ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి డబ్బులు పంపినా ఛార్జీలు పడతాయా? యూపీఐ పేమెంట్లపై సందేహాలు, సమాధానాలు

ఫొటో సోర్స్, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images
యూపీఐ కోసం ప్రభుత్వం ఒక కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది.
ఈ ఫ్రేమ్‌వర్క్ విడుదల తర్వాత.. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేందుకు సామాన్య ప్రజలు కూడా ఛార్జీలు చెల్లించాలా వద్దా అనే విషయంలో స్పష్టత వచ్చింది.
వ్యక్తుల మధ్య జరిగే (పీ టూ పీ) యూపీఐ చెల్లింపులు పూర్తిగా ఉచితమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంటే.. యూపీఐ చెల్లింపులకు సామాన్య ప్రజలు ఎలాంటి ఛార్జీలను భరించాల్సినవసరం ఉండదు. ప్రభుత్వ నిర్ణయంతో చాలా చిన్న వ్యాపారాలపై కూడా ఎలాంటి ప్రభావం ఉండదు.
అయితే, కొన్ని పెద్ద వ్యాపార లావాదేవీలకు మాత్రమే ఎండీఆర్ వర్తిస్తుంది.
అయితే, కింద పేర్కొన్న ప్రశ్నలు, సమాధానాల ద్వారా అసలు కొత్త నిబంధనలు ఏంటో తెలుసుకుందాం..
పీ టూ పీ చెల్లింపులు అంటే ఏమిటి? ఎండీఆర్ (మర్చెంట్ డిస్కౌంట్ రేటు) ఏంటి? వినియోగదారులపై ఎలాంటి ఫీజులు విధించమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఎందుకు యూపీఐ యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు?

యూపీఐ ద్వారా డబ్బు పంపేటప్పుడు ఛార్జీలు విధిస్తారా?
లేదు. ఎవరైనా యూపీఐ వాడుతూ మరో వ్యక్తికి డబ్బులు పంపిస్తే, ఎలాంటి ఛార్జీలు ఉండవు.
మొత్తం ఎంతైనా సరే, వ్యక్తుల మధ్య జరిగే (పీ టూ పీ) యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగా ఉంటాయి.
ప్రభుత్వం ప్రకారం, యూపీఐ మొత్తం లావాదేవీ విలువలో సుమారు 70 శాతం ఇటువంటి పీ టూ పీ చెల్లింపులే.

ఫొటో సోర్స్, Getty Images
పీ టూ పీ చెల్లింపు అంటే ఏమిటి?
దీని అర్థం ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి నేరుగా డబ్బు పంపడం (పర్సన్-టు-పర్సన్).
ఉదాహరణకు.. మీరు యూపీఐని ఉపయోగించి, మీ స్నేహితునికి లేదా బంధువుకు ఎంత మొత్తంలోనైనా డబ్బులు పంపుకోవచ్చు (యూపీఐ అలాంటి లావాదేవీలపై ఎలాంటి రోజువారీ పరిమితిని విధించనంత వరకు). గతంలో వల్లే దీనికి ఎటువంటి ఛార్జీలు ఉండవు.
ప్రభుత్వం చెబుతున్న ప్రకారం, ఇటువంటి యూపీఐ చెల్లింపులు మొత్తం ఎంతైనా సరే పూర్తిగా ఉచితం.

ఫొటో సోర్స్, Getty Images
రూ.2000 వరకు చేసే చెల్లింపులకు వ్యాపారులకు ఛార్జీలేమైనా విధిస్తారా?
లేదు. రూ. 2,000 వరకు ఉన్న అన్ని పీ టూ ఎం (వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే) యూపీఐ చెల్లింపులకు ఎండీఆర్ వర్తించదు.
అంటే.. రూ.2000 వరకు ఉండే యూపీఐ చెల్లింపులకు కస్టమర్‌కు మాత్రమే కాదు, వ్యాపారికి కూడా ఎలాంటి ఛార్జీలు ఉండవు.
పీ టూ ఎం చెల్లింపు అంటే?
