మరణ శిక్ష అమలు చేయడానికి రెండు సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇచ్చినా చనిపోలేదు.. ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స

అమెరికా, టెన్నెస్సీ, విషపూరిత ఇంజెక్షన్, మరణశిక్ష
    • రచయిత, సారెన్ హబెషియాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో మరణశిక్ష ఎదుర్కొంటున్న క్రిస్టా పైక్‌కు రెండుసార్లు విషపూరిత ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఆమె గుండె కొట్టుకుంటూనేఉంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు ఆమె న్యాయవాది తెలిపారు.

మరణశిక్ష అమలు జరుగుతున్న సమయంలోనే దాన్ని ఆపాలని క్రిస్టా పైక్ న్యాయబృందం అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది.

''పైక్ స్పృహ కోల్పోయారు. అయినప్పటికీ ఆమె గుండె కొట్టుకుంటోంది. ఆమె గురక శబ్దం వినిపిస్తోంది'' అని అందులో పేర్కొన్నారు.

పైక్‌కు రెండు సిరంజ్‌ల విషపూరిత మందు ఇచ్చిన తర్వాత కూడా ఆమె గుండె కొట్టుకుంటూ ఉండడంతో ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన వైద్య చికిత్స ఆస్పత్రిలో అందిస్తున్నారని ఆమె లాయర్లలో ఒకరు బీబీసీకి తెలిపారు

50 ఏళ్ల పైక్‌కు 1996లో 19 ఏళ్ల కొలిన్ సమ్మర్‌ను హత్య చేసిన కేసులో మరణశిక్ష విధించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సెప్టెంబర్ 30న నాష్‌విల్లేలోని రివర్‌బెండ్ మ్యాక్సిమమ్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూషన్‌లో మరణశిక్ష అమలుకు ప్రయత్నం జరిగింది.

పైక్‌కు మరణ శిక్ష అమలు చేయడానికి ఉపయోగించే రసాయనాన్ని రెండు మోతాదులుగా ఇంజక్ట్ చేశారు.

సాక్షులు ఉన్న గది తెరను రెండుసార్లు మూసివేశారని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.

ఒక దశలో మీడియా ప్రతినిధులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా కోరినట్టు ఆ వార్త సంస్థ తెలిపింది.

‘మరణశిక్షను అమలు చేయలేకపోయింది’

‘‘టెన్నెసీ రాష్ట్ర మరణశిక్ష అమలు విధానంలో మొదటి సెట్ మందులు ఇచ్చిన తర్వాత కూడా మరణం సంభవించకపోతే, రెండో సెట్ మందుల సిరంజ్‌లను సిద్ధాంగా ఉంచాలి. రెండో సెట్ మందులు ఇచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి బతికే ఉంటే ఏం చేయాలనే విషయంపై స్పష్టత లేదు’’ అని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.

‘‘అసలేం జరిగిందో తెలుసుకోడానికి సమగ్ర, స్వతంత్ర సంస్థతో సమీక్ష జరపాలని ఆదేశించాను’’ అని టెన్నెసీ గవర్నర్ బిల్ లీ చెప్పినట్టు అమెరికా మీడియా ప్రచురించింది.

‘‘టెన్నెసీ రాష్ట్రం ఈ రాత్రి మరోసారి చట్టబద్ధమైన మరణ శిక్ష అమలు చేయడంలో విఫలమైంది. మా ఆందోళనలు నిజమయ్యాయని చెప్పడం మాకు సంతోషంగా లేదు. కానీ పైక్ ముందుగానే వ్యక్తం చేసిన ఆందోళనలు నిజమయ్యాయి. సిరల్లోకి సూది పెట్టడం కష్టంగా ఉండటం, సిరలు దెబ్బతినడం, మందు నాణ్యత తగ్గడం, పరిస్థితి అదుపు తప్పినప్పుడు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం ఇవన్నీ ఇప్పటికీ పూర్తిగా వెల్లడించని ఒక విధానం కింద జరిగాయి'' అని పైక్ లాయర్లు తెలిపారు.

మరణశిక్ష అమలు సమయంలో విషపూరిత ఇంజక్షన్ ప్రక్రియ సరిగా జరగలేదని అనిపించడంతో పైక్‌కు వైద్య చికిత్స అందించి, ఆమె మరణశిక్ష నిలిపివేయాలని ఆమె లాయర్లు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్‌లో కోరిన విధంగా వైద్య సిబ్బంది చికిత్స అందించడం ప్రారంభించారు అని డిస్ట్రిక్ట్ జడ్జి క్లిఫ్టన్ ఎల్ కర్కిల్ ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొన్నారు.

