మనిషికి పంది కిడ్నీ: 271రోజుల రికార్డు సమయం తర్వాత ఎందుకు పని చేయడం మానేసింది...

కిడ్నీ, అవయవమార్పిడి, అమెరికా, జీనోట్రాన్స్‌ప్లాంటేషన్

ఫొటో సోర్స్, Kate Flock/Massachusetts General Hospital

    • రచయిత, జేమ్స్ గెళ్లఘర్
    • హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఓ రోగి శరీరంలో అమర్చిన పంది కిడ్నీ 271రోజులు పనిచేసిందని అమెరికా వైద్యులు చెప్పారు. ఓ పంది కిడ్నీ మనిషిలో ఇన్నిరోజుల పాటు పనిచేయడం ఇదే తొలిసారని తెలిపారు.

ఈ చికిత్స వల్ల తనకు జీవితంపై ఆశ కలిగిందని ఆ కిడ్నీని అమర్చుకున్న టిమ్ ఆండ్రూస్‌ చెప్పారు. డయాలసిస్ మెషీన్‌తో రక్తాన్ని శుద్ధిచేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరాన్ని కొన్ని నెలల పాటు తప్పించిందని ఆయన అన్నారు.

మనిషి అవయయాలు దొరికే వరకు పంది అవయవాలు 'బ్రిడ్జ్'లా ఉపయోగించొచ్చని మాస్ జనరల్ బ్రిగ్‌హామ్ ఆస్పత్రి బృందం తెలిపింది.

అయితే పంది కిడ్నీ తర్వాత పనిచేయడం ఆగిపోయింది. దాన్ని తొలగించారు. మళ్లీ కొత్త దాత దొరికేవరకు ఆండ్రూస్ డయాలసిస్ చేయించుకున్నారు.

అవయవాల మార్పిడికి కొరత ఏర్పడుతుండడంతో వైద్యులు, శాస్త్రవేత్తలు జీనోట్రాన్స్‌ప్లాంట్‌పై పరిశోధనలు చేస్తున్నారు. ఇతర జాతులకు చెందిన అవయవాలను మనుషులకు అమర్చడాన్ని జీనోట్రాన్స్‌ప్లాంట్ అంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కిడ్నీ, అవయవమార్పిడి, అమెరికా, జీనోట్రాన్స్‌ప్లాంటేషన్

ఫొటో సోర్స్, Kate Flock/Massachusetts General Hospital

ఫొటో క్యాప్షన్, పంది కిడ్నీ ఆండ్రూస్ శరీరంలో 271రోజులు పనిచేసింది.

‘జీవితంపై ఆశ చిగురించింది’

అమెరికాలో దాదాపు లక్షమంది కిడ్నీ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఏటా 25వేల కిడ్నీమార్పిడి ఆపరేషన్‌లు మాత్రమే జరుగుతున్నాయి. యూకేలో 7వేలమందికిపైగా ప్రజలు కిడ్నీ కోసం ఎదురుచూస్తున్న జాబితాలో ఉన్నారు.

జాబితాలో పేరు పైకి రావడానికి ఏడేళ్లు పడుతుందని ఆండ్రూస్‌తో చెప్పారు. డయాలసిస్ మీద ఆధారపడేవాళ్లు సగటున అయిదేళ్లు మాత్రమే బతుకుతారని అన్నారు.

''నాకు సమయం చాలా తక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఇది నాకు చాలా నిరాశ కలిగించింది'' అని ఆయన అన్నారు.

అయితే పంది కిడ్నీని అమర్చాలన్న ఆలోచన తనకు ఆశ కల్పించిందని, ఒక చీకటి సొరంగంలో చివరన కనిపించే వెలుగులా అనిపించిందని ఆయన అభివర్ణించారు.

''అన్నింటికంటే ఆశ పెద్ద విషయం. డయాలసిస్ యంత్రం నుంచి విముక్తి పొంది మీ జీవితాన్ని మీరు జీవించే అవకాశం దొరకడం ఎంతో ముఖ్యమైంది'' అని ఆయన చెప్పారు.

కిడ్నీ, అవయవమార్పిడి, అమెరికా, జీనోట్రాన్స్‌ప్లాంటేషన్

ఫొటో సోర్స్, Kate Flock/Massachusetts General Hospita

ఫొటో క్యాప్షన్, జీనోట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం పంది జన్యువుల్లో 69మార్పులు చేశారు.

పందులనుంచే ఎందుకంటే...

జీనోట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం పందులను అనువైన జంతువులుగా భావిస్తారు. వాటి అవయవాల పరిమాణం మనుషుల అవయవాలకు దాదాపు సరిపోతుంది. అంతేకాకుండా మనుషులకు పందులను పెంచడంలో ఎంతో కాలంగా అనుభవం ఉంది. వాటి జీవన శైలి, వాటి అవయవాల పనితీరు మీద చాలా వరకు అవగాహన ఉంది.

