ఉత్తర కొరియా శరణార్థి మహిళలు: ‘‘మగవాడు పైన, ఆడది కింద ఉంటే చాలు, ఫీలింగ్స్ అనే మాటకు అక్కడ తావులేదు’’

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, శరణార్థులు, మహిళలు, సెక్స్, లవ్, పిల్లలు

ఫొటో సోర్స్, BBC / Andro Saini

    • రచయిత, హాన్ సంగ్ మి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 9 నిమిషాలు

"ఉత్తర కొరియాలో నాకు కావాలని అనిపించినప్పుడు కాదు, నా భర్త అడిగినప్పుడే శృంగారంలో పాల్గొనాల్సి వచ్చేది"

"సెక్స్ అనేది మాకు ప్రేమను వ్యక్తపరిచే సమయం కాదు. మాపై విధించిన ఒక నియమం. పెళ్లయ్యాక పిల్లల్ని కనేందుకు, మహిళ తన దినచర్యలో భాగంగా దానిని భరించాల్సిందే"

ఉత్తర కొరియా నుంచి ప్రాణభయంతో దక్షిణ కొరియా పారిపోయి వచ్చిన 60 ఏళ్ల ‘ఏ’ అనే మహిళ అనుభవం ఇవి.

ఈమెలాంటి మరికొందరు శరణార్థులతో బీబీసీ మాట్లాడింది. భద్రత కారణాల దృష్ట్యా వారి వ్యక్తిగత వివరాలను వెల్లడించకుండా ఈ కథనాన్ని ప్రచురిస్తున్నాం. ‘బీ’ అనే 20 ఏళ్ల మహిళతోపాటు సీ అనే 40 ఏళ్లున్న మహిళతో కూడా బీబీసీ మాట్లాడింది.

"మేము దీనిని కోరుకుంటున్నామా లేదా అని మమ్మల్ని ఎవరూ అడగరు. అంతెందుకు మేమే ఆ సంగతి ప్రశ్నించుకోం" అని వారు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, శరణార్థులు, మహిళలు, సెక్స్, లవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా మహిళలు (ఫైల్ ఫోటో)

ఉత్తర కొరియాలో చాలా కాలంగా ప్రభుత్వం, కుటుంబ అవసరాల కోసమే మహిళల జీవనం కొనసాగుతోంది. విధేయత కలిగిన కూతురిగా, భర్తకు అంకితమైన భార్యగా, త్యాగాలు చేసే తల్లిగా ఉండటానికే వారి పాత్ర పరిమితం.

"అక్కడ ప్రేమ, వివాహం, పిల్లల్ని కనడం అనేవి వ్యక్తిగత ఆప్షన్లు కావు. అది దేశం మా నుంచి ఆశించే బాధ్యత. నాకు ఏం కావాలి? అనే ప్రశ్నకు తావులేదు" అని ఆ మహిళలు తెలిపారు.

ఈ కథనం రాసే ముందు ఉత్తర కొరియా మహిళల లైంగిక భావనల గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఈ ప్రయత్నంలో వారి కథలు సెక్స్‌కి మించిన విషయాలకు సంబంధించినవని తెలిసింది.

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, శరణార్థులు, మహిళలు, సెక్స్, లవ్

ఫొటో సోర్స్, Getty Images

"తాకితే గర్భం వస్తుందనుకునేదాన్ని"

ఇవన్నీ వేర్వేరు కథనాలుగా అనిపించవచ్చు. కానీ అవి చెప్పే విషయం ఒక్కటే. ఒక వ్యక్తి తనకు నచ్చినట్టు జీవించే హక్కు గురించి.

ఈ కథనం ఉత్తర కొరియా అక్కడి సమాజం మహిళల శరీరాలను, వారి కోరికలను, స్వీయ-నిర్ణయాధికారాన్ని ఏ మేరకు నియంత్రించగలవనే అంశాన్ని 'లైంగికత' కోణంలో పరిశీలిస్తుంది.

అయితే ఇది.. 'అసలు అది ఎవరి శరీరం?' అనే ప్రశ్న వద్దకు వచ్చి ఆగుతుంది.

ఉత్తర కొరియా వలసదారుల గురించి అధ్యయనం చేసే సోల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జియోన్ జు-రామ్ అనేకమంది ఉత్తర కొరియా మహిళలను ఇంటర్వ్యూ చేసినప్పుడు తనకు అత్యంత ఆశ్చర్యకరంగా అనిపించిన అంశంగా 'కోరిక' అనే పదాన్ని పేర్కొన్నారు.

