ఫేస్ బ్లైండ్‌నెస్: 'నా బాయ్‌ఫ్రెండ్‌ను గుర్తు పట్టేందుకే నేను చాలా కష్టపడ్డా'.. ముఖాలను గుర్తు పట్టలేని ఈ కంటి సమస్య ఏంటి?

ఫేస్ బ్లైండ్‌నెస్

ఫొటో సోర్స్, BBC/Maryam Nikan

ఫొటో క్యాప్షన్, కంటి చూపు (ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, కరోలిన్ స్టీల్
    • హోదా, బీబీసీ క్రౌడ్‌సైన్స్
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

అప్పట్లో ఒకసారి నా బాయ్‌ఫ్రెండ్‌నే నేను గుర్తు పట్టలేకపోయా. మేం ఆరు నెలల పాటు కలిసే ఉన్నాం.

ఆ తర్వాత సూపర్‌మార్కెట్లో ఒకరికొకరం ఎదురుపడ్డాం. ఒకరినొకరం దాటుకుని వెళ్తున్నప్పుడు, ఆయన ఎవరో నేను అస్సలు గుర్తుపట్టలేకపోయాను.

ఆయన మాట్లాడి, తన గొంతును నేను గుర్తించే వరకు ఆయన అంత దగ్గరగా ఉండటం, ఒకలాంటి కంగారును, ఆందోళనను కలిగించడం నాకు గుర్తుంది.

నిజం చెప్పుకోవాలి. ఈ ఘటనపట్ల ఆయన అంత సంతోషంగా లేరు. కానీ, నాకు మాత్రం ఇది సాధారణమే. ఎంత బాగా తెలిసిన వారైనా సరే, ముఖాలను గుర్తుపట్టడం నాకు ఎప్పుడూ కష్టంగానే అనిపిస్తుంది.

అందుకే, బీబీసీ పాడ్‌కాస్ట్ 'క్రౌడ్‌సైన్స్'లో భాగంగా... ముఖాలను గుర్తించడంలో ఇబ్బందిపడే 'ఫేస్ బ్లైండ్‌నెస్' (లేదా ప్రొసోపాగ్నోసియా) అనే పరిస్థితికి నేను పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'ఫేస్ బ్లైండ్‌నెస్‌'కు కారణాలేంటి?

ముఖాలను గుర్తించలేకపోవడం (ఫేస్ బ్లైండ్‌నెస్‌) చాలామంది అనుకున్నట్లు సర్వసాధారణమని, ప్రతి 50 మందిలో ఒకరిని ఇది ప్రభావితం చేస్తుందని నిపుణులు చెప్పారు.

కొన్ని కేసుల్లో ఉదాహరణకు స్ట్రోక్ (పక్షపాతం) వంటి కారణాల వల్ల మెదడు దెబ్బతిన్న (బ్రెయిన్ డ్యామేజ్) తర్వాత ఈ పరిస్థితి డెవలప్ అవుతుంది.

అయితే "ఆ కారణాల వల్ల ఫేస్ బ్లైండ్‌నెస్‌ను అనుభవించే వారిని మనం పెద్దగా చూడం" అని యూకేలోని బోర్న్‌మౌత్ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజిస్ట్ ప్రొఫెసర్ సారా బేట్ పేర్కొన్నారు.

చిన్న వయసు నుంచే ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా సాధారణమని, దీనిని డెవలప్‌మెంటల్ లేదా కంజెనిటల్ ప్రోసోపాగ్నోసియా అని పిలుస్తారని ఆమె వివరించారు.

ఇది కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుందని, దీనికి జన్యుపరమైన సంబంధం ఉండొచ్చని, అయితే దీని వెనుక ఉన్న కచ్చితమైన జన్యువులు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి.

''ఇది కేవలం ఒక్క జన్యువుకు సంబంధించినంత చిన్న విషయం కాదు'' అని సారా బేట్ అన్నారు. ''ఇది సాధారణంగా జన్యుపరమైన, పర్యావరణ కారకాల మధ్య ఉండే మరింత సంక్లిష్టమైన పరస్పర చర్య'' అని చెప్పారు.