మరణశిక్ష అమలు ప్రయత్నం సమయంలో తాము తీసుకున్న అన్ని చర్యలకు కట్టుబడి ఉన్నామని టెన్నెసీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్ తెలిపింది.

''అటార్నీ జనరల్ కార్యాలయం ఆమోదించిన, రాష్ట్రం చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన మరణశిక్ష విధానంలోని ప్రతి దశను టెన్నెసీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరక్షన్ పాటించింది'' అని ఆ శాఖ ప్రతినిది డోరిండా కార్టర్ టెన్నెసియన్ వార్తాపత్రికకు తెలిపారు.

''ఈ విధానంలో ఉపయోగించే విషపూరిత ఇంజక్షన్ మందు ఇప్పటి వరకు నిరంతరం ప్రభావవంతంగానే ఉంది. ఈ రాత్రి చేపట్టిన చర్యలకు మించి అదనపు వైద్య ప్రక్రియల్ని ఈ విధానం అనుమతించదు. క్రిస్టాపైక్‌ను ఆసుపత్రికి తరలించారు'' అని ఆమె చెప్పారు.

అమెరికా, టెన్నెస్సీ, విషపూరిత ఇంజెక్షన్, మరణశిక్ష
ఫొటో క్యాప్షన్, కొలిన్

‘మెదడు తీవ్రంగా దెబ్బతినే అవకాశం’

ఎమోరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ అయిన డాక్టర్ జోయెల్ జివాట్ పైకి న్యాయబృందం తనను వైద్యునిపుణుడిగా నియమించిందని బీబీసీకి తెలిపారు.

మరణశిక్ష అమలు సమయంలో పైక్ శ్వాస ఆగిపోవడానికి, ఆమె గుండె పని చేయటం ఆగిపోవడానికి అవసరమైన స్థాయిలో ఆ రసాయనం ఆమె రక్తంలోకి చేరకపోయి ఉండవచ్చని ఆమె చెప్పారు

''మళ్లీ ప్రాణాలు కాపాడే వైద్య చర్యలను ప్రారంభించడంలో జరిగిన ఆలస్యం కారణంగా ఆమె మెదడు బాగా దెబ్బతినే అవకాశం చాలా ఉంది'' అని జివాట్ ఒక ఈమెయిల్‌లో తెలిపారు.

బుధవారం ఉదయం దిగువ కోర్టు ఇచ్చిన మరణశిక్ష నిలిపివేత ఉత్తర్వును అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఈ మరణశిక్ష అమలుకు ప్రయత్నం జరిగింది.

పైక్‌కు విషపూరిత ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు చేయడానికి సుప్రీంకోర్టు వరుసగా రెండు రోజుల్లో రెండోసారి అనుమతి ఇచ్చింది.

అంతకుముందు రోజు ఇచ్చిన ఉత్తర్వులో అమెరికా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది సిక్స్త్ సర్క్యూట్ న్యాయమూర్తులు మరణశిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. పైక్ కేసులో ఉన్న వాదనలను పరిశీలించడానికి తమకు మరింత సమయం అవసరమని వారు చెప్పారు.

చిన్నతనంలో పైక్‌పై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలను 1996లో పైక్‌కు మరణశిక్ష విధించే సమయంలో జ్యూరీ పరిగణించే అవకాశం కల్పించలేదని ఆమె న్యాయవాదులు వాదించారు.

తాను చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైనట్టు పైక్ చెప్పింది అబద్ధమని టెన్నెసీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా కోర్టులో వాదిస్తూ వచ్చిందని ఆమె న్యాయవాదులు తెలిపారు.

అయితే ఆమె మరణశిక్షను ఎలా అమలు చేయాలనే అంశంపై ఇటీవల జరిగిన విచారణలో ఆమె చిన్నతనంలో లైంగిక వేధింపులు, అత్యాచారానికి గురైన విషయాన్ని తాము ఖండించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

అమెరికా, టెన్నెస్సీ, విషపూరిత ఇంజెక్షన్, మరణశిక్ష
ఫొటో క్యాప్షన్, కొలిన్‌ను తాను హత్య చేశానన్న విషయం తాను నమ్మలేకపోతున్నానని పైక్ చెప్పారు.

‘నాపై నాకే అసహ్యం కలుగుతుంది’

పైక్ చేసిన క్షమాభిక్ష అభ్యర్ధనను టెన్నెసీ గవర్నర్ ఈ వారం తిరస్కరించారు.