అయితే నేరుగా మన దొడ్లో ఉన్న పంది నుంచి కిడ్నీ తీసుకుని మనిషికి అమర్చడం సాధ్యం కాదు. మనిషి శరీరం ఆ అవయవాన్ని వెంటనే బయటి పదార్థం (ఫారిన్ బాడీ) గా గుర్తించి తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. దీంతో కిడ్నీ పాడైపోతుంది. ప్రతి కణంలోనూ రంధ్రాలు ఏర్పడి అవయవం లోపలి నుంచే రక్తం గడ్డకట్టడంతో అది కేవలం కొన్ని నిమిషాల్లోనే నల్లగా మారిపోతుంది.

అందుకే పరిశోధకులు యుకటాన్‌ అనే చిన్నజాతి పందులను అభివృద్ధిచేశారు. వాటి జన్యువుల్లో మొత్తం 69 మార్పులు చేసి, వాటి అవయవాలను మానవ శరీరానికి మరింత అనుకూలంగా మార్చారు.

ప్రతిఘటన వ్యవస్థ గుర్తించి దాడి చేసే కొన్ని లక్షణాలను ఈ జన్యుమార్పుల ద్వారా పంది కణాల్లో తొలగించారు. అలాగే కొన్ని మానవ డీఎన్ఏ లక్షణాలను జోడించి పంది కణజాలాన్ని ప్రతిఘటన వ్యవస్థకు కనిపించకుండా చేసే ఒకరకమైన మభ్యపెట్టే కవచంలా పనిచేసే విధంగా చేశారు. అంతేకాకుండా పంది డీఎన్ఏలో దాగి ఉండే వైరస్‌లను క్రియారహితం చేసే మరిన్ని జన్యుమార్పులు చేసి, ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించారు.

కిడ్నీ, అవయవమార్పిడి, అమెరికా, జీనోట్రాన్స్‌ప్లాంటేషన్

ఫొటో సోర్స్, Kate Flock/Massachusetts General Hospita

ఫొటో క్యాప్షన్, 66 ఏళ్ల వయసులో ఆండ్రూస్‌కు జీనోట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు.

జీనోట్రాన్స్‌ప్లాంటేషన్‌తో సమస్య తీరుతుందా?

టైప్ 2 డయాబెటిస్ కారణంగా ఆండ్రూస్‌కు కిడ్నీ వ్యాధి చివరి దశలో ఉంది. ఆయన కిడ్నీలు దాదాపుగా పనిచేయనిస్థితికి చేరుకున్నాయి.

2025 జనవరి 25న జీనోట్రాన్స్‌ప్లాంట్ చేసేటప్పుడు ఆయన వయసు 66 ఏళ్లు.

మార్పిడి చేసిన కిడ్నీ వెంటనే పనిచేయడం ప్రారంభించిందని లాన్సెట్ మెడికల్ జర్నల్‌‌లో ప్రచురితమైన కథనం పేర్కొంది.

ఆ కిడ్నీ 271రోజుల పాటు పనిచేసింది. 2025 అక్టోబరులో దాన్ని తొలగించారు. ఆ తర్వాత 82 రోజులపాటు ఆండ్రూస్ డయాలసిస్ చేయించుకున్నారు. చివరకు 2026 జనవరిలో ఓ దాత ద్వారా ఆయనకు మనిషి కిడ్నీ లభించింది. ప్రస్తుతం ఆ కిడ్నీ బాగా పనిచేస్తోంది.

‘‘మార్పిడి కోసం సరిపడా అవయవాలు లేకపోవడంతో మనం సంక్షోభంలో ఉన్నాం’’ అని మాస్ జనరల్ బ్రిగమ్‌లోని సెంటర్ ఫర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ లియోనార్డో రియెల్లా చెప్పారు.

''ఆశను కల్పించేందుకు మేం చాలా కష్టపడుతున్నాం. జీనోట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక ప్రత్యామ్నాయంగా మారగలగదని మేం నిజంగా నమ్ముతున్నాం. జీవించి ఉన్న దాత లేని రోగులకు డయాలసిస్‌ను దాటేసి నేరుగా మార్పిడిదశకు చేరుకునే అవకాశం దీనివల్ల రావచ్చు'' అని ఆయన చెప్పేవారు.

ఆండ్రూస్‌కు మార్పిడి చేసిన పంది కిడ్నీని శరీరం తిరస్కరిస్తున్నట్టు ప్రారంభంలో సంకేతాలు కనిపించాయి. అయితే మందుల్లో మార్పులు చేయడం ద్వారా దాన్ని విజయవంతంగా నియంత్రించారు.

దాదాపు ఆరు నెలల తర్వాత కిడ్నీలోని రక్తనాళాలు దెబ్బతినడం ప్రారంభించాయి. కిడ్నీలో వాపు ఏర్పడింది. చివరకు కిడ్నీ పనిచేయడం ఆగిపోవడం మొదలయింది.

ఇది ఎందుకు జరిగిందో కచ్చితంగా తెలియదు. పంది కిడ్నీపై యాంటీబాడీలు దాడి చేసినట్టు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు.

''కిడ్నీ జీనోట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ఉన్న అవకాశాలతో పాటు ఇంకా పరిష్కరించాల్సిన సవాళ్లను కూడా ఈ కేసు మనకు గుర్తు చేస్తోంది'' అని వైద్యులు ‘ది లాన్సెట్‌’లో ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)