కొత్త ఫోన్ కోసం పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

మొబైల్ ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ డ్యూయోతో పాటు ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఐఫోన్ 18 ప్రో ఈ నెల 18 నుంచి భారత్‌లో అందుబాటులోకి వస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధరే రూ.1,64,900 వరకు ఉంది.

ఇంత ధర భరించలేమనుకునే కొనుగోలుదారుల కోసంయాపిల్ ట్రేడ్ ఇన్ ప్రోగ్రామ్ అందిస్తోంది. అంటేదీని ద్వారా వినియోగదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుని, కొత్త ఐఫోన్‌ కొనుగోలుపై తగ్గింపు ధరను లేదా ఇన్‌స్టంట్ క్రెడిట్‌ పొందొచ్చు.

ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఆన్‌లైన్‌ లేదా యాపిల్ స్టోర్ నుంచైనా పొందవచ్చని పేర్కొంది.

యాపిల్ డివైజ్‌లతో పాటు శాంసంగ్, గూగుల్, వన్ ప్లస్ వంటి థర్డ్ పార్టీ డివైజ్‌లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇలా యాపిల్ ఒక్కటే కాదు, పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ తీసుకోమని ఆఫర్ చేసే కంపెనీలు చాలానే కనిపిస్తుంటాయి. దీనివల్ల వినియోగదారునికి ఎంతో కొంత తగ్గింపు లభిస్తుంది.

కానీ పాత ఫోన్ తిరిగి ఇచ్చేటప్పుడు వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మీ పాత మొబైల్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడానికి ముందు.. మీ డేటా సెక్యూరిటీ, ప్రైవసీని పరిగణనలోకి తీసుకోవాలి. మొబైల్ ఫోన్‌లో మన వ్యక్తిగత సమాచారం ఉంటుంది. మన బ్యాంకు ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు, బ్రౌజింగ్ హిస్టరీ, కుకీలు, మన ఇంటర్‌నెట్ వినియోగ సమాచారం నిక్షిప్తమై ఉంటుంది.

ఇలాంటి సున్నితమైన గోప్యతా సమాచారం ఎవరైనా ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లోకి వెళితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందుకే.. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు మీ డేటా అంతా డిలీట్ చేసి, ఫోన్‌ను ఫార్మాట్ చేసి ఇవ్వాలని స్టెల్లార్ఇన్ఫో.కో.ఇన్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది.

అయితే, డిలీట్ చేసి, ఫార్మాట్ చేసిన ఫోన్ నుంచి డేటాను ఏమాత్రం రికవరీ చేయకుండా ఉండాలన్నా, డేటాను పూర్తిగా శాశ్వతంగా డిలీట్ చేయాలన్నా డేటా ఎరేజర్ సాఫ్ట్‌వేర్‌ వాడాలని తెలిపింది.

దీనివల్ల ఎలాంటి డేటా రికవరీ టూల్స్ ద్వారా అయినా ఈ డేటాను ఎప్పటికీ రికవరీ చేయలేరని పేర్కొంది.

మొబైల్ స్టోర్

ఫొటో సోర్స్, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images

ఏం చేయాలి?

పాత, ఉపయోగించిన మొబైల్ ఫోన్లను భారత్‌లో ఆన్‌లైన్‌లో విక్రయించే క్యాషిఫై సంస్థ తన వెబ్‌సైట్‌లో పాత మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునేటప్పుడు యూజర్లు ఏం చేయాలో పేర్కొంది.

పాత ఫోన్‌‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఇచ్చే ముందైనా, ఇతరులకు అమ్మేటప్పుడైనా మొబైల్‌లోని సమాచారాన్నంతా బ్యాకప్ చేసుకోవడం మంచిది. బ్యాకప్ వల్ల మొబైల్‌పై వైరస్ దాడులు, పవర్ ఫెయిల్యూర్, ఇతర ఏదైన మానవ తప్పిదాల నుంచి మీ డేటాకు రక్షణ లభిస్తుంది. మీ కాంటాక్టులను, మెసేజ్‌లను, కాల్ రికార్డులను, ఫోటోలను, వీడియోలను,మీడియాను బ్యాకప్ తీసుకోవాలి.