ఉత్తర కొరియాలో వాస్తవానికి స్థానికులు తమకు నచ్చిన పాఠశాల, ఉద్యోగాన్ని, ఉద్యోగ స్థలాన్ని ఎంచుకోవడానికి వీలులేదు. అధికారుల నిర్ణయం, ఆదేశాల మేరకే వారు నడుచుకుంటారు.

"చిన్న వయస్సు నుంచే, 'ఏయ్, ఎత్తుగా, అందంగా ఉన్నావు, స్టాండప్' అని చెప్పి ఎవరో ఒకరిని ఎంపిక చేసి డివిజన్ 5కి తీసుకెళ్లేవారు. ఒకరికి ఉద్యోగం వస్తుందా? లేదా? కాలేజీకి వెళ్తారా? అనేది వారి సామాజిక నేపథ్యం ద్వారా నిర్ణయిస్తారు. జీవితాంతం అలాగే గడిపారు కాబట్టి, వారు దానిని అసౌకర్యంగా భావించరు" అని ప్రొఫెసర్ జియోన్ జు-రామ్ వివరించారు.

ఉత్తర కొరియాలో లైంగిక సమాచార లోపం గురించి అక్కడి నుంచి పారిపోయి వచ్చిన మహిళలు చెప్పిన అంశాల ద్వారా మరింత స్పష్టంగా తెలుస్తుంది.

అక్కడ తమకు ఎప్పుడూ లైంగిక విద్య అందలేదని వారు చెప్పారు. అది మాట్లాడకూడని, సిగ్గుపడాల్సిన విషయంగా భావించి తేలికగా కొట్టిపారేసే వారని వివరించారు.

"నాకు అసలు ఏమీ తెలియదు. అండం ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియదు. చేతులు పట్టుకుంటేనే గర్భం వస్తుంది అనుకునేదాన్ని. నాకు 20 ఏళ్లు వచ్చేంత వరకు అంతే. అసలు లైంగిక విద్య అనేది లేకపోవడం వల్లే ఇలా" అని 60 ఏళ్ల ‘ఏ’ చెప్పారు.

ఉత్తర కొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియా వచ్చాక అక్కడి శరణార్థుల శిబిరం హనావాన్‌లోనే ఆమె మొదటిసారి లైంగిక విషయాల గురించి తెలుసుకున్నారు.

హనావాన్‌లోనే శరణార్థి 20 ఏళ్ల 'బీ' సైతం మొదటిసారిగా లైంగిక విద్యను పొందారు. కానీ "అంతమంది వ్యక్తుల ముందు అలాంటి విషయాల గురించి మాట్లాడటం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది" అని ఆమె చెప్పారు.

"అలాంటి విషయాలు శ్రద్ధగా వింటే నా గురించి తప్పుగా అనుకుంటారని నేను నిద్ర పోయినట్లు నటించేదాన్ని" అని అన్నారు.

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, శరణార్థులు, మహిళలు, సెక్స్, లవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా యువతి, యువకుడు (ఫైల్ ఫోటో)

"మగవాడు పైన, మహిళ కింద... వాళ్లకు తెలిసిందింతే"

సోల్ నేషనల్ యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్ పార్క్ క్యుంగ్-సూక్ తన పరిశోధనా పత్రం ‘‘ఉత్తర కొరియా సమాజంలో ప్రభుత్వం, పితృస్వామ్యం, మహిళలు’’ అనే అంశంపై ప్రాథమిక అధ్యయనంలో ఉత్తర కొరియాలో లైంగికత గురించిన అధికారిక దృక్పథాన్ని వివరించారు.

"ఉత్తర కొరియా అధికారిక వైఖరి ప్రకారం, లైంగికత అనేది దాచవలసిన ఒక సిగ్గుచేటైన విషయం. ఇది వివాహం, సంతానోత్పత్తి అనే జాతీయ అవసరాల పరిధిలో మాత్రమే అనుమతించిన చర్య" అని ఆమె పేర్కొన్నారు.

ఉత్తర కొరియా శరణార్థుల అనుభవాలు కూడా అదే సూచిస్తున్నాయి.

