విమెన్స్ ఆసియా కప్ 2026: పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత మహిళల జట్టు నిరాకరణ.. దీనిపై పాక్ విమర్శలు ఏమిటి?

దుబాయ్‌లో ఆదివారం జరిగిన మహిళల టీ20 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్, పాకిస్తాన్ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు మాత్రం హర్మన్ సేన నిరాకరించింది.
ఫైనల్‌లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. 8వ సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. కాగా, లక్ష్య ఛేదనలో కేవలం 111 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది.
దీంతో జట్టు సభ్యులతో కలిసి గెలుపు సంబరాల్లో మునిగిపోయినా కెప్టెన్ హర్మన్ ప్రీత్, ట్రోఫీ బహూకరణ కార్యక్రమానికి హాజరు కాలేదు.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ సహా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీ బహూకరించడానికి వచ్చారు. అంపైర్లకు మెమెంటోలు, రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక ప్లేయర్లకు పతకాలు, చెక్కులను బహుకరించిన అనంతరం ప్రెజెంటేషన్ కార్యక్రమం ముగిసిపోయింది.
2025 మేలో భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో నాటి నుంచి పాకిస్తాన్ ఆటగాళ్లు, వారి ప్రతినిధులతో కరచాలనానికి భారత క్రికెటర్లు దూరంగా ఉంటున్నారు. అయితే ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పాకిస్తాన్ నేతలు విమర్శిస్తున్నారు.

గతేడాది పురుషుల జట్టు, ఈసారి మహిళల జట్టు
దుబాయ్‌లో స్థానిక కాలమానం ప్రకారం, రాత్రి 9.55కి మ్యాచ్ ముగిసింది. కానీ, ఆ తర్వాత 40 నిమిషాలకు గానీ ట్రోఫీ బహూకరణ కార్యక్రమం మొదలుకాలేదు.
ఆదివారం నాడు అవార్డు ప్రదానోత్సవానికి నఖ్వీ హాజరుకావడం అప్పటికే వివాదాస్పదంగా మారే ప్రమాదం కనిపించింది. అంపైర్లకు మెమెంటోలు ఇచ్చిన అనంతరం, రన్నరప్ శ్రీలంక జట్టు మెడల్స్ తీసుకునేందుకు తయారైంది. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా లంక కెప్టెన్ చమరి అటపట్టు ప్రైజ్ మనీ చెక్‌ని అందుకున్నారు.
2025లోనూ ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన అనంతరం, మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత పురుషుల జట్టు నిరాకరించింది.

ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty Images
"మేము చాంపియన్లుగా నిలిచాం. మాకు అంతే చాలు."
"బీసీసీఐ తీసుకున్న వైఖరిని మేము సమర్థిస్తున్నాం. ఈ టోర్నమెంట్ ముగిసింది. మేము చాంపియన్లుగా నిలిచాం. మాకు అది చాలు. ఆసియా కప్ 2026 విజేత భారత్ అని పెద్ద బోర్డుపై కూడా రాసి ఉంది. మాకు సంబంధించినంత వరకు టోర్నమెంట్ అధికారికంగా ముగిసింది. విజేతగా నిలవడం పట్ల సంతోషంగా ఉన్నాం" అని భారత మహిళల జట్టు కోచ్ అమోల్ మజుందార్ మీడియా సమావేశంలో అన్నారు.
"పహల్గామ్ ఘటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది"
ఈ వ్యవహారంపై బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా స్పందించారు. "ఆసియా కప్ ట్రోఫీ విషయంలో వివాదం నడుస్తోంది. మా పురుషుల జట్టు ఏడాదిన్నర క్రితం ట్రోఫీ గెలిచింది. అయితే 2025 ఏప్రిల్‌లో పహల్గామ్ ఘటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మా పొరుగు దేశం (పాకిస్తాన్)తో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని, క్రికెట్ కూడా ఆడోద్దని దేశ ప్రజల నుంచి మాపై ఒత్తిడి ఉంది. అయితే అంతర్జాతీయ టోర్నీలలో అన్ని జట్లతో ఆడాలనేది మా ప్రభుత్వ విధానం" అని ఐఏఎన్ఎస్ వార్త సంస్థతో దేవజీత్ తెలిపారు.
మొహ్సిన్ నఖ్వీని కలవడంపై మాట్లాడుతూ, "మేము ఎవరినీ కలవము అని కాదు. మ్యాచ్ సందర్భంగా నన్ను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ కలిశాను. తొలుత ఎవరో వచ్చి నా పక్కన కూర్చున్నారు. తర్వాత రాజీవ్ శుక్లా వచ్చారు. మీరు చెప్పిన వ్యక్తి (మొహ్సిన్ నఖ్వీ) సైతం వచ్చి, డిప్యూటీ చైర్మన్ ఖాలిద్ సాహిబ్ పక్కన కూర్చున్నారు. ఇది చాలా సాధారణం. ఎవరైనా వచ్చినప్పుడు కలిసి, మాట్లాడటం ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"క్రీడా స్ఫూర్తి లేకపోతే గెలుపు, ఓటములకు అర్థం లేదు"
‘ది డాన్’ వెబ్‌సైట్ నివేదించిన ప్రకారం, ఈ వ్యవహారంపై స్పందించిన పాకిస్తాన్ హోంమంత్రి తలాల్ చౌధరీ, ట్రోఫీ నిరాకరించడం చాలా దురదృష్టకరమని అన్నారు.
‘‘ఇది భారత రాయబార, మిలటరీ పరాభవాలను తుడిచిపెట్టదు’’ అని జియో న్యూస్‌తో అన్నారు తలాల్ చౌధరి.
క్రీడా సంస్కృతిని భారత్ దెబ్బతీస్తోందని తలాల్ చౌధరీ ఆరోపించారు. "క్రీడా స్ఫూర్తి చాలా ముఖ్యం. అది లేకపోతే గెలుపు, ఓటములకు అర్థం లేదు. భారత్‌లో అతివాద జాతీయవాదాన్ని దేశం మొత్తం నింపేశారు. మా (పాకిస్తాన్) క్రీడా సంస్కృతి.. శాంతి, ప్రేమకు చిహ్నం. అనేక యుద్ధాలను ఆపడంలో కీలక పాత్ర పోషించాం. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి బలహీనపడుతోంది" అని అన్నారు.
ప్రతి వివాదాస్పద అంశంపైనా చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని తలాల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఏమంటున్నారు?
సాధారణంగా గెలుపొందిన జట్టు కెప్టెన్ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా మాట్లాడతారు. అయితే, హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం ప్రత్యేకంగా మ్యాచ్ ముగిసిన కొద్ది నిమిషాలకే ఇంటర్వ్యూ ఇచ్చారు.
"మేము ఇక్కడికి వచ్చినప్పుడు అనుకున్నట్లుగానే, ముందుగా పెట్టుకున్న ప్రమాణాలకు తగినట్లుగా ఆడాం. మా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. టోర్నీ మొత్తం మా జట్టు అద్భుతంగా ఆడింది. ఫైనల్‌లో 183 పరుగులు చేయడం చాలా పెద్ద విషయం" అని హర్మన్ ప్రీత్ అన్నారు.
హాఫ్ సెంచరీలతో చెలరేగిన స్మృతి (59), షెఫాలీ (68) టీమిండియాకు బలమైన ఆరంభాన్ని అందించారని కొనియాడారు.
"దుబాయ్ లాంటి నెమ్మదైన పిచ్‌ల బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కానీ మా ఓపెనర్లు స్మృతి, షెఫాలీ అద్భుతంగా ఆడారు. అంతిమంగా మంచి క్రికెట్ ఆడటమే మా లక్ష్యం. నేను చాలా సంతోషంగా ఉన్నా" అని హర్మన్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























