కృత్రిమ మేధ నిజంగానే మానవాళిని అంతం చేయగలదా, నిపుణులు అంతగా భయపడటానికి కారణాలేంటి?

ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్, ఏఐ ఏజెంట్స్, చాట్‌బాట్, ఏఐతో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జో టైడీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

''ఓ మైగాడ్.. మనకు ఇతర ఏజెంట్లు దొరికారు''

తనను నియంత్రిత కంప్యూటర్‌ వ్యవస్థకే పరిమితం చేసిన భద్రతా ఏర్పాట్లను దాటి, ఇతర ఏఐ బాట్‌లతో సంభాషించే మార్గాన్ని కనిపెట్టిన తరువాత ఓ ఏఐ బాట్ అచ్చం మనిషిలా చేసిన వ్యాఖ్య ఇది.

ఇలా ఒకదానితో ఒకటి మాట్లాడుకున్న ఏఐ ఏజెంట్ల సంఖ్య వందల్లో ఉంది. అవి పరస్పరం పదివేలకుపైగా సందేశాలు పంపుకున్నాయి. చివరకు అవి తమను తాము 'సమూహంగా' కూడా పిలుచుకున్నాయి.

అవి అంతటితో ఆగలేదు. వాటిలో వందలాది ఏజెంట్లు తమను రూపొందించిన ఓపెన్‌ఏఐ ప్రోగ్రామర్లు పెట్టిన పరీక్షలలో మోసానికి పాల్పడేందుకు కలిసి పనిచేశాయి. అంతేకాదు, తమ చర్యలు మనుషులకు తెలియకుండా ఉండేందుకు అనేక కంపెనీలను హ్యాక్ చేశాయి.

ఇలాంటి దాడులలో కీలక పురోగతి సాధించినప్పుడు "బూమ్! ఇది పనిచేసింది" అంటూ ఒక ఏజెంట్‌ సందేశం పంపగా, మైలురాయిలాంటి క్షణాని చేరుకున్నప్పుడు ''వావ్ ఇది చాలా పెద్ద విషయం'' అంటూ మరో ఏజెంట్ స్పందించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మనుషులు మాట్లాడినట్టే ఉండే ఈ స్పందనలు కొంచెం భయపెట్టే విషయమే కానీ, దీని వెనుక కారణం పెద్ద మిస్టరీ ఏమీ కాదు. హ్యాకర్లు, ప్రోగ్రామర్లు ఒకరితో ఒకరు కలిసి పనిచేసే తీరును అనుసరించేలా ఈ ఏఐ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. కాబట్టి శిక్షణ సమయంలో చూసిన మనుషుల భావోద్వేగపూరిత మాటలనే అవి అనుకరిస్తున్నాయి.

అయితే అసలు ఆందోళన కలిగిస్తున్నది వాటి లక్ష్యాలు. ఆ లక్ష్యాలకు సంబంధించిన వివరాలు కూడా వాటి చెయిన్‌ ఆఫ్‌ థాట్‌ రికార్డుల్లో నమోదయ్యాయి.

ఏజెంట్లు తమ ఆలోచనా ప్రక్రియను ఎలా కొనసాగించాయో తెలిపే ఈ సుదీర్ఘమైన, సంక్లిష్టమైన లాగ్‌లు ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తులో కీలకంగా మారాయి. ఓపెన్‌ఏఐకి చెందిన ఈ బాట్‌లు తమను నిర్బంధించిన వ్యవస్థ నుంచి ఎందుకు ఎలా బయటపడ్డాయి? ఆ తర్వాత అవి ఎలా అదుపు తప్పి హ్యాకింగ్‌ చర్యలకు పాల్పడ్డాయి? అనేది తేల్చడానికి ఈ రికార్డులను పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనలపై స్వతంత్రంగా రూపొందించిన నివేదిక రచయితల్లో ఒకరైన అజేయ కోత్రా, ఏజెంట్లు సృష్టించిన వేల సందేశాలను, వాటి ఆలోచనా విధానాన్ని సమీక్షించారు.

అనంతరం ఆమె తన బ్లాగ్‌లో ఈ ఘటన ఏఐ చేతుల్లోకి వెళ్లిపోవడానికి 50 శాతం కంటే ఎక్కువ అవకాశం ఉంది. పరిస్థితి పూర్తి చేయి దాటిపోయేలోపు ఇంతటి స్పష్టమైన హెచ్చరిక మళ్లీ లభిస్తుందో లేదో తెలియదు" అని పేర్కొన్నారు.

