అయిదు రోజుల ‘గాయత్రీ జపం’ జరుగుతుండగా భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. రంగంలోకి కమాండోలు, తర్వాత ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Aman Gupta
- రచయిత, గౌరవ్ గుల్మోహర్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
(ఈ కథనంలో కలచివేసే అంశాలుండొచ్చు)
ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మరణించారు.
అహ్రౌలా పోలీస్‌స్టేషన్ పరిధిలోని శంభూపుర్ గ్రామంలో భార్య, కుమారుడితో పాటు ఇంట్లో అయిదు రోజుల గాయత్రీ జపం నిర్వహించేందుకు వచ్చిన ఇద్దరు పూజారులను మంగళవారం అరవింద్ సింగ్ అనే వ్యక్తి కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.
అరవింద్ సింగ్ తల్లి మీడియా ముందు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
"ఇంట్లో గాయత్రీ జపం జరుగుతున్నప్పుడు ఇది జరిగింది" అని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమం అయిదు రోజుల పాటు నిర్వహించేందుకు ఆ కుటుంబం ఏర్పాట్లు చేసుకుంది. అయితే నాలుగో రోజు అరవింద్ సింగ్‌కు కార్యక్రమంలో పాల్గొన్న పూజారులతో వాగ్వాదం జరిగినట్లు అక్కడున్నవారు చెబుతున్నారు.

‘అరవింద్ సింగ్ తన లైసెన్స్డ్ పిస్టల్‌తో పూజారులపై కాల్పులు జరిపాడు. వారిని కాపాడేందుకు వచ్చిన అతని భార్య కూడా తుపాకీ కాల్పుల్లో మరణించారు’ అని పోలీసులు తెలిపారు.
‘ఆ తర్వాత అరవింద్ సింగ్ తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. దీంతో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ఎస్ఓజీ కమాండోలను కూడా పిలిపించారు’ అని చెప్పారు.
దాదాపు ఏడు గంటల తర్వాత పోలీసులు గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించామని, అదే సమయంలో అరవింద్ ఒక చిన్నారితోపాటు తమ సిబ్బందిపై కూడా కాల్పులు జరిపాడని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Aman Gupta
"పోలీసులు అక్కడికి వెళ్లాక నిందితుడు పిల్లలను ఇంట్లోని గదిలో బంధించి, పోలీసులు, కుటుంబ సభ్యులపై కాల్పులు జరుపుతానని బెదిరించాడు. తన కొడుకును కూడా కాల్చాడు. పోలీసులపై కాల్పులు మొదలుపెట్టాడు. పిల్లల భద్రత, ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడు, అతని కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు" అని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ మీడియాకు తెలిపారు.

ఫొటో సోర్స్, Aman Gupta
అసలేం జరిగింది?
అరవింద్ సింగ్ మంగళవారం సాయంత్రం సుమారు ఆరు గంటలకు ఇంటికొచ్చారని, ఆ టైంలో ఇంట్లో పూజ జరుగుతోందని, అక్కడ ఆయన భార్య బబితా సింగ్‌తో పాటు ఇద్దరు పూజారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
"రెండుమూడు నెలలుగా అరవింద్ ఇబ్బందుల్లో ఉన్నారని గ్రామస్థులు మాకు చెప్పారు. ఆయన చిరాకు పడుతూ, తరచూ గొడవలు పడేవారు. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకు చికిత్స కూడా తీసుకుంటున్నారని వారు తెలిపారు. ఈ కారణాలతోనే ఆయన భార్య ఇంట్లో ఐదు రోజుల పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు" అని ఆజంగఢ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ చిరాగ్ జైన్ బీబీసీతో చెప్పారు.
"నాలుగో రోజు అరవింద్ సింగ్‌కు ఏమైందో తెలియదు కానీ, ఆయన పూజారులను 'మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు?' అని అడగి, వారిని తిట్టాడు. భార్య అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఆమెపై కాల్పులు జరిపాడు. పూజారులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిపైనా కాల్పులు జరిపారు. ఒక పూజారి గోడ దూకి అక్కడి నుంచి తప్పించుకున్నారు" అని ఆయన తెలిపారు.
మృతిచెందిన పూజారులను మహేంద్ర పాఠక్, అఖిలేశ్ మిశ్రాగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
ముగ్గురిని హత్య చేసిన తర్వాత అరవింద్ తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంట్లోని ఒక గదిలోకి వెళ్లి, లోపలి నుంచి లాక్ చేసుకున్నారు.