"నా భర్త తాగి వచ్చినా నేను శృంగారంలో పాల్గొనాల్సి వచ్చేది. నేను పీరియడ్స్‌లో ఉన్నానా అనే దానితో సంబంధం లేదు. మగాడికి కావాలంటే చేయాల్సిందే. ఫోర్ ప్లే ఉండేది కాదు. నా అభిప్రాయంతో అసలు పనిలేదు" అని ‘బీ’ తెలిపారు.

"నాకు సెక్స్ కావాలని మొదట ఓ మహిళ చెప్పడం లేదా అడగడం గురించి నేను ఎప్పుడూ ఊహించలేదు" అని ఆమె చెప్పారు.

"ఐదు నిమిషాలు కూడా (రతి క్రీడ) జరగదు. కొన్నిసార్లు ముద్దు పెట్టుకుంటాం. మగాడు చేయాల్సింది చేసి వెళ్లిపోతాడు. చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి, ఇష్టాయిష్టాలతో పనిలేదు. మహిళలకు ఏం కావాలి అనేది పురుషులు అసలు ఆలోచించరు. పొజిషన్స్ అనే మాటే లేదు. కేవలం మగవాడు పైన, ఆడది కింద. వాళ్లకు అంతే తెలుసు. ఇప్పుడు ఆలోచిస్తుంటే అసలు భావప్రాప్తి అంటే ఏమిటో కూడా నాకు తెలియదు" అని ఆమె వివరించారు.

"ఏమీ తెలియకుండానే నా యవ్వనం గడిచిపోవడం నా దౌర్భాగ్యం" అని ‘ఏ’ అన్నారు.

"హింస లేనిదే అక్కడ శృంగారం లేదు"

"నన్ను కొట్టినా నేను ఏమీ అనలేకపోయేదాన్ని. ఓ ఇల్లాలిని, నా పిల్లలకు తల్లిని కాబట్టి నా భర్తను బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉండేదని భావించేదాన్ని" అని మరో మహిళ తెలిపారు.

"భర్త పెట్టుకునే వివాహేతర సంబంధాలను సైతం మహిళ భరించాల్సి వచ్చేది. ఎందుకంటే ఉత్తర కొరియాలో విడాకులు పొందడం అతి కష్టమైన ప్రక్రియ" అన్నారామె.

"పురుషాధిక్య సంస్కృతిని సహజమైనదిగా భావించడం వల్లే ఇలా"

గతంలో ఉత్తర కొరియాలో గర్భనిరోధక విధానాలు మరింత భయంకరమైన రూపాల్లో ఉండేవని షిన్హాన్ యూనివర్సిటీలోని 'ఇనిస్టిట్యూట్ ఫర్ పోస్ట్-డివిజన్ బోర్డర్ కల్చర్'కు చెందిన డాక్టర్ క్వాన్ గ్యుమ్-సాంగ్ పేర్కొన్నారు.

హింసను భరించడం, విడాకుల ఆలోచనను వదిలివేయడం, భర్తకు శరీరాన్ని అప్పగించడం వంటి నిర్ణయాల వెనుక చాలా పెద్దదైన, పాత ప్రశ్న దాగి ఉంది.

'అసలు ప్రభుత్వం మహిళల శరీరాల పట్ల ఇంతగా ఎందుకు జోక్యం చేసుకుంటోంది?' అన్నది ప్రశ్న.

"పురుషాధిక్య సంస్కృతిని సహజమైనదిగా భావించడం వల్లే ఇలా" అని డాక్టర్ క్వాన్ గెమ్-సంగ్ వివరించారు.

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, శరణార్థులు, మహిళలు, సెక్స్, లవ్

ఫొటో సోర్స్, Getty Images

"ఒక్క కండోమ్ ధరతో నలుగురు భోజనం చేయొచ్చు"

బీబీసీ ఇంటర్వ్యూ చేసిన మహిళలు చెప్పిన ప్రకారం ఉత్తర కొరియాలో గర్భ నిరోధక బాధ్యత పూర్తిగా ఆడవారిదే. అందుకు అత్యంత సాధారణమైన విధానం 'హుక్' అని పిలిచే గర్భాశయ (ఇంట్రా యుటెరిన్ డివైజ్- ఐయూడీ) పరికరాన్ని తొడగడం.

రాగితో చేసిన రింగులను, కాస్త స్తోమత కలిగినవారు వెండితో చేసినవాటిని తొడిగించుకుంటారు. చైనా నుంచి వచ్చిన వస్తువులను మార్కెట్‌లో కొని, ఆస్పత్రికి తీసుకెళ్లి తొడగమనేవారు.

