బయు థాపెస్ట్రీ: 252 అడుగుల నార వస్త్రంపై అల్లిన యుద్ధ గాథ.. వెయ్యేళ్ల కిందటి కళాఖండంపై 93 చోట్ల పురుషులు, గుర్రాల అంగాలు అంత ప్రస్ఫుటంగా కనిపించేలా చూపించారెందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డెబోరా నికోల్స్-లీ
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
పదకొండో శతాబ్దానికి చెందిన ఒక కళాఖండం మధ్య యుగం నాటి సింహాసనం కోసం జరిగిన పోరాటం గురించి చెబుతుంది. ప్రస్తుతం ఈ కళాఖండాన్ని యూకేలో ప్రదర్శనకు ఉంచనున్నారు.
ఈ ఎంబ్రాయిడరీ చెప్పే కథ పౌరుషం, అధికారాన్ని ప్రతీకాత్మకంగా పురుషాంగంతో చూపిస్తుంది. అందుకే నేటికీ ఈ కథ ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
ఇంగ్లాండ్‌పై జరిగిన నార్మన్ల దండయాత్రకు సంబంధించిన రక్తసిక్తమైన, నగ్నత్వ ఛాయలు కలిగిన చరిత్రను ‘బయు థాపెస్ట్రీ’ చెబుతుంది.
77 మీటర్ల (సుమారు 252 అడుగుల) అవిసె నార వస్త్రంపై చేసిన ఎంబ్రాయిడరీ ఇది.
నెరవేర్చని వాగ్దానాలు, దురాశ, దురాక్రమణల చుట్టూ సాగిన ఈ చరిత్ర.. హేస్టింగ్స్ యుద్ధంలో కింగ్ హెరాల్డ్ II మరణంతో ముగుస్తుంది.
దాదాపు వెయ్యి సంవత్సరాల తర్వాత, ఈ ప్రసిద్ధ కళాఖండాన్ని ఫ్రాన్స్‌లోని నార్మండీ నుంచి ఇంగ్లండ్‌కు తీసుకొచ్చారు. 1070లో ఎంతో నైపుణ్యంతో అల్లిన ఈ ఆర్ట్‌వర్క్ సెప్టెంబర్ 10 నుంచి బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు.

నేటి డిజిటల్ మేనోస్పియర్‌కు మధ్యయుగ ప్రతిరూపం
ప్రస్తుత డిజిటల్ మేనోస్పియర్‌కు సంబంధించిన మధ్యయుగపు రూపాన్ని ఈ కళాఖండం వర్ణిస్తుంది. పురుషత్వం, మగవారి అనుభవాల చుట్టూ తిరిగే భావజాలంతో కూడిన ప్రపంచాన్ని వివరిస్తుంది. అక్కడ పరిమాణానికే అధిక ప్రాధాన్యం ఉంటుందని చెబుతుంది.
పదకొండో శతాబ్దానికి చెందిన ఈ థాపెస్ట్రీ మగవారి కృషిని మాత్రమే వర్ణిస్తుంది. ఇందులో కనిపిస్తున్నవారిలో మూడో వంతు పురుషులు ఆయుధాలను పట్టుకొని ఉన్నారు.
మిగతా వారు చెట్లు కొట్టడం, పడవల తయారీ, నిర్మాణ పనుల్లో నిమగ్నమై కనిపిస్తారు. కట్టెలు కొట్టే ఒకరు దుంగపై కూర్చుని తన గొడ్డలికి పదును పెడుతుంటాడు. వేటగాళ్లు పెద్ద గదలను పట్టుకొని వేట కోసం పరుగులు పెడుతున్నట్లుగా దీనిపై చిత్రించారు.
ఇదంతా, ఇద్దరు ఆల్ఫా పురుషులు డ్యూక్ ఆఫ్ నార్మండీ అయిన విలియం, హెరాల్డ్ గాడ్విన్సన్ మధ్య యుద్ధంలోని వాతావరణాన్ని వివరిస్తుంది.
"ఇంతకంటే ఎక్కువ పౌరుషత్వంతో నిండిన దృశ్యం చూడటం కష్టం" అని ఇంగ్లండ్‌కు చెందిన చరిత్రకారుడు డాక్టర్ క్రిస్టోఫర్ మాంక్ దీనిపై వ్యాఖ్యానించారు.
