చైనాకు ఆయుధాల విక్రయంపై అమెరికా చట్టంలో నిషేధం.. అయినా ఈ ప్రతిపాదన ఎందుకు?

ఫొటో సోర్స్, Kevin Dietsch/Getty Images
చైనాకు ఆయుధాలు విక్రయించేందుకు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతవారం ప్రతిపాదించారని బీజింగ్‌లోని అమెరికా రాయబారి డేవిడ్ పెర్డ్యూ అన్నారు.
గతవారం అమెరికా వచ్చిన షీ జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా ట్రంప్ మాట్లాడారని ఆదివారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేవిడ్ పెర్డ్యూ తెలిపారు.
ప్రపంచంలోని పలు దేశాలకు అమెరికా ఆయుధాలు విక్రయిస్తుందని, చైనా ఏమైనా ఆయుధాలు కొనాలనుకుంటోందా అని ట్రంప్ ఆరా తీశారని చెప్పారు.
అయితే పెర్డ్యూ ఇంటర్వ్యూ తర్వాత, చైనాకు ఆయుధాలు విక్రయించే ప్రణాళిక అమెరికాకు లేదని వైట్‌హౌస్ వివరణ ఇచ్చింది.
అమెరికా చట్టం ప్రకారం చైనాకు ఆయుధాల విక్రయంపై నిషేధం ఉందని, వారికి అమ్మే ఆలోచన ఏదీ లేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.


ఫొటో సోర్స్, Getty Images
ఆయుధాల విక్రయ ప్రతిపాదనకు తైవాన్ కనెక్షన్
పెర్డ్యూ ఇంటర్వ్యూ తర్వాత ఒక విషయంపై చర్చ తీవ్రమైంది.
ఆత్మరక్షణ కోసం తైవాన్‌కు ఆయుధాలు అందించడానికి చట్టపరంగా కట్టుబడి ఉన్న అమెరికా, ఆ దేశంతో జరగాల్సిన 14 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాన్ని నిలిపివేసింది.
కానీ, దాని చట్టప్రకారం ఆయుధాలు ఇవ్వకూడని చైనాకు మాత్రం కొనుగోలుకు అమెరికా ప్రతిపాదిస్తోంది. అయితే ఈ వాదనను అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ తిరస్కరించింది.
తైవాన్‌ను తమ భూభాగంగా పరిగణిస్తూ, విలీనం చేసుకోవాలని చైనా చూస్తోంది. ఈ సమయంలో తైవాన్‌కు అమెరికా ఆయుధాలు అందించడం చైనాకు ఇబ్బందిగా మారింది. దీనిపై చైనా పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది.
అమెరికాపై ఆధారపడటం లేదా సైనిక మార్గాల ద్వారా స్వాతంత్ర్యం సాధించడానికి ప్రయత్నించడం ఒక "మూసుకుపోయిన దారి (డెడ్ ఎండ్)" లాంటిదని 2025 జూన్‌లో తైవాన్‌ను చైనా హెచ్చరించింది.
వార్తాసంస్థ ఏఎఫ్‌పీ ప్రకారం, డిసెంబర్‌లో తైవాన్‌కు 11.1 బిలియన్ డాలర్ల ఆయుధాల విక్రయానికి ట్రంప్ ఆమోదం తెలిపారు. కానీ, 14 బిలియన్ డాలర్ల ఆయుధ ఒప్పందంపై నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టారు. దీనిని 'చైనాతో బేరసారాలు ఆడేందుకు ఒక ముఖ్యమైన ఎత్తుగడ' అని ట్రంప్ అభివర్ణించారు.
చైనా దాడి చేస్తే తైవాన్‌ను రక్షిస్తారా లేదా అనే ప్రశ్నపై అమెరికా చాలాకాలంగా వ్యూహాత్మక అస్పష్టతను పాటిస్తోందని రాయిటర్స్ వార్తాసంస్థను ఉటంకిస్తూ బ్రిటిష్ పత్రిక గార్డియన్ రాసింది.
కానీ, దశాబ్దాల నాటి 'తైవాన్ రిలేషన్స్ యాక్ట్' కింద తైవాన్ రక్షణకు తగిన సైనిక పరికరాలను అమెరికా అందించాల్సి ఉంటుంది. గతవారం వాషింగ్టన్‌లో ట్రంప్‌తో జరిగిన సమావేశంలో "తైవాన్ స్వాతంత్ర్యాన్ని" వ్యతిరేకించాలని షీ జిన్‌పింగ్ కోరారు.
