అనంత్ సింగ్: తన కుమార్తె పెళ్లికి 4 లక్షలమంది హాజరవుతారని ప్రకటించిన ఎమ్మెల్యేకు ఎంత ఆస్తి ఉంది?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, సీటూ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
బిహార్‌లోని మోకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగికి ఈ నెల 25న వివాహం జరగనుంది. అనంత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన నద్వాన్ (బాఢ్)లో ఈ వేడుక జరగనుంది.
నద్వాన్ గ్రామం పట్నా నుంచి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వివాహానికి దాదాపు 4 లక్షల మంది అతిథులుగా హాజరవుతారని అనంత్ సింగ్ స్వయంగా ప్రకటించారు.
ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
"నాలుగు లక్షలు అనేది ప్రారంభ సంఖ్య మాత్రమే. అంతకంటే ఎక్కువ మంది వచ్చినా వారికి కూడా భోజన ఏర్పాట్లు చేస్తాం. ఈ పెళ్లికి భారత్, పాకిస్తాన్‌లోని చాలామందికి ఆహ్వానాలు పంపించాం" అని చెప్పారు.
ఈ పెళ్లిలో గుర్రపు పందాలను కూడా నిర్వహించనున్నారు. ఈ పోటీలో గెలిచిన వారికి థార్ వాహనాన్ని బహుమతిగా అందిస్తారు. గుర్రపు పందేల గురించి అనంత్ సింగ్ భార్య నీలం దేవి సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ తర్వాత అనంత్ సింగ్ ధృవీకరించారు.

అనంత్ సింగ్ తన అల్లుడు రిషికేశ్కు విలాసవంతమైన కారును బహుమతిగా ఇవ్వనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ విషయం తనకు తెలియదని రిషికేశ్ తండ్రి రణ్ విజయ్ కుమార్ మీడియాతో చెప్పారు.
రిషికేశ్ పట్నాలోని బిహటా ప్రాంతం కృష్ణానగర్‌కు చెందినవారు. ఆయన అమెరికాలో ఎంబీఏ చదివారని కుటుంబ సభ్యులు తెలిపారు.
చమత్కారమైన మాటలతో ప్రసిద్ధి చెందిన అనంత్ సింగ్‌ను పెళ్లికి వచ్చే అతిథుల జాబితా గురించి జర్నలిస్టులు పదేపదే అడుగుతున్నారు.

ఫొటో సోర్స్, Ranjan kumar
పెళ్లికి అందరూ రండి
"ఇక్కడ సినిమా థియేటర్లో లాగా మీరు టిక్కెట్లు కొనాల్సిన అవసరం లేదు. మీరందరూ పెళ్లికి రండి" అని అనంతసింగ్ జర్నలిస్టులతో చెప్పారు.
పెళ్లికి ఎంత ఖర్చవుతుందని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా...
"అన్ని ఏర్పాట్లూ నా స్నేహితులు, అభిమానులే చేస్తారు. మేం స్వయంగా ఏమీ చేయడం లేదు. ఎవరో ఒకరు షామియానా ఖర్చులు భరిస్తే, ఇంకెవరో మిగతా ఖర్చులు చూసుకుంటారు. నాకు దేశవ్యాప్తంగా స్నేహితులు ఉన్నారు" అని అనంతసింగ్ బదులిచ్చారు.
పెళ్లి ఖర్చుల గురించిన ప్రశ్నలకు సమాధానాలను అనంత్ సింగ్ దాటవేశారు. అయితే ఈ పెళ్లి కోసం జరుగుతున్న భారీ ఏర్పాట్లు చూస్తుంటే అనంత్ సింగ్ మొత్తం ఆస్తి ఎంత అనే ఆసక్తి పెరుగుతోంది.
ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం అనంత్ సింగ్, ఆయన భార్య నీలం దేవికి మొత్తం 100 కోట్లరూపాయల విలువైన స్థిర,చరాస్తులున్నాయి.