యూపీఐ ద్వారా మీరు ఎవరికైనా దుకాణదారునికి లేదా వ్యాపారికి డబ్బులు చెల్లిస్తుంటే.. దాన్నే పీ టూ ఎం లేదా పర్సన్ టూ మర్చెంట్ పేమెంట్ (P2M) అంటాం.
ఉదాహరణకు.. యూపీఐ వాడుతూ గ్రోసరీ స్టోర్ వద్ద చెల్లింపులు చేయడం లేదా పెట్రోల్ బంకులో చెల్లించడం లేదా దుకాణదారుని నుంచి వస్తువులను కొనుగోలు చేసినప్పుడు చేసే చెల్లింపులు వంటివి.
ఇలాంటి చెల్లింపుల్లో మీరొక వ్యక్తి.. మీరు పంపించే డబ్బు స్వీకరించేది వ్యాపారి. ఇదే పర్సన్ టు మర్చంట్.

ఫొటో సోర్స్, Getty Images
రూ.2000 పైన మర్చెంట్ చెల్లింపులకు ఏం జరుగుతుంది?
అటువంటి చెల్లింపులపై ఎండీఆర్ (మర్చెంట్ డిస్కౌంట్ రేట్) విధిస్తారు.
రూ.2000 దాటిన జనరల్ మర్చెంట్ లావాదేవీలకు ఎండీఆర్ 0.4 శాతంగా నిర్ణయించారు.
కానీ, ఈ ఫీజును వినియోగదారులు భరించాల్సినవసరం లేదు.
వ్యాపారులు ఈ ఛార్జీలను వినియోగదారులపై మోపకుండా చూసుకోవాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎండీఆర్ అంటే ఏమిటి? దాన్ని ఎవరు చెల్లిస్తారు?
ఎండీఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేటు. సులభంగా చెప్పాలంటే, డిజిటల్ చెల్లింపులను స్వీకరించే వ్యాపారులు వసూలు చేసే ఛార్జీ ఇది.
ఉదాహరణకు.. ఈ నిబంధన కింద.. మర్చెంట్ చెల్లింపుపై ఎండీఆర్ 0.4 శాతం ఉంటే, కస్టమర్ పది వేల రూపాయల యూపీఐ చెల్లింపు చేస్తే.. ఎండీఆర్ రూ. 40 పడుతుంది.
అయితే, అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ రూ. 40ను వినియోగదారులు భరించాల్సిన అవసరం లేదు. ఎండీఆర్‌ను వినియోగదారునికి బదిలీ చేయొద్దని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
అంటే, ఒక కస్టమర్ రూ. 10,000 విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే, యూపీఐ వాడినందుకు వారి నుంచి అదనంగా రూ. 40 వసూలు చేయకూడదు.
వ్యాపారే ఈ 40 రూపాయల ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది.
ఎండీఆర్ అనేది మర్చెంట్ పేమెంట్ సిస్టమ్‌లో విధించే ఒక ఛార్జీ.
ఇది ప్రభుత్వం లేదా ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విధించే పన్ను కాదు.
ఇది బ్యాంకులు, పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లు లేదా యూపీఐ యాప్ ప్రొవైడర్లు వంటి చెల్లింపు వ్యవస్థలో భాగమయ్యే పలువురు భాగస్వాములకు వెళ్తుంది.
ప్రభుత్వం చెబుతున్న ప్రకారం.. దీన్ని యూపీఐ వ్యవస్థను నడపడానికి, మరింత అభివృద్ధి చేయడానికి ఉపయోగించనున్నారు.
చెల్లింపు ఎంత ఎక్కువగా ఉంటే, ఎండీఆర్ కూడా అంత ఎక్కువగా ఉంటుందా?
అన్నిసార్లూ అలా జరగదు. ఎండీఆర్ గరిష్ఠంగా రూ. 300 మాత్రమే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంటే 0.4 శాతం చొప్పున లెక్కేస్తే రూ. 75,000 చెల్లింపుపై రూ. 300 ఎండీఆర్ పడుతుంది.