ఈ సమాచారం అందగానే పెద్ద సంఖ్యలో పోలీసులు గ్రామానికి చేరుకుని అరవింద్ ఇంటివద్ద మోహరించారు. అయితే అరవింద్ గది నుంచి బయటకు రావడానికి అంగీకరించలేదు. దీంతో ఈ ఉద్రిక్త పరిస్థితి చాలా సేపు కొనసాగింది.
‘తర్వాత అరవింద్ సింగ్‌కు, తమకు మధ్య జరిగిన కాల్పుల్లో అరవింద్ సింగ్ మరణించారు’ అని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Aman Gupta
తప్పించుకున్న పూజారి ఏం చెప్పారు?
పూజారి అఖిలేశ్ మిశ్రాతో పాటు ఆయన కుమారుడు హిమాన్షు మిశ్రా కూడా ఈ పూజ జరిపించడానికి వచ్చారు. ఘటన సమయంలో ఆయన అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఆ పూజ గాయత్రీ జపం అని ఆయన తెలిపారు.
"ఇది ఐదు రోజుల పూజ. మూడు రోజుల పాటు బాగానే జరిగింది. కానీ నాలుగో రోజు ఇలా జరిగింది. అరవింద్ సింగ్‌కు ఈ పూజపై ఏమాత్రం ఆసక్తి లేదు. ఆయన తన భార్యను కూడా పూజలో కూర్చోనివ్వలేదు" అని హిమాన్షు మిశ్రా బీబీసీకి తెలిపారు.
ఈ ఘటన ఎలా జరిగిందో, తన ప్రాణాలు ఎలా కాపాడుకున్నారో హిమాన్షు వివరించారు..
"ఆ రోజు మేం పూజ ముగించుకుని బయలుదేరేటప్పుడు, అరవింద్ సింగ్ అక్కడికి వచ్చారు. మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? అని అడిగారు. మీ అమ్మగారు పిలిచారు అని మా నాన్న చెప్పారు. దానికి ఆయన నా పర్మిషన్ లేకుండా ఎలా వచ్చారు? అన్నారు"
"తర్వాత ఆయన 'ఆధార్ కార్డు చూపించండి' అన్నారు. మా నాన్న 'మా దుస్తులు చూస్తే మేమెవరో అర్థం కావడం లేదా? రేపు ఆధార్ కార్డు తీసుకొస్తాం, అప్పుడు చూసుకోండి' అని చెప్పారు. ఇంతలో ఆయన కర్ర తీసుకుని వచ్చి దాడి చేశారు. ఆయన భార్య, మేనకోడలు, తల్లి అడ్డుకునేందుకు రావడంతో రివాల్వర్ తీసి కాల్పులు జరిపారు. మొదటి బుల్లెట్ ఆయన భార్య బబితా సింగ్‌కు తగిలింది"
"మరో పూజారి మహేంద్ర పాఠక్ పారిపోవడానికి ప్రయత్నించగా వెనుక నుంచి ఆయన్ని కాల్చాడు. మా నాన్న (అఖిలేశ్ మిశ్రా)పై కూడా కాల్పులు జరిపాడు. బుల్లెట్ రాసుకుంటూపోవడంతో తలకు కొద్దిగా తగిలింది. నేను గోడ దూకి పారిపోయాను. తర్వాత ఆయన మళ్లీ మా నాన్న తలపై కాల్చారు" అని చెప్పారు.
ఈ ఘటన సమయంలో పోలీసులు చేపట్టిన చర్యలను ప్రత్యక్షంగా చూసిన గ్రామస్థుడు హరిశంకర్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు.
"నేను రాత్రి సుమారు ఎనిమిది గంటలకు వచ్చాను. అప్పటికే అక్కడ 200 మందికి పైగా పోలీసులు ఉన్నారు. ఎస్పీ కూడా ఆపరేషన్‌లో పాల్గొన్నారు. మేమంతా పోలీసులకు సుమారు 40 మీటర్ల దూరంలో ఉన్నాం. పోలీసులు, అరవింద్ సింగ్ ఏం మాట్లాడుకుంటున్నారో మాకు వినిపించలేదు. అయితే కనీసం 25-30 రౌండ్ల కాల్పులు జరిగి ఉంటాయి" అని ఆయన బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Aman Gupta
పిల్లల్ని చంపేస్తానని బెదిరింపు
ఆజమ్గఢ్లోని శంభూపూర్ గ్రామంలో ఈ ఘటన మంగళవారం సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో జరిగింది.