లోహంతో సంబంధం లేకుండా ఉండేవాటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవని ఆ మహిళలు చెప్పారు.

ఎంతోమంది మహిళలకు తీవ్ర రక్తస్రావం జరిగేది. నెలల పాటు విపరీతమైన వెన్ను నొప్పితో బాధ పడేవారు.

గర్భనిరోధక సాధనాలు వాడటంపై మగవారి దృక్పథం కాలానుగుణంగా మారుతూ వస్తోంది. 2010 నుంచి కండోమ్‌లు వాడటం ప్రారంభించారని పరిశోధకురాలు చోయ్ సియోల్ పేర్కొన్నారు.

"మగవారు నిజంగా గర్భనిరోధక సాధనాలు వాడతారో లేదో నాకు తెలియదు. మహిళలు మాత్రం ఎల్లప్పుడూ వాడేవారు" అని ‘బీ’ అనే మహిళ తెలిపారు.

"నేను చాటుగా మార్కెట్‌లో కండోమ్‌లను విక్రయించేదానిని. కానీ అవి చాలా ఖరీదైనవి. ఒక్క కండోమ్ ధరతో నలుగురు వ్యక్తులు భోజనం చేయొచ్చు. మగవారు వాటిని ఎందుకు వాడతారు?" అని ఆమె ప్రశ్నించారు.

కండోమ్‌లు ఉన్నాయనే సంగతి వారికి 2000 సంవత్సరం వరకు తెలియదు. అవి ఎవరు తీసుకొస్తున్నారు? ఎలా తెస్తున్నారు? అనేది తెలియకున్నా మార్కెట్‌ల ద్వారా వాటి గురించిన సమాచారం మాత్రం రహస్యంగా తెలిసేది.

"పదేపదే గర్భం దాలుస్తుంటే ఇక పిల్లల్ని ఎలా పెంచగలం? అందుకే మహిళలు ఐయూడీని అమర్చుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తారు. ఒకవేళ గర్భం దాల్చిచే పురుషుడు సులభంగా వెళ్లిపోగలడు, మరి మా సంగతి?" అని ఆమె ప్రశ్నించారు.

"ఇప్పటికీ అక్కడ మహిళలు అబార్షన్లు చేయించుకుంటారు. స్వయంగా వాళ్లే ఇంట్లోనే చేసుకుంటారు" అని ఆ మహిళ తెలిపారు.

నేను ఇంటర్వ్యూ చేసిన వారిలో, గర్భనిరోధక సాధనాలు ఎలా వాడాలనే విషయాన్ని తల్లులు తమ కూతుళ్లకు నేర్పించిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

ఒకవేళ అవి విఫలమైనప్పుడు స్వయంగా తల్లులే చిన్నారుల్లో రింగులను చొప్పించేవారు. అది చాలా దారుణమైన విషయం.

లైంగిక అవగాహన విద్య అందించాల్సిన ప్రభుత్వం, ఆ పని చేయలేదు. అలా ఏర్పడిన ఖాళీని తల్లులే పూరిస్తున్నారు.

మనగడ కోసం ఈ 'రహస్య జ్ఞానాన్ని' తరాలుగా అందిస్తూ వస్తున్నారు. అయితే కొన్ని కుటుంబాలలో ఇప్పటికీ అలాంటి సంభాషణలు సిగ్గుగా, నిషిద్ధమైనవిగా భావిస్తారు.

"దాని గురించి తల్లిదండ్రులతో మాట్లాడటం ఇబ్బందిగా ఉంటుంది. స్నేహితుల మధ్య జరిగే సంభాషణ అది" అని ఓ మహిళ తెలిపారు.

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, శరణార్థులు, మహిళలు, సెక్స్, లవ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా మహిళలు (ఫైల్ ఫోటో)

‘స్వేచ్ఛ, నా శరీరంపై నా హక్కు..’

"ఉత్తర కొరియా మహిళలకు దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చాక, ఇక్కడి డేటింగ్ సంస్కృతి, స్వీయ సంరక్షణ పద్ధతులు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించేవి." అని ఓ మహిళా శరణార్థి చెప్పారు.

ఇక డేటింగ్‌కి సంబంధించి అనూహ్య మార్పులు తమ జీవితంలో చోటుచేసుకున్నట్లు ఓ మహిళ పదేపదే చెప్పారు.

"ఒకసారి దక్షిణ కొరియా వ్యక్తితో డేటింగ్ చేశాక, ఇక ఎప్పటికీ ఉత్తర కొరియా వాడితో డేటింగ్ చేయాలని అనిపించడం లేదు."