కరోలైన్

ఫొటో సోర్స్, Caroline Steele

ఫొటో క్యాప్షన్, కరోలిన్ (ఎడమవైపు) చిన్నప్పటి నుంచే ముఖాలను గుర్తించేందుకు ఇబ్బందిపడ్డారు

ప్రారంభ దశలోని విజువల్ పరమైన అనుభవాలు దీనిలో కీలకపాత్ర పోషించవచ్చని బేట్ భావిస్తున్నారు. ఫేస్ బ్లైండ్‌నెస్‌ను ఎదుర్కొనే కొంతమంది ప్రజలు తమ చిన్నతనంలో దృష్టి లోపం లేదా అసాధారణమైన దృష్టిని ఎదుర్కొన్న సమయాల గురించి ప్రస్తావిస్తుంటారు.

''ముఖాలను గుర్తించడం నేర్చుకోవడంలో కీలకమైన అభివృద్ధి దశలు ఉండవచ్చు'' అని ఆమె అన్నారు.

"అవసరమైనప్పుడు పిల్లలకు కళ్లద్దాలు పెట్టకపోతే... లేదా పుట్టుకతోనే కంటిశుక్లం వల్ల దృష్టి లోపం ఉంటే ఆ ప్రక్రియకు అంతరాయం కలగవచ్చు" అని చెప్పారు.

వ్యక్తిగతంగా చూస్తే, ఇది నాకు పూర్తిగా అర్థమయ్యే విషయమే. చిన్నప్పుడు నాకు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండేవి.

కానీ, ఎనిమిదేళ్ల వయసులో కంటికి పట్టీ పెట్టుకోవడం, పెద్దయ్యాక అప్పటి నా బాయ్‌ఫ్రెండ్‌ని గుర్తుపట్టడంలో ఇబ్బంది పడటం.. ఈ రెండింటి మధ్య సంబంధం ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు.

ఇతర కారకాలు కూడా దీనికి కారణం కావచ్చుననే కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి.

"ఉదాహరణకు, ఆటిజం స్పెక్ట్రమ్ వంటి సమస్యలు ఉన్నవారిలో కొందరు ఐ కాంటాక్ట్ చేయడానికి ఇష్టపడరని మనకు తెలుసు. ఆ పరిస్థితులు ఉన్న చాలామంది ముఖాలను గుర్తించే విషయంలో ఇబ్బంది పడతారు" అని బేట్ చెప్పారు.

చిన్నతనంలో తగినంత సామాజిక పరిచయాలు లేకుండా పెరిగిన పిల్లలు కూడా, జీవితంలో తరువాత ముఖాలను గుర్తించడం కష్టంగా భావించవచ్చని అన్నారు.

ముఖాల గుర్తింపు

ఫొటో సోర్స్, Getty Images/BSIP/UIG

తక్కువ కనెక్టివిటీ

చాలామందికి తమకు పరిచయమున్న ముఖాన్ని గుర్తించడం చాలా సహజంగా అనిపిస్తుంది. కానీ, ఇది మెదడులో జరిగే ఒక సంక్లిష్టమైన ప్రక్రియల క్రమంపై ఆధారపడి ఉంటుందని నాడీ శాస్త్రవేత్తలు చెప్పారు.

''ముఖాలను గుర్తించడం కోసం మనకు ఒక నిర్దిష్టమైన బ్రెయిన్ సర్క్యూట్ ఉంటుంది. ఇదంతా మెదడు వెనుక భాగంలోని ఇంద్రియ ప్రాంతాలలో మొదలవుతుంది'' అని ఇటలీలోని బెర్గామో యూనివర్సిటీకి చెందిన న్యూరోసైంటిస్ట్ ప్రొఫెసర్ జైరా కట్టానియో తెలిపారు చెప్పారు.

మెదడులోని ఆ ప్రాంతాన్ని ఆక్సిపిటల్ లోబ్ అని పిలుస్తారు. ఇందులో ప్రాథమిక విజువల్ కార్టెక్స్ ఉంటుంది. ఇక్కడే మొదట విజువల్ ఇన్‌ఫర్మేషన్ తీసుకుని, అర్థం చేసుకుంటుంది బ్రెయిన్.

