థాయిలాండ్: అమెరికా యుద్ధ నౌకలో 250 రోజులు ఉన్న తరువాత పటాయా వచ్చిన సైనికులు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు?

ఫొటో సోర్స్, Arnun Chonmahatrakool/Thai News Pix/LightRocket via Getty Images
- రచయిత, జోనాథన్ హెడ్, నాంగ్నాపట్ పట్చుమ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
అమెరికా యుద్ధనౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' థాయిలాండ్ తీరానికి చేరుకుంది.
థాయిలాండ్‌లోని పటాయా అనగానే అందరికీ నైట్‌లైఫ్, బార్లు, క్లబ్బులు గుర్తుకొస్తాయి. కానీ 5 వేల మంది అమెరికన్ నావికుల ప్రవర్తన వాటికి దూరంగా ఉంది.
విలాసాలకు దూరంగా వాళ్లు స్థానిక మాల్స్‌లో షాపింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
నౌక నుంచి దిగిన తర్వాత నావికులు బీచ్‌లోని రెండు హోటళ్లలో ఉంటున్నారు. వాటిలో ఒకటైన హార్డ్ రాక్ హోటల్‌లో వాళ్లు కొత్తగా కొన్న వస్తువులతో తిరుగుతూ కనిపించారు.
రికార్డు స్థాయిలో వరుసగా 250 రోజుల పాటు యుద్ధనౌకలోనే గడిపిన ఈ నావికులకు.. సాధారణ జీవితంలో భాగమైన మాల్స్‌కు వెళ్లడం, షాపింగ్ చేయడమే ముఖ్యంగా కనిపిస్తోంది.


ఫొటో సోర్స్, Reuters
మిషన్ పొడిగించడంతో గల్ఫ్ నుంచి థాయిలాండ్‌కు..
గత నవంబర్‌లో అమెరికాలోని శాన్‌డియాగో నుంచి బయలుదేరిన ఈ యుద్ధనౌక, నిజానికి పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రంలో ఆరు నెలల పాటు విధులు నిర్వహించాల్సి ఉంది.
ఫిబ్రవరి చివరలో ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలు ప్రారంభించడంతో ఈ నౌకను అత్యవసరంగా గల్ఫ్ ప్రాంతానికి మళ్లించారు.
దీంతో సుదీర్ఘ కాలం పాటు సముద్రంలోనే గడపాల్సి వచ్చింది.
మిలటరీ తరహా హెయిర్‌కట్‌లు, మీసాలు, నేవీ టీ-షర్టులతో ఉన్న ఈ నావికులు.. బీచ్ దుస్తుల్లో తిరిగే పర్యాటకులుండే పటాయాలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, BBC/Lulu Luo
స్థానిక వ్యాపారుల్లో నిరాశ
పటాయాలో రాత్రి పూట అసలైన జీవితం కనిపిస్తుంది. నియాన్ దీపాలు, రంగు రంగుల బార్లు, వీధుల్లో ఆహ్వానం పలికే అమ్మాయిలతో కొత్తగా మారుతుంది.
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వల్ల పటాయా పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. పటాయా వచ్చే విదేశీ పర్యటకుల సంఖ్య బాగా తగ్గింది.
ఇలాంటి సమయంలో 9 నెలల జీతాన్ని చేతిలో పట్టుకుని వస్తున్న అమెరికన్ నావికులు తమ వ్యాపారాలను ఆదుకుంటారని స్థానిక బార్లు, రెస్టారెంట్ల యజమానులు ఆశపడ్డారు.
బుధవారం రాత్రి ఇక్కడి ప్రసిద్ధ విహార ప్రదేశం 'వాకింగ్ స్ట్రీట్' ప్రవేశద్వారం వద్ద "అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ సిబ్బందికి మార్కెట్ స్వాగతం పలుకుతోంది" అని పెద్ద డిజిటల్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.
కొందరు నావికులు మద్యం మత్తులో కనిపించినప్పటికీ, మెజారిటీ సైనికులు బార్లలో డబ్బు ఖర్చు చేయడం లేదని స్థానిక వ్యాపారస్థులు వాపోతున్నారు.
అయితే వాళ్లు మద్యం బాగా తాగారు. అర్థరాత్రయ్యే సరికి కొంతమంది యువ నావికులు తూలుతూ కనిపించారు.
మరికొందరు ఎర్రటి వెలుగులతో నిండిన గుహల్లాంటి గో - గో బార్లకు వెళ్లారు. ఈ బార్లలో పోల్ డాన్సర్లు దాదాపు నగ్నంగా డాన్స్ చేస్తుంటారు.