"ఉత్తర కొరియా మగవారితో ఉన్నప్పుడు నేను వారికి సేవలు చేస్తున్నట్లు అనిపించేది. నేను వారికోసం అన్నీ చేసేదాన్ని, కానీ ప్రతిఫలంగా కనీస గుర్తింపు కూడా దక్కేది కాదు."

"దక్షిణ కొరియా మగవారిని కలిశాకే ఇద్దరి మధ్యా చాలా వ్యత్యాసం ఉందని గుర్తించాను. ఇక్కడి మగవారి గొంతు కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది."

"కలయికలో ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూస్తూనే ఉంటారు. నాకు నచ్చుతుందా? లేదా? అని అడుగుతారు. నిజమైన ప్రేమను పొందడం అంటే అదేనేమో అని మొదటిసారి అనిపించింది."

"అన్ని స్త్రీలే చేయడం సహజమని ఉత్తర కొరియా పురుషులు భావిస్తారు. నాకు అది విసుగుపుట్టించేది. అసౌకర్యంగా అనిపించేది. నన్ను ప్రేమగా చూసుకునే చోట జీవించాలని కోరుకున్నా" అని ఆ మహిళ చెప్పారు.

దక్షిణ కొరియా పురుషులతో లైంగిక అనుభవాల గురించి 20లలో ఉన్న మహిళ వివరించారు. సెక్స్ తర్వాత ఫర్వాలేదా? అని అడుగుతూ, తన మానసిక, శారీరక స్థితి అర్థం చేసుకునేవారని ఆమె చెప్పారు.

"నేను దక్షిణ కొరియా వచ్చాక ఉత్తర కొరియా వ్యక్తిని పెళ్లి చేసుకున్నా. అతనిది ఇంకా పాత పోకడే. దీంతో జీవితం కష్టంగానే ఉండేది" అని 40లలో ఉన్న మహిళ చెప్పారు.

"సెక్సువల్ సైకాలజీలో నాలుగు దశలు ఉన్నాయి. ఎక్సైట్‌మెంట్, ఫోర్‌ప్లే, క్లైమాక్స్, ఎజాక్యులేషన్ అని. దక్షిణ కొరియా పురుషులతో డేటింగ్ చేస్తున్న మెజారిటీ ఉత్తర కొరియా మహిళలు, తమ సంబంధం పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది" అని డాక్టర్ జియోన్ జు-రామ్ తెలిపారు.

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మహిళల్లో వచ్చిన ఈ మార్పులు, ఉత్తర కొరియా నుంచి కలిసి పారిపోయి వచ్చిన దంపతుల్లో విడాకులకు దారితీస్తున్నాయి.

"ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన దంపతుల్లో గణనీయమైన సంఖ్యలో దంపతులు చివరకు విడాకులు తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో తప్పు జరుగుతోంది అని ఉత్తర కొరియా మహిళలు గుర్తించారు. ఉత్తర కొరియా పురుషులు త్వరగా తమను తాము మార్చుకోవాలి. అది అంత సులువా? వారు మారరు" అని పరిశోధకులు చోయ్ సియోల్ పేర్కొన్నారు.

"ఇది కేవలం సాంస్కృతిక ప్రాధాన్యతకు సంబంధించినది కాదు. ఎవరు ఏ పని చేయాలి (జెండర్ రోల్స్) అనేది వేర్వేరు సమాజాల్లో భిన్నంగా ఉంటుంది. ఉత్తర కొరియా పితృస్వామ్యాన్ని అధికార సాధనంగా ఉపయోగిస్తే, మహిళా సాధికారత ద్వారా దక్షిణ కొరియా లింగ సమానత్వాన్ని సాధించగలిగింది" అని సియోల్ చెప్పారు.

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, శరణార్థులు, మహిళలు, సెక్స్, లవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియాలో కొత్త దంపతులు (ఫైల్ ఫోటో)

దక్షిణ కొరియా ఏజెంట్ల పట్ల ఆకర్షణ..

ఇదే సమయంలో, ఉత్తర కొరియా మహిళలు దక్షిణ కొరియాకు చేరుకున్న తర్వాత, అక్కడి నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ విచారణ సమయంలో తాము కలిసిన పురుషుల పట్ల ఎలాంటి భావాలు కలిగాయో ఆ మహిళలు వివరించారు. అది చాలా ఆసక్తికరంగా అనిపించింది.

