జ్ఞాన దంతం వచ్చేటప్పుడు నొప్పి ఎందుకు కలుగుతుంది, ఈ దంతాన్ని ఎప్పుడు తొలగించాలి?

జ్ఞాన దంతం, ఆరోగ్య సమస్యలు, నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, మరియం సుల్తానా
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

పిల్లలకు కొన్ని నెలల వయసు వచ్చే సరికి దంతాలు రావడం మొదలవుతుంది. కౌమారదశకు చేరుకునే సమయానికి దాదాపు శాశ్వత దంతాలన్నీ వచ్చేస్తాయి.

కానీ నోటి వెనుక భాగంలో ఉండే కొన్ని దవడ పళ్లు మాత్రం అన్నింటికంటే చివరగా వస్తాయి. సాధారణంగా పిల్లలు యుక్తవయస్సుకు చేరుకుంటున్నప్పుడు ఇలా జరుగుతుంది.

భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని స్థానిక భాషల్లో ఇలా చివరగా వచ్చే దంతాలను 'జ్ఞానదంతం' అని పిలుస్తారు.

వయసు పెరిగే కొద్దీ మనిషిలో అవగాహన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా వృద్ధి చెందుతాయనే నమ్మకం ఉంది. వీటిని ఆంగ్లంలో 'విజ్డమ్ టూత్' అంటారు. వైద్య పరిభాషలో వీటిని 'థర్డ్ మోలార్' లేదా మూడవ దవడ పన్ను అని పిలుస్తారు.

దంతాల వరుసలో ఇది మూడవ దవడ పన్ను కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, ప్రతి ఒక్కరికీ ఈ జ్ఞాన దంతాలు రావు. కొందరిలో ఈ దంతాలు ఉన్నప్పటికీ ఎలాంటి సమస్యా ఉండదు. కానీ మరికొందరికి ఇవి తీవ్రమైన నొప్పి, ఇబ్బందిని కలిగిస్తాయి.

మరి, ఈ జ్ఞాన దంతాలు అంత ఆలస్యంగా ఎందుకు వస్తాయి?

ఈ దంతాలు వచ్చేటప్పుడు నొప్పి ఎందుకు వస్తుంది? ఇవి ఏ వయసు వరకు రావచ్చు, ఒకవేళ నొప్పి వస్తే పన్ను తీయించుకోవడమే ఏకైక పరిష్కారమా?

జ్ఞాన దంతం, ఆరోగ్య సమస్యలు, నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

జ్ఞాన దంతాలు రావడానికి సరైన వయసు

వయోజన దశ చేరినవారికి సాధారణంగా 32 దంతాలు ఉంటాయి. వీటిలో పై, కింది దవడలకు రెండు వైపులా, నోటి వెనుక భాగంలో ప్రతి మూలలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు జ్ఞాన దంతాలు ఉండవచ్చు.

అయితే, ప్రతి వ్యక్తిలోనూ నాలుగు జ్ఞాన దంతాలు ఉండవు. కొందరికి ఒకటి, రెండు లేదా మూడు రావచ్చు, ఇంకొందరికి ఒక్కటి కూడా రాకపోవచ్చు.

సాధారణంగా 17 నుంచి 21 ఏళ్ల మధ్య జ్ఞాన దంతాలు రావడం ప్రారంభమవుతుందని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ తెలిపింది.

ఈ దంతాలు సాధారణంగా కౌమారదశ చివరి సంవత్సరాల నుంచి 25 ఏళ్ల వయసు మధ్యలో వస్తాయని బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ పేర్కొంది. అయితే దీనర్థం ఒక నిర్దిష్ట వయసు దాటిన తర్వాత ఈ పళ్లు రావని కాదు. కొందరిలో ఈ నిర్ణీత వయసు దాటని తరువాత కూడా జ్ఞాన దంతాలు రావచ్చు.

చిగుళ్లలో సరైన స్థానంలో జ్ఞాన దంతం వస్తే, అది నోటి వెనుక భాగానికి మద్దతునివ్వడానికి, దవడ ఎముకను సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే, సాధారణంగా చూస్తే, ఇప్పుడు జ్ఞాన దంతాల అవసరం అంతగా లేదు. పైగా, చాలా మంది వైద్య నిపుణులు వీటిని నిష్క్రియ అవయవంగా పరిగణిస్తారు. గతంలో వీటికి ప్రత్యేక పాత్ర ఉండేది, కానీ ఇప్పుడు ఆ ప్రాముఖ్యం లేదు.

