ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించే యువతీ యువకులు కూడా హార్ట్‌ ఎటాక్‌లకు ఎందుకు గురవుతున్నారు?

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అస్వస్థతకు గురైన యువతి (ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, ప్రియాంక ధిమాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

గతంలో గుండెపోటు అనే మాట వినగానే చాలామంది వృద్ధుల మొహాలనే ఊహించుకునేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. యువత కూడా ఎక్కువగా గుండెపోటు బారిన పడుతోంది.

కొన్నిసార్లు ఒక వ్యక్తి బయటికి పూర్తిగా ఆరోగ్యంగా, దృఢంగా కనిపించచ్చు. కానీ వారి శరీరం లోపల తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు అభివృద్ధి చెందుతుండవచ్చు.

యువతలో గుండెపోటు ఎందుకు పెరుగుతోంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరమనే అంశాలపై బీబీసీతో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కేవల్ కిషన్ తల్వార్‌ మాట్లాడారు.

ప్రస్తుతం ఆయన దిల్లీలోని పీఎస్‌ఆర్‌ఐ ఆసుపత్రిలోని హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చైర్మన్‌.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గుండెపోటు ,యువత
ఫొటో క్యాప్షన్, బీబీసీ ప్రతినిధి ప్రియాంక ధిమాన్‌తో మాట్లాడుతున్న డాక్టర్ కేవల్ కిషన్ తల్వార్‌.
గుండె ఆరోగ్యం

అన్నింటికంటే ముఖ్యమైంది ప్రతిరోజూ వ్యాయామం చేయడం. ఆఫీసులో లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించాలి. శారీరక శ్రమను కూడా కొనసాగించాలి.

ప్రతిరోజూ 30 నుంచి 40 నిమిషాలు నడవడం ముఖ్యం. 10 నుంచి 12 నిమిషాల్లో ఒక కిలోమీటర్ నడిచేలా ప్రయత్నించాలి.

ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

పండ్లు, కూరగాయలు తినాలి. గుడ్లు తినడం కూడా మంచిదే. డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. మాంసాహారం తినేవారు కాల్చిన చికెన్, చేపలు తినవచ్చు.

మటన్‌లో కొవ్వు అధికంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పరిమితంగా తినాలని మేం సూచిస్తాం. గుండె సంబంధిత వ్యాధిలో జన్యుపరమైన అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

అందువల్ల ఎవరికైనా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే వారు మందులు కూడా తీసుకోవాలి. అయితే వెంటనే మందులు ప్రారంభించాలని నేను సూచించను.

ముందుగా సరైన ఆహారం, వ్యాయామం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి.

గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్ సహా అనేక వ్యాధులకు సిగరెట్లు ప్రధాన కారణం. యువత పాసివ్ స్మోకింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు స్వయంగా సిగరెట్లు కాల్చకపోయినా, మీ చుట్టూ ఎవరైనా స్మోకింగ్ చేస్తునప్పుడు మీరు దగ్గరే ఉంటే దాని ప్రభావం మీ శరీరంపై దాదాపు సిగరెట్ కాల్చినంతే ఉంటుంది.

గుండెపోటు ,యువత

ఫొటో సోర్స్, Getty Images

గుండె ఆరోగ్యం

వ్యాయామం శరీరానికి మంచిది. ఇది అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఒక యంత్రానికి నూనె ఎంత అవసరమో, శరీరానికి వ్యాయామం కూడా అంతే అవసరం.

అయితే ఇంతకుముందు ఎప్పుడూ వ్యాయామం చేయని వ్యక్తి అకస్మాత్తుగా ఎక్కువగా వ్యాయామం చేయడం ప్రారంభిస్తే, ప్రయోజనం కలగడానికి బదులు హాని కలగచ్చు.

కాబట్టి వ్యాయామం ప్రారంభించినప్పుడు ఒకేసారి ఎక్కువ చేయడానికి ప్రయత్నించకూడదు. క్రమంగా శరీరం దానికి అలవాటు పడేలా చేయాలి.

అయితే ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు షుగర్, రక్తపోటు వంటి కొన్ని సాధారణ పరీక్షలు చేయించుకోవాలి.