కొలిన్ సమ్మర్ అనే 19ఏళ్ల యువతిని పైక్, ఆమె అప్పటి బాయ్ ఫ్రెండ్ టడరిల్ షిప్ కలిసి కొట్టి, చిత్రహింసలకు గురిచేసి, హత్య చేసినప్పుడు పైక్ వయసు 18 సంవత్సరాలు.

సమస్యాత్మక టీనేజర్ల కోసం నిర్వహించిన ఉద్యోగ శిక్షణ శిబిరంలో వాళ్లిద్దరూ కొలిన్‌ను కలిశారు

కొలిన్‌ను కొట్టాలని మాత్రమే తాను అనుకున్నానని, ఆమెను చంపాలని అనుకోలేదని క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటిషన్ లో పైక్ చెప్పారు. కానీ పరిస్థితిని నియంత్రించలేకపోయానని ఆమె పేర్కొన్నారు

''అప్పుడు నేను మానసిక సమస్యలతో ఉన్న 18 ఏళ్ల అమ్మాయిని. నేను చేసిన పని ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. దాని వల్ల ఎంత మంది జీవితాలు ప్రభావితమయ్యాయో అంగీకరించడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టింది. నేను ఎవరో ఒకరి బిడ్డను, సోదరిని, స్నేహితురాలిని చంపాను. నేను అలాంటి నేరం చేయగలిగానని ఇప్పుడు ఆలోచిస్తే నాకు చాలా బాధగా, అసహ్యంగా అనిపిస్తుంది'' అని పైక్ ఒక ప్రకటనలో తెలిపారు.

అమెరికా, టెన్నెస్సీ, విషపూరిత ఇంజెక్షన్, మరణశిక్ష
ఫొటో క్యాప్షన్, పైక్‌కు మరణశిక్ష అమలు చేయాలని కొలిన్ తల్లి కోరారు.

‘ఒక్కరోజు కూడా మర్చిపోలేదు’

1995 లో జరిగిన కొలిన్ హత్య టెన్నెసీ రాష్ట్రంలోని నాక్స్‌విల్లేలో పెద్ద ఎత్తున మీడియా దృష్టిని ఆకర్షించింది.

కొలిన్ మృతదేహం కనుగొన్నప్పుడు ఆమె ఛాతీపై తలకిందులుగా పెంటాగ్రామ్ గుర్తు చెక్కి ఉంది.

హత్యకు ముందు కొలిన్ తనను అవమానించిందని, తన అప్పటి బాయ్ ఫ్రెండ్‌ను తననుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిందని పైక్ ఆరోపించింది.

ఆ శిక్షణాశిబిరంలో ఉన్న మరో ఇద్దరు యువతులు తర్వాత సాక్ష్యం చెప్పారు.

హత్యకు ముందు, హత్య తర్వాత కూడా ఆ హత్య గురించి పైక్ గొప్పగా చెప్పుకొందని, కొలిన్ పుర్రెలోని ఒక భాగాన్ని వారికి చూపించిందని వారు తెలిపారు.

పైక్‌కు మరణశిక్ష అమలు జరగాలని కొలిన్ తల్లి మార్టినెజ్ కోరుకున్నారు.

పైక్‌కు విధించిన మరణశిక్ష అమలు కావడానికి తాను దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నానని ఆమె అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు

మరణశిక్ష అమలును తాను, తన భర్త ప్రత్యక్షంగా చూడటానికి ఫ్లోరిడా నుంచి టెన్నెసీ వచ్చేందుకు ఒక బృందం తమకు డబ్బు సేకరించి సహాయం చేసిందని ఆమె చెప్పారు.

''కొలిన్ గురించి నేను ఆలోచించని రోజు లేదు. ఒక్క నిమిషం కూడా ఆమె నా ఆలోచనల్లో లేకుండా ఉండదు. పండుగలు, సెలవు రోజులు మరింత బాధ కలిగిస్తాయి'' అని మార్టినెజ్ చెప్పారు

మరణశిక్ష తిరిగి అమలు చేయడానికి 1976లో అమెరికా సుప్రీంకోర్టు అనుమతించినప్పటి నుంచి అమెరికాలో కేవలం 18 మంది మహిళలకు మాత్రమే మరణశిక్ష అమలు చేశారు. అదే సమయంలో 1,663 పురుషులకు మరణశిక్ష అమలు చేశారు. అమెరికా అమలు చేసిన మొత్తం మరణశిక్షల్లో మహిళల మరణశిక్షలు సుమారు ఒకశాతం మాత్రమే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)