ఆకాశంలో ఒక తార రివ్యూ: భార్య కలను తన లక్ష్యంగా మార్చుకున్న భర్త కథ ప్రేక్షకులను మెప్పించిందా?

దుల్కర్ సల్మాన్, అల్లు అరవింద్, ఆకాశంలో ఒక తార, స్వ‌ప్న‌, గున్నం సందీప్ , ప‌వ‌న్ సాధినేని
ఫొటో క్యాప్షన్, దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా 'ఆకాశంలో ఒక తార' సినిమా ఇవాళ విడుదలైంది.
    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

అల్లు అరవింద్‌, స్వ‌ప్న‌, గున్నం సందీప్ స‌మ‌ర్ప‌ణ‌లో 'ఆకాశంలో ఒక తార' సినిమా వ‌చ్చింది. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరో, కొత్త న‌టి సాత్విక వీర‌వ‌ల్లి హీరోయిన్‌, ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌కుడు. దుల్క‌ర్ సినిమా అంటేనే ఒక పాజిటివ్ బ‌జ్‌.

క‌థ‌లో బ‌లం వుంటే త‌ప్ప ఒప్పుకోడ‌నే న‌మ్మ‌కం. మ‌రి ఈ సినిమా ఆయ‌న ఇమేజ్‌ని పెంచిందా?

క‌థ ఏమంటే... క‌ల్ప‌న (సాత్విక వీర‌వ‌ల్లి)కి చిన్న‌ప్ప‌టి నుంచి చ‌దువంటే ఇష్టం. న‌క్ష‌త్రాలు, ఆకాశం , అంత‌రిక్షం ఆమె క‌ల‌. ఆస్ట్రోనాట్ కావాల‌నే ఆశ‌యం.

క‌నీసం రోడ్డు కూడా లేని ప‌ల్లెటూరిలో పుట్టింది. తండ్రి దుర్మార్గుడు, త‌ల్లిని హింసిస్తూ ఉంటాడు. క‌ల్ప‌న‌ని చ‌దువు మాన్పించి డ్రైవ‌ర్ కృష్ణ (దుల్క‌ర్‌)తో పెళ్లి చేస్తాడు.

మొద‌టి రోజే త‌న భార్య చిన్న పిల్ల అని, చ‌దువు ఆమె ఆశ‌యం అని కృష్ణ‌కి అర్థ‌మ‌వుతుంది. ఆమెని కాలేజీలో చేర్పించి చ‌దివిస్తాడు. నాలుగేళ్లు గుజ‌రాత్‌లో ఉండి కాంట్రాక్ట్ లేబ‌ర్‌గా చాకిరి చేసి ఫీజులు క‌డ‌తాడు. మ‌రి క‌ల్ప‌న ల‌క్ష్యం నెర‌వేరిందా? అంత‌రిక్షంలోకి ఎగిరిందా? ఇది మిగ‌తా క‌థ‌.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇలాంటి క‌థలు మ‌న‌కి కొత్త‌కాదు. స్పోర్ట్స్ డ్రామాలు దంగ‌ల్‌, గురు (వెంక‌టేష్‌) ఈ కేట‌గిరీనే.

ఒక ల‌క్ష్యం, పేద‌రికం, తండ్రి లేదా గురువు అండ , ఎన్నో వైఫ‌ల్యాలు చివ‌రికి విజ‌య సాధ‌న‌. ఇదే టెంప్లేట్‌.

ఆకాశంలో ఒక తార‌లో కొత్త విష‌యం ఏమంటే భ‌ర్త అండ‌గా నిల‌బ‌డి ఎంతో ఓర్పుతో క‌ష్ట‌న‌ష్టాల‌తో ఆమెని వ్యోమ‌గామి చేస్తాడు.

దుల్కర్ సల్మాన్, అల్లు అరవింద్, ఆకాశంలో ఒక తార, స్వ‌ప్న‌, గున్నం సందీప్ , ప‌వ‌న్ సాధినేని
ఫొటో క్యాప్షన్, 'ఆకాశంలో ఒక తార' సినిమాలో కొత్త న‌టి సాత్విక వీర‌వ‌ల్లి హీరోయిన్‌‌గా నటించారు.