వ్యాయామం ప్రారంభించే ముందు ట్రెడ్‌మిల్‌పై ప్రాక్టీస్ చేయాలని కూడా మేం సూచిస్తాం. ఏదైనా సమస్య లేదా అసౌకర్యం ఎదురైతే దాన్ని తొలిదశలోనే గుర్తించవచ్చు.

అకస్మాత్తుగా తీవ్రంగా వ్యాయామం చేయడం వల్ల కొన్నిసార్లు పొటాషియం, ఎలక్ట్రోలైట్ స్థాయిలు తగ్గిపోవచ్చు.

దీని వల్ల గుండెకు సంబంధించిన కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.

వ్యాయామం

ఫొటో సోర్స్, Getty Images

గుండె ఆరోగ్యం

ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. యువకులు, ఆరోగ్యంగా ఉన్నవారు 10 నిమిషాల్లో ఒక కిలోమీటర్ వరకు నడవగలగాలి.

బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి క్రీడలు ఆడగలిగితే అది కూడా చాలా మంచిది. దీనివల్ల శరీరం మరింత రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది.

ఎందుకంటే మీరు నడుస్తున్నప్పుడు మీ మనసులో ఏదో ఒక ఆలోచన నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కానీ మీరు ఏదైనా ఆట ఆడుతున్నప్పుడు మీ దృష్టి మొత్తం దానిపైనే ఉంటుంది.

వారానికి ఐదు రోజులు వ్యాయామం చేయాలని మేం సూచిస్తాం. అయితే ఏడు రోజులూ వ్యాయామం చేయగలిగితే మరింత మంచిది.

గుండె ఆరోగ్యం

యువతలో తరచుగా ఎలాంటి హెచ్చరిక లక్షణాలు కనిపించవు. అకస్మాత్తుగా గుండెపోటు రావచ్చు.

అయితే వృద్ధుల్లో గుండెపోటుకు ముందు అనేక హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి.

నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఊపిరి అందకపోవడం, ఛాతీలో బరువుగా అనిపించడం వంటివి ఉంటాయి.

కానీ యువత విషయానికి వస్తే, వారిలో తరచుగా ఈ లక్షణాలు కనిపించవు. వారికి అకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది.

ఎవరైనా నడుస్తున్నప్పుడు ఆయాసంగా అనిపించడం, ఛాతీలో బరువుగా అనిపించడం ప్రారంభమైతే వైద్యులను సంప్రదించాలి.

ఇది తీవ్రమైన సమస్యకు ముందస్తు సంకేతం కావచ్చు.

గుండెపోటు ,యువత

ఫొటో సోర్స్, Getty Images

గుండె ఆరోగ్యం

గుండెపోటు సమయంలో ఛాతీ మధ్యలో ఉన్న ఎముక చుట్టూ నొప్పి వస్తుంది. ఈ నొప్పి దవడ వరకు వ్యాపించవచ్చు. కుడి, ఎడమ చేతుల్లో కూడా నొప్పి అనిపించవచ్చు.

కింద పొత్తికడుపులో కూడా నొప్పి రావచ్చు. చాలామంది దీన్ని కేవలం కడుపునొప్పిగా భావించి పట్టించుకోరు. అలా చేయకూడదు.

ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చినప్పుడు ఎంత త్వరగా వైద్య సహాయం అందితే, అంత త్వరగా చికిత్స చేయచ్చు.

గుండెకు ఉండే మూడు ప్రధాన ధమనుల్లో ఏదైనా ఒకదానిలో అడ్డంకి ఏర్పడితే వెంటనే వైద్య సహాయం తీసుకుని చికిత్స చేయించుకోవాలి. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే, రోగి అంత వేగంగా కోలుకుంటారు. ప్రస్తుతం పీసీఐ అనే విధానం అందుబాటులో ఉంది.

ఈ విధానం ద్వారా రక్తం గడ్డలను తొలగించవచ్చు. ధమనిలోని అడ్డంకిని తొలగించకపోతే గుండె కండరాలు దెబ్బతింటాయి

గుండెపోటు ,యువత

ఫొటో సోర్స్, Getty Images

గుండె ఆరోగ్యం

ముందు ఆసుపత్రికి వెళ్లాలి. ఈలోగా ఆస్పిరిన్ లేదా యాంటీహిస్టమైన్ వంటి కొన్ని మందులను మీ వద్ద ఉంచుకోవచ్చు. వాటిని నమిలి తీసుకోవాలి. దీనివల్ల కూడా వెంటనే కొంత మార్పు కనిపిస్తుంది.