బ్యాకప్ కోసం మీరు మరొక డివైజ్‌ను లేదా ఎక్స్‌టర్నల్ హార్డ్‌డ్రైవ్‌ను ఉపయోగించి మాన్యువల్‌గా బ్యాకప్ తీసుకోవచ్చు. లేదా గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ డ్రైవ్ వంటి క్లౌడ్ స్టోరేజ్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

ఫ్యాక్టరీ రీసెట్‌కు ముందు..

ఫోన్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చేముందు చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఫ్యాక్టరీ రీసెట్. ఇలా రీసెట్ చేయడానికి ముందు మొబైల్‌లో మీరు లాగిన్ అయిన అన్ని అకౌంట్ల నుంచి విజయవంతంగా లాగౌట్ అయినట్లు నిర్ధరించుకోవాలి. అలాగే, మీరు మీ పాస్‌వర్డ్‌లను ఎక్కడైనా భద్రపరిచి ఉంటే, వాటిని కూడా తొలగించాలి.

మీ ఫోన్‌ను తిరిగి అమ్మేముందు, లేదా పారవేసే ముందు, పాస్‌వర్డ్‌లకు సంబంధించిన సమాచారం, వ్యక్తిగత వివరాల ఆనవాళ్లు ఏవీ లేకుండా పూర్తిగా తొలగించాలి.

సిమ్ కార్డు, మైక్రో-ఎస్డీ కార్డు తొలగించాలి

మీ మొబైల్ ఫోన్‌ను విక్రయించే ముందు.. సిమ్ కార్డు, ఎస్‌డీ కార్డును తొలగించాలి. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే, ఎస్‌డీ కార్డులో మీకు సంబంధించిన చాలా సమాచారం నిక్షిప్తమై ఉంటుంది.

సిమ్ కార్డులో మీ వ్యక్తిగత సమాచారం ఉంటుంది. అందుకే ఫోన్ నుంచి తొలగించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఆ సిమ్ కార్డును మీరు భవిష్యత్‌లో వాడకూడదనుకుంటే, దాన్ని పూర్తిగా విరగ్గొట్టి ధ్వంసం చేస్తే మంచిది.

మొబైల్ ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

ఎన్‌క్రిప్ట్ చేసుకోవాలి

చాలామంది యూజర్లకు ఈ ఫీచర్ గురించి చాలా తక్కువగా తెలుసు. ప్రాథమికంగా, ఎన్‌క్రిప్షన్స్ మీ డేటాకు అదనపు భద్రతను అందిస్తాయి.

ఈ ఎన్‌క్రిప్షన్ మీ ఫోన్ డేటాను చదవలేని ఫార్మాట్‌లోకి మార్చేస్తుంది. ఒక యునిక్ కీను ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఆ డేటాను చూడలగరు. ఇది యూజర్లకు ఏదైనా ఆర్థిక లావాదేవీల మోసాల బారిన పడకుండా అడ్డుకుంటుంది.

అలాగే, అనధికారిక వ్యక్తులు మీ డేటాను పొందకుండా చూస్తుంది. కొన్ని డివైజ్‌లు ఈ ఫీచర్‌తో వస్తుండగా.. మరికొన్ని డివైజ్‌లు ఈ ఆప్షన్ వాడుకునే అవకాశం కల్పిస్తున్నాయి.

ఫ్యాక్టరీ రీసెట్

ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత.. మీ ఫోన్‌లోని డేటా అంతా ఎరేజ్ చేయాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఆ డివైజ్‌లో మీరు చేసిన ప్రతి విషయాన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం చాలా సులభం, వేగవంతమైన ప్రక్రియ కూడా. ఫోన్ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్ ఉంటుంది.