రాకెట్ సైన్స్‌తో భార్యాభర్తల ప్రేమను మిక్స్ చేసిన దర్శకుడు

రాకెట్ సైన్స్ అంద‌రికీ అర్థ‌మ‌య్యే స‌బ్జెక్ట్ కాదు. దీన్ని భార్యాభ‌ర్త‌ల ప్రేమ‌, ఎమోష‌న్స్‌తో ప్యాక్ చేసి ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ అందించాడు.

ఒక‌ప్పుడు అమృతం సీరియ‌ల్‌లో చిర‌ప‌రిచితుడైన గున్నం గంగరాజు స్క్రీన్ ప్లేలో పెద్ద హైప్స్‌, ట్విస్టులు లేవు గానీ, ద‌ర్శ‌కుడి రైటింగ్‌లో సున్నిత‌త్వం, భావం, హాస్యం క‌లిసి సినిమాని వేరే లెవెల్‌కి తీసుకెళ్లాయి. దీనికి తోడు తెర‌మీద వ‌చ్చే ప్ర‌తిచిన్న పాత్ర కూడా గుండెల‌కి హ‌త్తుకునేలా రిజిస్ట‌ర్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ సాధించాడు.

ఈ పాత్ర కోస‌మే పుట్టాడా అన్నంత బాగా దుల్క‌ర్ స‌ల్మాన్ చేశాడు. భార్య‌పై ఉన్న అపార‌మైన ప్రేమ‌, ఆమె ల‌క్ష్యం కోసం అత‌ని త‌ప‌న, చివ‌ర్లో ఆమెకి ఏమైనా ప్ర‌మాదం జ‌రుగుతుందేమోన‌నే భ‌యం అన్ని ర‌కాల భావోద్వేగాల్ని పండించాడు.

న‌టి సాత్విక‌కి ఇది తొలి సినిమా అంటే న‌మ్మాల‌నిపించ‌దు. ప‌ల్లెటూరి అమాయ‌క‌త్వం, అంత‌రిక్షంపై ఆకాంక్ష, భ‌ర్త‌పై ప్రేమ‌, ఎమోష‌న్స్ ఆమెలో సుల‌భంగా ప‌లికాయి. ఇంట‌ర్వెల్ సీన్‌లో నాలుగేళ్ల త‌ర్వాత భ‌ర్త‌ని చూసిన అనందం, ల‌క్ష్యంలో విఫ‌ల‌మైన బాధ ఏక‌కాలంలో సాత్విక చూపించిన ఒక ఎక్స్‌ప్రెష‌న్‌కే నేష‌న‌ల్ అవార్డ్ ఇవ్వొచ్చు.

దుల్కర్ సల్మాన్, అల్లు అరవింద్, ఆకాశంలో ఒక తార, స్వ‌ప్న‌, గున్నం సందీప్ , ప‌వ‌న్ సాధినేని
ఫొటో క్యాప్షన్, 'ఆకాశంలో ఒక తార' సినిమాను పవన్ సాధినేని దర్శకత్వం వహించారు.

శ్రుతిహాస‌న్ ఎంట్రీతో స్పీడ్ అందుకున్న కథ

ఇంట‌ర్వెల్ వ‌ర‌కు స్లో నెరేష‌న్‌తో సాగుతున్న సినిమా సెకెండాఫ్‌లో శ్రుతిహాస‌న్ ఎంట్రీతో మారిపోయింది. తెర‌మీద‌కి కొత్త ఉత్సాహాన్ని తెచ్చారు. ఆమె కెరీర్‌లో ది బెస్ట్ సినిమా ఇది. ముఖ్యంగా ఆమె ఇంట్లో ఫోన్‌లో క‌ల్ప‌న‌తో మాట్లాడే సీన్ సినిమాకే హైలైట్‌.

ఇరుముడిలో లేడీ విల‌న్‌గా క‌నిపించిన స్వాసిక‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. ఈ సినిమాలో దుల్క‌ర్‌కి అక్క‌గా న‌టించారు. గ‌ట్టిగా గ‌య్యాళిగా అరుస్తూ నెగెటివ్ షేడ్స్‌తో ఉండాల్సిన పాత్ర అది. కానీ ఆమె క‌ళ్ల‌తోనే మాట్లాడారు.

