టమోటాలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా, అరటి ఊచ రసం తాగితే అవి కరిగిపోతాయా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

టమోటాలు, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, అరటి కాండం జ్యూస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, షణ్ముగప్రియ సెల్వరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

టమోటాలు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని అరటి ఊచ జ్యూస్ తాగితే ఆ రాళ్లు కరిగిపోతాయని ప్రజలలో కొన్ని నమ్మకాలు ఉన్నాయి.

ఇందులో నిజం ఉందా.. దీని గురించి వైద్యులేం చెబుతున్నారు?

మానవ శరీరంలో పొట్ట వెనుక భాగంలో వెన్నెముకకు ఇరువైపులా రెండు కిడ్నీలు ఉంటాయి. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో దాదాపుగా అదే సైజులో ఉంటాయి.

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను వడపోసి వాటిని మూత్రం ద్వారా విసర్జించడం మూత్రపిండాల ప్రాథమిక విధి.

కిడ్నీలలో ఉత్పత్తి అయిన మూత్రం మూత్రనాళం ద్వారా మూత్రాశయానికి ప్రయాణిస్తుంది. అక్కడ అది ఒక నిర్దిష్ట పరిమాణానికి చేరుకున్న తర్వాత విసర్జితమవుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టమోటాలు, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, అరటి కాండం జ్యూస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు పక్కటెముకల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది.

కిడ్నీల్లో రాళ్లు ఎందుకు వస్తాయి?

మూత్రం ద్వారా బయటకు వెళ్లాల్సిన కాల్షియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు పేరుకుపోయినప్పుడు అవి నిక్షేపాలుగా ఏర్పడి, క్రమంగా ఒకదానితో ఒకటి కలుస్తూ గట్టి రాళ్ల రూపాన్ని సంతరించుకుంటాయి. వీటినే కిడ్నీలో రాళ్లు అంటారు. అరుదుగా అమ్మోనియం మెగ్నీషియం ఫాస్ఫేట్ రాళ్లు కూడా కనిపిస్తాయి.

రాళ్లు ఏర్పడటానికి మూత్రంలో ఖనిజ పదార్థాల పరిమాణం పెరగడం ఒక కారణమైతే, మూత్రం పరిమాణం తగ్గడం కూడా మరో ముఖ్యమైన కారణంగా ఉంటుంది. మూత్రం పరిమాణం తగ్గినప్పుడు, అందులోని ఖనిజ పదార్థాల సాంద్రత పెరిగి, నిక్షేపాలు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుందని యూరాలజిస్ట్‌ గోపాలకృష్ణన్‌ చెబుతున్నారు.

పెరుగుతున్న కిడ్నీ వ్యాధులలో స్టోన్స్ కూడా ఒకటని, కిడ్నీ వ్యాధులు ప్రపంచ జనాభాలో 12 శాతాన్ని ప్రభావితం చేస్తున్నాయని అమెరికన్ నేషనల్ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సీబీఐ) చెబుతోంది.

కిడ్నీలో రాళ్లు ఏర్పడటం మూత్రపిండాల పనితీరు పూర్తిగా ఆగిపోయే పరిస్థితికి దారితీసే అధిక ప్రమాదంతో సంబంధం కలిగి ఉందని కూడా తెలిపింది. మూత్రపిండంలోని రీనల్ పాపిల్లా ఉపరితలాలపై ఉండే 'రాండల్ ప్లాక్' అనే ప్రాంతంలో ఏర్పడే 'కాల్షియం ఆక్సలేట్' రకం రాళ్లే అత్యంత సాధారణమైనవని పేర్కొంది.

టమోటాలు, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, అరటి కాండం జ్యూస్

ఫొటో సోర్స్, Getty Images

లక్షణాలు

కిడ్నీలలో రాళ్లు ఏర్పడితే పక్కటెముకల ప్రాంతంలో ఆకస్మికంగా తీవ్రమైన నొప్పి, వాంతులు, జ్వరం లాంటివి వస్తాయి. వ్యక్తిని బట్టి నొప్పి తీవ్రత మారుతుంది. కొంతమందిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని డాక్టర్ గోపాలకృష్ణన్ చెప్పారు.

మూత్ర నాళంలో రాళ్లు ఏర్పడటం వల్ల మూత్ర విసర్జనకు అడ్డంకి ఏర్పడి అది ఇన్ఫెక్షన్‌గా మారి ప్రాణాంతకమైన సెప్టిసీమియాకు కూడా దారితీయవచ్చని ఆయన హెచ్చరించారు.

మూత్రపిండాల్లో రాళ్ల లక్షణాలు మూత్రపిండం, మూత్రనాళం లేదా మూత్రాశయంలో ఆ రాళ్లు ఎక్కడ ఉన్నాయనే దానిపై ఆధారపడి ఉంటుందని 2018లో ఎన్‌సీబీఐ అధ్యయనంలో తేలింది.

కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటం వల్ల తీవ్రమైన కండరాల నొప్పులు, పక్కటెముకల నొప్పి, మూత్రంలో రక్తం, మూత్ర నాళం మూసుకుపోవడం లేదా దెబ్బతినడం, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, మూత్ర విసర్జనలో అడ్డంకి, మూత్రపిండాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని అధ్యయనం పేర్కొంది.

