ఇరాన్ యుద్ధం బ్రిక్స్‌ను ఎలా ప్రభావితం చేసింది, ప్రత్యర్థి దేశాలను ఒకచోట చేర్చడంలో భారత ఎలా విజయం సాధించింది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఆజాదె మొషీరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన నేతల్లో కొందరు శని, ఆదివారాల్లో దిల్లీలో సమావేశమయ్యారు.
ఈ సదస్సులో పాల్గొన్న నేతలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిక్స్ సభ్యదేశాల నేతలు నియమాలను అనుసరించే వారు కాకుండా, నియమాలను రూపొందించే వారిగా మారాలని సూచించారు.
సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా సహా బ్రిక్స్ కూటమి సభ్య దేశాల నేతలు పాల్గొన్నారు.
అయితే ఈ దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ సామరస్యంగానే లేవు. సరిహద్దు వివాదాలు, చివరకు సైనిక ఘర్షణల చరిత్ర కూడా ఉంది.
2020లో వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో భారత్, చైనాల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా పరస్పర విరుద్ధ వైఖరులు తీసుకున్నాయి. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుండగా, బ్రిక్స్ సభ్య దేశమైన యూఏఈపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ నేతలందరినీ భారత్ స్వయంగా ఒకచోటికి తీసుకురాగలగడం ఒక ఘనతే అని చెప్పుకోవాలి.
అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న దౌత్యపరమైన శక్తికి ఇది నిదర్శనం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాలు పరస్పర సంబంధాలను పునఃసమీక్షించుకునేందుకు కూడా ఈ సమావేశం ఒక వేదికగా నిలిచింది.
అయితే కొత్త ప్రపంచ వ్యవస్థ ఎలా ఉండాలి అనే అంశంపై ఏకాభిప్రాయానికి రావడం, స్పష్టమైన ఆచరణాత్మక ఫలితాలను సాధించడం మాత్రం చాలా కష్టమైన పని. శిఖరాగ్ర సమావేశం అంతటా ఈ ఉద్రిక్తత కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
పాశ్చాత్య ప్రభావానికి ప్రత్యామ్నాయంగా...
చైనా, రష్యా, ఇరాన్ వంటి దేశాలకు బ్రిక్స్ అనేది అమెరికా, పశ్చిమ యూరప్ ప్రభావాన్ని తగ్గించే సాధనం.
అయితే బ్రిక్స్‌ను పాశ్చాత్య వ్యతిరేక కూటమిగా చూపించేందుకు భారత్ ఇష్టపడటం లేదు. ‘ఈ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదు’ అని మోదీ స్వయంగా సమావేశంలో చెప్పారు.
భారత ప్రభుత్వానికి ఈ తేడా చాలా ముఖ్యం. ఎందుకంటే పరస్పరం విభేదించే దేశాలతో కూడా సంబంధాలను కొనసాగించాలని భారత్ కోరుకుంటోంది.
"ఈ కూటమి పాశ్చాత్య వ్యతిరేకంగా మారాలని కోరుకునే దేశాలు ఇందులో ఉన్నాయి. కానీ బ్రిక్స్ అలాంటిది కాదు" అని అనిల్ త్రిగుణాయత్ చెప్పారు. ఆయన భారత దౌత్యవేత్త, మాజీ రాయబారి.
ఆయన అభిప్రాయం ప్రకారం, యుద్ధ పరిస్థితులు నెలకొన్న కాలంలో భారత్ సాధించింది వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కోసం చేసిన ఒక ప్రయత్నం. అలాగే బ్రిక్స్ సభ్య దేశాల మధ్య మరింత సహకారాన్ని పెంచే చర్యలకు భారత్ ప్రాధాన్యం ఇచ్చింది.
సభ్య దేశాల మధ్య విభేదాలు ఇంత స్పష్టంగా కనిపించిన సందర్భాలు అరుదైనప్పటికీ, ఈ శిఖరాగ్ర సమావేశం ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేయడంలో విజయవంతమైంది.
