చైనా, పాకిస్తాన్ మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం ఏమిటి, భారత్ ఆగ్రహానికి కారణమేంటి?

ఫొటో సోర్స్, Future Publishing via Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
హిమాలయాల్లోని వివాదాస్పద ప్రాంతంలో పాకిస్తాన్ - చైనా మధ్య ఉన్న సరిహద్దును గుర్తించడానికి భారత్ ఎప్పటి నుంచో నిరాకరిస్తోంది. ఆ ప్రాంతాన్ని ఇండియా తన భూభాగంగా పేర్కొంటోంది.
గత వారం, ఈ పర్వత ప్రాంతంలోని మారుమూల భాగంలో పాకిస్తాన్, చైనా తమ మధ్య సరిహద్దును అధికారికంగా ఖరారు చేసుకున్నాయి. దీనిపై దిల్లీ తీవ్రంగా స్పందించింది.
ఈ ఇరుదేశాలు పాకిస్తాన్ - చైనా బౌండరీ జాయింట్ కమిషన్‌పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాన్ని ‘‘కీలక మైలురాయి’’గా పాకిస్తాన్ అభివర్ణించింది. ఈ ఒప్పందం భారత్ ప్రాంతీయ ప్రత్యర్థులైన పాకిస్తాన్ -చైనా మధ్య సరిహద్దు నిర్వహణ, వాణిజ్యం, రాకపోకలపై సహకారాన్ని మరింత విస్తృత పరుస్తుంది.
దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ చర్యకు ఎలాంటి చట్టబద్ధత లేదని కొట్టిపారేస్తూ, తమదిగా పేర్కొంటున్న ప్రాంతంలో పాకిస్తాన్-చైనా సరిహద్దును గుర్తించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
ఈ ప్రకటన అత్యంత సున్నితమైన సమయంలో వెలువడింది.


ఫొటో సోర్స్, Corbis via Getty Images
హిమాలయ సరిహద్దుల్లోని వివాదాస్పద వాస్తవాధీన రేఖ వెంబడి ఏళ్ల తరబడి నెలకొన్న సైనిక ఉద్రిక్తతలను తగ్గించి సంబంధాలను స్థిరపరుచుకోవడానికి భారత్, చైనా ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో భారత్ తనదిగా పేర్కొంటున్న ప్రాంతంలో బీజింగ్, ఇస్లామాబాద్ తమ సహకారాన్ని మరింత విస్తరిస్తున్నాయి.
"పాకిస్తాన్, చైనా మధ్య అసలు సరిహద్దే లేదు. ఎలాంటి చట్టబద్ధత లేని ఈ సో-కాల్డ్ జాయింట్ కమిషన్‌ను మేం పూర్తిగా తిరస్కరిస్తున్నాం" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
ఈ కమిషన్ పరిధిలోకి పాకిస్తాన్-చైనా సరిహద్దుతో పాటు 5180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న షక్స్‌గామ్ వ్యాలీ కూడా వస్తోంది. 1963లో పాకిస్తాన్ దీనిని చైనాకు వదులుకుంది. అయితే భారత్ దీనిని లద్దాఖ్‌లోని తమ భూభాగంగా చెబుతోంది.
ఈ ప్రాంతం గతంలో జమ్మూ కశ్మీర్ సంస్థానంలో భాగమని, పాకిస్తాన్ దీనిని ఆక్రమించుకున్న తరువాత చైనాకు అప్పగించిందని భారత్ వాదిస్తోంది. భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని ఎన్నడూ అంగీకరించలేదు. ఇది చట్ట విరుద్ధమని,చెల్లదని చెబుతోంది.
ఈ చరిత్రే బుధవారం నాటి తాజా ప్రకటన ఎందుకు సున్నితమైనదో వివరిస్తోంది.
‘‘భారత్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎలాంటి ఒప్పందాలు చేసుకునే హక్కు పాకిస్తాన్‌కు లేదు’’అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మరోవైపు, జమ్మూ కశ్మీర్ ఇప్పటికీ వివాదాస్పద భూభాగమేనని పాకిస్తాన్ అంటోంది. అందువల్ల చైనాతో 1963లో చేసుకున్న సరిహద్దు ఒప్పందాన్ని ప్రశ్నించే హక్కు భారత్‌కు లేదని ఆ ఒప్పందం చట్టబద్ధమైనదేనని వాదిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
పాత ఒప్పందానికి పునరుజ్జీవం
ఈ తాజా పరిణామం పూర్తిగా కొత్త ఏర్పాటేమీ కాదని, గతంలో ఉన్న ఒక వ్యవస్థను తిరిగి అమల్లోకి తీసుకురావడమేనని దిల్లీలోని శివ్ నాడార్ యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాలు, గవర్నెన్స్ స్టడీస్ విభాగం ప్రొఫెసర్ జబీన్ టీ జాకబ్ చెప్పారు.