'యుద్ధనౌక ఎంత పెద్దదైనా పడవలాగే అనిపిస్తుంది'
బార్లలో హోరుమనే సంగీతం మధ్య ఎవరితోనైనా మాట్లాడటం చాలా కష్టం.
అయితే ఒక సీనియర్ అధికారితో బీబీసీ మాట్లాడింది. తమకు విశ్రాంతి అవసరమని ఆయన చెప్పారు.
"మేం తొమ్మిది నెలలుగా సముద్రంలో ఉన్నామని వార్తలు వస్తున్నాయి. నిజం చెప్పాలంటే, నేను అసలు సమయాన్నే మర్చిపోయాను. అక్కడ చాలా విసుగు పుడుతుంది. వేలాది మందితో కలిసి ఉన్నప్పుడు యుద్ధనౌక ఎంత పెద్దదైనా.. అది ఒక చిన్న పడవలాగే అనిపిస్తుంది. మాకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం" అని ఆయన చెప్పారు.
మరి తిరిగి కాలిఫోర్నియా ఎప్పుడు వెళ్తారనే ప్రశ్నకు, "దానికి ఇంకా చాలా సమయం పడుతుంది" అని సమాధానమిచ్చారు.
ఇటీవల వ్యాపారం చాలా తగ్గిందని అమెరికన్ నావికులు నగరానికి కొత్త కళ తీసుకొచ్చారని రెస్టారెంట్ యజమాని కోసోల్ హోంఖున్థోడ్ చెప్పారు.
'బీచ్‌లో చాలామంది కూర్చుని ఉండటం చూశాను. రోజు ఇలా జరగదు" అని అటుగా వెళుతున్న టూరిస్ట్ ఒకరు చెప్పారు.
అయితే అమెరికన్ నావికులు బార్లలోకి రాకుండా వీధుల్లో అటు ఇటు తిరుగుతూ టైమ్ పాస్ చేస్తున్నారని బార్ యజమాని కాంటా సెంకాలా చెప్పారు.
"వాళ్లు డ్రింక్స్ కోసం లేదా అలాంటిదేమీ కోసం రావడం లేదు. ఎక్కువగా అటూఇటూ తిరుగుతూనే ఉంటారు. గత సంవత్సరాల్లో ఖర్చు చేసినట్లుగా ఇప్పుడు డబ్బు ఖర్చు చేయడం లేదు" అని ఆయన అన్నారు.
పార్టీలు చేసుకున్నా, చేసుకోకపోయినా పటాయా రావడం అమెరికన్ నావికులకు చాలా ఉపశమనం కలిగించే అంశం.
మరోవైపు, అమెరికాలో ఉన్న నావికుల కుటుంబాలు కూడా ఆందోళన చెందుతున్నాయి.
"కొన్ని నెలలుగా నౌకలోని సిబ్బంది మనోధైర్యం చాలా తగ్గిపోయింది. ఆ యుద్ధ వాతావరణం భయానకంగా ఉంది" అని 25 ఏళ్ల నావికుడు జాడా ఫెయిర్‌ఫాక్స్ తల్లి షకేరా రాయిటర్స్‌తో చెప్పారు.
"నా కొడుకు ముఖంలో నవ్వు చూడటానికి అతని నోటి నుంచి 'మమ్మీ' అనే పిలుపు వినడానికి నేను ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" షకేరా అన్నారు.

కఠిన నిబంధనలు.. పర్యవేక్షణ
థాయిలాండ్‌లో వ్యభిచారం సాంకేతికంగా చట్టవిరుద్ధం. నావికులు ఎవరూ కూడా ఇక్కడి సెక్స్ పరిశ్రమ వైపు వెళ్లకుండా కఠిన నిబంధనలు విధించారు.
అంతేకాకుండా, నౌకలో అంతర్గత పరిస్థితులపై మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని నావికులకు ముందే శిక్షణ ఇచ్చారు.
నగరంలో క్రమశిక్షణను కాపాడటానికి "తీర సమన్వయ బృందం" అని రాసి ఉన్న టీ-షర్టులు ధరించిన ప్రత్యేక బలగాలు పటాయా అంతటా పహారా కాస్తున్నాయి.
సైనికులపై ఉన్న ఆంక్షల గురించి బీబీసీ అడిగిన ప్రశ్నలకు అమెరికన్ నావికాదళ అధికారి క్రిస్టోఫర్ రాబిన్సన్ నేరుగా సమాధానం చెప్పలేదు.
"మేం నావికులకు సాధ్యమైనంత ఎక్కువ విశ్రాంతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మా సిబ్బంది అమెరికా చట్టాలు, యుఎస్ నేవీ నిబంధనలు థాయ్ చట్టాలకు లోబడే ప్రవర్తిస్తారు" అని ఆయన స్పష్టం చేశారు.
గల్ఫ్ ప్రాంతం నుంచి కాలిఫోర్నియాకు తిరిగి వెళ్లే మార్గంలో థాయిలాండ్ ఉండటం, అమెరికాకు సుదీర్ఘ కాలంగా నావికాదళ మిత్రదేశంగా కావడంతో ఈ 'పోర్ట్ స్టాప్' ఏర్పాటు చేయడం వ్యూహాత్మకంగా జరిగింది.
ఈ విరామం సుదీర్ఘ మిషన్‌తో అలసిపోయిన నావికులకు మానసిక ఉపశమనాన్ని ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