"సాధారణంగా, లక్షణాల తీవ్రత రాయి ఉన్న ప్రదేశం, దాని సంఖ్య, పరిమాణం, అది కదులుతుందా లేక స్థిరంగా ఉందా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. కదిలే రాయి మూత్రనాళం లోపలి పొరను గాయపరచడం వల్ల తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. సాధారణంగా, 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న రాళ్లు సహజంగానే బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంత కంటే పెద్ద రాళ్లు వాటంతటవే బయటకొచ్చే అవకాశం తక్కువ" అని డాక్టర్ గోపాలకృష్ణన్ వివరించారు.

సాధారణంగా వేసవిలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ చెమట ద్వారా శరీరం నీటిని విసర్జించడం పెరిగి, శరీరానికి అవసరమైనంత నీరు తాగని వారిలో కిడ్నీ రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

టమోటాలు, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, అరటి కాండం జ్యూస్

ఫొటో సోర్స్, Getty Images

నీళ్లు బాగా తాగితే కిడ్నీరాళ్లు బయటికొచ్చేస్తాయా?

కిడ్నీలో చిన్న, నొప్పి లేని రాళ్లకు తక్షణ చికిత్స అవసరం లేదు. పుష్కలంగా ద్రవపదార్థాలు తీసుకోవడం, నిరంతర పర్యవేక్షణ సరిపోతుందని డాక్టర్ గోపాలకృష్ణన్ చెప్పారు. పెద్ద, నొప్పి కలిగించే రాళ్లకు ఈ క్రింది చికిత్సా పద్ధతులను ఉపయోగిస్తారు.

షాక్ వేవ్ లిథోట్రిప్సీ: షాక్ తరంగాలను ఉపయోగించి రాళ్లను విచ్ఛిన్నం చేసే పద్ధతి.

లేజర్ చికిత్స: ఎండోస్కోపీ ద్వారా మూత్రనాళంలో ఇరుక్కుపోయిన రాయిని నేరుగా లేజర్‌తో విచ్ఛిన్నం చేసే పద్ధతి.

స్టెంటింగ్ : ఇన్ఫెక్షన్ సోకిన సందర్భంలో, నిలిచిపోయిన మూత్రాన్ని బయటకు పంపడానికి మొదట ఒక చిన్న గొట్టం (స్టెంట్) అమరుస్తారు. ఇన్ఫెక్షన్‌కు చికిత్స చేసిన తర్వాత రాళ్లను తొలగిస్తారు.

పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ : పెద్ద రాళ్ల కోసం, వీపు ద్వారా చిన్న కోత పెట్టి నేరుగా మూత్రపిండాన్ని చేరుకుని రాయిని తొలగిస్తారు. ఇది పెద్ద శస్త్రచికిత్స కాదు.

టమోటాలు, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, అరటి కాండం జ్యూస్

ఫొటో సోర్స్, Getty Images

జీవన శైలి మార్పుతో ‘రాళ్ల’కు అడ్డుకట్ట

ఒకసారి మూత్రపిండాల్లో రాళ్లు వచ్చిన వారికి అవి మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ వచ్చినవాళ్లు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని డాక్టర్ గోపాలకృష్ణన్ సిఫార్సు చేశారు.

పుష్కలంగా నీరు తాగడం: కనీసం 2.5 నుంచి 3 లీటర్ల మూత్రవిసర్జన జరిగేంత నీరు తాగండి. ఇది స్థానిక ఉష్ణోగ్రత, వ్యక్తి పనిచేసే వాతావరణాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

ఉప్పు వాడకాన్ని తగ్గించడం: సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఉప్పు వాడకం తగ్గించాలి.

మాంసాహారం తగ్గించడం : కాలేయం, మెదడు వంటి అంతర్గత అవయవాలలో ఆక్సలేట్ యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి కాబట్టి మాంసాహారాన్ని మానుకోవాలి.

శరీర బరువును నియంత్రించడం: అధిక బరువు రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.

తీపి పానీయాలకు దూరంగా ఉండటం: తీపి పదార్థాలలో ఉండే ఫ్రక్టోజ్ యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది.

ఆక్సలేట్ అధికంగా ఉండేవి మితంగా తీసుకోవాలి: కొన్ని ఆకుకూరలు, గింజలలో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది కాబట్టి వాటిని మితంగానే తీసుకోవాలి.

కొన్ని కుటుంబాలలో వంశపారంపర్య జీవక్రియ లోపాల కారణంగా కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు

టమోటాలు, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, అరటి కాండం జ్యూస్

ఫొటో సోర్స్, Getty Images

టమోటాలు తింటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయా?

ఇది జనబాహుళ్యంలో విస్తృత ప్రచారంలో ఉన్నప్పటికీ అవాస్తవమని డాక్టర్ గోపాలకృష్ణన్ అంటున్నారు.

టమోటాలలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యేంత ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉండదు కాబట్టి వాటిని మితంగా తీసుకోవచ్చని ఆయన చెబుతున్నారు.

అరటి ఊచ రసం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడగలదా? అంటే ఈ వాదనను డాక్టర్ గోపాలకృష్ణన్ ఖండించారు.

అరటి ఊచ రసం తాగడం వల్ల రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని గానీ లేదా ఏర్పడిన రాళ్లు మరింత సులభంగా బయటకు వెళ్తాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అన్నారు.

శస్త్రచికిత్స ద్వారా లేదా సహజంగా బయటకు వచ్చిన రాళ్ల రసాయన కూర్పును విశ్లేషించడం ద్వారా ఏ ఆహార పదార్థాలను మానుకోవాలో జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో కచ్చితంగా నిర్ణయించవచ్చని డాక్టర్ డాక్టర్ గోపాలకృష్ణన్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)