చైనా నుంచి పొంచి ఉన్న తీవ్రమైన సైనిక ముప్పు గురించి పెర్డ్యూ ఇంటర్వ్యూకు ముందు తైవాన్ ఉప విదేశాంగ మంత్రి చెన్ మింగ్-చి మాట్లాడారు.
"తైవాన్ జలసంధిలో పరిస్థితి తీవ్రంగా ఉంది. చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నా, వారు తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి నిరంతరం ఎక్కువ వనరులను వెచ్చిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో మా రక్షణ అవసరాలను అమెరికా బాగా అర్థం చేసుకుంటుంది" అని ఆయన తైపీలో మీడియాతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనాకు ఆయుధాల విక్రయంపై ఉన్న నిషేధ చట్టం ఏమిటి?
1989 జూన్‌లో చైనాలోని తియానన్మెన్ స్క్వేర్ వద్ద ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులపై చైనా ప్రభుత్వం తీసుకున్న హింసాత్మక చర్యల తర్వాత, అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ ఆ దేశానికి ఆయుధాలు, సైనిక సామగ్రి ఎగుమతిపై నిషేధం విధించారు.
ఆ తర్వాత 1990 ఫిబ్రవరిలో అమెరికా కాంగ్రెస్ పీఎల్ 101-246లోని సెక్షన్ 902 ద్వారా ఈ ఆంక్షలను శాశ్వతంగా చట్టంలో చేర్చి, వాటి పరిధిని విస్తరించింది.
ఈ చట్టం కింద, యూఎస్ మ్యూనిషన్ లిస్ట్‌లో ఉన్న రక్షణ సంబంధిత వస్తువులు, రక్షణ సేవల ఎగుమతి కోసం చైనాకు లైసెన్సులు జారీ చేయడాన్ని నిలిపివేశారు.
అంతేకాకుండా, నేర నియంత్రణకు సంబంధించిన పరికరాలు, కొన్ని ఉపగ్రహాలపై కూడా ఈ నిషేధం వర్తిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ విక్రేత
సీఎన్ఎన్ కథనం ప్రకారం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు అమెరికా. ఆ దేశ ఆయుధాలకు అతిపెద్ద కస్టమర్‌గా యూరప్ ఉంది.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) గణాంకాలను సీఎన్ఎన్ ఉటంకిస్తూ, 2020 నుంచి 2024 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా 43 శాతంగా ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆయుధ ఎగుమతి దేశమైన ఫ్రాన్స్ వాటాతో పోలిస్తే ఇది నాలుగు రెట్లకు పైనే.
సిప్రి రిపోర్టు ప్రకారం, 2015 నుంచి 2019 మధ్యకాలంలో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా 35 శాతం ఉండేది.
గత దశాబ్ద కాలంలో యూరప్ దేశాలు అమెరికా ఆయుధాలపై మరింతగా ఆధారపడ్డాయని రిపోర్టు ద్వారా తెలుస్తోందని సీఎన్ఎన్ రాసింది.
గత ఐదేళ్లలో (2022లో యూరప్ సరిహద్దుల్లో యుక్రెయిన్‌పై రష్యా చేసిన దాడితో సహా) యూరప్‌లోని నాటో దేశాలు దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో దాదాపు మూడింట రెండు వంతులు అమెరికాలో తయారైనవే. 2015 నుంచి 2019 మధ్య ఈ వాటా సగానికంటే కొంచెం ఎక్కువగా ఉండేది.
సిప్రి ప్రకారం, రెండు దశాబ్దాల్లో తొలిసారిగా అమెరికా ఆయుధ ఎగుమతుల్లో అత్యధిక భాగం మిడిల్ ఈస్ట్‌కు (మధ్యప్రాచ్యానికి) కాకుండా యూరప్ ప్రాంతానికి వెళ్లాయి.
రష్యా దాడి చేసిన తర్వాత అమెరికాతో సహా పలు దేశాల నుంచి యుక్రెయిన్ భారీ మొత్తంలో ఆయుధాలు, సైనిక పరికరాలను కొనుగోలు చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























