కొందరు ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలు హీరోలుగా ఎందుకు చూస్తారు?

T N Seshan, Tukaram Munde
ఫొటో క్యాప్షన్, టీ ఎన్ శేషన్, తుకారాం ముండే
    • రచయిత, నికితా యాదవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

భారతదేశ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో అప్పుడప్పుడు కొంతమంది అనూహ్యంగా ప్రజాదరణ పొందుతుంటారు.

ఈ జాబితాలో తాజాగా చేరిన పేరు 51 ఏళ్ల తుకారాం ముండే.

మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలనా విభాగం కమిషనర్‌గా ఉన్న ఆయన మే నెలలో ఆ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుసగా తనిఖీలు, చర్యలు చేపట్టారు. ఆయన నేతృత్వంలోని బృందాలు రెస్టారెంట్లు, ఇతర ఆహార వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేపట్టి కీటకాల బెడద, అపరిశుభ్రత, గడువు ముగిసిన ఆహార పదార్థాలు వంటి సమస్యలను గుర్తించాయి.

అంతేకాకుండా సాధారణ వైద్య సామగ్రి కోసం ఆసుపత్రులు చెల్లించే ధరలకు, అదే వస్తువుల కోసం రోగుల నుంచి వసూలు చేసే ధరలకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు.

దీంతో తుకారాం ముండే సోషల్ మీడియా సెలబ్రిటీగా మారారు. తనిఖీలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

తమ రాష్ట్రంలో కూడా ఆహార భద్రత సమస్యలను పరిష్కరించేందుకు ముండే లాంటి అధికారులను పంపాలని కోరుకుంటున్నామని వందలాది మంది కామెంట్లు చేశారు.

ముండే ఒక్కరే కాదు. దిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో జిల్లా టౌన్ ప్లానర్ ఆర్‌ఎస్ బాత్ అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంతో ప్రశంసలు అందుకున్నారు.

అయితే కేవలం తమ విధులను నిర్వర్తిస్తున్నందుకే ఈ అధికారులు హీరోలుగా ఎందుకు మారుతున్నారు?

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తుకారాం ముండే, కిరణ్ బేడీ, జస్వాల్, అధికారులు-హీరోలు
ఫొటో క్యాప్షన్, అధికారిక ప్రక్రియలోని అడ్డంకులను తొలగించి ఒక అధికారి వేగంగా పని చేయిస్తున్నట్లు కనిపిస్తే, ప్రజల స్పందన ఊహించని స్థాయిలో ఉంటుంది.

భారతదేశంలో ప్రజలు ప్రతిరోజూ ఆధారపడే అనేక సేవలకు సివిల్ సర్వెంట్లు బాధ్యత వహిస్తారు. పత్రాలు జారీ చేయడం నుంచి పోలీసింగ్, ఆహార భద్రత, ఆరోగ్య సేవల వరకు అనేక బాధ్యతలను చూసుకుంటారు. అయితే ఆలస్యం చేయడం, లంచాలు తీసుకోవడం, పనుల కోసం ప్రజలను ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిప్పడం వంటి ఆరోపణలు కూడా చాలామంది అధికారులపై ఉన్నాయి.

అందుకే అధికారిక ప్రక్రియలోని అడ్డంకులను తొలగించి ఒక అధికారి వేగంగా పని చేయిస్తున్నట్లు కనిపిస్తే, ప్రజల స్పందన ఊహించని స్థాయిలో ఉంటుంది.

"సాధారణమైన విషయం అసాధారణంగా మారిపోయింది" అని రిటైర్డ్ ప్రభుత్వ అధికారి కమల్ కాంత్ జస్వాల్ అంటున్నారు.

అధికారిక ప్రక్రియల్లోని అడ్డంకులు, జాప్యం,నిర్లక్ష్య వైఖరి వంటివి ప్రజలకు ఎంతగా అలవాటైపోయాయంటే, సమర్థవంతమైన పాలన ఇప్పుడు అసాధారణంగా కనిపిస్తోందని ఆయన అంటున్నారు.

ఇలా తమ విధులు నిర్వర్తించినందుకు గుర్తింపు పొందిన అధికారి ముండే ఒక్కరే కాదు.

1990లలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నిబంధనలను, నిర్భయంగా అమలు చేసిన టీఎన్ శేషన్ ఇందులో అత్యంత ప్రముఖమైన ఉదాహరణల్లో ఒకరు.