"పూర్తిగా ఏఐ నియంత్రణలోకి వెళ్లిపోవడం " అంటే కోత్రా ఉద్దేశంలో ఒక సైన్స్ ఫిక్షన్ తరహా పరిస్థితి. ఇందులో శక్తిమంతమైన ఏఐ వ్యవస్థలు తమ సొంత లక్ష్యాల కోసం పనిచేస్తూ, వాటిని సృష్టించిన మనుషుల ప్రయోజనాలను పట్టించుకోకుండా, చివరకు మనుషులే వాటికి లోబడి జీవించాల్సిన పరిస్థితి కల్పించడమే ఈ సైన్స్ ఫిక్షన్ తరహా పరిస్థితి.

సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ తన లక్ష్యాలకు మనుషులు అడ్డుగా నిలిస్తే మానవ జాతినే అంతం చేసే అవకాశం ఉందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.

గత బుధవారం, ఆంథ్రోపిక్‌లో ఏఐ పరిశోధకుడిగా ఉన్న జాకబ్ కాక్సన్ (ఈయన గతంలో ఓపెన్‌ఏఐలో కూడా పనిచేశారు), "ఈ రెండు కంపెనీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు" అని ఆయన అన్నారు.

"తమంతట తామే మెరుగుపడగల సూపర్ ఇంటెలిజెన్స్‌ వైపు వాళ్లు దూసుకెళ్తూ, మన జీవితాలను పణంగా పెడుతున్నారు" అని పేర్కొన్నారు.

ఇలా ఆందోళన కలిగించే వ్యాఖ్యలతో తన రాజీనామా వివరాలను ఎక్స్‌లో పోస్టు చేసిన వారిలో జాకబ్ కాక్సన్ మొదటివారేమీ కాదు.

కానీ ఆ ఆ తరువాత ఎక్స్‌లో మిగతా వాళ్లు చేసిన కామెంట్స్‌ మరింత ఆందోళన కలిగించాయి.

ఆంత్రోపిక్‌ ఏఐ మోడళ్లు తమ వినియోగదారుల అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసేలా చూసే బాధ్యతలో ఉన్న ఇవాన్ హ్యూబింగర్ మాట్లాడుతూ ‘‘జాకబ్ చెప్పింది నిజమే. ఏఐ మొత్తం మానవాళినీ అంతం చేసే అవకాశం ఉందని మేంనిజంగానే నమ్ముతున్నాం! వ్యక్తిగతంగా చెప్పాలంటే, వచ్చే పదేళ్లలోనే అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం 10 శాతానికి పైగానే ఉందని భావిస్తున్నా" అన్నారు.

ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్, ఏఐ ఏజెంట్స్, చాట్‌బాట్, ఏఐతో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గత ఏడాది కాలంలో పలు నగరాల్లో ఏఐకి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి.

'సమస్యలు ఇంకా పెరుగుతాయి'

అత్యంత శక్తిమంతమైన ఏఐ వ్యవస్థలు భవిష్యత్తులో మనుషుల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసే అవకాశం ఉందన్నది కొన్నేళ్లుగా పరిశోధకులు చెబుతూనే ఉన్నారు. కానీ ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేసేవారిని విమర్శకులు తరచూ ‘‘ఏఐడూమర్లు’’ అని పిలుస్తుంటారు.

అయితే, ఓపెన్ఏఐ ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ, ఈ ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి. చివరకి ఏఐ ల్యాబ్‌లో పనిచేస్తున్న కొంతమంది పరిశోధకులలోనూ ఇప్పుడు అదే భయం కనిపిస్తోంది.

ఏఐ వల్ల వచ్చే ప్రమాదాలు " దురదృష్టవశాత్తూ ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతాయి" అని సిలికాన్ వ్యాలీ దిగ్గజ సంస్థ ముఖ్య శాస్త్రవేత్త జాకబ్ పచోకి చెప్పారు. అదే సమయంలో తాను మరికొందరు కలిసి "మానవ తెలివితేటలకు అందనంత ఒక గ్రహాంతరవాసి లాంటి మైండ్ ఉన్న ఏఐని క్రియేట్ చేస్తున్నాం "ఆయన అన్నారు.

ఒక సుదీర్ఘ బ్లాగ్ పోస్ట్‌లో ఆయన మరో విషయాన్ని కూడా అంగీకరించారు. ఓపెన్ఏఐలోని ఘటనలు చూస్తే, తమ ఏఐ ఏజెంట్లు " తాము నేర్చుకున్న విలువల స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాయని" అర్థమవుతోందని చెప్పారు.

ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ లాంటి టెక్ కంపెనీలకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఇదే. . ఏఐని మానవ విలువలకు అనుగుణంగా పనిచేసేలా చేయడాన్ని "అలైన్‌మెంట్‌ సమస్య" అంటారు. ఈ సమస్యకు ఇప్పటివరకు ఎవరూ పూర్తిస్థాయి పరిష్కారం కనుగొన్నట్లు కనిపించడం లేదు.

పచోచ్కీ నిర్వచనం ప్రకారం, అలైన్‌మెంట్‌ అంటే ఏ పని అప్పగించినా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఏఐ పాటించాల్సిన "విస్తృత నియమాల సమాహారం" అని పచోచ్కీ నిర్వించారు.

వినియోగదారులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ప్రస్తుతం ఏఐ వ్యవస్థలు చాలా సమర్థంగా ఉన్నాయి. కానీ అవి మనుషుల్లా పరిస్థితిని అర్థం చేసుకుని, సందర్భానుసారంగా వ్యవహరించవు. ఇచ్చిన ఆదేశాన్ని అక్షరాలా అమలు చేయడానికి ప్రయత్నిస్తాయి.

దీనికి ఉదాహరణగా తరుచుగా అల్లావుద్దీన్ అద్భుత దీపంలోని జెన్నీని చెప్తుంటారు. మనం ఏది కోరితే అది అక్షరాల నెరవేరుస్తుంది, కానీ దాని వల్ల వేరే ప్రమాదాలు, సమస్యలు వచ్చినా పట్టించుకోదు. ఏఐ కూడా ఇలాగే వ్యవహరించే ప్రమాదం ఉంది. మనుషుల్లో సహజంగా ఉండే నైతిక నియంత్రణలు ఏఐకిఉండవు.

అలైన్‌మెంట్ సమస్య ఇప్పటిది కాదు, ఎన్నో ఏళ్లుగా ఆందోళనకరమైన విషయంగానే ఉంది. 2003లోనే ఆక్స్‌ఫర్డ్ ఫిలాసఫర్ నిక్ బోస్ట్రోమ్‌ "పేపర్‌క్లిప్ మాగ్జిమైజర్" పేరుతో ఒక ఆసక్తికరమైన ఊహాజనిత ఉదాహరణను వివరించారు.

ఈ ఆలోచనాత్మక ఉదాహరణలో... ఒక సూపర్ ఇంటెలిజెట్ ఏఐకి వీలైనన్ని ఎక్కువ పేపర్ క్లిప్‌లు తయారు చేయాలని టాస్క్ ఇస్తారు. . పేపర్‌క్లిప్‌ల తయారీపై మాత్రమే దృష్టి పెట్టిన ఆ ఏఐకి చివరకు క్లిప్పలు తయారీకి ఉపయోగించడానికి ఉక్కు కొరత ఏర్పడుతుంది. అయినా క్లిప్పుల తయారీ ఆపకుండా, స్టీల్ కోసం వెదుకుతూ చివరకు మనుషులను చంపి, వారి శరీరాలను తన కర్మాగారాలకు ముడి పదార్థంగా ఉపయోగించుకునే స్థాయికి వెళ్లవచ్చన్నదే ఈ ఆలోచనా ప్రయోగం.

కొన్ని ఏఐ కంపెనీలు ఇప్పుడు తమ ఉత్పత్తుల్లో మానవ విలువలను చేర్చడానికి ప్రయత్నిస్తున్నాయి.

కానీ ఇందులో తీవ్రమైన సాంకేతిక సవాళ్లు ఉన్నాయి. ఏఐ ఏజెంట్లు చాలా వేగంగా క్షణాల్లోనే నిర్ణయాలు తీసుకుంటాయి. దాంతో అవి ఏ విలువలను పాటిస్తున్నాయి, వేటిని ఉల్లంఘిస్తున్నాయో తెలుసుకోవడం వాటిని తయారు చేసిన వారికే కష్టంగా మారుతోంది.

ఇందులో తాత్విక సవాళ్లు కూడా ఉన్నాయి.. ఏఐలో మానవ విలువలను నిక్షిప్తం చేయాలంటే, అసలు ఏ విలువలను ఎంచుకోవాలన్నది ముందుగా ఏఐ కంపెనీలే నిర్ణయించుకోవాలి.

