SIR: తెలంగాణలో గత ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఓట్లు రద్దవుతాయా?

సర్ ప్రక్రియ, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7,73,372 మంది ఓటర్లు ఉండగా.. 3,29,828 మంది ఓటర్లు ఏఎస్‌డీడీ కేటగిరిలోనే...(ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ కొనసాగుతోంది.

దీనిలో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికలు.. అంటే 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఓట్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైందని స్పష్టమవుతోంది.

మరికొన్ని నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే 50శాతానికిపైగా ఓట్లు తొలగించే అవకాశం ఉందని బీబీసీ పరిశీలనలో తేలింది.

ఎన్నికల సంఘం ఆగస్టు 17న విడుదల చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ముసాయిదా ఓటర్ల జాబితా మేరకు తెలంగాణలో సుమారు 73.39 లక్షల ఓట్లు ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్నాయి.

ఏఎస్‌డీడీ అంటే ఏ-ఆబ్సెంట్ (ఓటరు లేకపోవడం), ఎస్-షిఫ్టెడ్ (శాశ్వతంగా వలస వెళ్లడం), డీ-డెత్స్ (చనిపోవడం), డీ-డూప్లికేట్ (రెండేసి చోట్ల ఓటు ఉండటం).

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రెండు నియోజవర్గాల్లో పోలైన ఓట్ల కంటే అధికం

మలక్ పేట, యాఖుత్ పురా నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఓట్లు తొలగించేందుకు 'సర్' ముసాయిదా జాబితాలో ఎన్నికల సంఘం చేర్చిందని కోల్‌కతాకు చెందిన సబర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన పరిశీలనలో తేలింది.

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మలక్ పేట నియోజకవర్గంలో 1,31,143 ఓట్లు పోలయ్యాయి.

ఈ నియోజకవర్గంలో అప్పట్లో 3,17,875 ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గణంకాల ప్రకారం స్పష్టమవుతోంది.

ప్రస్తుతం 'సర్' ప్రక్రియలో భాగంగా ఈ నియోజకవర్గంలో 1,47,799 ఓట్లు తొలగించేందుకు సిద్ధమైనట్లు ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం తెలుస్తోంది.

2026 జూన్ 10 నాటికి, అంటే ‘సర్’ ప్రక్రియ తెలంగాణలో మొదలయ్యేనాటికి మలక్ పేట నియోజకవర్గంలో 3,30,191 ఓట్లు ఉన్నట్లుగా ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి.

యాఖుత్ పురా నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల నాటికి 3,53,141 ఓట్లుండగా 1,39,630 ఓట్లు పోలయ్యాయి.

అయితే, 'సర్' ముసాయిదా జాబితా ప్రకారం, 1,54,982 ఓట్లు తొలగించాలని ఎన్నికల సంఘం ప్రతిపాదించింది.

‘ఆట మొదలైంది’

మలక్ పేట, యాఖుత్ పురా నియోజకవర్గాల్లో ఓటర్ల తొలగింపు వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఎన్నికల సంఘం తెలంగాణలో, హైదరాబాద్‌లో తన ఆటను మొదలుపెట్టిందని రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

''మొదట బిహార్‌లో పరీక్షించింది. అక్కడ పెద్దగా ప్రతిఘటన రాలేదు. బెంగాల్‌లో కొంత ప్రతిఘటన ఎదురైనా అధిగమించి ముందుకెళ్లింది. ఇప్పుడు ఎలాంటి అడ్డంకి ఎదురైనా ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది'' అని ఆయన అన్నారు.

అయితే, అభ్యంతరాలు, ఫిర్యాదులన్నీ పరిష్కరించిన తర్వాతే ఎక్కడా అర్హులకు ఇబ్బంది లేకుండా ఓటర్ల తొలగింపు ఉంటుందని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సి.సుదర్శన్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

''నోటీస్ అందిన ఓటర్ల వివరాలను హియరింగ్‌ తర్వాత నిబంధనల ప్రకారం పరిశీలించి, అవసరమైన ఆధారాలను ధ్రువీకరించిన అనంతరమే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించాం'' అని చెప్పారు.

సర్ ప్రక్రియ, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, నవంబరులో తుది జాబితా ప్రచురించే లోపు పత్రాలు సమర్పించకపోతే ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్నట్లు ఈసీ అధికారులు చెప్పారు. (యువ ఓటర్లు- ప్రతీకాత్మక చిత్రం)

మ్యాపింగ్ కానివారెందరు? ఏఎస్‌డీడీ కేటగిరీలో ఎంతమంది?

తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ జూన్ 10న ప్రారంభమైంది. ఆగస్టు 17న 'సర్' ముసాయిదా జాబితాను విడుదల చేసింది ఎన్నికల సంఘం.

జూన్ 10 నాటికి తెలంగాణలో 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు.

ఆగస్టు 17న విడుదల చేసిన 'సర్' ముసాయిదా జాబితా ప్రకారం, 2,64,87,213 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజ్ అయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఆ వివరాలతో ముసాయిదా జాబితాను సీఈవో సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు.

ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం, అభ్యంతరాల స్వీకరణ పూర్తి చేసి నవంబరు 9న తుది ఓటరు జాబితా ప్రచురించాలని నిర్ణయించామని వివరించారు.

ముసాయిదా జాబితా ప్రకారం 32,26,659 మంది వివరాలు మ్యాపింగ్ కాలేదని అధికారులు ప్రకటించారు. అంటే 2002 'సర్' జాబితాతో పోల్చినప్పుడు ఈ ఓటర్ల వివరాలు సరిపోలలేదన్నమాట.

అలాగే 73,39,235 మందిని ఏఎస్‌డీడీ కేటగిరీలో చేర్చింది ఎన్నికల సంఘం.

వీరు నిర్దేశిత గడువులోగా అంటే, నవంబరులో తుది జాబితా ప్రచురించే లోపు పత్రాలు సమర్పించకపోతే ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

సర్ ప్రక్రియ, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, మలక్ పేట, యాఖుత్ పురా నియోజకవర్గాల్లో భారీగా ఓట్ల తొలగింపు (ఓటరు జాబితాలో తమ పేర్లు చూసుకుంటున్న పౌరులు-ప్రతీకాత్మక చిత్రం )

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అధికం

ఓట్ల తొలగింపు వ్యవహారంపై బీబీసీ పరిశీలన చేసినప్పుడు.. మలక్ పేట, యాఖుత్ పురా నియోజకవర్గాలతోపాటు మరికొన్ని నియోజకవర్గాల్లోనూ భారీగా ఓట్లు తొలగించేందుకు ఎన్నికల సంఘం ప్రతిపాదించిందని అర్థమైంది.

హైదరాబాద్ నగర పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో లక్ష కంటే ఎక్కువ ఓట్లు తొలగించాలని ముసాయిదా జాబితాలో ఎన్నికల సంఘం నిర్ణయించినట్లుగా తేలింది.

నియోజకవర్గాల వారీగా ముసాయిదా జాబితాలో పేర్కొన్న వివరాలు, గత అసెంబ్లీ ఎన్నికలలో పోలైన ఓట్ల వివరాలను బీబీసీ పరిశీలించింది.

అలాగే, నిజామాబాద్ అర్బన్, కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాల్లో భారీగా ఓట్లను తొలగింపు జాబితాలో చేర్చింది ఎన్నికల సంఘం.

ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో భారీగా ఓట్లు తొలగించే అవకాశం ఉంది. ఈ జిల్లా పరిధిలో ఏఎస్‌డీడీ కేటగిరీలో 19,41,444 మంది ఓటర్లు ఉన్నారు.

వీరంతా చనిపోవడం లేదా శాశ్వతంగా వలస వెళ్లడం లేదా రెండేసి చోట్ల పేర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం చెబుతోంది.

రంగారెడ్డి జిల్లా పరిధిలో 12,87,091, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో 10,71,566 ఓట్లను ఏఎస్‌డీడీ కేటగిరీలో చేర్చడంతో.. నిర్దేశిత గడువులోగా పత్రాలు సమర్పించకపోతే వారి ఓట్లను తొలగించనుంది ఎన్నికల సంఘం.

మొత్తంగా కలిపి ఈ మూడు జిల్లాల్లో 43 లక్షల ఓట్లు ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్నాయి.

సర్ ప్రక్రియ, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, తెలంగాణలో ఏఎస్‌డీడీ కేటగిరీలో సుమారు 73.39 లక్షల ఓట్లు ఉన్నట్లు తేలింది (ఓటరు జాబితా-ఫైల్ ఫోటో)

బీబీసీ పరిశీలనలో ఏం తేలిందంటే…

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాలలో ఏఎస్‌డీడీ కేటగిరీలో ప్రతిపాదించిన ఓటర్ల వివరాలను పరిశీలించినప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్యకు దాదాపు సమానమైన ఓట్లు తొలగించే అవకాశం ఉంది.