మన పూర్వీకుల తొలి ఆహారంలో పెద్ద మొత్తంలో పచ్చి మొక్కలు, డ్రై ఫ్రూట్స్, గట్టిగా ఉండే పీచు మాంసం ఉండేవి. ఇలాంటి ఆహారాన్ని నమిలి, జీర్ణమయ్యేలా చేయడంలో జ్ఞాన దంతాలు కీలక పాత్ర పోషించేవి. నేటి కాలంలో ఆహారాన్ని తయారుచేసే ఆధునిక పద్ధతులు, తినడానికి వాడే పరికరాలు జ్ఞాన దంతాల అవసరాన్ని చాలా వరకు తగ్గించేశాయని అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ రిపోర్టు పేర్కొంటోంది.

ఆహారపు అలవాట్లలో వచ్చిన ఈ మార్పులకు అనుగుణంగా మన శరీరంలో కూడా కొన్ని చిన్న మార్పులు జరిగాయి. ఉదాహరణకు, మన దవడలు మునుపటి కంటే చిన్నవిగా మారాయి. అందుకే చాలా మందికి తమ నోటిలో జ్ఞాన దంతాలు రావడానికి తగినంత స్థలం ఉండదు.

మనిషికి సాధారణంగా నాలుగు జ్ఞాన దంతాలు ఉంటాయి. కానీ ఎప్పుడూ ఆ నాలుగు రావాలనే నియమం లేదు. ప్రతి పది మందిలో సుమారు ఎనిమిది మందికి కనీసం ఒక్క జ్ఞాన దంతం అయినా రాదు. అయితే, ఒక్క జ్ఞాన దంతం కూడా రాకపోవడం లేదా నాలుగు రావడం, ఈ రెండూ సాధారణ పరిస్థితులే.

జ్ఞాన దంతం, ఆరోగ్య సమస్యలు, నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

నొప్పి ఎందుకు వస్తుంది?

జ్ఞాన దంతం ఇతర దంతాల్లాగే సాధారణంగా, తగినంత స్థలంతో వస్తే ఎటువంటి సమస్యా ఉండదు. అయితే, ఈ పన్ను వచ్చే సమయంలో స్వల్ప ఇబ్బంది లేదా అసౌకర్యంగా అనిపించవచ్చు.

ప్రధానంగా స్థల లేమి కారణంగానే జ్ఞాన దంతం సమస్యలను సృష్టిస్తుంది. ఈ పన్ను చిగుళ్లకు అత్యంత చివరలో వస్తుంది. అక్కడ పన్ను బయటకు రావడానికి తగినంత స్థలం లేకపోతే, అది పక్కనే ఉన్న పన్ను వైపు వంగిపోవచ్చు. లేదంటే పాక్షికంగా లేదా పూర్తిగా చిగురులో, దవడ ఎముకలో ఇరుక్కుపోయి ఉండిపోవచ్చు. ఇలాంటి దంతాన్ని 'ఇంపాక్టెడ్ విజ్డమ్ టూత్' లేదా 'ఇరుక్కుపోయిన జ్ఞాన దంతం' అంటారు.

పాక్షికంగా బయటకు వచ్చిన పంటిపై చిగురులో కొంత భాగం మిగిలిపోతే, అక్కడ ఆహారపు రేణువులు, బ్యాక్టీరియా పేరుకుపోయే అవకాశం ఉంది.

దీనివల్ల పంటి చుట్టూ ఉన్న చిగుళ్లలో వాపు లేదా ఇన్ఫెక్షన్ రావచ్చు, దీన్ని 'పెరికోరోనైటిస్' అని పిలుస్తారు. దీని కారణంగా పన్ను పుచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. సగం బయటకు వచ్చిన పంటి చుట్టూ శుభ్రం చేయడం కష్టంగా ఉండటం వల్ల, కొన్ని సందర్భాల్లో జ్ఞాన దంతం చుట్టూ ద్రవం పేరుకుపోయి సిస్ట్ లేదా చీము చేరచ్చు.

జ్ఞాన దంతం, ఆరోగ్య సమస్యలు, నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఇరుక్కుపోయిన దంతం పక్కన ఉన్న పళ్లకు కూడా హాని కలుగుతుందని అమెరికాకు చెందిన మెడికల్, రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ మాయో క్లినిక్ తెలిపింది.ఈ స్థితిలో నొప్పితో పాటు చిగుళ్లు వాచిపోవచ్చు. నోరు తెరవడంలో లేదా నమలడంలో ఇబ్బంది కలగవచ్చు. అయితే, జ్ఞాన దంతం సరైన విధంగా వస్తే అది ఆహారం నమలడానికి బాగా సహాయపడుతుంది.

