ఎలాంటి దిండు వాడితే మెడనొప్పి వంటి సమస్యలు రావు.. ఎవరికి ఏది సూటవుతుంది?

తలగడ, క్రిస్ మెక్ కార్తీ, సైకాలజిస్టు
ఫొటో క్యాప్షన్, నిద్రపోయే భంగిమను బట్టి మీకు ఎలాంటి దిండు అవసరమో డాక్టర్ క్రిస్ మెక్ కార్తీ కొన్ని సూచనలు చేశారు.
    • రచయిత, జార్జీ శాండీమాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

"నేను కూడా అలాంటి వాళ్లలో ఒకడినే. నేను నా దిండును నాతో పాటే తీసుకెళ్తాను" అంటారు డాక్టర్ క్రిస్ మెక్‌కార్తీ.

ఎయిర్‌పోర్ట్‌లో తమ సూట్‌కేసులను లాగుతూ చేతి కింద దిండును ఇరికించుకుని వెళ్లే వారిని మీరు చూసే ఉంటారు.

లేదా మీరే అలాంటి వారై ఉండవచ్చు.

రాత్రంతా హాయిగా నిద్రపోవడానికి వీలుగా ఉండే మెత్తటి గట్టి దిండుతో మీకు విడదీయరాని బంధం ఉండి ఉండవచ్చు.

తానేమీ మరీ అంత పట్టింపులు ఉన్న వ్యక్తిని కాదని మెక్‌కార్తీ చెబుతున్నారు. ఆయన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సరైన దిండు వాడకపోతే మెడనొప్పి వస్తుందని ఆయనకు బాగా తెలుసు.

ఆయన విదేశాలకు వెళ్లేటప్పుడు దిండును తీసుకెళ్లరు కానీ, హోటల్‌కు చేరుకోగానే అక్కడ ఉన్న దిండ్లను తనకు నచ్చినట్లుగా సర్దుబాటు చేసుకుంటారు.

ఎంతటి నాసిరకం దిండైనా సరే ప్రశాంతంగా నిద్రపోయేలా మార్చుకోవడానికి ఆయన దగ్గర ఒక అద్భుతమైన చిట్కా ఉంది.

మీకు సరిపోయే పర్ఫెక్ట్ దిండును ఎలా ఎంచుకోవాలో ఆయన కొన్ని సూచనలు చేశారు.

తలగడ, క్రిస్ మెక్ కార్తీ, సైకాలజిస్టు
ఫొటో క్యాప్షన్, వెల్లకిలా పడుకునే వారు మెడకు సౌకర్యవంతంగా ఉండే దిండును వాడాలని మెక్ కార్తీ సూచించారు.

మీరు ఎలా పడుకుంటారు?

మాంచెస్టర్ స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మెక్‌కార్తీ ప్రకారం మీరు పడుకునే భంగిమను బట్టే మీకు ఎలాంటి దిండు కావాలో ఆధారపడి ఉంటుంది.

మెజారిటీ ప్రజలు మూడు కేటగిరీలలో.. అంటే పక్కకు ఒత్తిగిలి, వెల్లకిలా లేదా బోర్లా ఏదో ఒక పద్ధతిలో పడుకుంటారని ఆయన బీబీసీ 'స్లైస్డ్ బ్రెడ్' పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.

అయితే బోర్లా పడుకోవద్దని మెక్ కార్తీ నిరుత్సాహపరుస్తారు.

ఎందుకంటే దీనివల్ల మెడ చాలా సేపు ఒకే వైపుకు తిరిగి ఉంటుంది.

"దీనివల్ల కండరాలు లేదా లిగమెంట్లు సాగి, నొప్పికి దారితీస్తాయి" అని ఆయన చెప్పారు. "ఫిజియోథెరపీ ప్రపంచంలో వెన్నునొప్పి చికిత్సకు సంబంధించి అందరూ ఏకాభిప్రాయానికి వచ్చే ఒకే ఒక్క విషయం ఏంటంటే.. బోర్లా పడుకోవద్దని" అని మెక్ కార్తీ అన్నారు.

