శరీరాన్ని ముక్కలు చేసి కాలువలో పడేశారు, చేతిపై ఉన్న టాటూ ఆమె ఎవరో చెప్పింది, నిందితుడి గుర్తింపునకు దారి చూపింది

ఫొటో సోర్స్, UGC
(హెచ్చరిక: కలవర పరిచే అంశాలు ఉన్నాయి)
చిన్నప్పుడే తల్లిపోతే అనాథాశ్రమంలో పెరిగిన ఓ మహిళ కథ ఇది. చివరకు ఆ మహిళ కన్నకొడుకు కూడా చిన్నవయసులోనే అనాథాశ్రమానికి చేరాల్సిన పరిస్థితులకు సంబంధించిన కథ.
విజయవాడ ఇబ్రహీంపట్నం స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య మిస్టరీ వీడింది.
తల్లి హత్యకు గురవడం, పెంపుడు తండ్రి జైలుకు వెళ్లడంతో ఆమె నాలుగేళ్ల కుమారుడు అనాథ అయ్యాడు. ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఏసీపీ దుర్గారావు చెప్పిన వివరాల మేరకు వీటీపీఎస్‌లో దొరికిన మృతదేహం కర్రి దుర్గ అలియాస్ కళ్యాణిదిగా గుర్తించారు.
షఫీ అనే వ్యక్తే ఈ హత్య చేశారని పోలీసుల అభియోగం.


ఫొటో సోర్స్, Getty Images
కాలువలో మొండెం..మిగిలిన భాగాలు ఎక్కడ?
ఈనెల 18వ తేదీ సాయంత్రం విజయవాడ శివార్లలోని వీటీపీఎస్ కాలువలో ఒక మొండెం కనిపించినట్టు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మిగిలిన శరీర భాగాల కోసం గాలించారు. కానీ మొండెంపై దుస్తులు తప్ప మరే వివరాలు తెలియలేదు.
థర్మల్ ప్లాంటుకు వెళ్లే ఈ కాలువకు ఒక జాలీ ఉంటుంది. దీంతో సెప్టెంబర్ 19వ తేదీన పోలీసులు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సాయంతో ఆ జాలీ ప్రాంతంలో వెతికించగా ఒక చేయి, రెండు కాళ్లు దొరికాయి.
మృతురాలు ఎవరో కనుక్కోవడానికి పోలీసులకు బట్టపై ఉన్న బ్రాండ్ తప్ప మరే ఆధారమూ కనిపించడం లేదు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. వీటీపీఎస్ కాలువపై ఉన్న వంతెనల్లో ఏదో ఒక చోట నుంచి మృతదేహాన్ని కాలువలో పడేసి ఉంటారనే కోణంలో కెమెరాలను పరిశీలించారు.
ఈ కేసు విచారణలో మృతురాలి చేతిపై ఉన్న నెమలి పింఛం పచ్చబొట్టు కీలకంగా మారింది. ఈ టాటూనే పోలీసులకు మృతురాలు ఎవరో, నిందితుడు ఎవరో కనిపెట్టేలా చేసింది. పోలీసులు ఆమె కాలి పట్టీలు, చెవిపోగులు, టాటూ, బట్టలు.. ఇలాంటి గుర్తులన్నింటినీ ఫోటోలు తీసి, వీటి ఆధారంగా మృతురాలిని ఎవరైనా గుర్తించాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు.
ఆ మృతదేహం ఎవరిదో కనుక్కోవడానికి పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒంటిపై దుస్తులకు సంబంధించిన కంపెనీ వివరాలతో ఆరా తీశారు.
అయితే సోషల్ మీడియా పోస్టులు చూసినవారిలో కొందరు మంగళగిరి పోలీసుస్టేషన్‌కు ఫోన్ చేసి, ఫలానా టాటూ అమ్మాయిని తాము చూశామని చెప్పారని పోలీసులు వివరించారు. అంతలోనే ఆ టూటా తమ సోదరిదేననీ, తన అక్క దుస్తుల్లానే ఉన్నాయంటూ కల్యాణి సోదరుడు పోలీసులను సంప్రదించారు.
''తన అక్కతో మాట్లాడి వారం దాటిందని చెప్పిన ఆయన, తమకు ఫోన్ చేసిన తరువాత ఆమె ఉండే ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ ఇల్లు తాళం వేసి ఉంది. చుట్టుపక్కల ఆరా తీస్తే మూడు రోజులుగా ఆమె ఇంటికి రావడం లేదని తేలిందని సోదరుడు చెప్పారు'' అన్నారు ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం.
వీటీపీఎస్ అధికారుల ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, మృతురాలి పేరు, వివరాలు తెలియడంతో ఫోన్ నంబర్ సాయంతో సాంకేతిక ఆధారాలు సేకరించారు. దీంతో పోలీసులకు ఈ కేసును విచారించడానికి మార్గం సుగమం అయింది. మృతురాలి ఫోన్ నెంబర్ ఆధారంగా కాల్ డేటా సేకరించారు.చివరిగా ఎవరితో మాట్లాడింది, ఎవరితో ఎక్కువసార్లు మాట్లాడింది లాంటి వివరాలను సేకరించడంతో చిక్కుముడి విడిపోయినట్టు పోలీసులు చెప్పారు. ఈ డేటా ఆధారంగా షఫీ అనే వ్యక్తిపై అనుమానంతో విచారణ జరిపామని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
అసలేం జరిగింది?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
మృతురాలి పేరు కర్రి దుర్గ అలియాస్ కల్యాణి. ఏలూరు జిల్లా కలిదిండి మండలం చిన్న తాడినాడ స్వగ్రామం. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో ఆమెను, ఆమె సోదరుడిని కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని ఒక ఆశ్రమంలో చేర్పించారు తండ్రి.
