తల్లి మృతదేహాన్ని మూడేళ్లు ఫ్రీజర్‌లో దాచి పెన్షన్, ఇతర ప్రయోజనాలు తీసుకున్న కుమారుడు.. చివరకు ఎలా తెలిసిందంటే..?

క్రిస్టోఫర్ ఫిలిప్స్, బ్రిడ్జెండ్ కౌంటీలోని పోర్త్‌కావ్‌, ఫ్రీజర్‌లో తల్లి మృతదేహం, సిల్వియా ఫిలిప్స్,

ఫొటో సోర్స్, South Wales Police

ఫొటో క్యాప్షన్, ఇంట్లో తల్లి మృతదేహం లభించిన తర్వాత కొడుకు క్రిస్టోఫర్ ఫిలిప్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
    • రచయిత, కొలెట్ హ్యూ, ఆలివర్ స్లో
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాదాపు మూడేళ్లు భద్రపరిచి, ఆమె పెన్షన్, ఇతర ప్రయోజనాలు పొందుతూ వచ్చిన కుమారుడికి యూకే కోర్టు జైలు శిక్ష విధించింది.

బ్రిడ్జెండ్ కౌంటీలోని పోర్త్‌కావ్‌లో గల పోప్లర్ క్రెసెంట్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో సిల్వియా (89)మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నాక, 60 ఏళ్ల క్రిస్టోఫర్ ఫిలిప్స్‌ను అరెస్ట్ చేశారు.

సిల్వియా ఫిలిప్స్ 2023 మార్చిలో చనిపోయారు. తల్లి మరణం తర్వాత ఆమెను విడిచిపెట్టలేకపోయానని క్రిస్టోఫర్ ఫిలిప్స్ వైద్యులతో చెప్పారు.

తల్లికి చట్టప్రకారం, గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించకపోవడం, హౌసింగ్ బెనిఫిట్స్, వింటర్ ఫ్యూయల్ అలవెన్సులతో పాటు పెన్షన్ క్లెయిమ్ చేయడం లాంటి మూడు నేరాలను ఫిలిప్స్ అంగీకరించారు.

క్రిస్టోఫర్ రెండేళ్ల వయసులో ఉండగా సిల్వియా దత్తత తీసుకున్నారు. క్రిస్టోఫర్ తల్లితో సన్నిహితంగా ఉండేవారు. ఆమెకు ఏకైక సంరక్షకుడిగా కూడా ఉన్నట్టు మెర్థైర్ టైడ్ఫిల్ క్రౌన్ కోర్టులో జరిగిన వాదోపవాదనలలో తెలిసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్రీజర్‌లో మూడేళ్లు

సిల్వియా చనిపోయిన మరుసటి రోజు ఆమెను క్రిస్టోఫర్ తన చేతుల్లోకి తీసుకుని, తాను చూసుకుంటానని ఆమెకు చెప్పారు.

ఆమె మరణించిన రెండు రోజుల తర్వాత క్రిస్టోఫర్ ఒక ఫ్రీజర్ కొనుగోలు చేసి, డైనింగ్ రూమ్‌లో ఉంచారు. జీపీ (వైద్యుడు) అభ్యర్థన మేరకు పోలీసులు ఆరా తీయడానికి వచ్చే వరకు ఆ మృతదేహం అక్కడే ఉంది

అంతకుముందు, ఆమెను సంప్రదించడానికి స్థానిక వైద్యులు పదేపదే ప్రయత్నించినా, క్రిస్టోఫర్ వారిని ఇంట్లోకి అనుమతించలేదు. ఇంటికి వెళ్లిన పోలీసులతో తన తల్లి లండన్‌కు వెళ్లిందని, వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఇష్టపడలేదని ఆయన చెప్పారు.

'రోజూ ఆమె చేయి పట్టుకొని..'

అధికారులకు అనుమానం కలగడంతో క్రిస్టోఫర్ ఆందోళన చెందారు. ఆయన పై అంతస్తుకు పరుగున వెళ్లారు. అనంతరం గర్ల్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ, "పోలీసులు నన్ను అరెస్ట్ చేయబోతున్నారు, నీ దగ్గర వీలునామా ఉంది" అని చెప్పడం అధికారులకు వినిపించింది.

ఫ్రీజర్ తెరిచిన అధికారులకు ఆ వృద్ధురాలి మృతదేహం కనిపించింది. ఆమె మృతదేహం పూర్తిగా గడ్డకట్టుకుపోవడంతో పోస్ట్‌మార్టం నిర్వహించడానికి కొంత సమయం పట్టింది. మరణానికి గల కచ్చితమైన కారణాన్ని పాథాలజిస్ట్ కనుగొనలేకపోయారు. అయితే, మరణం అనుమానాస్పదంగా జరిగినట్లు భావించలేదు.

కోర్టులో జరిగిన వాదనల ప్రకారం, తల్లి మృతదేహం పక్కనే నిద్రపోవడానికి క్రిస్టోఫర్ కింది అంతస్తుకు మారారు. కొన్నిసార్లు ఫ్రీజర్ తెరిచి ఆమె చేతిని పట్టుకునేవారు.