భారత పోలీస్ సర్వీస్‌లో(ఐపీఎస్) అధికారిగా చేరిన తొలి మహిళ కిరణ్ బేడీకి 1980ల ప్రారంభంలో "క్రేన్ బేడీ" అనే పేరు వచ్చింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి చెందిన ఒక కారును అక్రమంగా పార్క్ చేసినందును కిరణ్ బేడీ దాన్ని అక్కడి నుంచి తొలగించారని అప్పట్లో విస్తృతంగా వార్తలు వచ్చాయి(అయితే వాస్తవానికి ఆ కారును తొలగించింది ఆమె బృందంలో పని చేసే ఒక సబ్ ఇన్‌స్పెక్టర్. అయితే ఆయన నిర్ణయానికి బేడీ యస్ చెప్పారని ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత వెల్లడించారు)

తుకారాం ముండే, కిరణ్ బేడీ, జస్వాల్, అధికారులు-హీరోలు
ఫొటో క్యాప్షన్, కిరణ్ బేడీ

2012లో వివాదాస్పద భూ లావాదేవీని అడ్డుకోవడానికి జోక్యం చేసుకున్న తర్వాత అశోక్ ఖేమ్కా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

2020లో దిల్లీలో జరిగిన మతపరమైన హింస సమయంలో ఒక గుంపును ధైర్యంగా ఎదుర్కొన్న పోలీసు అధికారి నీరజ్ జాదౌన్ కూడా ప్రశంసలు అందుకున్నారు.

ఇలాంటి ఘటనల వల్ల నిజాయితీతో, నిర్మొహమాటంగా పనిచేసే ప్రభుత్వ అధికారి అనే భావన ఒకవైపు ప్రజలకు సుపరిచితం అవుతూనే అరుదుగా మారాయి.

అయితే భారత్‌లో వేలాది మంది అధికారులు ప్రజల దృష్టికి రాకుండానే తమ విధులను నిర్వర్తిస్తున్నారని జస్వాల్ గుర్తుచేస్తున్నారు.

"వారి పనిలో భాగంగా ప్రజలతో నేరుగా సంబంధం ఉండకపోవచ్చు. లేదా వారి పని అంతగా కనిపించకపోవచ్చు."

అయితే సాధారణ ప్రజలకు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లడం తరచూ అలసట తెప్పించే పనిలాగా అనిపిస్తుంది.

దిల్లీలోని ఓ ఆర్థిక సంస్థలో పనిచేస్తున్న 43 ఏళ్ల రాజేశ్ సింగ్ తన పనులు పూర్తయ్యేందుకు చాలా కాలం వేచి చూడాల్సి వచ్చిందని, ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతకంటే ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు.

"24 గంటల్లో పూర్తవ్వాల్సిన పని ఆరు నెలల వరకు సాగిన వైనాన్ని నేను అనుభవించాను. పోనీ అప్పటికీ పని సానుకూలంగా పూర్తవుతుందన్న భరోసా ఉండదు" అని ఆయన చెప్పారు.

అయితే నిబంధనలను కఠినంగా అమలు చేసినందుకు ప్రశంసలు పొందే అధికారి, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా వాటిని మరీ కఠినంగా అమలు చేస్తున్నారనే విమర్శలను కూడా ఎదుర్కోవచ్చు.

ముండే తనిఖీలపై ఆహార, ఆతిథ్య రంగానికి చెందిన కొందరు విమర్శలు చేశారు. కావాలని లక్ష్యంగా లేదా చట్టవిరుద్ధంగా చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలను ఆయన తిరస్కరించారు.

తనిఖీలు ఆధారాలపై జరుగుతాయని, తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే లైసెన్సులను నిలిపివేస్తామని ఆయన చెప్పారు.

బాత్ కూడా అక్రమ ఆక్రమణలపై చర్యలు తీసుకున్నందుకు విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన చర్యలు కొందరినే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఉంటాయని, బలహీన వర్గాలపై మరింత ప్రభావం చూపుతున్నాయని విమర్శకులు ఆరోపించారు.

వైరల్ అయిన పలు వీడియోల్లో తన చర్యలు టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారమే కచ్చితంగా చేపడుతున్నామని ఆయన చెప్పారు.

తుకారాం ముండే, కిరణ్ బేడీ, జస్వాల్, అధికారులు-హీరోలు
ఫొటో క్యాప్షన్, తుకారాం ముండే

చట్టం దృష్టిలో ఒక వీధి వ్యాపారి ఏర్పాటు చేసిన దుకాణం అనధికార నిర్మాణం కావచ్చు. కానీ అది ఆ కుటుంబానికి ఏకైక ఆదాయ వనరు అయి ఉండవచ్చని జస్వాల్ వివరిస్తున్నారు. పని కోసం నగరాలకు వలస వచ్చే లక్షలాది మంది ఉన్న దేశంలో, అనుమతులు లేని అనధికార నివాస స్థలాలే వారికి దొరికే ఏకైక మార్గం కావచ్చు.