దిండును ఎంచుకునేటప్పుడు వెల్లకిలా పడుకునే వారు తమ వెన్నెముక పైభాగంలో ఉండే వంపును గమనించాలి. వయసు పెరిగే కొద్దీ ఈ వంపు సహజంగానే పెరుగుతుంది. మీకు వెన్నుభాగంలో వంపు ఎక్కువగా ఉంటే "వెన్ను ఫ్లాట్‌గా ఉన్నవారితో పోలిస్తే మీకు కొంచెం లావుపాటి దిండు అవసరమవుతుంది" అని మెక్‌కార్తీ చెప్పారు.

ఇక పక్కకు ఒత్తిగిలి పడుకునే వారికి వారి భుజాల వెడల్పు చాలా ముఖ్యం. సాధారణంగా భుజాలు ఎంత వెడల్పుగా ఉంటే, అంత లావుపాటి దిండు అవసరమవుతుంది. కానీ దీనితో పాటు మీరు పడుకునే పరుపు ఎలా ఉందో కూడా చూసుకోవాలి.

తలగడ, క్రిస్ మెక్ కార్తీ, సైకాలజిస్టు
ఫొటో క్యాప్షన్, పక్కకు తిరిగి పడుకునే వారు వెడల్పాటి ఛాతీ ఉండేవారు గట్టిగా ఉండే దిండు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

మీ పరుపు ఎంత మెత్తగా ఉంది?

మీరు పరుపులోకి ఎంతవరకు కూరుకుపోతారనే దానిపైనే మీకు కావలసిన దిండు ఎత్తు ఆధారపడి ఉంటుందని మెక్‌కార్తీ చెప్పారు.

"మీరు చాలా గట్టిగా ఉండే పరుపును వాడుతుంటే, వెడల్పాటి భుజాలు ఉన్నవారికి లావుపాటి దిండు కావాలి" అని ఆయన వివరించారు.

"అదే మెత్తటి పరుపు అయితే మీ భుజం పరుపులోకి ఎక్కువగా కూరుకుపోతుంది కాబట్టి మీకు పలచటి దిండు అవసరమవుతుంది" అని కార్తీ తెలిపారు.

వెల్లకిలా పడుకునే వారికి ఈ సమస్య పెద్దగా ఉండదు.

ఎందుకంటే వారు పక్కకు పడుకునే వారిలా పరుపులోకి ఎక్కువగా కూరుకుపోరు.

మీ దిండు మరీ పలచగా ఉన్నట్లు అనిపిస్తే దాని కింద ఒక టవల్‌ను మడతపెట్టి ఉంచాలని మెక్‌కార్తీ సూచిస్తున్నారు.

మీకు సరిపోయే ఎత్తు వచ్చే వరకు టవల్ మడతలను సర్దుబాటు చేసుకోవచ్చు.

ఆ తర్వాత ఆ కొలత ఆధారంగా మీరు కొత్త దిండును కొనుగోలు చేయవచ్చు.

తలగడ, క్రిస్ మెక్ కార్తీ, సైకాలజిస్టు
ఫొటో క్యాప్షన్, వెల్లకిలా పడుకునే వారి కోసం మధ్యలో పల్లంగా ఉండి రెండు వైపులా ఎత్తుగా ఉండే దిండ్లను కంపెనీలు అమ్ముతున్నాయి.

ఎలాంటి షేప్ ఉత్తమం?

మార్కెట్‌లో కాంటోర్డ్, ఎర్గోనామిక్ లేదా ఆర్థోపెడిక్ వంటి ప్రత్యేక దిండ్ల ప్రకటనలు కనిపిస్తుంటాయి.

కానీ, ఇవి ఎంతవరకు పనిచేస్తాయనే దానికి పూర్తి ఆధారాలు లేవని మెక్‌కార్తీ అంటారు.

"దిండు ముందు భాగం కొద్దిగా ఎత్తుగా ఉండి మెడ భాగంలో సపోర్ట్ ఇచ్చేలా ఉంటే అది పక్కకు పడుకునే వారికి సహాయపడుతుందని చెప్పడానికి కొన్ని చిన్నపాటి ఆధారాలు ఉన్నాయి" అని ఆయన చెప్పారు.

ఈ ఎత్తైన ముందు భాగం మీకు నిద్రపోవడానికి సహాయపడుతుందో లేదో తెలుసుకోవడానికి మీరు మెక్‌కార్తీ చెప్పిన టవల్ చిట్కాను ప్రయత్నించవచ్చు.