"ఎన్‌ఐఎస్ ఏజెంట్లు ఎంత కూల్‌గా ఉండేవాళ్లంటే, అందరూ వాళ్లను చూసి పిచ్చెక్కి పోయేలా ఇష్టపడేవాళ్లు. నిజం చెప్పాలంటే, నేను మొదట ఇక్కడికి వచ్చినప్పుడు సరిగ్గా అలాగే ఉన్నాను. వాళ్లు సూట్లు వేసుకుని, చాలా అందంగా, మృదువుగా ఉండేవాళ్లు. వాళ్లని చూస్తేనే చాలు మనసంతా సంతోషంగా అనిపించేది" అని ఓ మహిళ చెప్పారు.

దక్షిణ కొరియాలో స్థిరపడిన ఉత్తర కొరియా మహిళలకు గౌరవం, కరుణ అనే భావనలు ఎంత కొత్తవో, ఎంత తీవ్రమైనవో ఈ చిన్న ఉదంతం వివరిస్తోంది.

"దక్షిణ కొరియాకు చెందిన ఓ వ్యక్తితో నాకు లోతైన అనుబంధం ఉండేది. ఇప్పుడు మేము విడిపోయాం. కానీ, ఆయన ఎంతో దయాహృదయం కలిగినవారు. నన్ను ప్రేమగా చూసుకునేవారు. మరోసారీ నేను దక్షిణ కొరియా వ్యక్తితోనే డేట్ చేయాలని అనుకుంటున్నా. ఏదో ఒకరోజు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా" అని 60 ఏళ్ల మహిళ తెలిపారు.

ఇంటర్వ్యూ ముగిసే సమయంలో సెక్స్ గురించి ఆ మహిళల అభిప్రాయం అడిగాను.

"జనాలతో అనుబంధం" అని బీ అనే మహిళ చెప్పారు. "లైంగికత గురించి తెలిశాక, చాలా మందితో పరిచయాలు ఏర్పరచుకోవాలని ఉంది."

"గతంలో నాకు ఏం కావాలో నాకే తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు ప్రేమగా, ఎప్పటికప్పుడు కొత్తగా చూసుకునే వ్యక్తి కావాలని అనిపిస్తోంది."

"ఒక పువ్వులా నన్ను నేను భావిస్తా. సెక్స్ తర్వాత నాకు చాలా సంతోషంగా, ఆనందంగా అనిపిస్తుంది. దక్షిణ కొరియా వచ్చాకే అది గుర్తించాను. ఒక మహిళగా సంతోషంగా ఉండటం అంటే ఏంటో తెలుసుకున్నా" అని ఏ అనే మహిళ చెప్పారు.

'మీకు ఏం కావాలి?' అని ఉత్తర కొరియా మహిళలను అడిగిన క్షణాన తమ శరీరాలు ఇక తమకే సొంతం అనే భావన వారిలో ఏర్పడింది. ఆలస్యంగానైనా.

ప్రభుత్వం, సమాజం, భర్తల కారణంగా తమ శరీరాలపై కోల్పోయిన హక్కును, దక్షిణ కొరియాలో స్వేచ్ఛ, స్వీయ నిర్ణయాధికారం ద్వారా తిరిగి సాధించారు. వారికి సంబంధించినంత వరకు అది విప్లవమే కదా?

"మరో జన్మంటూ ఉంటే దక్షిణ కొరియాలోనే పుట్టాలని అనుకుంటున్నా. ముందు నుంచీ నాకు స్వేచ్ఛగా, ధైర్యంగా డేట్ చేయాలని ఉండేది. నా శరీరంతో నాకు నచ్చిన జీవితం గడపాలని ఉంది. నాకు ఇప్పుడే అర్థమైంది నిజమైన స్వాతంత్య్రం అంటే ఏంటో" అని ఏ చెప్పారు.

వారి కథ ఇంకా మధ్యలోనే ఉంది. ఇన్నాళ్లూ తమకు దూరంగా ఉన్న ‘శరీరాలపై తమ హక్కు’ను, కోరికలను, ప్రేమను తిరిగి పొందే ప్రయాణంలో ఉన్నారు. ఈ క్రమంలోనే వారు ఎట్టకేలకు మాట్లాడుతున్నారు.

"ఇప్పుడు నా శరీరం పూర్తిగా నా సొంతం. నాకెంతో సంతోషంగా ఉంది" అని మరో మహిళ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)