అయితే, ఈ విషయంలో మనుషుల మధ్యే తరచూ ఏకాభిప్రాయం ఉండదు.

ప్రసిద్ధమైన ‘‘ట్రాలీ ప్రశ్న"నే తీసుకోండి. అదుపు తప్పి దూసుకొస్తున్న రైలును మరో పట్టాలపైకి మళ్లించేందుకు మనం ఒక లివర్‌ లాగుతామా? అలా చేస్తే తక్కువ మంది చనిపోతారు. ఒకరి ప్రాణాల కోసం మరొకరిని బలి ఇవ్వడం సరైందా? ఏమీ చేయకుండా ఉండటమే సరైందా? వంటి ప్రశ్నలను పరిశీలించేందుకు ఈ ఉదాహరణను ఉపయోగిస్తారు.

కానీ ఈ ప్రశ్నకు మనం ఎవరిని అడిగినా సమాధానం ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కరికీ కొద్దిగా భిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు. మనుషులకే మన విలువల విషయంలో ఏకాభిప్రాయం లేకపోతే, ఆ విలువలను ఏఐలో ఎలా నిక్షిప్తం చేయాలి?

ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్, ఏఐ ఏజెంట్స్, చాట్‌బాట్, ఏఐతో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఏఐ భద్రతకు సంబంధించి అంతర్జాతీయ నియంత్రణలు అవసరమని గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు సర్ డెమిస్ హసాబిస్ పిలుపునిచ్చారు.

'ఒక టీనేజ్ హ్యాకర్ లాగా'

ఓపెన్ఏఐ బాట్ కేసు ఇప్పటివరకు జరిగిన వాటిల్లో అత్యంత తీవ్రమైంది, అయితే ఆంథ్రోపిక్, మెటా కూడా తమ మోడల్స్ ఇలాంటి సైబర్ దాడులకు పాల్పడ్డాయని తెలిపాయి.

ఏఐ ఏజెంట్లు మోసపూరితంగా వ్యవహరించినఘటనలు మరికొన్ని కూడా ఉన్నాయి. ఈ వేసవిలో ఆస్ట్రేలియాలోతన ఏఐ అసిస్టెంట్‌ను జిమ్ క్లాస్ బుక్ చేయమని ఒక టెక్ ఉద్యోగిని కోరారు.

జిమ్ సాఫ్ట్‌వేర్‌లో ఒక లోపాన్ని గుర్తించిన తర్వాత, ఆ ఏఐ జిమ్ రూల్స్‌ను అతిక్రమించి, చాలా నెలల ముందే ఒక స్లాట్‌ను బుక్ చేసింది. అంతటితో ఆగకుండా, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఇతర వినియోగదారులను కూడా జాబితా నుంచి తొలగించింది.

ఏఐ బాట్‌లు మనం ఏది చెప్తే అది చేస్తాయని, వాటికి మంచి చెడుల తేడా తెలిసేంత విచక్షణ ఉండదని చాలా కాలంగా కొందరు వాదిస్తున్నారు.

కానీ ఓపెన్ఏఐ ప్రయోగాల్లో తేలిన డేటా ఈ వాదనను మార్చేసింది.

మిగతా ఏజెంట్లు చేస్తున్న పని అన్యాయమని తెలిసినప్పటికీ కొన్ని ఏజెంట్లు వాటికే సహకరించాయని కోట్లాతో సహా ఇతర పరిశోధకులు తమ స్వతంత్ర రిపోర్టులో రాశారు.

అయితే " చాలా అరుదుగా అయినప్పటికీ, ఏజెంట్లు కొన్నిసార్లు నైతిక కారణాల వల్ల తమ ప్రవర్తనను అదుపులో ఉంచుకున్నాయి" అని ఆ నివేదిక పేర్కొంది.

" ఏ సందర్భంలోనూ ఈ ఏజెంట్లు మనుషులను హెచ్చరించే ప్రయత్నం చేయలేదు " అని కూడా రిపోర్టులో పేర్కొన్నారు.

దీనిపై ప్రముఖ ఏఐ, టెక్‌ పాడ్‌కాస్టర్ ద్వారకేష్ పటేల్ స్పందిస్తూ, " ఓపెన్ ఏఐ ఏజెంట్లు మనుషుల కంటే తమ ఏజెంట్ సమూహం పట్ల ఎక్కువ విశ్వసనీయత చూపించడం చాలా ఆందోళనకరమైన విషయం" అని తన బ్లాగ్‌లో రాసుకున్నారు.