  • మీ డివైజ్‌లోని సెట్టింగ్స్ ఫీచర్‌కు వెళ్లాలి.
  • ఆ తర్వాత అడిషినల్ సెట్టింగ్స్‌లోని బ్యాకప్ లేదా రీసెట్ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • దానిలోని ఎరేజ్ ఆల్ డేటా, రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అనే దానిపై క్లిక్ చేయాలి.
యూజ్డ్ మొబైల్స్ విక్రయం

ఫొటో సోర్స్, Getty Images

డేటా డిలీట్ చేయకపోతే..

పాత ఫోన్లలో సిమ్ కార్డు తీయకపోయినా, డేటాను డిలీట్ చేసి, ఫోన్‌ను ఫార్మాట్ చేయకపోయినా మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.

మీ ఫోటోలు, వీడియోలు, ఫోన్‌లోని నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇతరుల చేతికి చిక్కుతాయి. దాంతో సైబర్ నేరగాళ్లు పలు మోసాలకు, బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంటుంది. ప్రతి ఫోన్‌కు ఒక ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. ఏదైనా సైబర్ మోసాలు జరిగినప్పుడు పోలీసులు దాని ప్రకారమే విచారణ చేపడతారు. అప్పుడు మీరు ఇరుకున పడే అవకాశం ఉంటుంది.

అందుకే పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత సిమ్ కార్డును కొత్త ఫోన్‌తో లింక్ చేసుకోవాలని టెక్ నిపుణులు నల్లమోతు శ్రీధర్ చెప్పారు. అప్పుడు పాత ఐఎంఈఐ నెంబర్‌తో మన సిమ్ కార్డు లింక్ అవ్వదని, నేరం జరిగిన సమయాన్ని బట్టి పోలీసులు దర్యాప్తు జరుపుతారని తెలిపారు.

ఒకవేళ పాత ఐఎంఈఐ నెంబర్‌తో మీ నెంబర్ లింక్ అయి ఉందో లేదో కూడా ట్రాయ్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని చెప్పారు.

మొబైల్ ఫోన్ బ్యాకప్

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ చేసుకున్న తర్వాత.. మెమరీని పూర్తిగా ఖాళీ (జీరో ఫిల్లింగ్) చేయాలని శ్రీధర్ చెప్పారు. ఇలా చేయడం వల్ల ఆ మెమరీని ఎవరూ రికవరీ చేయలేరని ఆయన తెలిపారు.

డేటా రికవరీ సాఫ్ట్‌వేర్లు ద్వారా కొంతమంది పాత ఫోన్ల నుంచి డేటాను తీస్తుంటారని..కానీ జీరో ఫిల్లింగ్ చేస్తే అలా చేయడానికి వీలుపడదని తెలిపారు.

దాంతో పాటు డేటా ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ కూడా వాడుకుంటే మంచిదని సూచించారు.

కొన్ని మొబైల్ ఫోన్లలో సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని, మరికొన్ని మొబైల్ ఫోన్లలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఫోన్ మోడల్ బట్టి ఈ డేటా ఎన్‌క్రిప్షన్‌ను కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయని తెలిపారు. ఇలా చేసుకున్నప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ తర్వాత డిలీట్ చేసిన డేటా అంతా జంక్ డేటాగా మారుతుందని చెప్పారు.

అయితే, పాత మొబైల్ ఫోన్ ఎవరి దగ్గర ఎక్స్ఛేంజ్ చేస్తున్నామనే విషయంలో ఎలాంటి గ్యారెంటీ ఉండదని, ట్రస్టెడ్ సోర్సుల దగ్గర చేసినప్పుడు పాత మొబైల్ ఫోన్‌కు కాస్త తక్కువ వాల్యూ రావొచ్చని, చిన్న ప్లేయర్ల దగ్గర చేసినప్పుడు కాస్త ఎక్కువ వాల్యూ రావొచ్చని చెప్పారు. నమ్మకమైన సోర్సుల దగ్గరే ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలని సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)