"శంభూపూర్ గ్రామంలో ముగ్గురి హత్య జరిగిందని అహ్రౌలా పోలీస్‌స్టేషన్‌కు, 112 నంబర్‌కు సమాచారం అందింది. సుమారు 6:30 గంటలకు పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ ఘటనాస్థలికి చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు సర్కిల్ ఆఫీసర్, 8:30 గంటలలోపు ఎస్ఎస్పీ, డీఐజీ, ఏడీజీ కూడా అక్కడికి చేరుకున్నారు" అని అదనపు పోలీసు సూపరింటెండెంట్ చిరాగ్ జైన్ బీబీసీతో చెప్పారు.
అరవింద్ సింగ్‌ను కొన్నిగంటలపాటు లొంగిపోవాలని కోరినప్పటికీ, ఆయన అంగీకరించలేదని, పిల్లలను చంపుతానని కూడా పదేపదే బెదిరించాడని పోలీసులు తెలిపారు.
ఈ ఉద్రిక్తత ఎంతసేపు కొనసాగింది? అరవింద్ కుమారుడు శౌర్య ఏ పరిస్థితుల్లో మరణించాడు? అని ఆయన్ను అడిగింది బీబీసీ.
దీనిపై చిరాగ్ జైన్ మాట్లాడుతూ, "పోలీసులు, చుట్టుపక్కల ఉన్నవారు కూడా లొంగిపోవాలని అతనికి నచ్చజెప్పారు. కానీ అతను పదేపదే బెదిరిస్తూనే ఉన్నాడు. అకస్మాత్తుగా ఇంట్లో నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించడంతో ఎస్ఓజీకి చెందిన ఇద్దరు సిబ్బంది, ఎస్ఎస్పీ తలుపు పగలగొట్టి, మంచం చాటునుండి లోపలికి వెళ్లారు. అవతలి వైపు నుంచి అరవింద్ కాల్పులు జరపగా, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను గాయపడ్డాడు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Aman Gupta
కమాండోల సాయం తీసుకున్నారా?
ఈ ఆపరేషన్ కోసం కమాండోలను పిలిపించినప్పటికీ, వారు ఇంట్లోకి వెళ్లలేదు" అని చిరాగ్ జైన్ తెలిపారు.
మృతిచెందిన పూజారి మహేంద్ర పాఠక్ మేనల్లుడు బజరంగీ పాఠక్ బీబీసీతో మాట్లాడారు.
"ఘటన జరిగినప్పుడు నేను ఒకచోట పూజ చేస్తున్నా. మీ మామయ్యపై కాల్పులు జరిగాయని నాకు ఫోన్ వచ్చింది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వెళ్లా. నేను వెళ్లేసరికి అరవింద్ గదిలోనే లాక్ చేసుకుని ఉన్నాడు. పోలీసులు కూడా అక్కడే ఉన్నారు" అని ఆయన తెలిపారు.
"మా మామయ్య తలకు ఒక బుల్లెట్ తగిలింది. ఆయన అక్కడికక్కడే మరణించారు. తల వెనుక వైపు నుంచి బుల్లెట్ తగిలింది" అని ఆయన చెప్పారు.
మృతిచెందిన ఐదుగురికీ పోస్టుమార్టం పూర్తయినట్టు పోలీసులు చెప్పారు.
"మేం అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ, అరవింద్ ఇంటి నుంచి బయటకు రావడానికి కానీ, పిల్లలను బయటకు పంపించడానికి కానీ ఒప్పుకోలేదు. పోలీసు అధికారులతో మాట్లాడించాం. అయినప్పటికీ ప్రతిసారీ 'పిల్లలు నా దగ్గర ఉన్నారు, వాళ్లే నా రక్షణ. మీరు వెనక్కి వెళ్లిపోండి' అని ఒకే సమాధానం చెప్పాడు. అప్పటికే ఏడు గంటలయ్యాయి. తర్వాత కనీసం ఇంటిని చుట్టుముట్టాలని, అతను పారిపోయేందుకు ప్రయత్నిస్తే అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాం" అని వారణాసి అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ నవీన్ అరోరా మీడియాకు తెలిపారు.
"మేం దానిని ప్రిపేర్ అవుతున్నప్పుడే లోపలి నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఇక మాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే లోపల ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక్కసారి కాల్పులు జరిగాయంటే ఏదైనా జరగవచ్చు" అని ఆయన చెప్పారు.
ఆ తర్వాతే పోలీసు బృందం ఇంట్లోకి ప్రవేశించినట్టు ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