క్రిస్టోఫర్ ఫిలిప్స్, బ్రిడ్జెండ్ కౌంటీలోని పోర్త్‌కావ్‌, ఫ్రీజర్‌లో తల్లి మృతదేహం, సిల్వియా ఫిలిప్స్,
ఫొటో క్యాప్షన్, సిల్వియా ఫిలిప్స్ మృతదేహం పోర్త్‌కావ్‌లోని ఇంట్లో లభించింది.

వైద్యులకు అనుమానం

సిల్వియాకు స్థానిక జీపీ వద్ద 2021లో 26 అపాయింట్‌మెంట్‌లు, 2022లో ఆరు అపాయింట్‌మెంట్‌లు ఉన్నాయి. ఆ తర్వాత ఆమెకు వైద్యులతో ఎలాంటి సంప్రదింపులు లేవు.

సిల్వియా చివరిసారిగా 2022 సెప్టెంబర్ 24న అత్యవసర విభాగంలో కనిపించారు. స్థానిక జీపీ సెప్టెంబర్ 26న ఇంటికి వెళ్లి పరిశీలించారు. అయితే, ఆ తర్వాత కూడా ఆమెకు సంబంధించిన మందులను క్రి తీసుకెళ్తూనే ఉన్నారు.

వైద్యుల బృందం ఆమెను సమీక్షకు ఆహ్వానించగా, ఆమె క్లినిక్‌కు రాదని, రక్త పరీక్షలు అవసరం లేదని క్రిస్టోఫర్ చెప్పారు.

క్రిస్టోఫర్ ఫిలిప్స్ మొత్తం 78,190.92 పౌండ్లను స్టేట్ పెన్షన్, పెన్షన్ క్రెడిట్, అటెండెన్స్ అలవెన్స్, వింటర్ ఫ్యూయల్ పేమెంట్స్, కాస్ట్-ఆఫ్-లివింగ్ పేమెంట్స్, హౌసింగ్ బెనిఫిట్ పేమెంట్ల రూపంలో అందుకున్నారు. ఆమె మరణించినట్టు తెలిపి ఉంటే ఈ చెల్లింపులు నిలిచిపోయేవి.

క్రిస్టోఫర్ 2008 నుంచి ఆమె ప్రాథమిక సంరక్షకుడిగా ఉన్నారు. సిల్వియా ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో 2022 చివర్లో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వీరిద్దరూ కొంతవరకు ఒంటరిగా జీవించేవారని కోర్టుకు తెలిపారు.

'తల్లి మరణాన్ని అంగీకరించలేకపోయారు'

తల్లిని విడిచి ఉండలేకపోయానని క్రిస్టోఫర్ పోలీసులతో చెప్పినట్లు ఆయన తరఫున న్యాయవాది రూత్ స్మిత్ తెలిపారు.

"ఆమె ఇంకా బతికే ఉన్నట్లుగా ఆయన మాట్లాడేవారు. పక్కనే కూర్చుని టీవీ షోలు, కొరోనేషన్ స్ట్రీట్, గుర్రపు పందేల గురించి మాట్లాడేవారు. గతంలో ఎప్పటిలాగే ఆమెతో మాట్లాడేవారు" అని రూత్ స్మిత్ చెప్పారు. క్రిస్టోఫర్ "బలహీనమైన వ్యక్తి" అన్నారామె.

న్యాయస్థానంలో క్రిస్టోఫర్ ఏడ్చారని, తన క్లయింట్ తల్లికి అత్యంత సన్నిహితుడని, ఆమె మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్నారని రూత్ స్మిత్ చెప్పారు.

తల్లి మరణాన్ని ఆయన అంగీకరించలేకపోయారని, ఆమె ఇంకా బతికే ఉందనే భ్రమలో జీవించారని తెలిపారు.

కోర్టు ఏం చెప్పిందంటే..

వాదనలన్నీ విన్న జడ్జి లాయిడ్-క్లార్క్.. క్రిస్టోఫర్‌కు 28 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఇందులో 40 శాతం కాలం జైలులో గడపాల్సి ఉండగా, మిగతా కాలం లైసెన్స్‌పై ఉండాల్సి ఉంటుందని తెలిపారు. క్రిస్టోఫర్ తన తల్లి మరణాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, ఆమె ఇంకా బతికే ఉన్నట్లు నమ్మించే ప్రయత్నాలు చేశారని జడ్జి అభిప్రాయపడ్డారు.

"మీరు ఆమె మందులను తీసుకున్నారు. వైద్యులకు, చివరకు పోలీసులకు కూడా అబద్ధాలు చెప్పారు" అని లాయిడ్-క్లార్క్ అన్నారు.

"అధికారులకు సమాచారం అందించి, చట్టప్రకారం అంత్యక్రియలు చేయకుండా, ఛెస్ట్ ఫ్రీజర్ కొనుగోలు చేసి అందులో మృతదేహాన్ని దాచిపెట్టారు" అన్నారు.

ఆస్తుల జప్తుకు సంబంధించిన చర్యలపై తదుపరి విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)