ఆపై ఆ విజువల్ ఇన్‌ఫర్మేషన్, టెంపోరల్ కార్టెక్స్ అనే మెదడు భాగానికి వెళ్తుంది. అక్కడ గుర్తింపు మరింత స్పష్టంగా తెలుస్తుంది.

"ఈ దశలో మీరు కేవలం ఒక ముఖాన్ని గుర్తించడమే కాకుండా, ఆ ముఖం మీకు పరిచయమైనదా కాదా అని కూడా తెలుసుకుంటారు" అని కట్టానియో చెప్పారు.

"మీరు ఆ వ్యక్తికి సంబంధించిన పేరును, అలాగే అన్ని అర్థవంతమైన, జీవిత విశేషాలను (బయోగ్రాఫికల్ సమాచారాన్ని) మీరు ఆ దశలో పొందవచ్చు" అన్నారు కట్టానియో.

చివరి దశలో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగం ఉంటుంది. ఇది స్పృహతో కూడిన ఆలోచనలను, నిర్ణయాలను తీసుకోవడంతో ముడిపడి ఉన్న ప్రాంతం. ''ఇక్కడ మనం ముఖాన్ని చాలా స్పృహతో గుర్తిస్తాం. ఎందుకంటే, చాలా వరకు ఇంద్రియ ప్రక్రియలు ఎలాంటి స్పృహ లేకుండానే జరుగుతాయి'' అని తెలిపారు.

ముఖాన్ని గుర్తించే దాదాపు ఈ క్షణకాల ప్రక్రియ కేవలం వ్యక్తిగత మెదడు ప్రాంతాలపై మాత్రమే కాకుండా, అవి కలిసి ఎలా పనిచేస్తాయి అనేదానిపై కూడా ఆధారపడి ఉంటుందని కట్టానియో వంటి శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

ఫేస్ బ్లైండ్‌నెస్‌ ఉన్న వ్యక్తులలో "ఫేస్ సర్క్యూట్‌లోని భాగాల మధ్య కనెక్టివిటీ తక్కువగా ఉండవచ్చు" అని ఆమె చెప్పారు.

కరోలైన్‌కు మెదడు పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images/Reuters

ప్రముఖ ముఖాలు

వయసు పెరుగుతున్న కొద్దీ, జ్ఞాపకశక్తి సాధారణంగా తగ్గడం వల్ల మాత్రమే కాకుండా.. ముఖాలను గుర్తించడంలో మనం ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆధారాలు సూచిస్తున్నాయి.

కాలక్రమేణా పరిచయమున్న ముఖాల పట్ల మెదడులోని సంబంధిత భాగాలు మునపటిలా స్పష్టంగా స్పందించలేకపోతున్నాయని కట్టానియో వివరించారు.

కాబట్టి నాలాగే మీరు చిన్నతనంలో ఇబ్బంది పడినా పడకపోయినా, "మనం వయసు పెరిగేకొద్దీ ముఖాలను గుర్తించడంలో లోపాలను ఎదుర్కోవచ్చు" అని ఆమె చెప్పారు.

కానీ, నా ఫేస్ బ్లైండ్‌నెస్ అనేది కచ్చితంగా వయసుతో ముడిపడిన అంశం కాదు. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను దీనితో ఇబ్బంది పడుతున్నాను. నన్ను పరీక్షించి అధికారిక ప్రమాణాలకు సరిపోతానో లేదో చూస్తానని బేట్ ఆఫర్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది.

ముఖాలతో ప్రతి రోజూ నాకు కలిగే అనుభవాలతో ప్రశ్నోత్తరాలతో ఈ పరీక్ష మొదలైంది. నేను తరచూ వ్యక్తులను గుర్తించడంలో విఫలమవ్వడం లేదా ఒకే రకమైన దుస్తులు ధరించినప్పుడు వ్యక్తులను గుర్తించడంలో కష్టపడటం వంటి వాటితో నేను ఎంతవరకు ఏకీభవిస్తున్నానో లేదా విభేదిస్తున్నానో రేటింగ్ ఇచ్చాను.

