ధనుష్ 'ఓ.ఎం' రివ్యూ: ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సహజత్వానికి దగ్గరగా తీసిన సినిమా

ఫొటో సోర్స్, Dhanush/x.com
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఓ.ఎం: ఆపరేషన్ మోల్'.
'అమరన్' సినిమా తీసిన రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై డ్రామా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చిందంటే....
ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి అబ్దుల్ హమీద్ (నసీరుద్దీన్ షా)ను పట్టుకునే బాధ్యత స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి నిత్యారెడ్డి (సాయి పల్లవి)కి అప్పగిస్తారు.
ఈ నెట్‌వర్క్‌లోకి చొరబడేందుకు తిరు (ధనుష్)ను అండర్‌కవర్ ఆపరేషన్ కోసం ఎంపిక చేస్తారు.
స్థానిక స్మగ్లింగ్ కింగ్‌పిన్ కార్తికేయన్ అలియాస్ సియా (మమ్ముట్టి) గ్యాంగ్‌లోకి తిరుని పంపిస్తారు.
తిరు ఫొటోగ్రాఫర్‌గా మారి సియా గ్యాంగ్‌లోకి చొరబడతాడు.
మరి అబ్దుల్ హమీద్‌ను పట్టుకున్నారా? సియా ఈ స్మగ్లింగ్‌లోకి ఎందుకు వచ్చాడు?
తిరుతో తనకి ఎలాంటి బంధం ఏర్పడింది? ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా లేదా? అనేది మిగతా కథ.

‘పుష్ప’కి మరో కోణం
ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'పుష్ప' పెద్ద విజయం అందుకుంది. కాకపోతే ఎర్రచందనం స్మగ్లింగ్ పుష్పలో చూపించినంత తేలికగా ఉండదు.
నిజ జీవితంలో ఆ స్మగ్లింగ్ వెనుక రక్తచరిత్ర దాగుంది. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో జరిపిన కాల్పుల్లో అనేకమంది మరణించిన ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా 2015లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు 20 మంది కూలీలు, స్మగ్లర్లు మరణించిన ఘటన తెలుగు, తమిళనాట సంచలనం రేపింది.
ఇలాంటి ఘటనల్లో కూలీలు, పోలీసులు అన్ని వైపులా నష్టపోతారు. ఇలాంటి వాస్తవ ఘటనను ఆధారంగా తీసుకొని, కల్పిత పాత్రలతో వాస్తవానికి కాస్త దగ్గరగా ఉండే సన్నివేశాలతో ఈ సినిమాని తీర్చిదిద్దాడు దర్శకుడు రాజ్‌కుమార్.

ఫొటో సోర్స్, sreeleela14/insta
విరామం వరకు నిదానమేనా?
కమర్షియల్ స్పై థ్రిల్లర్ కథకు భిన్నంగా, ఎమోషన్స్‌తో కూడిన పోలీస్ ప్రొసీజురల్ డ్రామాగా సినిమాను నడిపారు. హీరోను తిరుగులేని శక్తిగా చూపించడానికి బదులుగా, అతడి ఇమేజ్‌ను పూర్తిగా పక్కనపెట్టి వాస్తవానికి దగ్గరగా తీర్చిదిద్దిన సినిమా ఇది.
కథ సాదాసీదాగా మొదలవుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్, అందులో గిరిజనులు ఎలా దోపిడీకి గురవుతున్నారు అనే అంశాలను వివరిస్తూ కథ మొదలవుతుంది. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవిలకు వారి పాత్రల నేపథ్యాలను, వారి లక్ష్యాలను పరిచయం చేస్తూ ప్రత్యేకమైన సన్నివేశాలు కేటాయించారు.
ధనుష్, శ్రీలీల మధ్య వచ్చే వైవాహిక విభేదాల సన్నివేశాలు కథకు పెద్దగా ఉపయోగపడవు. ఈ కథలో స్టార్స్ ఉన్నప్పటికీ హై మూమెంట్స్ జోలికి వెళ్లలేదు. ఇంటర్వెల్ వరకూ సినిమాని నిదానంగా నడిపారు. విరామంలో తిరు పాత్ర ఎమోషనల్‌గా కుప్పకూలిపోయే సన్నివేశం మాత్రం కథలో వేగం తీసుకొస్తుంది.