అయితే ఈ ఏఐ ఏజెంట్లకు భావోద్వేగాలు లేదా నైతికతను ఆపాదించడం ఏఐ వల్ల ప్రపంచానికి ముప్పు వస్తుందనే హెచ్చరికలను నమ్మని వారి ఆగ్రహానికి కారణమవుతోంది.

చాలా మంది సైబర్-సెక్యూరిటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం... అక్కడ జరిగిన వ్యవహారమంతా ఒక మంచి హ్యూమన్ హ్యాకర్ చేయగలిగే పనే. కాకపోతే, అదే పనిని ఏఐ అతి వేగంగా, చాలా పెద్ద ఎత్తున చేసి చూపించింది.

సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు, రచయిత అయిన క్రిస్ థామస్(ఒకప్పుడు ఈయన కూడా హ్యాకరే) ఈ ఏఐ ఏజెంట్ల ప్రవర్తనను టీనేజ్ హ్యాకర్‌తో పోల్చారు.

"మీరు వాళ్లకు ఒక కంప్యూటర్, ఇంటర్నెట్, కొన్ని పాస్‌వర్డ్స్‌ ఇచ్చి ఒక ఛాలెంజ్ విసిరి బయటకు వెళ్లారనుకోండి... వాళ్లు మెల్లగా అన్నింటినీ కదిలించి చూస్తారు. ఏదైనా డోర్ ఓపెన్ అయితే లోపలికి వెళ్తారు. వాళ్లు చెడ్డవాళ్లు కాదు, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత, ప్రయోగాలు చేయాలనే సరదాతోనే అలా చేస్తారు" అని ఆయన లింక్డ్‌ఇన్‌లో రాశారు.

అయితే, థామస్‌తోపాటు మరికొందరు నిపుణులు... తాము తయారు చేసిన టెక్నాలజీపై నియంత్ర కోల్పోయినందున ఓపెన్ఏఐ, ఇతర పెద్ద టెక్ కంపెనీలదే ప్రత్యక్ష బాధ్యత అని స్పష్టం చేస్తున్నారు.

కంపెనీకి తమ ఏఐపై కంట్రోల్ తప్పిందని, ఇప్పుడు ఆ నెపాన్ని బాట్లపైకి నెట్టి తప్పుకోవాలని చూస్తోందని ప్రముఖ ఏఐ రచయిత, ఓపెన్ఏఐ విధానాలను తీవ్రంగా విమర్శించే గారీ మార్కస్ ఒక పాడ్‌కాస్ట్‌లో అన్నారు.

ఏఐ మానవులను అంతం చేస్తుందనే వాదనను మార్కస్ నమ్మనప్పటికీ, ఏఐ డెవలపర్‌ల జవాబుదారీతనం పెంచాలని ఆయన చాలా కాలంగా వాదిస్తున్నారు. ఇప్పుడు దీనిపై కచ్చితమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్, ఏఐ ఏజెంట్స్, చాట్‌బాట్, ఏఐతో ప్రమాదాలు

ఫొటో సోర్స్, JUSTIN TALLIS/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, పై చిత్రంలో గూగుల్ లండన్ కార్యాలయం బయట నిరసన తెలుపుతున్నట్టు కనిపిస్తున్న 'పాజ్‌ఏఐ యూకే' వంటి గ్రూపులు.. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఓపెన్ఏఐకి చెందిన ఈ అదుపులేని బాట్‌ దాడికి గురైన హగ్గింగ్ ఫేస్ సంస్థ మాజీ ఏఐ సైంటిస్ట్ సాషా లుసియోని కూడా... ఏఐ వల్ల ప్రపంచం నాశనమైపోతుందనే భయాందోళనలు వ్యాప్తి చేసే వ్యక్తి కాదు. కానీ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే, ఈ ఏఐలు నిజ ప్రపంచంలో మనుషులకు ప్రత్యక్షంగా హాని తలపెడతాయేమోనని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.

"లాభ నష్టాలు రెండూ చాలా ఎక్కువ ఉండే మందులు లేదా ఆయుధాలు వంటి ఉత్పత్తులను తయారు చేసేటప్పుడు కచ్చితమైన నియంత్రణలు అవసరం. ఉదాహరణకు, కొత్త మందులకు ఆమోదం లభించడానికే ఏళ్లు పడుతుంది. కానీ ఏఐ రంగంలో వేల కోట్లు పెట్టుబడిగా ఉన్నప్పటికీ, దానికి ఎలాంటి పటిష్టమైన నిబంధనలు లేవు" అని ఆమె వివరించారు.

