‘నిఠారీ వరుస హత్యల కేసు’లో నిర్దోషిగా విడుదలైన సురీందర్ కోలీ అనుమానాస్పద మృతి

సురీందర్ కోలీ మృతి , నిఠారీ వరుస హత్యల కేసు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సురీందర్ కోలీ (ఫైల్ ఫోటో)
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

నిఠారీ వరుస హత్యల కేసులో 2025లో నిర్దోషిగా విడుదలైన సురీందర్ కోలీ.. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లోని భూపత్‌వాలా ప్రాంతంలో మృతిచెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

సురీందర్ కోలి గత కొన్ని నెలలుగా హరిద్వార్‌లో నివసిస్తున్నారు. ఆయన లాల్ మాతా ఆలయం ఎదుట ఒక చిన్న టీ దుకాణం నడుపుకొనేవారు. అదే దుకాణంలో ఆయన శవమై కనిపించారు. సురీందర్ కోలి అల్మోరాలోని భికియాసైన్ ప్రాంతానికి చెందినవారు. పోలీసులు ఆయన కుటుంబానికి ఈ ఘటన గురించి సమాచారం అందించారు.

వార్తాసంస్థ పీటీఐ ప్రకారం, పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

2006 నిఠారీ హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురీందర్ కోలీని.. చివరి కేసులోనూ నిర్దోషిగా పేర్కొంటూ గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు విడుదల చేసింది.

సురీందర్ కోలిని గత న్యాయస్థానాలు ఏ ఆధారాలతో దోషిగా నిర్ధరించి శిక్ష విధించాయో, అవి చట్టబద్ధంగా చెల్లవని, నమ్మశక్యం కానివని, పరస్పర విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ కేసులో మరో నిందితుడు మొనిందర్ సింగ్ పంధేర్‌ను న్యాయస్థానం ముందే నిర్దోషిగా విడుదల చేసింది.

నోయిడాలోని సెక్టార్-31లో ఉన్న నిఠారీ గ్రామంలో బాధిత పిల్లల కుటుంబాలు ఇప్పుడు నాలుగే మిగిలాయి. చాలా కుటుంబాలు గ్రామాన్ని వదిలిపెట్టడంతో పాటు న్యాయపోరాటం నుంచి కూడా తప్పుకున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హరిద్వార్ పోలీసులు ఏం చెప్పారు?

బీబీసీ అనుబంధ పాత్రికేయుడు ఆసిఫ్ అలీ తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తర హరిద్వార్‌లోని సప్తర్షి ప్రాంతంలో సురీందర్ కోలి మృతదేహం లభ్యమైంది.

"సప్తర్షి ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం దొరికింది. మృతుడి పేరు సురేంద్ర కోలి. ప్రాథమికంగా చూస్తే ఇది ఆత్మహత్యగా అనిపిస్తోంది. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తోంది. మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయిస్తాం" అని హరిద్వార్ సీఓ సిటీ శిశుపాల్ సింగ్ నేగి చెప్పారు.

పోలీసుల సమాచారం ప్రకారం, విడుదలైన తర్వాత సురేంద్ర కోలి హరిద్వార్‌లో ఒక చిన్న డబ్బా పెట్టుకుని టీకొట్టు నడుపుతున్నారు. ఈ ఘటన తర్వాత ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. అయితే సంఘటనా స్థలం నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు.

(ఆత్మహత్య అనేది తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు కూడా ఒత్తిడికి గురవుతుంటే భారత ప్రభుత్వ 'జీవన్ ఆస్థా' హెల్ప్‌లైన్ 18002333330కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. మీరు మీ స్నేహితులు, బంధువులతో కూడా మాట్లాడాలి.)

సురీందర్ కోలీ మృతి , నిఠారీ వరుస హత్యల కేసు

ఫొటో సోర్స్, Asif Ali

ఫొటో క్యాప్షన్, హరిద్వార్ సీఓ సిటీ శిశుపాల్ సింగ్ నేగి

అసలు కేసు ఏమిటి?

