పొగలు కక్కే కాఫీలు, టీలు, వేడి పానియాలు తాగితే అన్నవాహిక క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

వేడిగా ఉండే పానీయాలు క్యాన్సర్ ముప్పును పెంచే అవకాశం ఎక్కువ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మైఖేల్ రాబర్ట్
    • హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

టీ, కాఫీ లాంటి పానీయాలను అత్యంత వేడిగా తాగడం వల్ల అన్నవాహికకు క్యాన్సర్ సోకే ప్రమాదం ఎక్కువవుతుందని యూకే పరిశోధనలు చెబుతున్నాయి.

వేడి పానీయాలకు, అన్నవాహిక క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని నిర్థరించడంలో ఇదే ఇప్పటిదాకా చేసిన అతిపెద్ద అధ్యయనమని పరిశోధకులు చెప్పారు. దాదాపు 10 లక్షల మందిపై ఈ అధ్యయనం చేశారు.

అయితే ఇలా క్యాన్సర్ బారినపడే ప్రమాదం తక్కువే అని నిపుణులు చెబుతున్నప్పటికీ, గోరువెచ్చగా టీ, కాఫీ లాంటి పానీయాలు తీసుకునేవారి కంటే వాటిని ఎక్కువ వేడిగా తాగేవారు క్యాన్సర్ బారినపడే ముప్పు మూడు రెట్లు అధికంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది.

పొగలుకక్కే పానీయాలు కడుపులోకి జారేటప్పుడు అన్నవాహిక అంతర్గత పొరలోని కణాలను దెబ్బతీస్తాయి.

ఏ పానీయమైనా 65 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటే దానిని ''అత్యధిక వేడి''గానూ, ముప్పు కలిగించే అవకాశం ఉన్నదిగానూ ఇంటర్‌నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురితమైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం తెలిపింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రోజుకు ఆరు లేదా అంతకంటే ఎక్కువసార్లు వేడి పానీయాలు తీసుకోవడం కూడా ముప్పును పెంచుతుందని 9,77,282 మంది మధ్యవయస్కులైన మహిళలు, పురుషుల నుంచి సేకరించిన సమాచారం చెబుతోంది.

పాత్రలోని నీరు పూర్తిగా వేడెక్కిన తరువాత తయారుచేసే టీ గరిష్ఠంగా 100 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుంది. అయితే దానిని కప్పులోకి పోసిన తరువాత ఆ వేడి 90 లేదా 95 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గచ్చు.

కప్పులో పోసుకున్న టీ వెంటనే తాగకుండా కొన్ని నిమిషాలు ఆగడం వల్ల, ఆ పానీయం చల్లబడి సురక్షితమైన ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.

కాఫీ, టీ, అన్నవాహిక క్యాన్సర్ ముప్పు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాఫీ, టీలు మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు తాగడం మంచిది కాదని పరిశోధనలు చెబుతున్నాయి.( ప్రతీకాత్మక చిత్రం)

ఎంత వేడి సురక్షితం?

అయితే వేడిపానీయం ఎంతసేపటిలో చల్లబడుతుందో కచ్చితమైన సమయం చెప్పడం కష్టమని యూకే క్యాన్సర్ పరిశోధనా సంస్థ చెప్పింది.

''దీనిపై మీరు ఆందోళన చెందుతుంటే, కాఫీ, టీ వేడిగా ఉన్నప్పుడే తాగకుండా, అది తాగగలిగేంత సౌకర్యవంతంగా మారే వరకు వేచి ఉండాలని చెబుతాం'' అని ఆ సంస్థ చెప్పింది.

దక్షిణ అమెరికాలో ఈ పరిశోధన చేసినట్టు దానికి నాయకత్వం వహించిన డాక్టర్ కీరెన్ పాపియర్ చెప్పారు. అక్కడ అనేకమంది మేట్ అని పిలిచే చాలా వేడిగా ఉండే హెర్బల్ పానీయాన్ని సేవిస్తారు. ఇది వేడిపానీయాలకు, అన్నవాహిక క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని చూపింది.

''అయితే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కచ్చితమైన ఉష్ణోగ్రతలను గుర్తించడానికి మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది'' అని ఆమె చెప్పారు.

విభిన్న రకాల బ్లాక్ కాఫీలను పలుమార్లు రుచి చూసిన 118 మంది యువతీయువకులపై చేసిన ఒక ప్రత్యేక అధ్యయనంలో 70 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న పానీయాలనే చాలా వేడిగా ఉన్నట్టు వారిలో ఎక్కువమంది భావించారని తేలింది.

అన్నవాహిక క్యాన్సర్‌ ముప్పుకు పొగతాగడం కూడా కారణమే

ఫొటో సోర్స్, Getty Images

ఇతర కారణాలు ఏమిటి?

ఒకవేళ ఎవరైనా మరింత వేడి కాఫీ కావాలని కోరితే, కాఫీ మాస్టర్ ఆ కాఫీ ఎక్కువసేపు వేడిగా ఉండేలా చూడటానికి దానిని 82 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా అందించవచ్చని ఎమ్టీపాక్ కాఫీ సంస్థ చెబుతోంది.

ప్రజలు బాగా వేడిగా ఉండే పానీయాలు తాగడం మానేస్తే, ప్రతి 10 అన్నవాహిక క్యాన్సర్ కేసులలో ఒకటి లేదా రెండు కేసులను నివారించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

స్క్వామస్ సెల్ అన్నవాహిక క్యాన్సర్ చాలా అరుదైనది, ఏటా కొన్ని వేల మంది మాత్రమే దీని బారిన పడుతున్నారు. యూకేలో, ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఈ రకమైన క్యాన్సర్ బారిన పడే ముప్పు దాదాపు 1 శాతంగా ఉంది.

కాబట్టి, పొగలు కక్కే వేడి పానీయాలు ఒకరికి క్యాన్సర్ ముప్పును పెంచినప్పటికీ, వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి.

అయితే అన్నవాహిక క్యాన్సర్‌కు పొగతాగడం వంటి మరికొన్ని కారకాలు అంతకంటే పెద్ద ముప్పు.

'ఈ రకమైన క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవడానికి పొగతాగకపోవడం, మద్యపానాన్ని తగ్గించుకోవడం అత్యంత ముఖ్యమైన మార్గాలు' అని ఈ అధ్యయనానికి ఆర్థిక సహాయం అందించిన క్యాన్సర్ రీసర్చ్ యూకేకు చెందిన ఫియోనా ఓస్గన్ చెప్పారు.

బరువు తగ్గడంతో పాటు గుండెల్లో మంట, అజీర్ణం, గొంతు లేదా ఛాతీలో నొప్పి అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)