బిజిలీగా రుహానీశ‌ర్మ డైలాగ్‌లు ముద్దుముద్దుగా ఉన్నాయి. ముర‌ళీశ‌ర్మ‌, నాజ‌ర్‌, గౌతం వాసుదేవ్‌, కోట జ‌య‌రాం అంద‌రూ బాగా చేశారు. క్లుప్లంగా ఉన్న డైలాగ్‌లు సినిమాకి ప్రాణం.

  • ద‌గ్గ‌రైతే దూరం వెళ్ల‌లేనేమో
  • ఆకాశ‌మంత ఎత్తున్న ఆయ‌న భుజాల‌పై అంత‌రిక్షం చూసాను
  • కారుతో పాటు డ్రైవ‌ర్‌ని కూడా ఉంచేసుకో

ప్ర‌తి డైలాగ్‌లోనూ డెప్త్ ఉంటుంది. చివ‌రిలో తండ్రితో హీరోయిన్ మాట్లాడే సీన్ టాప్‌. ఈ మ‌ధ్య వ‌చ్చిన బెస్ట్ ఎమోష‌న‌ల్ రైటింగ్ ఈ సినిమా.

మామూలుగా అయితే అర‌వింద్‌, స్వ‌ప్న‌, గున్నం గంగ‌రాజు లాంటి గ‌ట్టి వంట‌వాళ్ల చేయి ప‌డిన‌ప్పుడు చెడిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌. ప్రేక్ష‌కుడి అదృష్టం కొద్దీ అన్నీ కుదిరాయి.

దుల్కర్ సల్మాన్, అల్లు అరవింద్, ఆకాశంలో ఒక తార, స్వ‌ప్న‌, గున్నం సందీప్ , ప‌వ‌న్ సాధినేని
ఫొటో క్యాప్షన్, 'ఆకాశంలో ఒక తార' సినిమాను అల్లు అరవింద్, స్వప్న, గున్నం సందీప్ సమర్పించారు.

'ఎమోషనల్ అంతరిక్ష యాత్ర'

జివి.ప్ర‌కాశ్ బిజిఎం, కెమెరా, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, ఎడిటింగ్ ప్ర‌తిదీ తూకంగా అమిరాయి.

అంత‌రిక్షానికి సంబంధించిన స‌న్నివేశాల్ని కూడా ఖ‌ర్చుకి వెనకాడ‌కుండా తీశారు. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. ఇప్ప‌టికీ ప‌ల్లెటూర్ల‌లో కాలేజీకి వెళ్ల‌లేని ప‌రిస్థితుల్లో అమ్మాయిలుంటున్నారు. వాళ్లంద‌రికీ ఇదొక ప్రేర‌ణ‌గా నిలిచే సినిమా.

ఇదే క‌థాంశంతో డియ‌ర్ ఆస్ట్రోనాట్ అనే చిన్న సినిమా ఇండ‌స్ట్రీలో రెడీగా ఉండ‌టం విచిత్ర‌మైన వివాదం.

దుల్క‌ర్ అన్ని సినిమాల్లో క‌నిపించే క‌మెడియ‌న్ మ‌హేశ్ అచంట ఒక సీన్‌లో ఉన్నాడు.

ఇంత క్లీన్‌గా ఉన్న మూవీలో ఒక రాజ‌కీయ నాయ‌కుడిని గుర్తుకు తెచ్చే సెటైర్ మ‌హేశ్‌తో ప‌లికించ‌డం బ్యాడ్ టేస్ట్‌.

ప్ల‌స్ పాయింట్స్ః

  • దుల్క‌ర్‌, సాత్విక న‌ట‌న‌
  • డైలాగ్స్‌
  • బిజిఎం, కెమెరా

మైన‌స్ పాయింట్స్ః

  • వెతికి మ‌రీ చెప్ప‌డం అన‌వ‌స‌రం.

ఫైన‌ల్‌గా ఇదో ఎమోష‌న‌ల్ అంత‌రిక్ష యాత్ర‌.

(అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)