"1963లో చైనా–పాకిస్థాన్ మధ్య కుదిరిన ఒప్పందంలోనే సంయుక్త సరిహద్దు కమిషన్ ఏర్పాటు గురించి ఉంది. ఇప్పుడు దాని కార్యాచరణకు ఎంచుకున్న సమయమే అసలైన అంశం" అని ఆయన BBCతో చెప్పారు.
పాకిస్తాన్ ఇతర సరిహద్దుల్లో ఘర్షణలు అస్థిరత నెలకొన్న తరుణంలో చైనా తన సరిహద్దులను గుర్తించే విస్తృత ప్రయత్నంలో భాగంగా సరిహద్దు వెంబడి రాకపోకలు పరస్పర మార్పిడిని వ్యవస్థీకృతం చేయాలనే ఉద్దేశంతో ఈ సమయంలో దీనిని తెచ్చి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ పరిణామం పట్ల భారత్ "ఆందోళన" సహజమని జాకబ్ అన్నారు. కానీ, పాకిస్తాన్, చైనా తీసుకున్న తాజా చర్య 1963 నాటి ఒప్పందంలోని ఒక నిబంధనను పట్టించుకోనట్టుగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
కశ్మీర్ వివాదం పరిష్కారమై ఆ భూభాగం చివరికి ఏ దేశం ఆధీనంలోకి వస్తుందో ఆ దేశంతో 1963 నాటి ఒప్పందాన్ని తిరిగి చర్చించుకోవాలని, ఆ ఒప్పందంలోని ఆర్టికల్ 6 చెబుతోందని జాకబ్ వివరించారు.
భారత్‌కు మరో సమస్య అంతర్జాతీయ సమాచార, మీడియా రంగంలో ఉందని జాకబ్ అన్నారు.
‘‘అంతర్జాతీయ మీడియా, సమాచార రంగంలో భారత్‌తో పోలిస్తే చైనాకు ఎక్కువ ఆధిపత్యం ఉంది.
"సీజీటీఎన్, సీఆర్ఐ, సోషల్ మీడియా ద్వారా చైనా తన వాదనలను, తన మ్యాప్‌లను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయగలుగుతోంది. మరోవైపు భారత్ కేవలం నిరసనలకే పరిమితమవుతోంది. వీటిని ఇతర ప్రపంచ దేశాలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
రాజకీయంగా వ్యూహాత్మకం
అయితే ఈ ఆందోళన కేవలం సరిహద్దు నిర్వహణ కంటే భిన్నమైనది. చైనా-పాకిస్తాన్‌లకు ఇప్పటికే ఈ ప్రాంతంలో విస్తృత మౌలిక సదుపాయాలు, అనుసంధాన వ్యవస్థలు ఉన్నాయి. వీటిలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, కారకోరమ్ హైవే కూడా ఉన్నాయి.
ఈ కొత్త కమిషన్ ఆచరణీయంగానూ, రాజకీయ వ్యూహంగానూ ఉందని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ అన్నారు.
"ఇది రెండింటి కలయిక" అని హక్కానీ బీబీసీతో చెప్పారు.
"ఇది సరిహద్దు సహకారాన్ని పెంచడానికి అక్రమ చొరబాట్లను నిరోధించడానికి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌కి సంబంధించిన వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను రక్షించడానికి ఉద్దేశించిన యంత్రాంగం" అని హక్కాని అన్నారు.
బీజింగ్ ఇప్పటికీ కశ్మీర్‌ను పాకిస్తాన్ కోణం నుంచే చూస్తోందని భారత్‌కు సంకేతం ఇవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
"కశ్మీర్‌పై భారతదేశ వైఖరిని చైనా ఏనాడూ అంగీకరించలేదు. చైనా గిల్గిత్-బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్ కోణం నుంచే చూస్తుంది తప్ప, భారత కోణం నుంచి కాదు" అని హక్కానీ పేర్కొన్నారు. భారత్ తన భూభాగంగా పేర్కొంటున్న పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్‌లోని చైనా సరిహద్దు ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లోని కశ్మీర్‌లో జరిగిన పరిణామాలకు అనుగుణంగానే ఇస్లామాబాద్ వైఖరి కూడా మారిందని హక్కానీ అన్నారు.
"జమ్మూ కశ్మీర్ తుది స్థితి ఇంకా తేలాల్సి ఉందని పాకిస్తాన్ ఇప్పటికీ వాదిస్తోంది" అని ఆయన చెప్పారు.
"కానీ భారత్ తన వైపు ఉన్న కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వంటి అంతర్గత మార్పులు చేసినందున, 1963 నుండి చైనాతో ఉన్న వాస్తవ పరిస్థితిని అధికారికంగా వ్యవస్థీకృతం చేయడంలో ఎలాంటి సమస్య లేదని పాకిస్తాన్ భావిస్తోంది" అని హక్కానీ అభిప్రాయపడ్డారు.