మనిషి ప్రతి దవడలో సాధారణంగా మూడు దవడ పళ్లు లేదా వెనుక భాగంలో నమిలే దంతాలు ఉంటాయి. ముందు నుంచి వెనుకకు ఇవి మొదటి మోలార్, తర్వాత రెండవ మోలార్, ఆ తర్వాత మూడవ మోలార్‌గా ఉంటాయి. అన్నిటికంటే చివరన ఉండే ఈ మూడవ మోలార్‌నే విజ్డమ్ టూత్ లేదా జ్ఞాన దంతం అంటారు. చాలాసార్లు పన్ను బయటకు కనిపించకపోయినప్పటికీ ఎక్స్-రే ద్వారా దాని పరిస్థితిని సులభంగా పసిగట్టవచ్చు.

''పంటి స్థానం సరిగ్గా ఉండి, అది రావడానికి తగినంత స్థలం ఉంటే, జ్ఞాన దంతం ఒకటి నుంచి రెండేళ్లలోపు సాధారణంగా బయటకు వస్తుంది. ఈ సమయంలో ప్రతి కొన్ని నెలలకోసారి నొప్పి రావచ్చు'' అని ఢాకాకు చెందిన దంత వైద్యుడు డాక్టర్ ఎ.కె.ఎం. హసనుజ్జమాన్ అన్నారు.

ఆయన చెప్పిన దాని ప్రకారం, జ్ఞాన దంతం వచ్చేటప్పుడు రోగులు ప్రధానంగా నొప్పి, వాపు సమస్యల గురించి ఫిర్యాదు చేస్తుంటారు. చాలా మందికి నోరు పూర్తిగా తెరవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది. చిగుళ్ల ఇన్ఫెక్షన్‌కు ఎక్కువ కాలం చికిత్స తీసుకోకపోతే, అది నోరు, గొంతులోని వివిధ భాగాలకు వ్యాపించి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు దారి తీయవచ్చు.

"ఆ సమయంలో శ్వాస తీసుకోవడం లేదా భోజనం చేయడంలో ఇబ్బంది కలుగుతుంది, పరిస్థితి విషమిస్తే రోగిని ఆసుపత్రిలో చేర్చాల్సి రావొచ్చు. చాలా కేసుల్లో చివరకు శస్త్రచికిత్స దాకా వెళ్లాల్సి వస్తుంది" అని హసనుజ్జమాన్ తెలిపారు.

జ్ఞాన దంతం, ఆరోగ్య సమస్యలు, నొప్పి, ఎప్పుడు తీసేయాలి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

జ్ఞాన దంతం తీయించడం అవసరమా?

జ్ఞాన దంతంలో నొప్పి రాగానే దాన్ని కచ్చితంగా తీయించేయాలని అర్థం కాదని వైద్యులు సూచిస్తున్నారు.

ఎన్‌హెచ్ఎస్ ప్రకారం, జ్ఞాన దంతం ఎలాంటి సమస్యా కలిగించకపోతే సాధారణంగా దాన్ని తీయరు. బదులుగా, క్రమం తప్పకుండా చేసే దంత పరీక్షల ద్వారా దాని పరిస్థితిని గమనిస్తుంటారు.

అయితే, పదే పదే చిగుళ్లలో ఇన్ఫెక్షన్ రావడం, తీవ్రమైన నొప్పి లేదా పన్ను పాడయ్యే పరిస్థితుల్లో వాటిని తీసివేయవచ్చు. సిస్ట్ లేదా చీము చేరడం లాంటి సంక్లిష్టతలు ఉంటే దాన్ని తీయించుకోవాలని వైద్యులు సలహా ఇవ్వొచ్చు.

సాధారణంగా పన్ను తీయడానికి ముందు చిగురులో లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తారు. దీంతో ఆ నిర్దిష్ట భాగం మొద్దుబారిపోయి, పన్ను తీసేటప్పుడు నొప్పి అనిపించదు. రోగికి ఇబ్బంది కలగకుండా సెడేషన్ కూడా ఇవ్వవచ్చు.

ఒకవేళ పన్ను తీయడం సంక్లిష్టంగా ఉన్నా లేదా రోగి బాగా భయపడుతున్నా జనరల్ అనస్థీషియా ఇస్తారు. ఆ తర్వాత రోగి నిద్రలోకి జారుకుంటారు.

జ్ఞాన దంతం తీయడంలో ఉండే ప్రాథమిక దశలు ఇవి

  • ఒకవేళ పన్ను చిగురు కింద దాగి ఉంటే, వైద్యులు ముందుగా చిగురుకు చిన్న గాటు పెడతారు.
  • ఆ తర్వాత అవసరానికి తగ్గట్టుగా పంటి చుట్టూ ఉన్న భాగాన్ని తెరుస్తారు.
  • అనంతరం పంటిని ఒకే ముక్కగా బయటకు తీస్తారు, అయితే అవసరమైతే దాన్ని రెండు లేదా మూడు భాగాలుగా విడగొట్టి కూడా తీయవచ్చు.
  • చివరగా చిగురుపై కుట్లు వేస్తారు, అవి తర్వాత వాటంతట అవే కరిగిపోతాయి.
జ్ఞాన దంతం, ఆరోగ్య సమస్యలు, నొప్పి, ఎప్పుడు తీసేయాలి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది?

