ ప్రారంభించింది.
ఈ రైలు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా ప్రయాణిస్తుంది.
ఏపీలోని అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో హాల్టు సౌకర్యం ఉంది. తెలంగాణలోని కృష్ణా రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తుంది కానీ అక్కడ మాత్రం ఆగడం లేదు.

వందే భారత్ స్లీపర్ గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించగలదు.
ప్రస్తుతం మాత్రం గంటకు 130 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతోనే రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ చెబుతోంది.
సాధారణ రైళ్లల్లో బెంగళూరు నుంచి ముంబయికి ప్రయాణ సమయం 22 నుంచి 23 గంటలు పడుతుండగా, వందే భారత్ స్లీపర్‌లో మాత్రం 11 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చని రైల్వే శాఖ చెప్పింది.

వందేభారత్‌లో పై బెర్తులకు వెళ్లేందుకు వీలుగా నిచ్చెన తరహా వ్యవస్థ ఏర్పాటు చేశారు.
లోయర్, మిడిల్, అప్పర్ బెర్తుల వద్ద ప్రత్యేకంగా ప్రతి ప్రయాణికుడికి విడివిడిగా లైట్లు ఉన్నాయి.
మిడిల్, అప్పర్ బెర్తుల వద్ద మొబైల్ ఛార్జింగ్ కోసం ప్రత్యేకంగా యూఎస్బీ, సి కేబుల్ ఛార్జింగ్ పాయింట్లున్నాయి.
ప్రతి బోగీలో రెండువైపులా డిస్‌ప్లే స్క్రీన్స్ ఉన్నాయి.
ఇందులో రైలు ఏ స్టేషనుకు సమీపంలో ఉంది.. ఎంత దూరంలో ఉంది.. ఏ స్టేషన్‌లో ఆగింది.. తర్వాత వచ్చే స్టేషన్ ఏంటీ.. ఇలాంటి వివరాలు కనిపిస్తాయని రైల్వే శాఖ చెబుతోంది.
టాయిలెట్స్ దగ్గర కూడా డిస్ ప్లే వ్యవస్థ ఏర్పాటు చేశారు. టాయిలెట్‌ను ఎవరైనా ఉపయోగిస్తుంటే రెడ్ సిగ్నల్ వస్తుంది.


రైలుకు పూర్తిగా ఆటోమేటిక్ డోర్లు ఉన్నాయి. రైలు ప్లాట్‌ఫాం మీదకు వచ్చి ఆగినప్పుడు మాత్రమే డోర్లు తెరుచుకుంటాయి.
ఫ్లాట్‌ఫామ్ నుంచి బయల్దేరే ముందు ఆటోమేటిక్‌గా మూసుకుంటాయి.
బోగీలోకి ప్రవేశించేందుకు సెన్సర్ ఆధారిత ఆటోమేటిక్ డోర్లు ఉన్నాయి.
ప్రయాణికులు తమ చేతిని సెన్సర్ బటన్ వద్ద ఉంచితే డోరు తెరుచుకుంటుంది.
భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినట్లుగా రైల్వే శాఖ చెబుతోంది.
ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఒక బోగి నుంచి మరో బోగీకి మంటలు వ్యాపించకుండా ఆటోమేటిక్ డోర్ లాకింగ్ వ్యవస్థ ఉంది.
డోర్ వద్ద పైన ఉండే స్మోక్ డిటెక్టర్ సెన్సర్ పొగను గుర్తించి ఆటోమేటిక్‌గా డోర్ లాక్ చేస్తుంది. దీనివల్ల మంటలు ఒక బోగి నుంచి మరో బోగికి వ్యాపించవని అధికారులు చెబుతున్నారు. ప్రతి బోగీలోనూ సీసీ కెమెరాలున్నాయి.