దాదాపు 18 ఏళ్ల వయసు వచ్చే వరకూ కల్యాణి, ఆమె సోదరుడు ఆ ఆశ్రమంలోనే పెరిగారు. తరువాత బయటకు వచ్చేశారు. కల్యాణి వివిధ హోటళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తూ మంగళగిరిలో నివాసం ఉంటున్నారు.
ఆమెతో కలసి జీవించారని చెబుతోన్న ఒక వ్యక్తిని కూడా పోలీసులు విచారించారు. కాలికి మెట్టెలు ఉన్నప్పటికీ వారికి వివాహం అయిందా, సహజీవనమా అన్నది పోలీసులు స్పష్టం చేయలేదు.
వీరిద్దరి బంధం ద్వారా ఒక మగ బిడ్డ పుట్టగా, ఆ బిడ్డ తండ్రికీ, ఈమెకూ అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు. ఆ బిడ్డను మరొకరికి దత్తత ఇచ్చారు. బిడ్డ తండ్రికి బంధువు అయిన షఫీ అనే మాంసం వ్యాపారి ఆ బాబును దత్తత తీసుకున్నాడు.
షఫీకి అప్పటికే ముగ్గురు కుమార్తెలు ఉన్నప్పటికీ, కుమారుడు కావాలనే ఆశతో ఈ బిడ్డను అనధికారికంగా దత్తత తీసుకున్నారని పోలీసులు చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం... దత్తత ఇచ్చిన తరువాత కూడా కల్యాణి, షఫీతో టచ్‌లో ఉంది. దత్తత సమయంలో కల్యాణికి షఫీ లక్ష రూపాయలు ఇచ్చాడనీ, తరువాత మరింత డబ్బు కోరగా, కొద్ది మొత్తాల్లో సొమ్ము, కొద్దిగా బంగారం ఇచ్చాడనీ ఏసీపీ దుర్గారావు తెలిపారు. అయినప్పటికీ కల్యాణి తరచూ డబ్బు డిమాండ్ చేస్తూండడంతో ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఫొటో సోర్స్, UGC
‘తరచూ డబ్బులు అడుగుతోందనే’
షఫీ విజయవాడలోని భవానీపురంలో ఉంటారు.
"ఈ నెల 17న భార్య, పిల్లల్నీ గుంటూరులోని వారి బంధువుల ఇంటికి పంపిన షఫీ ఆ తరువాత కల్యాణిని తమ ఇంటికి పిలిచాడు. అక్కడ వారు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ తరువాత షఫీ ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. తరువాత పెద్ద కత్తితో ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి, కవర్లలో పెట్టి, రెండు విడతలుగా వాటిని బైక్ పై తీసుకెళ్లి, వీటీపీఎస్ కాలువలో పారేశాడు. ఈ క్రమంలో తనతో పనిచేసే దుర్గారావు అలియాస్ అబ్దుల్లా అనే వ్యక్తినీ వెంట తీసుకెళ్లాడు."
ప్రస్తుతం ఆ అబ్దుల్లా పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
''తరచూ డబ్బు అడుగుతోంది. డబ్బు ఇవ్వకపోతే పిల్లాణ్ణి వెనక్కు ఇవ్వమంటోంది. షఫీకి ఆ పిల్లాడంటే చాలా ఇష్టం. ఆ పిల్లాణ్ణి ఇవ్వడం ఇష్టంలేని షఫీ ఆమెను హత్య చేస్తే గొడవ ఉండదని భావించి కిరాతకంగా చంపేశాడు. తాను మటన్ కొట్టే కత్తితోనే హత్య చేశాడు. హత్యకు ఇతర కారణాలు ఏవీ కనపడలేదు'' అని ఏసీపీ దుర్గారావు మీడియాకు వివరించారు.
ప్రస్తుతం కల్యాణి సొంత కొడుకు, షఫీ దత్త పుత్రుడి వయసు నాలుగు ఏళ్లని చెప్పారు పోలీసులు. ఇది చట్ట వ్యతిరేకమైన దత్తత కావడంతో, దీనిపై చట్టపరమైన సలహా తీసుకుని ఆ బాబును ఏదైనా ఆశ్రమంలో చేర్పిస్తామని పోలీసులు మీడియాతో చెప్పారు.
హత్యచేసిన తరువాత శరీరాన్ని ముక్కలు చేసి కనపడకుండా చేస్తే ఎవరూ గుర్తించరని షఫీ భావించారని పోలీసులు చెప్పారు.
నిందితుని బంధువులు, కల్యాణి సోదరునితో మాట్లాడటానికి బీబీసీ ప్రయత్నిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