ఆత్మప్రశంసతో కూడిన పౌరుష ప్రదర్శన నాటి పురుషాధిక్య సమాజాన్ని చూపిస్తుంది. అక్కడ వివాదాల పరిష్కారానికి హింసే మార్గంగా ఉంది.
హేస్టింగ్స్ యుద్ధ రంగంలో సాయుధ దోపిడీదారులు బీభత్సం సృష్టిస్తుంటే, యుద్ధంలో నేలకూలిన సైనికుల దుస్తులు విప్పే చిత్రాలను దిగువ అంచులో చిత్రీకరించారు. అంటే హెరాల్డ్‌ను చంపి రాజరికపు హక్కును లాక్కున్న తీరుకు ఇది సంకేతం.

ఫొటో సోర్స్, Getty Images
పురుషాంగాల చిత్రీకరణకు అర్థమేంటి?
ఈ ప్రసిద్ధ కళాకృతిలో పురుషాంగం పదే పదే కనిపిస్తుంది.
ఈ ఎంబ్రాయిడరీలోని 93 చోట్ల అంగాలను చిత్రించినట్లు యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ జార్జ్ గార్నెట్ లెక్కించారు.
ఇందులో 88 అంగాలు గుర్రాలకు చెందినవి కాగా, మరో అయిదు మగవారివి. వేలాడుతున్న ఒర(దీనిని ఆయన తోసిపుచ్చారు)లాంటి నిర్మాణం కనిపించడం పెద్ద చర్చకు దారి తీసింది.
"బయు థాపెస్ట్రీలో పరిమాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు" అని జానినా రామిరేజ్ తన ఫెమినా: ఎ న్యూ హిస్టరీ ఆఫ్ మిడిల్ ఏజెస్, త్రూ ద ఉమెన్ రిటన్ అవుట్ ఆఫ్ ఇట్(2022)లో పేర్కొన్నారు. సింహాసనం కోసం జరిగిన పోరాటంలో పౌరుషాన్ని రాజకీయ అధికారంతో , సైనిక బలంతో పోల్చారు. "ఇందులో అత్యంత పెద్దదిగా ఉన్న అంగం యుద్ధానికి ముందు రోజు విలియమ్‌కు బహుకరించిన శ్రేష్ఠమైన మగ గుర్రానికి చెందినది" అని ఆమె పేర్కొన్నారు. రెండో స్థానం కింగ్ హెరాల్డ్ వాహనానికి దక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల పాత్ర ఎందుకు తగ్గింది?
కథనం అంతా పురుషుల చుట్టే తిరగడం వల్ల థాపెస్ట్రీలో మహిళల పాత్ర తక్కువగా ఉందని యూకేలోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో లెక్చరర్ డాక్టర్ ఎమిలీ జోన్ వార్డ్ బీబీసీకి చెప్పారు.
‘యుద్ధాల్లో పాల్గొన్న పురుషుల గురించి మాత్రమే ఈ కళాఖండంలో ఎక్కువగా వర్ణించారు. అందుకే ఇక్కడ మహిళలకు ప్రాధాన్యం కనిపించదు’
ఒకవేళ స్త్రీ, పురుషుల నిష్పత్తి(1:100) సరిగ్గా లేకపోవడానికి, ఆ కళాఖండాన్ని ఎవరి కోసం తయారు చేశారనేదే అసలు కారణం కావచ్చు. ఆ చిత్రాన్ని విలియమ్ సోదరుడు, బయు బిషప్ అయిన ఓడో తయారు చేయించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. అందుకే ఇందులో ఆయన పాత్రను ప్రముఖంగా చూపించారు. విలియమ్‌కు రాజ్యం దక్కడంలో తన పాత్ర ఎంత కీలకమైనదో అందరికీ చూపించుకోవడానికి ఆయన దీనిని ఉపయోగించి ఉండవచ్చు.
"ఇందులో ఉన్న విషయం అతనికి, అతని వర్గానికి నచ్చేలా ఉంటుంది. అందులో ఎక్కువ మంది పురుషులై ఉంటారు" అని వార్డ్ చెప్పారు.
దీనికి నార్మన్ ఆర్థిక సాయం చేసి ఉన్నందున అందులో సందేశం వారికి నచ్చినట్టుగా ఉంటుందని అన్నారు.
"కథలో చాలా మంది మహిళలను పరిచయం చేయడం నిజానికి కొంచెం సాహసమే" అని చెప్పారు.