ఒక టవల్‌ను రోల్ చేసి మీ దిండు కింద మెడ వచ్చే భాగంలో ఉంచండి.

పక్కకు పడుకునే వారు తమ వెన్ను నిటారుగా ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు.

వెల్లకిలా పడుకునే వారి కోసం, మధ్యలో పల్లంగా ఉండి రెండు వైపులా ఎత్తుగా ఉండే దిండ్లను కంపెనీలు అమ్ముతుంటాయి.

ఇది ప్రజలు మంచి పొజిషన్‌లో పడుకోవడానికి సహాయపడుతుందని మెక్‌కార్తీ అంగీకరించారు.

అయితే ఆయన పేషెంట్లలో కొందరు ఇవి కొద్దిగా ఇరుకుగా ఉండి ఊపిరాడనట్లు అనిపించాయని చెప్పారు.

పెద్ద, బరువైన తల ఉన్నవారికి కూడా కాస్త లావుగా గట్టిగా ఉండే దిండు అవసరమని ఆయన పేర్కొన్నారు.

తలగడ, క్రిస్ మెక్ కార్తీ, సైకాలజిస్టు
ఫొటో క్యాప్షన్, దిండ్ల కింది భాగంలో గట్టి మెటీరియల్‌ను వాడటం వల్ల రాత్రంతా దిండు ఆకారం మారకుండా ఉంటుంది.

ఈకలు డౌన్ ఫిల్లింగ్స్ ఉన్న దిండ్లు తల నుంచి వేడిని దూరం చేస్తాయి కాబట్టి వేసవి రాత్రులలో ఇవి మిమ్మల్ని చల్లగా ఉంచుతాయని మెక్‌కార్తీ చెప్పారు.

కానీ రాత్రి పూట పదే పదే అటు ఇటు కదిలేవారికి వీటి ఆకారం మారిపోతుంది. దిండులోని ఈకలన్నీ మంచం పైభాగానికి చేరి ముద్దగా మారిపోతాయి.

"మొదట్లో ఫ్లాట్‌గా సపోర్టివ్‌గా ఉన్న దిండు ఆ తర్వాత ఒక వైపు ఎత్తుగా మారిపోతుంది. దీనివల్ల మెడ వంగిపోతుంది" అని ఆయన సూచించారు.

హోలో ఫైబర్, మైక్రోఫైబర్ ఫిల్లింగ్స్ ఉన్న దిండ్లు వాటి ఆకారాన్ని బాగా నిలిపి ఉంచుతాయి. అయితే ఇవి వేడిని అంతగా దూరం చేయలేవని మెక్‌కార్తీ తెలిపారు.

కొన్ని దిండ్ల కింది భాగంలో గట్టి మెటీరియల్‌ను వాడుతుంటారు.

ఇది రాత్రంతా దిండు ఆకారం మారకుండా ఉంచడానికి సహాయపడుతుంది.

మెక్‌కార్తీ ఐదేళ్ల క్రితం సుమారు 50 పౌండ్లు (రూ. 6345) పెట్టి ఒక ఫోమ్ దిండును కొనుగోలు చేశారు.

ఇందులో గాలి వెళ్లడానికి ట్యూబ్ లాంటి ఖాళీ స్థలాలు ఉన్నాయి.

పక్కకు పడుకునే అలవాటు ఉన్న ఆయన ఈ దిండు కింద మడతపెట్టిన టవల్‌ను ఉంచి దాని ఎత్తును సర్దుబాటు చేసుకుంటారు.

దిండు ఎంపిక అనేది పూర్తిగా ఎవరి వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.

కొన్ని కంపెనీలు ఇచ్చే ట్రయల్ పీరియడ్ ఆఫర్లను ఉపయోగించుకోవాలని ఆయన ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

"అందరికీ లేదా అన్ని పొజిషన్లకు సరిపోయే ఒకే ఒక్క పర్ఫెక్ట్ డిజైన్ అంటూ ఏదీ లేదు. మీకు తగ్గట్టుగా దీన్ని మీరే పర్సనలైజ్ చేసుకోవాలి" అని ఆయన స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)