మొనిందర్ పంధేర్, సురీందర్ కోలి ఇద్దరికీ 2009లో అత్యాచారం, హత్య, ఆధారాలను నాశనం చేయడం లాంటి ఇతర ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో ఘజియాబాద్ సీబీఐ కోర్టు ఉరిశిక్ష విధించింది.

11 కేసుల్లో కోలి ఒక్కడే నిందితుడు కాగా, రెండు కేసుల్లో ఆయన్ను పంధేర్‌తో పాటు సహనిందితుడిగా చేర్చారు.

అలహాబాద్ హైకోర్టు 2023లో ఈ కేసుకు సంబంధించిన 12 వ్యవహారాల్లో కోలిని నిర్దోషిగా విడుదల చేసింది. అలాగే మొనిందర్ కూడా తనపై నమోదైన రెండు కేసుల్లో నిర్దోషిగా తేలారు.

దర్యాప్తు సరిగా జరగలేదని, "ఆధారాలు సేకరించాల్సిన కనీస ప్రమాణాలను బాహాటంగా ఉల్లంఘించారు" అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

కోర్టు కేసు, హరిద్వార్, నిఠారీ హత్యలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, మొనిందర్ పంధేర్ (ఫైల్ ఫోటో)

కోర్టు తీర్పు, ప్రశ్నలు

"ఈ కేసులో ఎలాంటి సందర్భోచిత ఆధారాలు లేవు. అందుకే సీబీఐ నమోదు చేసిన కోలి వాంగ్మూలాలను కోర్టు విశ్వసించలేదు. చట్టప్రకారం వాంగ్మూలం స్వచ్ఛందంగా ఇవ్వాలి, ఎలాంటి భయం, ఒత్తిడితో కాదు" అని అప్పట్లో కోర్టు తీర్పుపై న్యాయవాది పరాస్ నాథ్ సింగ్ చెప్పారు.

308 పేజీల అలహాబాద్ హైకోర్టు తీర్పు కాపీలోని 47వ పేజీలో ఇలా రాశారు, "కోలి 60 రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్నాడు కానీ ఈ 60 రోజుల్లో అతడికి ఎప్పుడూ వైద్య పరీక్షలు నిర్వహించలేదు. దీనివల్ల శారీరక హింస జరిగి ఉండొచ్చనే అనుమానాలు అలాగే ఉండిపోయాయి. కేవలం 2007లో ఒక మెడికల్ సర్టిఫికెట్ తెచ్చారు, దాని ప్రామాణికతను నిర్ధరించేందుకు వైద్యుడిని సాక్ష్యంగా ప్రవేశపెట్టలేదు".

ఏ మేజిస్ట్రేట్ ముందు కోలి వాంగ్మూలాలు నమోదు చేశారో, నిందితుడు ఎవరి ఒత్తిడి లేకుండానే వీటిని చెప్పాడనే విషయంపై ఆ మేజిస్ట్రేట్ కూడా సంతృప్తి వ్యక్తం చేయలేదని తీర్పులో రాశారు.

ప్రాసిక్యూషన్ ఎప్పటికప్పుడు తమ వాదనలు మారుస్తూ వచ్చిందని హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది.

ప్రారంభంలో కోలితో పాటు డి-5 ఇంటి యజమాని మొనిందర్ పంధేర్‌పై కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలంలో దొరికిన వస్తువులకు ఇద్దరినీ బాధ్యులను చేశారు. కానీ కాలక్రమేణా అన్నింటికీ కోలినీ మాత్రమే దోషిగా చూపించడం ప్రారంభించారు.

దర్యాప్తులోని వివిధ దశల్లో ప్రాసిక్యూషన్ ఆధారాలు కూడా మారుతూ వచ్చాయి, చివరగా కోలి వాంగ్మూలం మాత్రమే ఏకైక ఆధారంగా మిగిలింది. దాని ప్రామాణికత ముందు నుంచే ప్రశ్నార్థకంగా మారింది.