కుమార్తెకు మాత్రం బ్యాంకు ఖాతా లేదు
65 ఏళ్ల అనంత్ సింగ్ 2005 నుంచి మోకామా నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు. ఆయన భార్య నీలం దేవి ఈ స్థానం నుంచి కొద్ది కాలం ఎమ్మెల్యేగా ఉన్నారు.
2025 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, అనంత్ సింగ్‌కు 26 కోట్లరూపాయల విలువైన చరాస్తులు ఉండగా, ఆయన భార్యకు 13 కోట్లరూపాయల విలువైన చరాస్తులు ఉన్నాయి.
నగదు విషయానికొస్తే అనంత్ సింగ్ దగ్గర 15లక్షల రూపాయలు, ఆయన భార్య నీలం దేవి దగ్గర 34లక్షలరూపాయలున్నాయి. అనంత్ సింగ్‌కు పట్నా, బాఢ్ ప్రాంతాల్లో ఐదు బ్యాంకు ఖాతాలు ఉండగా, ఆయన భార్య నీలం దేవికి 12 బ్యాంక్ అకౌంట్లున్నాయి.
అనంత్ సింగ్ తన అఫిడవిట్లో తన కుమార్తె శివాంగి సింగ్‌తో సహా నలుగురిని డిపెండెంట్లగా పేర్కొన్నారు.
అయితే శివాంగి సింగ్‌కు ఎలాంటి బ్యాంకు అకౌంట్ లేదు గానీ మిగిలిన ముగ్గురు డిపెండంట్లకు బ్యాంకు ఖాతాలున్నాయి.
అఫిడవిట్ ప్రకారం, అనంత్ సింగ్‌కు దర్ప్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీలో 34.375 శాతం వాటా ఉంది. వాటి విలువ సుమారుగా 10కోట్ల18 లక్షలు. ఆయన భార్య నీలం దేవికి రాజనందిని ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఎస్జీసీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వాటాలున్నాయి. వాటి కొనుగోలు విలువ 21లక్షల50వేలరూపాయలు.
జీవిత బీమా పథకాల్లో నీలం దేవి 37 లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు.
అనంత్ సింగ్ తన భార్య నీలం దేవికి 8కోట్ల37లక్షల రూపాయలు, ఇతర వ్యక్తులకు 3కోట్ల75లక్షలు అప్పుగా ఇచ్చారు. నీలం దేవి కూడా ఇతరులకు 10 కోట్లరూపాయలకు పైగా రుణం ఇచ్చారు. అంటే ఈ దంపతులు మొత్తం 22 కోట్లకు పైగా అప్పులు ఇచ్చారు.
అనంత్ సింగ్ దగ్గర 3 కోట్లకు పైగా విలువైన కార్లు ఉన్నాయి. ఇందులో 2024లో కొనుగోలు చేసిన 48 లక్షల రూపాయల టయోటా ఫార్చ్యూనర్ కూడా ఉంది.
అనంత్ సింగ్, నీలం దేవి ఇద్దరికీ కలిపి 4 కోట్లకు పైగా విలువైన వాహనాలున్నాయి.
అఫిడవిట్ ప్రకారం అనంత్ సింగ్ వద్ద 150 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ సుమారు 15 లక్షలు.
నీలం దేవి వద్ద దాదాపు 700 గ్రాముల బంగారం, ఆరు కిలోల వెండి ఉన్నాయి. వీటి విలువ 71 లక్షల రూపాయలకు పైగా ఉంది.
అనంత్ సింగ్ దగ్గర కోటీ 90లక్షల విలువైన గుర్రాలు, ఆవులు, ఏనుగు, గేదెలు కూడా ఉన్నాయి.
వీటితో పాటు మరికొన్ని ఆస్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో ఉంది.

ఫొటో సోర్స్, Seetu
సామాజిక సేవ, వ్యాపారం, వ్యవసాయం
ఈ అఫిడవిట్లో అనంత్ సింగ్ తన వృత్తిని సామాజిక సేవ, వ్యాపారం, వ్యవసాయం అని పేర్కొన్నారు. తన భార్య నీలం దేవి వృత్తి కూడా ఇదే అని తెలిపారు. ఇళ్ల అద్దెల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ఆదాయ వనరుగా ప్రస్తావించారు.
అనంత్ సింగ్‌కు 2 కోట్లరూపాయల అప్పులు, ఆయన భార్యకు 23 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. కారు కొనడానికి అనంతసింగ్ 2 కోట్ల రుణం తీసుకున్నారు. ఆయన భార్య కారు రుణంతో పాటు వ్యవసాయ రుణం కూడా తీసుకున్నారు.
అనంత్ సింగ్‌పై 28 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో హత్య, హత్య చేస్తానని బెదిరించడం, నేరస్తులకు ఆశ్రయం కల్పించడం, కిడ్నాప్ వంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి.
డిసెంబర్ 1వ తేదీలోగా లొంగిపోవాలని ఇటీవల సుప్రీంకోర్టు అనంత్ సింగ్‌ను ఆదేశించింది.
కుమార్తె శివాంగి సింగ్ వివాహం ఉన్న కారణంగా సుప్రీంకోర్టు ఆయనకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. దీనిపై అనంత్ సింగ్ స్పందిస్తూ, తనకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని, తాను లొంగిపోతానని చెప్పారు.
2025 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో దులార్‌చంద్ యాదవ్ హత్యకు గురైన కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
"అనంత్ సింగ్, నీలం దేవికి ఐదుగురు పిల్లలు. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఇప్పుడు పెళ్లి జరుగుతున్నది చిన్న కూతురికి. ఇంతకుముందు పెద్ద కుమార్తె వివాహం కూడా ఇదే స్థాయిలో ఘనంగా జరిగింది. ఆమెకు ఒక ప్రభుత్వ అధికారితో వివాహం జరిగింది. అయితే అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం ఇంతగా లేదు. అందుకే ఆ పెళ్లికి ఇప్పుడు జరుగుతున్నంత ప్రచారం రాలేదు" అని మోకామాకు చెందిన స్థానిక జర్నలిస్టు అనుభవ్ కుమార్ బీబీసీతో చెప్పారు.
తన చిన్న కుమార్తె పెళ్లి గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై అనంత్ సింగ్ కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు.
తాను కొత్తగా ఏమీ చేయడం లేదని పలుమార్లు జర్నలిస్టులతో చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