బీజింగ్ విషయానికొస్తే పొరుగు దేశాలతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకుని భారత్‌పై తన వైఖరిని స్పష్టం చేయడమనే విస్తృత వ్యూహంలో ఈ ఏర్పాటు కూడా భాగమని చెప్పొచ్చు.
కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు భరోసా ఇవ్వడం బీజింగ్‌కు వ్యూహాత్మక, భౌగోళిక రాజకీయ పరంగా ఎంతో విలువైనదని హక్కానీ అన్నారు.
"వ్యూహాత్మక రంగానికి వస్తే ఇది పాకిస్తాన్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. భౌగోళిక-వ్యూహాత్మక రంగానికి వస్తే చైనా, పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే రెండు వైపుల ముప్పు గురించిన భయాన్ని భారత్‌లో ఇది మరింత పెంచుతుంది. ఇది పాకిస్తాన్‌కు సంతృప్తిని ఇచ్చి, చైనాకు ప్రయోజనం చేకూరుస్తుంది" అని హక్కానీ చెప్పారు.

ఫొటో సోర్స్, Anadolu Agency/Getty Images
బ్రిక్స్ నుంచి వెళ్లగానే ఎందుకు?
ఈ ప్రకటన వెలువడిన సమయం కూడా చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు.
"చైనా తన నిర్ణయాలను ఎప్పుడూ నెలలు లేదా సంవత్సరాల ముందే ప్లాన్ చేసుకుంటుంది. కాబట్టి ఉమ్మడి సరిహద్దు కమిషన్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం కొంతకాలం క్రితమే జరిగి ఉండాలి" అని హక్కానీ చెప్పారు.
"ఇటీవల అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బ్రిక్స్ సదస్సు పర్యటన ముగిసిన తర్వాత ఈ సమాచారాన్నివెల్లడించడం ద్వారా తమ వ్యూహాత్మక భాగస్వామ్యంపై పాకిస్తాన్‌కు భరోసా ఇవ్వడంతోపాటు, బహుపాక్షిక సంబంధాలు కొనసాగించినంత మాత్రాన దక్షిణాసియాపై చైనా వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని భారత్‌కు గుర్తుచేయడమే దీని ఉద్దేశం" అని ఆయన అన్నారు
అయితే ఈ పరిణామంలో ప్రతి అంశాన్ని భారత్‌పై నేరుగా జరుగుతున్న సైనిక చర్యగా భావించవద్దని జాకబ్ హెచ్చరించారు.
"దీని వల్ల ప్రస్తుతానికి ఎల్ఏసీపై తక్షణ లేదా స్పష్టమైన ప్రభావాలేవీ కనిపించడం లేదు" అని ఆయన అన్నారు.
దీనిని బట్టి చూస్తే గత వారం నాటి ప్రకటన వివాదాస్పద హిమాలయ సరిహద్దుల్లో తక్షణ మార్పు తీసుకురావడం కంటే, భారత్ నిరంతరం తిరస్కరిస్తున్న అంశాలను క్రమంగా వ్యవస్థీకృతం చేయడంలోనే దాగి ఉందని అర్థమవుతోంది.
ఢిల్లీ దృష్టిలో ఇది పాకిస్తాన్ ఆక్రమించుకున్న భారత భూభాగానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నమని, అలాంటి ప్రయత్నాన్ని అంగీకరించబోమని భారత వైఖరి "స్పష్టంగా, స్థిరంగా" ఉందని జైస్వాల్ అన్నారు. దీనివల్ల భారత సార్వభౌమత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ వివాదం సరిహద్దుల చట్టపరమైన అంశాలను మించి ఉందని హక్కానీ అభిప్రాయపడ్డారు.
"భారత్, చైనా మధ్య సరిహద్దు, సరిహద్దు రేఖల వివాదం భౌగోళికంగా వ్యూహాత్మకమైనదే తప్ప, మ్యాప్‌లకు సంబంధించినది కాదు. కాబట్టి సరిహద్దు చర్చలు సరిహద్దు నిర్వహణ వ్యవస్థలు ఎంతవరకు ఫలితాలు సాధించగలవనేదానికి కూడా ఒక పరిమితి ఉంటుంది" అని ఆయన అన్నారు.
భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఇప్పటికీ "చైనాకు ఉపయోగపడే మరో శక్తిగా" కొనసాగుతోంది. ఇస్లామాబాద్‌తో బీజింగ్ జరిపే చర్చలు దిల్లీకి నిరంతరం ఆ సందేశాన్ని పంపుతూనే ఉంటాయని హక్కానీ అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























