సిడ్నీ జంట హత్యలు: ‘ఉబెర్ ఈట్స్ రైడర్’లా వచ్చి మగ జంటను కాల్చి చంపిన పోలీసు అధికారి, మృతుల్లో ఒకరు ఆయన మాజీ బాయ్‌ఫ్రెండ్

ఫొటో సోర్స్, Supplied: Jesse Baird
- రచయిత, లానా లామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ మగ జంటను సర్వీస్ తుపాకీతో కాల్చి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ పోలీసు అధికారి, తన మాజీ ప్రియుడిపై ఉన్న 'అసూయ, మోజు' కారణంగానే ఈ హత్యలకు పాల్పడ్డారని ప్రాసిక్యూటర్లు స్థానిక కోర్టుకు తెలిపారు.
బ్యూమాంట్ లామార్-కాండన్ (31) అనే ఈ పోలీసాఫీసర్ జంట హత్య కేసులతో పాటు, అక్రమంగా ఇంట్లోకి చొరబడిన కేసులోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఉబెర్ డ్రైవర్ వేషంలో వెళ్లి ఈ ఘటనలకు పాల్పడ్డారని కోర్టుకు తెలిపింది ప్రాసిక్యూషన్.
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తిరస్కరించారు.
2024లో సిడ్నీ సమీపంలో ప్యాడింగ్టన్ ప్రాంతంలోని ఒక ఇంట్లో లామార్-కాండన్ ఈ హత్యలకు పాల్పడ్డారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
లామార్-కాండన్ తన మాజీ భాగస్వామి, టీవీ ప్రెజెంటర్ జెస్సీ బైర్డ్ (26)తో పాటు, ఆయన కొత్త భాగస్వామి, ఫ్లైట్ అటెండెంట్‌గా పని చేస్తున్న ల్యూక్ డేవిస్ (29)ను కాల్చి చంపారని అభియోగాలున్నాయి.


ఫొటో సోర్స్, Shutterstock
సిడ్నీకి 200 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామీణ ప్రాంతంలో సర్ఫ్‌బోర్డ్ బ్యాగుల్లో ఆ జంట మృతదేహాలు లభించాయి. కొంతకాలంపాటు సాగిన ప్రేమబంధం తర్వాత బైర్డ్ పట్ల లామార్-కాండన్ ఏ విధంగా ‘‘విపరీతమైన వ్యామోహం, అసూయ నిండిన ఆకర్షణ" పెంచుకున్నారో ప్రాసిక్యూటర్ బ్రెట్ హాట్‌ఫీల్డ్ వివరించారు.
ఆ పోలీసాఫీసర్ కంపల్సివ్ బిహేవియర్ (తనకే సొంతం అనే పట్టుదల నిండిన ప్రవర్తన)లో పడిపోయారని హాట్‌ఫీల్డ్ చెప్పారు. 2023 నవంబర్‌లో ఆయనతో బైర్డ్ పూర్తిగా సంబంధాలు తెంచుకున్న తర్వాత ఈ ప్రవర్తన మరింత తీవ్రమైందని చెప్పారు.
విడిపోయిన తర్వాతివారాల్లోనూ బైర్డ్‌ను లామార్-కాండన్ వెంబడించారని ప్రాసిక్యూటర్ తెలిపారు. తనకు క్యాన్సర్ ఉందని చెబుతూ ఓ స్నేహితుడి ఫోన్ నుంచి ఆయనకు మెసేజ్‌లు పంపారనీ, బైర్డ్ కారును ఉద్దేశపూర్వకంగా చెడగొట్టారని వివరించారు.
'తెల్లవారుజామున 4:30 గంటలకు అలారం'
ఈ హత్యలు జరిగిన రోజున, లామార్-కాండన్ స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:30 గంటలకు అలారం పెట్టుకున్నారని కోర్టుకు తెలిపారు హాట్‌ఫీల్డ్.