ముఖాలను గుర్తించలేకపోవడంలో సాధారణ లక్షణాలను ఎంత తరచుగా ఎదుర్కొంటున్నాననే దానిపై నేను సమాధానాలు ఇచ్చాను. చివరికి నేను ప్రముఖమైన ఈ పరీక్షను పూర్తి చేశాను. ఇక్కడ బాగా తెలిసిన ప్రముఖ ఫోటోలను చూపించారు. ఈ ప్రతి ముఖం నాకు పరిచయమైనదా కాదా అన్నది నేను నిర్ణయించాలి.

బ్రిటీష్ ప్రకృతి శాస్త్రవేత్త. బ్రాడ్‌కాస్టర్ సర్ డేవిడ్ అటెన్‌బరోను గుర్తించినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ, ది బీటిల్స్‌కు చెందిన సర్ పాల్ మెక్‌కార్ట్నీని, హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్‌ను, యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ను గుర్తించలేకపోయాను.

ఊహించినట్లుగానే, నేను ఫేస్ బ్లైండ్‌నెస్‌కు సంబంధించిన గుణాలు నాలో ఉన్నాయని అర్ధమైంది. ఇది నాకు పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు.

మెదడుకు పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images/ZeynepKaya

మెదడుకు శిక్షణా?

ఇది బహుశా జీవితాంతం నాతో ఉండే సమస్యే కావచ్చు. అయితే, మెదడులోని ముఖ గుర్తింపు నెట్‌వర్క్‌ను చురుగ్గా మెరుగుపరచవచ్చా అనే దానిపై శాస్త్రవేత్తలు ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నారు.

మెదడులోని న్యూరాన్లు తరచుగా 'ఆసిలేషన్స్' అని పిలిచే సింక్రనైజ్డ్ ప్యాట్రన్స్‌లో (సమన్వయంతో కూడిన నమూనాలతో) కలిసి పనిచేస్తుంటాయి.

''సమర్థవంతమైన అవగాహనకు సంబంధించి ఫ్రీక్వెన్సీ వద్ద మెదడు కంపించేలా మనం ప్రాథమికంగా దానికి శిక్షణ ఇవ్వొచ్చు'' అని కట్టానియో తెలిపారు.

న్యూరాన్‌లు సమకాలీకరించడాన్ని ప్రోత్సహించడానికి ఆమె తలపై బలహీనమైన, నాన్-ఇన్వాసివ్ ఎలక్ట్రికల్ కరెంట్‌ను ఉపయోగించి అధ్యయనం చేస్తున్నారు.

ఇది ముఖాల గుర్తింపుకు సాయం చేస్తుండొచ్చని ప్రాథమిక ఫలితాలు సూచిస్తున్నాయి. కానీ, దీనిపై అతిగా ఆశలు పెట్టుకోవద్దని హెచ్చరించారు.

''కొన్నిసార్లు సమస్య ఏమిటంటే, ప్రజలు ఈ పద్ధతులు అద్భుతాలు చేస్తాయని భావించి వాటిని ఆశ్రయిస్తుంటారు'' అని ఆమె అన్నారు.

''మేం చూస్తున్న ప్రభావాలు ఒక నిర్దిష్టమైన పనిలో బహుశా రెండు లేదా మూడు శాతం మాత్రమే మెరుగుదల ఉండొచ్చు లేదా మీరు కొన్ని మిల్లీసెకండ్ల వేగంగా పనిని పూర్తి చేయగలరు'' అని చెప్పారు.

సాధారణ మెదడు శిక్షణ వ్యాయామాల వల్లే, ముఖ గుర్తింపుకు శిక్షణనిచ్చే ప్రయత్నాలు పరిమిత విజయాలనే సాధించాయని బేట్ చెప్పారు.

దానికి బదులుగా, సామాజిక సందర్భాలలో ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం వంటి.. ముఖాలను గుర్తించడంపై తక్కువగా ఆధారపడే పద్ధతులను ఉపయోగించి రోజువారీ జీవితాన్ని నిర్వహించుకోవడానికి ఆచరణాత్మక మార్గాలపై దృష్టి సారించాలని ఆమె సూచిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)