జ్ఞాన దంతం తీయించిన తర్వాత సాధారణంగా మరుసటి రోజే రోజువారీ పనులకు తిరిగి వెళ్లవచ్చు.

అయితే, పన్ను తీసే ప్రక్రియ సంక్లిష్టంగా ఉన్నా లేదా జనరల్ అనస్థీషియా ఇచ్చినా ఒకటి నుంచి మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తారు.

సాధారణంగా పన్ను తీయించిన తర్వాత రెండు వారాల పాటు చిన్నపాటి నొప్పి, వాపు లాంటి సమస్యలు ఉండొచ్చు. అయితే ఇవి ఒకటి, రెండు రోజుల తర్వాత తగ్గడం ప్రారంభమవుతుంది.

అలాగే బుగ్గపై గాయం లేదా నల్లటి మచ్చలు పడొచ్చు. దవడలో నొప్పి, బిగుసుకుపోయినట్లు అనిపించవచ్చు. ఆహారం నమలడంలో, మింగడంలో ఇబ్బంది కలగవచ్చు.

ఒకవేళ పన్ను తీసిన తర్వాత కుట్లు వేస్తే, అవి సాధారణంగా వాటంతట అవే కరిగిపోతాయి. పన్ను తీయించిన తర్వాత గాయం ఉన్న చోట రక్తం గడ్డకడుతుంది, ఇది గాయం త్వరగా మానడానికి సహాయపడుతుంది.

పన్ను తీయించిన తర్వాత మొదటి కొద్ది రోజుల్లో త్వరగా, మెరుగ్గా కోలుకోవడానికి వైద్యులు ఈ జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తారు.

నొప్పిని తగ్గించుకోవడానికి వైద్యుల సలహాతో మెడిసిన్స్ వాడాలి.

సాధారణంగా నమలడం సులభమయ్యేంత వరకు మెత్తటి లేదా ద్రవ రూపంలో ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.

మౌత్‌వాష్ లేదా గోరువెచ్చని ఉప్పు నీటితో నెమ్మదిగా పుక్కిలించడం ద్వారా గాయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.

వైద్యులు చెప్పినదాని ప్రకారం మిగిలిన దంతాలను జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. కానీ కుట్లు లేదా గడ్డకట్టిన రక్తం ప్రభావితం కాకుండా గాయం ఉన్న చోట మాత్రం బ్రష్ తగలకుండా చూసుకోవాలి.

రక్తం కారుతుంటే శుభ్రమైన వస్త్రం లేదా దూదితో కనీసం 10 నిమిషాల పాటు ఆ ప్రదేశాన్ని నొక్కి పట్టుకోవాలి.

మరోవైపు, జనరల్ అనస్థీషియా తీసుకున్న తర్వాత 48 గంటల పాటు, సెడేటివ్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత 24 గంటల పాటు వాహనాలు నడపకూడదని వైద్యులు చెబుతున్నారు.

నట్స్ లేదా గింజల లాంటి గట్టి, కరకరలాడే ఆహారాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే వాటి రేణువులు గాయంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.

ధూమపానం చేయకూడదని వైద్యులు సలహా ఇస్తారు, దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

అయితే, జ్ఞాన దంతం తీయించడం కష్టమైన ప్రక్రియ కానప్పటికీ, కొన్ని సంక్లిష్టతలు తలెత్తే అవకాశం ఉంది.

డ్రై సాకెట్: పన్ను తీసిన తర్వాత ఏర్పడే ఖాళీ ప్రదేశంలో సాధారణంగా రక్తం గడ్డకడుతుంది. ఇది సరిగ్గా ఏర్పడకపోయినా లేదా గాయం మానకముందే అక్కడి నుంచి తొలగిపోయినా విపరీతమైన నొప్పి వస్తుంది. దీన్నే డ్రై సాకెట్ అని పిలుస్తారు.

ఇన్ఫెక్షన్: గాయం ఉన్న చోట ఇన్ఫెక్షన్ రావచ్చు, దీనికి చికిత్స కోసం యాంటీబయాటిక్స్ అవసరం పడవచ్చు.

నరాలకు నష్టం: పంటి దగ్గర ఉండే నరాలు దెబ్బతింటే నాలుక, పెదవులు లేదా గడ్డం మొద్దుబారిపోవచ్చు లేదా జివ్వుమని లాగినట్లు అనిపించవచ్చు. సాధారణంగా ఈ పరిస్థితి కొంత సమయానికి మెరుగుపడుతుంది, కానీ ఒక్కోసారి కొన్ని వారాలు లేదా నెలల పాటు అలాగే ఉండిపోవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)