ఫస్ట్ క్లాస్ ఏసీలో అత్యాధునిక సౌకర్యాలున్నట్లుగా రైల్వే శాఖ చెబుతోంది. అప్పర్ బెర్తుకు చేరుకునేందుకు వీలుగా ఒకవైపు మెట్ల మార్గం ఏర్పాటు చేశారు.
లోపల ఉన్న ప్రయాణికులు లాక్ చేసుకునేందుకు వీలుగా లాకింగ్ వ్యవస్థ ఇచ్చారు.
డోర్‌కు కిటికీ ఉంటుంది. దీని పక్కనే ఉన్న బటన్ నొక్కితే లోపల ఉన్న ప్రయాణికులకు బయట ఉన్న వారు కనిపించేలా వ్యవస్థ ఉంది.
తర్వాత ఆటోమేటిక్‌గా కనిపించకుండా అవుతుంది. అటెండర్‌ను పిలిచేందుకుగాను బెల్ బటన్ ఉంటుంది. అది నొక్కితే ఏ క్యాబిన్ నుంచి బటన్ నొక్కారో తెలిసిపోతుంది.

దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. వారు ప్లాట్ ఫారం నుంచి రైలులోకి ఎక్కేందుకు వీలుగా ఒక బోగికి తాత్కాలిక (రిమూవబుల్) ర్యాంపులుంటాయి.
దివ్యాంగులకు ప్రత్యేకంగా బెర్తులు కేటాయించారు.వారి కోసం టాయిలెట్ వద్ద కూడా లోనికి చక్రాల కుర్చీలో వెళ్లేందుకు వీలుగా చిన్నపాటి ర్యాంపు తరహా వ్యవస్థ ఉంటుంది.
ఏదైనా అత్యవసరమైతే నేరుగా లోకో పైలెట్‌తో మాట్లాడే వ్యవస్థ కూడా వందే భారత్ స్లీపర్ రైలులో ఉంది.
దివ్యాంగులకు కేటాయించిన ప్రాంతంలో ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ (ఈటీబీయూ) ఉంది.
అత్యవసర సమయాల్లో ఇక్కడ ఉండే మైకు ద్వారా నేరుగా తమ సందేశాన్ని ప్రయాణికులు లోక్ పైలెట్‌కు చెప్పవచ్చు.
లోకో పైలెట్ చెప్పే సందేశాలు కూడా వినేందుకు వీలుగా స్పీకర్ ఉంటుంది.
ఫస్ క్లాస్ ఏసీలో టాయిలెట్ల విషయంలో కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది రైల్వే శాఖ.
ఇందులో వేడినీటితో స్నానం చేసేందుకు ఏర్పాట్లున్నాయి.
సాధారణ రైళ్లలో టాయిలెట్లు ఎదురెదురుగా ఉంటాయి. వందే భారత్ స్లీపర్‌లో మాత్రం పక్కపక్కన ఉంచారు.
బోగీకి ఒకవైపు రెండు వెస్ట్రన్ టాయిలెట్స్, మరోవైపు ఇండియన్, వెస్ట్రన్ టాయిలెట్లు ఉన్నాయి.
ప్రయాణికులకు ఆహారం సరఫరా చేసేందుకుగాను ప్రతి రెండు బోగీలకు ఒకచోట 'మినీ ప్యాంట్రీ' ఉంటుంది.
ఇందులో ఆహార పదార్థాలు వేడి చేసేందుకు ఓవెన్లు, చల్లటి పానీయాలు అందించేందుకు ఫ్రిజ్‌లు ఉంటాయి.
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సరఫరా చేసేందుకు వేడి, సాధారణ, చల్లటి నీళ్లు అందుబాటులో ఉంటాయి.
విమానాల్లో తరహాలో ప్రయాణికులకు ఆహారం సరఫరా చేసేందుకు ట్రాలీలు అందుబాటులో ఉన్నాయి.

రెగ్యులర్ రైళ్లలో స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. కానీ, వందే భారత్ స్లీపర్ రైల్ కోచ్‌లు పూర్తిగా ఏసీ బోగీలు.
మొత్తం 16 కోచ్ (బోగీ)లు ఉండగా, అందులోత్రీటైర్ ఏసీ 11 , 2టైర్ ఏసీ, నాలుగు ఫస్ట్ క్లాస్ ఏసీ బోగి 1 ఉంటుంది.
823 మంది ప్రయాణించేందుకు వీలుంటుంది. ప్రయాణ సమయం తగ్గినా, ఛార్జీలు మాత్రం రెగ్యులర్ రైళ్లతో పోల్చితే ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