ఈ ఏడాది ఇంతకుముందు రెండుసార్లు బ్రిక్స్ మంత్రుల సమావేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయకుండానే ముగిశాయి. ఈసారి మాత్రం ఏకాభిప్రాయం కుదిరింది. అయితే సభ్య దేశాల మధ్య తీవ్ర విభేదాలున్న అంశాలను పక్కన పెట్టడం ద్వారా ఈ ఏకాభిప్రాయం సాధించారు. దీంతో పరిష్కారాలు కూడా పెద్దగా కనిపించలేదు.
శిఖరాగ్ర సమావేశం తొలిరోజే న్యూదిల్లీ ప్రకటనను ఆమోదించారు. అయితే అందులో ఏమి లేదన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మధ్యప్రాచ్య యుద్ధంపై ప్రకటనలో అత్యంత సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. పౌర మౌలిక సదుపాయాలు, శాంతియుత అణు సౌకర్యాలపై జరుగుతున్న దాడులను కూడా ఖండించారు. అయితే ఇందుకు ఎవరు బాధ్యులో మాత్రం పేర్కొలేదు.
రెండు దేశాల పరిష్కారానికి మద్దతును పునరుద్ఘాటించిన ప్రకటన, పాలస్తీనియన్లను బలవంతంగా తరలించడాన్ని, ఆక్రమణను చట్టబద్ధం చేసే లేదా కొనసాగించే చర్యలను వ్యతిరేకించింది. ఈ అంశాన్ని ఇప్పటికే ఉన్న ఐక్యరాజ్యసమితి తీర్మానాల పరిధిలో జాగ్రత్తగా ప్రస్తావించింది.
రష్యా యుక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధం గురించి మాత్రం ప్రకటనలో ఎలాంటి ప్రస్తావన లేదు. గతంలోని బ్రిక్స్ ప్రకటనలతో పోలిస్తే ఇది ఒక మార్పు.
వాణిజ్య అంశంలోనూ ఇదే జాగ్రత్త కనిపించింది. పెరుగుతున్న సుంకాలపై ఆందోళన వ్యక్తం చేసి, ఏకపక్ష ఆంక్షలను ఖండించారు. అయితే అమెరికా పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో వాషింగ్టన్ ఆగ్రహానికి గురికాకుండా ఉండేలా జాగ్రత్తపడినట్లు కనిపిస్తోంది.
అనేక బ్రిక్స్ సభ్య దేశాలు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆగ్రహాన్ని ఎదుర్కొనేందుకు ఇష్టపడకపోయి ఉండవచ్చు. సరిహద్దు వాణిజ్యం కోసం కేంద్ర బ్యాంకుల డిజిటల్ కరెన్సీలను అనుసంధానించే ప్రతిపాదనలతో సహా బ్రిక్స్ ప్రతిపాదనలను ట్రంప్ గతంలో అమెరికాకు వ్యతిరేకంగా అభివర్ణించారు.
"మధ్యప్రాచ్యంలోని ఘర్షణను ఖండించినప్పటికీ, ఏ దేశం పేరునూ ప్రస్తావించకపోవడం భారత్ శైలిని ప్రతిబింబిస్తోంది" అని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ సీనియర్ విశ్లేషకుడు ప్రవీణ్ డోంథి చెప్పారు.
"సుంకాలపై బలమైన ప్రస్తావన ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. భారత్ ఈ విషయంలో మరింత పరోక్షంగా వ్యవహరించాలని భావించి ఉండవచ్చు. అయితే తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు దీన్ని ఒక అవకాశంగా భావించి ఉండవచ్చు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ వాణిజ్య బెదిరింపులు, మధ్యప్రాచ్య యుద్ధం సృష్టించిన ఆందోళనల నేపథ్యంలో ప్రపంచ వ్యవస్థను పునర్నిర్మించడం బ్రిక్స్‌లోని అనేక సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు అత్యవసరగా మారింది.
కొన్ని నెలల క్రితం ఊహించడం కూడా కష్టంగా అనిపించిన సమావేశాలకు ఈ శిఖరాగ్ర సమావేశం వేదిక కల్పించింది.
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ కలిసి చర్చలు జరిపారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ రెండు దేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి ప్రత్యక్ష సమావేశం ఇదేనని భావిస్తున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులు, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ తాను ఒంటరిగా లేనని ప్రపంచానికి చూపించేందుకు ఈ సమావేశం ఇరాన్‌కు అవకాశం కల్పించింది.