అలాగే, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7,73,372 మంది ఓటర్లు ఉండగా.. 3,29,828 మంది ఓటర్లు ఏఎస్‌డీడీ కేటగిరిలో ఉన్నారు.

ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోనూ 2 లక్షల మందికిపైగా ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్నారు. వీరు తమ వివరాలు సమర్పించకపోతే ఆ ఓట్లన్నీ తొలగిపోయే అవకాశం ఉంది.

కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 50శాతానికి మించి ఓట్లను తీసివేసే వీలుంది.

హైదరాబాద్ జిల్లా పరిధిలో 15 నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో చార్మినార్ మినహా అన్ని నియోజకవర్గాల్లో లక్ష మందికిపైగా ఓటర్లు ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్నందున ఆ మేరకు తొలగింపులు ఉండే అవకాశం ఉంది.

అయితే, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని అర్బన్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 50శాతానికి మించి పోలింగ్ శాతం నమోదు కాలేదని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) సుదర్శన్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

''ఎవరైతే శాశ్వత నివాసం వెళ్లారో.. చనిపోయారో.. డబుల్ ఓట్లు ఉన్నాయో.. గుర్తించలేని వారున్నారో.. అలాంటి వారి ఓట్లనే సర్ ప్రక్రియతో తొలగిస్తున్నాం. అర్హుల ఓట్లు తొలగించడం లేదు. ఓటర్లు ఫారం-6, 7, 8 ద్వారా తిరిగి నమోదు చేసుకోవచ్చు లేదా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు'' అని సుదర్శన్ రెడ్డి చెప్పారు.

సర్ ప్రక్రియ, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, డేటాలో లోపాలు ఉన్నవారందరికీ దశలవారీగా అందరికీ నోటీసులు అందిస్తామని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) సుదర్శన్ రెడ్డి చెప్పారు. ( ఓటరు కార్డు -ప్రతీకాత్మక చిత్రం)

'కుటుంబంలో ఎవరైనా వచ్చి పత్రాలు ఇవ్వొచ్చు'

తెలంగాణలో సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు ఇచ్చే నోటీసులు, అభ్యంతరాలపై నోటీసుల జారీ, విచారణ, పరిష్కారానికి నవంబరు 5 వరకు గడువు ఉన్నట్లు సుదర్శన్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

''ఓటర్లకు అందించిన నోటీసులను పరిష్కరించేందుకు సంబంధిత ఓటరు కుటుంబ సభ్యులలో ఒకరు ఈఆర్ఒ/ఏఈఆర్ఒ ఎదుట వ్యక్తిగతంగా హాజరై అవసరమైన పత్రాలు, సమాచారాన్నిఅందించవచ్చు. ఆ పత్రాలను స్వీకరించి జారీ చేసిన నోటీసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం'' అని చెప్పారు.

నోటీసులు ఇంకా పూర్తి స్థాయిలో జారీ కాకపోవడంపై బీబీసీ అడిగిన ప్రశ్నకు సుదర్శన్ రెడ్డి స్పందించారు.

''దశలవారీగా అందరికీ నోటీసులు అందిస్తాం. ఓటర్లందరికీ ఒకేసారి నోటీసులు ఇచ్చినా అభ్యంతరాల సమర్పణకు ఇబ్బంది అవుతుంది. అందుకే విడతల వారీగా అందిస్తున్నాం. ఓటర్లు తమకు నోటీసులు అందిన తర్వాత.. దాన్ని పూర్తి చేసి నిర్దేశిత డాక్యుమెంట్లతో తిరిగి ఇవ్వవచ్చు. ఈఆర్వో, ఏఈఆర్వో వద్ద అభ్యంతరాలను పరిష్కరించుకోవచ్చు'' అని చెప్పారు.

మరోవైపు, ఏఎస్‌డీడీ, అనామలీస్ కేటగిరీ కింద ఇప్పటివరకు మొత్తం 82.02లక్షల మందికి నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు 43.98 లక్షల మంది నిర్దేశిత గడువులోగా విచారణకు రాలేదని ఎన్నికల సంఘం చెబుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)