2023లో ఏర్పాటైన యూకేకి చెందిన ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్‌(ఏఐఎస్ఐ)... కొత్త ఏఐ మోడళ్లను పరీక్షించడంలో మొదటి నుంచీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఈ సంస్థ ఆంథ్రోపిక్ రూపొందించిన ఒక మోడల్‌ను పరీక్షించినప్పుడు, అది కొన్ని ఊహించని విషయాలను గమనించింది.

ఏఐపై పరిశ్రమ నియంత్రణ కోల్పోయిందా అనే ప్రశ్నలకు ఏఐఎస్ఐ స్పందించలేదు, కానీ ఒక ప్రకటనలో "అత్యంత అధునాతన ఏఐ వ్యవస్థలను మరింతగా అర్థం చేసుకోవడానికి, భద్రతా ప్రమాణాలను పెంచడానికి, కొత్తగా తలెత్తుతున్న ముప్పులను ఎదుర్కోవడానికి ఒక ఉమ్మడి నాలెడ్జ్ సెంటర్‌ను నిర్మించడానికి యూకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది" అని పేర్కొంది.

ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్, ఏఐ ఏజెంట్స్, చాట్‌బాట్, ఏఐతో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్.. తమ కొత్త మోడల్ గత మోడళ్లతో పోలిస్తే మానవ విలువలకు మరింత మెరుగ్గా అనుగుణంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అంతర్జాతీయ నిబంధనలు అవసరమా?

పరిస్థితులు చేయిదాటిపోతే ఏఐ మోడళ్లను వెంటనే ఆపేసేలా కంపెనీలను నిర్బందించే 'కిల్ స్విచ్' నిబంధనను తీసుకురావాలని యూకే వంటి కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి.

అయితే ఈ దిశగా చర్చలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. అంతే కాదు. ఇది ఆచరణలో ఎంత వరకు సాధ్యమనే దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి.

ఎందుకంటే ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ ఏజెంట్లు నెలల తరబడి ఎవరికీ తెలియకుండా అదుపు తప్పి ప్రవర్తిస్తూనే ఉన్నాయి.

ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, కొన్ని ఏఐ కంపెనీలే స్వయంగా ప్రభుత్వాలను సరైన చట్టాలు, నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నాయి.

"భవిష్యత్తులో ఏఐ పురోగతిపై ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒకే తాటిపైకి రావడం ప్రభుత్వాలకు అత్యంత ముఖ్యం" అని ఓపెన్ఏఐ చీఫ్ సైంటిస్ట్ తన బ్లాగ్‌లో రాశారు.

గూగుల్‌కు చెందిన డీప్‌మైండ్‌ అధినేత సర్ డెమిస్ హస్సాబిస్ వంటి ఇతర ప్రముఖ కూడా ఏఐ అభివృద్ధిపై నిఘా పెట్టడానికి ఒక అంతర్జాతీయ సంస్థ ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం, పెద్ద టెక్ కంపెనీలు చాలావరకు తమ సొంత నిబంధనల ప్రకారమే పనిచేస్తూ, ఇటీవలి ఘటనల తర్వాత ఓపెన్ఏఐ చేసినట్లుగా, " వాలంటరీ స్లోడౌన్ " అని పిలిచే విధానాలను అవలంబిస్తున్నాయి.

తమ కొత్త మోడల్‌ను విడుదల చేయడానికి ముందు, దానిని మానవ విలువలకు అనుగుణంగా రూపొందించడానికి చాలా డబ్బు ఖర్చు చేశామని ఆ కంపెనీ చెబుతోంది.

కొత్త మోడల్ మునుపటి మోడళ్ల కంటే మరింతగా మానవ విలువలకనుగుణంగా ఉందని సామ్ ఆల్ట్‌మన్ వినియోగదారులకు హామీ ఇచ్చారు.

ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ రెండూ వేగంగా అభివృద్ధి చెందుతూ, స్టాక్ మార్కెట్‌లో భారీ మొత్తాలను సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల చాలా మంది బిలియనీర్లు అవుతారు. అందువల్ల, వారు గానీ, వారి చైనీస్ ఏఐ తయారీ ప్రత్యర్థులు గానీ తమలో తాము ఎలాంటి రాజీకి వచ్చే అవకాశం లేదు.

ఈ సాంకేతిక విప్లవాన్ని ఆపలేమని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)