అయితే అన్నింటికంటే ముఖ్యమైన విషయం వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోవడం.

గుండె ఆరోగ్యం

షుగర్, కొలెస్ట్రాల్, రక్తపోటు, యూరిక్ యాసిడ్ ఇవన్నీ ముఖ్యమైన పరీక్షలు.

అదనంగా, ప్రస్తుతం సీఆర్‌పీ పరీక్షను కూడా సిఫార్సు చేస్తున్నారు. అయితే నా అభిప్రాయం ప్రకారం వివిధ కారణాల వల్ల సీఆర్‌పీ స్థాయి పెరగవచ్చు.

గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల కూడా సీఆర్‌పీ స్థాయి పెరిగి ఉండవచ్చు. దీంతో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం యువత గూగుల్‌లో వెతకడం లేదా ఏఐ సహాయం తీసుకోవడం చేస్తున్నారు.

అనారోగ్యానికి సంబంధించిన విషయాల్లో వీటిపైనే పూర్తిగా ఆధారపడటం మంచిది కాదని నేను చెబుతా. దీనివల్ల గందరగోళం మాత్రమే పెరుగుతుంది.

ఒక్కోసారి హానికరంగా కూడా మారచ్చు. ఇది అన్నివేళలా సహాయపడదు కూడా. చాలామంది వైద్యుడి వద్దకు వెళ్లడానికి బదులుగా గూగుల్ లేదా ఏఐ సహాయంతో మందులు తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. కానీ కొన్నిసార్లు దీనివల్ల సమస్య పరిష్కారం దొరక్కపోగా సమస్య మరింత తీవ్రమవుతుంది.

గుండెపోటు ,యువత

ఫొటో సోర్స్, Getty Images

గుండె ఆరోగ్యం

గుండెపోటు వచ్చిన రోగి ఆసుపత్రికి చేరుకున్నప్పుడు అక్కడ పూర్తి స్థాయి కార్డియాక్ ఏర్పాట్లు ఉంటాయి. ముందుగా ఈసీజీ చేస్తారు. దీనివల్ల గుండెపోటు వచ్చిందో లేదో నిర్ధరించచ్చు. ఆ తర్వాత రక్త పరీక్షలు నిర్వహిస్తారు. పగలైనా, రాత్రయినా మొత్తం విభాగాన్ని అప్రమత్తం చేస్తారు.

రోగి పరిస్థితి గురించి వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లందరికీ సమాచారం ఇస్తారు. ఎందుకంటే ఇది ఎంతో కీలకమైన సమయం.

రోగిని ఎంత త్వరగా ఆసుపత్రిలో చేర్చి చికిత్స ప్రారంభిస్తే, గుండె కండరాలను అంత త్వరగా కాపాడవచ్చు. ఎంత త్వరగా యాంజియోప్లాస్టీ చేస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి.

ఇలాంటి సదుపాయం ఉన్న ఆసుపత్రి సమీపంలో లేకపోతే, ప్రస్తుతం అనేక చోట్ల థ్రాంబోలైటిక్ థెరపీ అందుబాటులో ఉంది.

ఆసుపత్రికి చేరుకున్న వెంటనే థ్రాంబోలైటిక్ థెరపీ ఇవ్వాలి. ఇందులో ఒకే ఒక్క ఇంజెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత రోగిని పెద్ద ఆసుపత్రికి తరలించవచ్చు.

అదనంగా, సమాజంలో సీపీఆర్‌పై అవగాహన పెంచడం కూడా ఎంతో కీలకం. సీపీఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్.

ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చి వెంటనే స్పృహ కోల్పోయాడని అనుకుందాం. వెంటనే కార్డియోపల్మనరీ రిససిటేషన్ అందించి, ఆ తర్వాత అతడిని ఆసుపత్రిలో చేర్పించడం వల్ల ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)