టోపీ మింగిన హిప్పో.. అత్యవసర చికిత్స

ఫొటో సోర్స్, Cincinati Zoo
- రచయిత, మేడలైన్ హాల్పెర్ట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఉన్న సిన్సినాటి జూలో 'ఫియోనా' అనే హిప్పోపొటమస్ పొరపాటున టోపీ మింగేసింది.
దీంతో దానికి ప్రస్తుతం అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నట్లు జూ అధికారులు వెల్లడించారు.
9 రోజుల క్రితం తాను ఉన్న ప్రదేశంలో పడిన ఒక టోపీని ఫియోనా మింగేసిందని జూ యాజమాన్యం తెలిపింది.
మొదట్లో దానికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదని ఫియోనా శరీర పరిమాణం పెద్దది కాబట్టి ఆ చిన్న టోపీ సాధారణంగానే జీర్ణమై బయటకు వచ్చేస్తుందని భావించామని పేర్కొంది.
అయితే కొన్ని రోజుల తర్వాత ఫియోనాకు ఆకలి తగ్గడం మొదలైంది.

ఆ టోపీ జీర్ణవ్యవస్థ ద్వారా బయటకు వచ్చేలా చేసేందుకు దానికి ఆహారం తినిపించడానికి జూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
సిన్సినాటి జూలో నెలలు నిండకముందే పుట్టిన ఫియోనా తొలినాళ్లలో ప్రాణాలతో పోరాడింది.
దాని స్ఫూర్తిదాయక కథ ఆధారంగా ఒక ఐస్‌క్రీమ్ ఫ్లేవర్, సిన్సినాటి బ్యాలే నృత్య రూపకంలో ఒక పాత్రను రూపొందించారు.
సందర్శకుల్లో ఒకరు టోపీని గాలిలోకి విసిరినప్పుడు అది సీలింగ్ ఫ్యాన్‌కు తగిలి ఒక చిన్న రంధ్రంలోంచి ఫియోనా ఉన్న చోట పడిందని జూ ప్రతినిధి మిచెల్ కర్లీ అమెరికా మీడియాకు తెలిపారు.
"మళ్లీ అలా చేయాలని మేం ప్రయత్నించినా బహుశా సాధ్యం కాదేమో" అని కర్లీ పేర్కొన్నారు.
ఫియోనా త్వరగా కోలుకోవడానికి జూ సిబ్బంది దానికి ద్రవ పదార్థాలు (ఫ్లూయిడ్స్) అందించడంతో పాటు అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాజా అల్ట్రాసౌండ్ స్కాన్‌లో ఆ టోపీ ఫియోనా చిన్న పేగు గుండా కదులుతున్నట్లు గుర్తించామని అయితే దాని శరీరంలో ఇంకా కొంత నీటి శాతం తక్కువగా (డీహైడ్రేషన్) ఉందని సిబ్బంది తెలిపారు.
"పూర్తిగా ఎదిగిన నీటిగుర్రాలకు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఫియోనా దానంతట అదే ఆ టోపీని బయటకు విసర్జించడమే మన ముందున్న అత్యుత్తమ మార్గం" అని జూ సంరక్షకుల్లో ఒకరు పేర్కొన్నారు.
2017లో ఫియోనా జన్మించింది. పుట్టినప్పుడు దాని బరువు కేవలం 13 కిలోలు మాత్రమే ఉంది.
ఈ జాతి జంతువులలో అంతకుముందు నమోదైన అత్యల్ప జనన బరువులో ఇది సగం మాత్రమేనని జూ అధికారులు తెలిపారు.
"పుట్టినప్పుడు ఎంతటి ధైర్యాన్ని, పోరాట పటిమను ప్రదర్శించిందో ఇప్పుడు కూడా ఫియోనా అంతే బలంగా కోలుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం" అని జూ సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