గరిష్ఠం రూ. 300 కాబట్టి రూ. 75,000 కంటే ఎంత చెల్లించినా కూడా రూ. 300 కంటే ఎక్కువ ఎండీఆర్ ఉండదు.
అయితే... రూ. 2,000.. రూ. 75,000 మధ్య చెల్లింపుల విషయానికొస్తే చెల్లించే మొత్తం ఎంత ఎక్కువ ఉంటే ఎండీఆర్ దానిపై 0.4 శాతం ఉంటుంది. చెల్లింపు ఎంత ఎక్కువైతే ఎండీఆర్ అంత ఎక్కువవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
రూ.2000 కంటే ఎక్కువ ఉండే పెట్రోల్, ట్రైన్ టిక్కెట్, ఫోన్ బిల్లు చెల్లింపులకు ఛార్జీలు ఎంతుంటాయి?
కొన్ని అత్యవసర సేవలకు వేర్వేరు ఎండీఆర్ నిబంధనలు ఉన్నాయి. రూ.2,000 దాటిన లావాదేవీలకు రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ వసూలు చేస్తారు.
దీనిలో కింద పేర్కొన్న ఈ రంగాలు ఉన్నాయి:
- రైల్వే
- టెలికాం
- బీమా
- ఇంధనం అంటే పెట్రోల్, డీజిల్
- వ్యవసాయ ఉత్పాదకాలు
ఉదాహరణకు, పెట్రోల్ కోసం రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులు చేస్తే, ఈ లావాదేవీపై రూ. 5 ఎండీఆర్ ఉంటుంది.
కానీ, రూ.5ను కస్టమర్ నుంచి వసూలు చేయరు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం.. కస్టమర్‌పై ఎండీఆర్ భారం ఉండదు.
ప్రజలు ఎందుకు భయపడుతున్నారు?
దీనికి చాలా సింపుల్ రీజన్ ఉంది. అది.. భారత్‌లో యూపీఐ ప్రారంభమై పదేళ్లు గడిచినా.. ఇప్పటి వరకు ఈ సౌకర్యం ఉచితంగానే ఉంది.
ప్రస్తుతం ప్రభుత్వం తొలిసారి.. పెద్ద వ్యాపార లావాదేవీలకు ఎండీఆర్ రేట్లను ప్రకటించింది. ఇది సహజంగానే ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది.
ఒకవేళ మర్చెంట్ ఇవాళ ఎండీఆర్‌ను చెల్లించాల్సి వస్తే.. ఆ దుకాణదారుడు లేదా వ్యాపారి తన స్వంత లాభాన్ని వదులుకోకపోతే ఆ భారాన్ని కస్టమర్లపై మోపడా? అనే ప్రశ్న ప్రజల మనసులో కలగడం సహజం.
అలాగే, వ్యాపారులు తమ ఖర్చులను భర్తీ చేసుకోవడానికి వేరే ఏ విధంగానైనా ధరలను పెంచవచ్చా?
ఉదాహరణకు, డిజిటల్ చెల్లింపులను స్వీకరించే భారం వ్యాపారిపై పెరిగితే, దానిని వారు వస్తువులు లేదా సేవల ధరలకు కలుపుతారనే భయం కస్టమర్లలో ఉంది. లేదా మళ్లీ నగదు (క్యాష్) రూపంలో చెల్లింపులు తీసుకునే ధోరణి పెరిగే అవకాశం ఉంది.
అయినప్పటికీ, పీఐబీ ప్రెస్ రిలీజ్‌లో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తూ.. ఇలా జరగకూడదని పేర్కొంది. వ్యాపారులు ఎండీఆర్ మొత్తాన్ని కస్టమర్ల నుంచి వసూలు చేయకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించాయి.
అంతేకాకుండా, యూపీఐ యాప్ కంపెనీలు ప్లాట్‌ఫామ్ ఫీజులు లేదా హిడెన్ ఛార్జీలను వసూలు చేయకుండా నిరోధించారు.