2025 నవంబర్ 11న కోలిపై పెండింగ్‌లో ఉన్న చివరి కేసులో సీజేఐ బీఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు చెబుతూ "ఏ ఆధారాలు సరిపోవని, నమ్మశక్యంగా లేవని చెబుతూ కోలిని 12 కేసుల్లో కోర్టు ముందే నిర్దోషిగా విడుదల చేసిందో, అవే ఆధారాలతో ఒక కేసులో అతడిని దోషిగా ఉంచడం రాజ్యాంగబద్ధంగా సరైనది కాదు" అని తెలిపింది.

నిఠారీలో జరిగిన నేరాలు చాలా భయంకరమైనవని, పిల్లలను కోల్పోయిన కుటుంబాల బాధ వర్ణణాతీతమని కోర్టు అంగీకరించింది. కానీ, ఇంత సుదీర్ఘ దర్యాప్తు తర్వాత కూడా అసలు నేరస్థుడు ఎవరో పక్కా ఆధారాలతో నిరూపించలేకపోయారు.

కోర్టు తన తీర్పులో, "కేవలం అనుమానం ఆధారంగా చట్టం ఎవరినీ దోషిగా నిర్ధరించలేదు. అనుమానం ఎంత బలమైనదైనా, కోర్టుకు కచ్చితమైన ఆధారాలు కావాలి. న్యాయం చేయాలనే ఒత్తిడిలో చట్టపరమైన నియమాలను పక్కన పెట్టలేం" అని స్పష్టం చేసింది.

చివరగా పోలీసులతో పాటు దర్యాప్తు సంస్థల తీరుపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.

"దర్యాప్తు సకాలంలో, వృత్తిపరంగా, రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా జరిగితే, అత్యంత కష్టమైన కేసుల్లో కూడా నిజం బయటకు తీసుకురావచ్చు. కానీ నిఠారీ కేసులో అలా జరగలేదు. నిర్లక్ష్యం, జాప్యం మొత్తం దర్యాప్తును బలహీనపరిచాయి. అసలు నేరస్థుడి వద్దకు చేరుకునే దారులను కూడా మూసివేశాయి" అని కోర్టు తెలిపింది.

ఫలితంగా మొనిందర్ సింగ్ పంధేర్, సురీందర్ కోలి ఇద్దరూ అన్ని కేసుల్లో నిర్దోషులుగా తేలి విడుదలయ్యారు.

నిఠారీ ఉదంతం ఏమిటి?

2005-2006 మధ్య కాలంలో దిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడాలోని నిఠారీ గ్రామంలో ఒకరి తర్వాత ఒకరుగా పలువురు పిల్లలు, యువతులు అదృశ్యమైన ఘటనలు వెలుగుచూశాయి.

ఈ పిల్లల కుటుంబ సభ్యులు ఈ కేసుల గురించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు నెలల తరబడి వీటిని పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి.

చివరగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, పంధేర్ ఇంటి వెనుక ఉన్న కాలువలో 19 అస్థిపంజరాలు బయటపడ్డాయి. మొనిందర్ సింగ్ పంధేర్, సురీందర్ కోలిలను అరెస్టు చేశారు.

ఈ వ్యవహారం సీబీఐకి చేరింది. దర్యాప్తు సంస్థ తమ సోదాల్లో కొన్ని మానవ ఎముకల భాగాలు, మానవ అవయవాలు నింపి కాలువలో పడేసిన 40 ప్యాకెట్లను గుర్తించింది.

దర్యాప్తు ముందుకు సాగింది. 2009లో ఘజియాబాద్ సీబీఐ కోర్టు ఒక కేసులో వీరిద్దరికీ ఉరిశిక్ష విధించింది.

కానీ, ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు అనంతరం, ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు తన తీర్పులో ఇద్దరు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)