‘ఎందుకంటే విలియం తన తల్లి వైపు నుంచి రాజరిక హక్కును సాధించుకోవడానికి యత్నించారు. ఆ బలహీనమైన విషయంపై అందరి దృష్టి పడకూడదనే ఉద్దేశంతోనే మహిళల ప్రస్తావన తగ్గించి ఉండవచ్చు" అని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ చిత్రకళలో "ఎల్ఫ్‌గివా" అనే పేరు ఉన్న ఒక రహస్య మహిళ కనిపిస్తారు. ఆమె ముఖాన్ని తాకాలని ఒక ప్రీస్ట్ యత్నించడం కనిపిస్తుంది. అతన్ని అనుసరిస్తూ నగ్నంగా ఉండే వ్యక్తి బొమ్మను థాపెస్ట్రీ కింద బోర్డర్‌లో చూడవచ్చు. ఆమె ఎవరు? ఆమె ఎందుకు అక్కడ ఉన్నారు? అని వివరించడానికి చాలా రకాల కథనాలు ఉన్నాయి. బయు థాపెస్ట్రీ స్టోరీ(2026) సహ రచయిత డాక్టర్ డేవిడ్ ముస్‌గ్రోవ్ అభిప్రాయం ప్రకారం.. ప్రీస్ట్ లైంగిక వేధింపులు "మధ్యయుగపు మీ-టూ ఉద్యమం" లాంటిది.
ఇతరులు దీనిని కొట్టిపారేశారు. 20వ శతాబ్దానికి చెందిన చరిత్రకారుడు ఇలా వ్యాఖ్యానించారు. "దీని వల్ల గందరగోళమే తప్ప కథకు ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే దీన్ని వదిలేయడమే సరైనదిగా భావించాం."
నిస్సందేహంగా అల్లికలు చేసినవారు ముందస్తు డిజైన్ ప్రకారమే పని చేశారనేది నిజమే. కానీ అంత మాత్రాన వారు కేవలం వేరొకరి ఆదేశాలు కళ్లు మూసుకొని అమలు చేశారని అర్థం కాదు అని డాక్టర్ క్రిస్టోఫర్ మాంక్ అభిప్రాయపడ్డారు.
విక్టోరియన్ కాలం నాటి పద్ధతులు (సిగ్గు, బిడియం) అసలు చిత్రకళలో ఉన్న పురుషాధిక్య నగ్నత్వ తీవ్రతను కొంత తగ్గించాయి.
1885లో 35 మంది మహిళలు కలిసి దానికి ప్రతిరూపాన్ని తయారు చేశారు. ఆ ప్రతిరూపంలో కూడా సైన్యంలో పురుషులే ఉన్నప్పటికీ, గుర్రాల అంగాల పరిమాణాన్ని తగ్గించి చిత్రీకరించారు. అలాగే ప్రీస్ట్‌ను అనుకరిస్తూ నగ్నంగా ఉన్న పురుషుడి బొమ్మకు నిక్కరు జోడించారు.
ఈ ప్రతిరూపాన్ని బ్రిటన్ రీడింగ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.
అన్నింటికంటే ముఖ్యంగా 1885 నాటి వెర్షన్‌లో ప్రతి ఎంబ్రాయిడరీ కళాకారిణి తమ పేరును చేర్చడానికి ఒక అదనపు అంచును చేర్చారు. దీని వల్ల ఈ కళాఖండాన్ని తయారు చేసిన మహిళలకు గుర్తింపు, గౌరవం లభించాయి.
రమీరెజ్ చెబుతున్నట్టు వ్యాన్ గో గురించి ప్రస్తావించకుండా "స్టారీ నైట్' చిత్రం గురించి ఎవరూ మాట్లాడలేరు. కానీ బయు థాపెస్ట్రీ గురించి మాట్లాడేటప్పుడు దానిని తయారు చేసిన మహిళల గురించి ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు.
అసలైన బయు థాపెస్ట్రీ(చిత్రకళ) సెప్టెంబర్ 10, 2026 నుంచి జూలై 11, 2027 వరకు లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు.
అలాగే దీని 1885 నాటి ప్రతిరూపం రీడింగ్ మ్యూజియంలో శాశ్వత ప్రదర్శనకు ఉంచారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