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన యూపీఐ చెల్లింపుల పరిస్థితి ఏంటి?
వీటికి వేర్వేరు ధరలు నిర్ణయించారు.
మ్యూచువల్ ఫండ్‌లు, సెక్యూరిటీలు, స్టాక్ బ్రోకర్లు, డీలర్లకు సంబంధించిన చెల్లింపులపై 0.02 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది.
దీని గరిష్ట పరిమితి కూడా ప్రతి లావాదేవీకి రూ.300గానే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
చిన్న దుకాణదారులు కూడా ఎండీఆర్ చెల్లించాలా?
లేదు. కొంతమంది చిన్న వ్యాపారులకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంది.
పీ టూ ఎంగా వర్గీకరించిన స్ట్రీట్ వెండార్లు, ఇళ్ల పక్కనుండే దుకాణాలు, ఇతర చిన్న వ్యాపారాలు యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు రూ.లక్ష కంటే తక్కువ పొందితే.. వారి లావాదేవీలపై జీరో ఎండీఆర్ ఉంటుంది.
దీనివల్ల చిన్న వ్యాపారాలపై డిజిటల్ చెల్లింపుల అదనపు భారం పడదని ప్రభుత్వం చెబుతోంది.
నెలలో కొన్నిరోజులు మాత్రమే యూపీఐ ఉచితంగా ఉంటుందా?
లేదు. వ్యక్తుల యూపీఐ లావాదేవీలపై నెలవారీ పరిమితి లేదు.
నెలవారీ కోటా లేదు. అలాగే, ఉచిత లావాదేవీల సంఖ్యపై కూడా ఎటువంటి పరిమితి లేదు.
ఎన్ని వ్యాపార లావాదేవీలు ప్రస్తుతం ఎండీఆర్ పరిధిలోకి వస్తాయి?
ప్రభుత్వం చెబుతున్న ప్రకారం.. యూపీఐ ద్వారా ప్రస్తుతం జరిగే అన్ని లావాదేవీల్లో కేవలం 4 శాతం లావాదేవీలు మాత్రమే ఎండీఆర్ పరిధిలోకి వస్తాయి.
అంటే.. సుమారు 96 శాతం వ్యాపార లావాదేవీలు ఈ నియమం వల్ల ప్రభావితం కావు. వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు.
ఇవి రూ.2000 వేల కంటే తక్కువ లేదా చిన్న మర్చెంట్ల కోసం తీసుకొచ్చిన జీరో-ఎండీఆర్ పరిధిలోకి వచ్చేవి.
ఎండీఆర్ నుంచి వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్తుంది?
దీనిలో కొంత భాగం చిన్న వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన నిధికి వెళ్తుంది.
ప్రభుత్వం చెబుతున్న ప్రకారం.. మొత్తం ఎండీఆర్ వసూళ్లలో 5 శాతం ఒక ప్రత్యేక నిధికి కేటాయించనున్నారు.
చిన్న వ్యాపారాలలో యూపీఐని ప్రోత్సహించడానికి, మరిన్ని దుకాణాలకు యూపీఐని అనుసంధానించడానికి ఇది ఉపయోగిస్తారు.

ఫొటో సోర్స్, finance ministry
ప్రభుత్వం ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ఎందుకు రూపొందించింది?
యూపీఐని దీర్ఘకాలంలో సుస్థిరంగా మార్చడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.
కొత్త విధానం ప్రకారం, సాధారణ ప్రజలకు యూపీఐ చెల్లింపులను ఉచితంగా ఉంచారు.
చాలా కేసుల్లో ఎండీఆర్ నుంచి చిన్న వ్యాపారాలకు కూడా మినహాయింపు ఇచ్చారు.
అదే సమయంలో, పెద్ద వ్యాపార లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్యాంకులు, పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లు, యూపీఐ యాప్ కంపెనీల ద్వారా చెల్లింపు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగించనున్నారు.
ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లో యూపీఐ మౌలిక సదుపాయాలను విస్తరించడంలో ఇది సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