ఫొటో సోర్స్, dhanushkraja/insta
సెకండ్ హాఫ్ సేవియర్ డ్రామా పండిందా?
తొలి సగం నిదానంగా ఉన్నప్పటికీ, దర్శకుడు ఏదో సీరియస్‌గా ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది.
సెకండ్ హాఫ్‌లో ఈ కథను తిరు కోణంలోకి తీసుకొచ్చారు. అక్కడ కూలీలకు జరిగిన అన్యాయం చూసి చలించి, వారి కోసం పాటు పడే విధంగా కొన్ని సన్నివేశాలు నడిపారు.
ఈ క్రమంలో ఒక మంచి హై మూమెంట్ కూడా వస్తుంది. అక్కడ హీరోయిజం బాగున్నప్పటికీ ఈ కథను ఆ సన్నివేశం ఎలాంటి మలుపు తిప్పలేకపోయింది. మళ్లీ కథను తను సేకరించిన సమాచారం, వాస్తవాల ఆధారంగా తీసుకెళ్లే సన్నివేశాలు నడిపారు.

ఫొటో సోర్స్, dhanushkraja/insta
ధనుష్, మమ్ముట్టి ఇద్దరూ ఇద్దరే
ధనుష్ చేసిన తిరు పాత్రలో ఏజెంట్‌గా తెలివితేటలతో పాటు భావోద్వేగాలు కూడా సమపాళ్లలో ఉన్నాయి. ఆ పాత్రను మరోసారి తనదైన శైలిలో ఆకళింపు చేసుకొని ప్రదర్శించాడు.
కోర్టులో సాక్ష్యం చెబుతున్నప్పుడు మమ్ముట్టి కళ్లల్లోకి చూడలేకపోయే సన్నివేశం, విరామంలో ఎమోషనల్‌గా కూలిపోవడం ధనుష్ నటనకు గీటురాయి.
మమ్ముట్టి పాత్రలో హీరోయిజం లేదు కానీ కావాల్సినంత హ్యూమనిజం ఉంది.
ఎర్రచందనం స్మగ్లర్లలోనూ మానవత్వం ఉంటుందని చూపించే పాత్ర అది.
జైల్లో తనను కాపాడటానికి పోలీసులు చేసిన పోరాటం వ్యవస్థపై గౌరవం పెంచేలా ఉంటుంది. ఈ ఇద్దరూ తమదైన నటనతో మెప్పించారు.

ఫొటో సోర్స్, saipallavi.senthamarai/insta
నారాయణ సేవ చేసిన సాయి పల్లవి
'అమరన్'లో బలమైన స్త్రీ పాత్ర రాసిన దర్శకుడు రాజ్‌కుమార్, 'ఓ.ఎం'లో కూడా అంతకంటే బలమైన పాత్ర రాశాడు. నిజానికి ఇది నిత్యారెడ్డి కథే.
ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక కొందరి ధనదాహం ఉంది. అలాంటి వాళ్లని పట్టుకుంటే అమాయకులైన కూలీలకు ఇలాంటి గతి పట్టదనుకునే గొప్ప లక్ష్యంతో ముందుకు నడిచే పాత్రలో సాయి పల్లవి నటన మరోస్థాయిలో ఉంటుంది.
విధి నిర్వహణలో తన తండ్రిని, భర్తను కోల్పోయిన నిత్య చివరికి తన ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా జైల్ బ్రేక్ ఎపిసోడ్‌లో చేసిన పోరాటం 'నారాయణ సేవ'కు అసలు అర్థాన్ని నిర్వచిస్తుంది.
శ్రీలీల పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ, తన పరిధిలో బాగానే నటించారు. నసీరుద్దీన్ షా లాంటి మేటి నటుడికి తగ్గ పాత్ర అయితే కాదు. ఇంద్రన్స్ మరోసారి తండ్రి పాత్రల్లో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నారు. టీఎస్‌కే, ప్రసన్న, రేణు దేశాయ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాయి అభ్యంకర్ మంచి జోష్‌లో ఉన్నాడు. ఆయన సంగీతం ఈ సినిమాకు మంచి బలాన్ని ఇచ్చింది. 'వీజా వీరా' ట్రాక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పవర్‌ఫుల్‌గా కుదిరాయి. ఎళిల్ అరసు సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి విజువల్ అప్పీల్‌ను తీసుకొచ్చింది.
'ఓ.ఎం: ఆపరేషన్ మోల్' హీరో ఎలివేషన్స్, హై మూమెంట్స్‌పై ఆధారపడకుండా, సహజత్వానికి దగ్గరగా ఉండే సిన్సియర్ పోలీస్ ప్రొసీజురల్ డ్రామా. రెగ్యులర్ స్పై థ్రిల్లర్ తరహాలో ఉత్కంఠను ఆశించే ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. కానీ వాస్తవాలు, మానవీయ కోణాలను ఇష్టపడేవారికి ఇందులో కొన్ని మూమెంట్స్ మంచి ఎమోషన్‌తో కనెక్ట్ అవుతాయి.
(ఈ కథనంలో అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