అమెరికా ఆంక్షలు, వాషింగ్టన్ చేపట్టిన ఆపరేషన్ ఎకనామిక్ ఔట్‌కాస్ట్, ఇరాన్ నౌకాశ్రయాలపై నౌకా దిగ్బంధనాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, బ్రిక్స్ సభ్య దేశాలతో మరింత లోతైన ఆర్థిక సంబంధాలు ఏర్పరచుకోవాలని పెజెష్కియాన్ కోరారు. మలేసియా, భారత్, ఇథియోపియాతో సహా ఇతర దేశాలతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
చైనా విషయానికి వస్తే, అధ్యక్షుడు జిన్‌పింగ్ ఏడు సంవత్సరాల తర్వాత తొలిసారి దిల్లీకి వచ్చారు. 2020 సరిహద్దు వివాదం తర్వాత చైనా, భారత్ మధ్య తీవ్ర అనుమానాలు నెలకొన్నప్పటికీ, ఇటీవలి కాలంలో ఆ ఉద్రిక్తతలు సద్జుమణిగాయి. ఇరు దేశాల మధ్య భారీ వాణిజ్య అసమతుల్యత కూడా ఉంది. ఇందులో చైనాకు అనుకూలంగా ఉండే లోటు భారీగా ఉంది.
షీ, మోదీలు స్నేహపూర్వకంగా హాండ్‌షేక్ చేసుకున్నారు. అయితే మోదీకి అలవాటైన ఆలింగనం మాత్రం కనిపించలేదు. శనివారం రాత్రి మోదీ ఏర్పాటు చేసిన విందుకు కూడా జిన్‌పింగ్ హాజరుకాలేదు. ఆయన 24 గంటల కంటే తక్కువ సమయమే దిల్లీలో గడిపారు.
అయినప్పటికీ, ఇంత సంక్లిష్టమైన సంబంధాలున్న రెండు దేశాలకు ఈ వారాంతం ఒక కీలక సందర్భంగా నిలిచింది. అధికారిక వివరాల ప్రకారం, వ్యాపార సంబంధాలు, రవాణా కనెక్షన్లను బలోపేతం చేయడంతో పాటు వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను పరిష్కరించేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు.
ఇటీవలి సంవత్సరాల్లో ఇరు దేశాల సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్న పరిణామంలో ఇది కూడా ఒక ముందడుగని త్రిగుణాయత్ భావిస్తున్నారు. ఇరువైపులా కలిసి పనిచేయాలనే ఆసక్తి ఉందని ఆయన అన్నారు. అయితే ఇది గణనీయమైన పురోగతికి దారితీస్తుందా అనేది చూడాల్సి ఉంది.
"మనం విశ్వసించాలి. కానీ ముందుగా ఆ విశ్వాసాన్ని ధృవీకరించుకోవాలి అని నేను ఎప్పుడూ చెబుతుంటాను" అని ఆయన అన్నారు.
ఇక ముందేం జరగనుంది?
పాశ్చాత్య ఆధిపత్య సంస్థలకు వెలుపల ప్రత్యర్థి దేశాలు చర్చలు జరపడానికి, తమ ప్రయోజనాల కోసం వ్యూహాలు రచించుకోవడానికి బ్రిక్స్ అవకాశం కల్పించగలదని ఈ శిఖరాగ్ర సమావేశం చూపించింది.
అయితే ఇక ముందేం జరుగుతుందన్నదే మిస్టరీ.
ప్రపంచానికి ఒక కొత్త వ్యవస్థ అవసరం గతంలో కంటే ఇప్పుడు మరింతగా ఉందన్న విషయంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య స్పష్టమైన ఏకాభిప్రాయం ఉంది. కానీ ఆ కొత్త వ్యవస్థ ఎలా ఉండాలి, ప్రస్తుత వ్యవస్థ స్థానంలో దాన్ని ఎలా తీసుకురావాలి అన్న ప్రశ్నలకు సమాధానం కనుగొనడం మాత్రం మరింత సవాలుతో కూడుకున్న విషయం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