అదే రోజు తన స్నేహితుడికి టెక్ట్స్ మెసేజ్ చేస్తూ.."ఈ రాత్రి నీకు కాల్ చేసి వివరాలు చెబుతా. నేను ఈ పని చేస్తున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు దొరకవు" అని చెప్పారని ప్రాసిక్యూటర్ వెల్లడించారు.
ఆ తర్వాత లామార్-కాండన్ బర్నర్ ఫోన్ (గుర్తుపట్టకుండా వాడి పడేసే ఒక రకం ఫోన్) వాడారని, అద్దె కారు తీసుకుని ఉబెర్ డ్రైవర్ వేషంలో బైర్డ్ ఇంటి బయట మూడు గంటల పాటు వేచి ఉన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. బైర్డ్ మృతదేహాన్ని పారేయడానికి ముందుగానే సర్ఫ్‌బోర్డ్ బ్యాగ్‌ను కొన్నారని హాట్‌ఫీల్డ్ చెప్పారు.
ముందుగానే సంపాదించిన తాళంచెవితో బైర్డ్ ఇంట్లోకి ప్రవేశించిన లామార్-కాండన్, వంటగదిలో బైర్డ్‌ను కాల్చారని, ఈ కలకలం విని బెడ్‌రూమ్‌లో ఉన్న డేవిస్... సాయం కోసం ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేస్తుండగా ఆయన్ను కూడా కాల్చి చంపారని ప్రాసిక్యూషన్ వెల్లడించింది.
'పథకం ప్రకారమే హత్య'
నిందితుడు పక్కాగా పథకం పన్ని బైర్డ్‌ను హత్య చేశారని, ఆ ఘటనకు సాక్ష్యంగా మిగలకూడదన్న ఉద్దేశంతోనే డేవిస్‌ను కూడా చంపారనీ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు.
ఈ హత్యలు జరిగిన కొన్నిగంటలు, రోజుల తర్వాత కూడా బైర్డ్ మొబైల్ ఫోన్ నుంచి లామార్-కాండన్ మెసేజ్‌లు పంపడంతో పాటు, ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
లామార్-కాండన్ ఎదుర్కొంటున్న 'అగ్రవేటెడ్ బ్రేక్ అండ్ ఎంటర్' (అక్రమంగా ఇంట్లోకి చొరబడటం) అభియోగం 2023 ఆగస్టులో జరిగిన ఓ ఘటనకు సంబంధించినది. అప్పట్లో ఆయన బైర్డ్ ఇంట్లోకి చొరబడి ఫోన్, వాలెట్‌ను దొంగిలించారన్న ఆరోపణలు ఉన్నాయి.
బైర్డ్ మృతికి సంబంధించి 'మాన్‌స్లాటర్' (ఉద్దేశపూర్వకంగా చేయని హత్య) అనే ఒక్క అభియోగాన్ని మాత్రమే అంగీకరించేందుకు లామార్-కాండన్ గతంలో ముందుకొచ్చారనీ, అయితే దాన్ని తిరస్కరించినట్లు ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సిడ్నీ దక్షిణ ప్రాంతంలోని ఒక చెత్త బుట్టలో బైర్డ్, డేవిస్‌లకు చెందిన రక్తపు మరకలతో ఉన్న వస్తువులు లభ్యం కావడంతో పోలీసులు తొలిసారిగా ఈ హత్యల గురించి అప్రమత్తమయ్యారు. ఆ వారం చివర్లో లామార్-కాండన్ స్వయంగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవడంతో ఆయనపై కేసు నమోదు చేశారు.
ఈ హత్యలు జరిగిన 8 రోజుల తర్వాత అధికారులు ఆ జంట మృతదేహాలను గుర్తించారు. ఈ హత్య కేసులో అభియోగాలు నమోదైన కొన్ని వారాలకే, లామార్-కాండన్‌ను న్యూ సౌత్ వేల్స్ పోలీసులు విధుల నుంచి తొలగించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