చట్టం, ఆర్థిక పరిస్థితుల మధ్య ఉన్న ఈ వైరుధ్యం వల్లే ఒకే చర్యను చట్టబద్ధమైనదిగానూ, కఠినమైనదిగానూ చూడవచ్చని ఆయన అంటున్నారు.

అధికారులు కూడా తమ విధులను నిర్వర్తించే క్రమంలో సొంత సవాళ్లను ఎదుర్కొంటారు.

కొంతకాలం ప్రభుత్వ అధికారిగా పనిచేసి, అభివృద్ధి అంశాలపై విస్తృతంగా రచనలు చేసిన పుష్పా సుందర్, రాజకీయ నాయకుల డిమాండ్లకు అనుగుణంగా వ్యవహరించేందుకు నిరాకరిస్తే అధికారులు రాజకీయ ఒత్తిళ్లు, బదిలీలను ఎదుర్కోవాల్సి రావచ్చని చెప్పారు.

"వారికీ కుటుంబాలు, ఉద్యోగాలు, ఆర్థిక బాధ్యతలు ఉంటాయి. స్వతంత్రంగా వ్యవహరించేందుకు వాటన్నింటినీ పణంగా పెట్టడానికి అసాధారణమైన ధైర్యం అవసరం" అని ఆమె చెప్పారు.

చట్టవిరుద్ధమైన పని చేయాలని చెప్పినప్పుడు దాన్ని తిరస్కరించే అధికారులకు బలమైన సంస్థాగత మద్దతు అవసరమని ఆమె వాదిస్తున్నారు.

తుకారాం ముండే, కిరణ్ బేడీ, జస్వాల్, అధికారులు-హీరోలు
ఫొటో క్యాప్షన్, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో కమల్ కాంత్ జస్వాల్

జస్వాల్ కూడా ఇలాంటి ఒత్తిడిని స్వయంగా ఎదుర్కొన్న సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.

1974లో అప్పటి ఉమ్మడి ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తర్‌కాశీ జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్నప్పుడు, ఒక సీనియర్ మంత్రి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఆ మంత్రి చేసిన పలు డిమాండ్లను తాను తిరస్కరించాల్సి వచ్చిందని జస్వాల్ చెప్పారు. ఆ మంత్రి ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కొద్దికాలానికే తనకు మార్చింగ్ ఆర్డర్స్ వచ్చాయని జస్వాల్ చెప్పారు.

అయితే ఆయన తదుపరి బాధ్యతలు చేపట్టేందుకు బయలుదేరినప్పుడు, వీడ్కోలు చెప్పేందుకు వేసవి ఎండలో పలువురు ప్రజలు ఆయన ప్రయాణించే మార్గంలో కిలోమీటర్ల మేర నిలబడ్డారు.

రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఆయన అంటున్నారు.

ఇష్టమైన పోస్టింగులు పొందాలని లేదా రాజకీయ మద్దతుపై ఆధారపడే అనేక మంది అధికారులు ఎదురుతిరగకుండా ఉండే మార్గాన్ని ఎంచుకుంటారని, రాజకీయ ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల కొన్ని మూల్యాలు చెల్లించాల్సి వస్తుందని ఆయన చెప్పారు.

ఒక అధికారి ప్రజాదరణ పొందే వేగాన్ని కూడా సోషల్ మీడియా మార్చేసింది.

గతంలో ఒక జిల్లాకు మాత్రమే పరిమితమైనదాన్ని ఇప్పుడు వీడియోగా చిత్రీకరించి, షేర్ చేసి, కొన్ని గంటల్లోనే లక్షలాది మంది చూసే స్థాయికి చేరుకుంది.

"సోషల్ మీడియా ఒక అధికారిని దాదాపు రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చగలదు" అని సుందర్ చెప్పారు.

ముండే విషయంలోనూ ఇదే కొంతవరకు జరిగింది. ఆయన తనిఖీలకు సంబంధించిన వీడియోలు సాధారణ తనిఖీ చర్యలను పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షించే అంశంగా మార్చాయి.

అయితే ముండే దీన్ని మరో విధంగా చూస్తారు.

ఇటీవల బీబీసీతో మాట్లాడిన ఆయన, తన చర్యలు ప్రజారోగ్యంపై ఉన్న ఆందోళనల దృష్ట్యానే జరుగుతాయని, నిబంధనలు పాటించే వ్యాపార సంస్థలకు భయం అవసరం లేదని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)